దేశాన్ని లాక్ డౌన్ నుంచి కాపాడండి! దేశ ప్రజలకు ప్రధాని వినతి
posted on Apr 20, 2021 @ 9:06PM
దేశాన్ని లాక్ డౌన్ నుంచి కాపాడాలని దేశ ప్రజలను కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. లాక్ డౌన్ అవసరం లేకుండానే కరోనా మహ్మమారిని కట్టడి చేద్దామని పిలుపిచ్చారు. లాక్ డౌన్ చివరి అస్త్రంగానే ఉండాలన్నారు ప్రధాని. ప్రజలెవరు బయటికి రావొద్దని సూచించారు. అందరూ జాగ్రత్తగా ఉంటే కరోనా ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని చెప్పారు.
కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ పై జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోడీ. కరోనా మహమ్మారి మరోసారి తుపాన్‌లా విరుచుకుపడుతోందని అన్నారు. దేశం మరోసారి భీకర యుద్దం చేస్తుందన్నారు. అందరం కలిసి కట్టుగా దీనిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాను అంతమొందించే పోరులో ముందున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లను ప్రశంసించారు. తమ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి మరీ వారు దేశం కోసం పోరాడుతున్నారని తెలిపారు. వైద్య సిబ్బందికి సెల్యూట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.
గత కొన్ని రోజుల్లో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌కు డిమాండ్ ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా అవసరమున్న ప్రతిఒక్కరికీ ఆక్సిజన్ అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఆక్సిజన్‌ను ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ఔషధాల తయారీని పెంచేందుకు సైతం తగిన చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలో ఔషధ తయారీ సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయన్నారు.
శాస్ర్తవేత్తలు రాత్రిపగలు కష్టపడి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయన్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ సంస్థల కృషిని ప్రధాని ప్రశంసించారు. ప్రతి ఒక్కరికీ వీలైనంత త్వరగా టీకా అందించేందుకు కృషి జరుగుతోందన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా టీకాలు అందిస్తున్న దేశంగా భారత్ కొనసాగుతోందన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా ఇప్పటికే వైద్యారోగ్య సిబ్బందికి ఫలాలు అందుతున్నాయన్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించనున్నామని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీకా కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు.
నగరాల్లో పనిచేస్తున్న కార్మికులకు వేగంగా వ్యాక్సిన్ అందించాలన్న ఉద్దేశంతోనే 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించేందుకు అనుమతి ఇచ్చామని తెలిపారు. వివిధ నగరాల్లో పనిచేస్తున్న శ్రామికులకు వారున్న చోటే టీకా అందిస్తామన్న భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా వారిలో ఎలాంటి గందరగోళం లేకుండా చూడాలని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే కరోనాను ఎదుర్కొనేందుకు కావాల్సిన మౌలిక వసతులు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. ఈ ఘనత దేశప్రజలందరికీ వర్తిస్తుందని తెలిపారు. దేశంలోని ప్రతిఒక్కరూ సహకిరిస్తేనే కరోనాపై విజయం సాధించగలమన్నారు.