షర్మిల కాదు.. సివంగి...
posted on Apr 16, 2021 @ 12:49PM
షర్మిల బ్లౌజ్ చిరిగింది. ఆమె సంకల్పం మాత్రం చెదరలేదు. షర్మిల శరీరాన్ని మహిళా పోలీసులు నలిపేశారు. ఆమె మనోనిర్బరం మాత్రం నలగలేదు. షర్మిల పాదయాత్రపై ఖాకీలు కౌర్రంగా ప్రవర్తించారు. ఆమె పద ఘట్టనలు ప్రభుత్వంలో ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. షర్మిలపై పోలీసులు బల ప్రయోగం చేసి ధర్నా చౌక్‌లో శిబిరం ఎత్తేశారు. ఆమె దీక్ష మాత్రం లోటస్ పాండ్‌లో కొనసాగుతోంది. ఒక షర్మిల.. వందలాది మంది పోలీసులు.. ఒక షర్మిల.. వందలాది మంది అభిమానులు.. ఒక షర్మిల.. కేసీఆర్ సర్కారుపై వందలాది బాణాలు..
షర్మిల.. షర్మిల.. షర్మిల.. ఇప్పుడు తెలంగాణలో షర్మిల పేరు మారుమోగుతోంది. ఇంకా పార్టీ పేరైనా ప్రకటించలేదు.. అప్పుడే ప్రభుత్వంపై మడమ తిప్పని పోరాటం చేస్తోంది. కంచె ఐలయ్య మాటల్లో చెప్పాలంటే.. షర్మిల రాణి రుద్రమదేవిలా కేసీఆర్ సర్కారుపై దండెత్తుతోంది. ఆమె చేస్తున్న పోరాటం, ఆమె ప్రదర్శిస్తున్న రాజకీయ చాణక్యం.. హేమాహేమీ పార్టీలను, బడాబడా నాయకులను సైతం అవాక్కయ్యేలా చేస్తోంది. షర్మిల పార్టీకి ఇంకా జెండా, అజెండానే లేదు. కానీ, తనకు కావలసినంత కరేజ్.. టన్నులకు టన్నులు కమిట్‌మెంట్ ఉందని నిరూపిస్తున్నారు.
దొర పాలనపై పోరాటమంటూ.. ఖమ్మంలో మొదటి సభతోనే తన టార్గెట్ కేసీఆరే అని సూటిగా చెప్పేశారు షర్మిల. ఆ తర్వాత ఆమె ఎంచుకున్న మొట్టమొదటి ఇష్యూ మరింత సంచలనం. నిరుద్యోగ సమస్య, ఉద్యోగ భర్తీపై దీక్షా దక్షత ప్రకటించారు. ఏళ్లుగా అసంతృప్తితో రగిలిపోతున్న నిరుద్యోగులను దిక్సూచిగా మారారు. కాకతీయ యూనివర్సిటీలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం సునీల్ నాయక్ సూసైడ్ చేసుకుంటే.. ప్రతిపక్ష పార్టీలన్నీ కేవలం ప్రకటనలకు, సంతాపాలకే పరిమితమయ్యాయి. కాకలుతీరిన కాంగ్రెస్ కానీ, దూకుడు మీదున్న బీజేపీ కానీ, తూతూమంత్రంగా హడావుడి చేసి సైలెంట్ అయ్యాయి. షర్మల మాత్రం అలా కాదు. జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాలంటూ ఏకంగా దీక్షకు దిగారు. సున్నితమైన సమస్యపై దీక్ష చేపట్టారు. మొదట ఒకరోజు దీక్ష మాత్రమే.. అప్పటికప్పుడు అది మూడు రోజుల దీక్షగా మారింది. అనుమతి లేదంటూ పోలీసులు దీక్షను భగ్నం చేయాలని చూస్తే గట్టిగా వ్యతిరేకించారు. పాదయాత్ర అడ్డుకోవాలని ప్రయత్నిస్తే.. పట్టు వదలకుండా తుదకంటూ ప్రయత్నించారు. పోలీసులు అడ్డునిలిచి కాలు కదపకుండా అడ్డుకుంటే.. ‘‘ఇంకోసారి నాపై చేయివేస్తే బాగోదు’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఖాకీలు ఆమెను బలవంతంగా ఇంటిలో దిగబెడితే.. అక్కడే మొక్కవోని దీక్ష కొనసాగిస్తున్నారు.
షర్మిల దీక్షతో ఉద్యోగాల భర్తీ అంశం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. నిరుద్యోగ సమస్య గురించి ఈ మధ్య కాలంలో ఇంతలా మరెవరూ పోరాడింది లేదు. షర్మిల సరైన సమయంలో, సరైన దీక్ష చేపట్టారని అంటున్నారు. తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానం పదునైన సమస్యపై పోరాటంతో ప్రారంభించడం బాగుందని చర్చించుకుంటున్నారు. షర్మిల ఇప్పుడు తెలంగాణలో ఓ రాజకీయ సంచలనం. ఒక మహిళగా ఆమె చేస్తున్న పోరాటంతో మిగతా రాజకీయ పార్టీలకు కలవరం.
అన్న కోసం ప్రచారం చేయడం మినహా ఇప్పటి వరకూ పెద్దగా రాజకీయ అనుభవం లేదు ఆమెకి. నిన్నామొన్నటి వరకూ అన్న చాటు చెల్లమ్మే. ఇప్పుడూ తల్లి విజయమ్మ తోడుగా ఉండాల్సిందే. అలాంటిది.. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ షర్మిల రాజకీయ అరంగేట్రం చేయడం ఓ సంచలనం. మొదట్లో ఆమె ఎవరు వదిలిన బాణమో ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పటికీ అదే అనుమానం. పార్టీ పెట్టబోతున్నానంటూ ప్రకటించారు అంతే. మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వివిధ వర్గాల ప్రముఖులు వరుసబెట్టి ఆమెను కలవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. అదేంటి, షర్మిల పార్టీకి అంత క్రేజ్ ఏంటి అంటూ అంతా చెవులు కొరుక్కున్నారు. ఆ ఏముందిలే.. ఎందరిని చూడలేదు.. షర్మిలకు అంత సీన్ ఉందా అంటూ అంతా లైట్ తీసుకున్నారు. ఖమ్మం సభ వేదికగా కేసీఆర్‌పై పదునైన విమర్శన బాణాలు వదలడంతో అంతా షాక్ అయ్యారు. ఈమె మామూలు ఆడది కాదు.. ఆడ సివంగిలా ఉందిగా అనుకున్నారు. ఖమ్మం సభతోనే సినిమా అయిపోలేదు.. ముందుంది ముసళ్ల పండుగ అన్నట్టు.. నిరుద్యోగ సమస్య, ఉద్యోగాల భర్తీ కో్సం ఇందిరాపార్కు దగ్గర ఆమె చేపట్టిన దీక్ష రాజకీయంగా దుమ్ము రేపింది. పోలీసుల బలప్రయోగాన్ని ధిక్కరించి పాదయాత్ర చేపట్టడం.. బ్లౌజ్ చిరిగినా.. చెదరని సంకల్పంతో.. సమరనాదం వినిపించడం సంచలనమే. ఇప్పుడు లోటస్‌పాండ్‌లో 72గంటల దీక్ష కొనసాగిస్తున్నా.. తెలంగాణకు ఏదో ఒక రోజు తాను సీఎం అవుతానంటూ సవాల్ చేసినా.. అది షర్మిలకే చెల్లింది.