కరోనా కల్లోలంలో ఎన్నికలా? ప్రాణాల కంటే పవరే ముఖ్యమా?
posted on Apr 21, 2021 @ 2:42PM
కరోనా సెకండ్ వేవ్ తో దేశం అల్లాడిపోతోంది. చాలా ప్రాంతాల్లో పరిస్థితి చేయి దాటిపోయింది. హాస్పిటల్స్ నిండిపోవడంతో కరోనా రోగులు చికిత్స కోసం నరకయాతన పడుతున్నారు. ఆక్సిజన్ సకాలంలో అందక పిట్టల్లా రాలిపోతున్నారు. తమ కండ్ల ముందే రోగులు చనిపోతున్నా వైద్యులు ఏమి చేయలేని పరిస్థితి. తాము ఏం చేయలేకపోతున్నామని రోదిస్తూ ముంబైకి చెందిన ఓ డాక్టర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు చూస్తేనే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
దేశంలో ఆరుగురు ముఖ్యమంత్రులు, అనేకమంది కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కరోనాకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, ఢిల్లీలో అత్యంత దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాము ఇప్పటి వరకు ఇన్ని శవాలను ఎన్నడూ చూడలేదు.. శవాల కుప్పల మధ్య శ్మశానంలో కాలు పెట్టలేకలేపోతున్నాము అని లక్నో ముక్తిధామ్ శ్మశాన వాటికలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి చెప్పడం కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రధానమంత్రి నియోజకవర్గమైన వారణాసి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాంతమైన గోరఖ్‌పూర్ పరిస్థితి దారుణంగా ఉన్నది. లక్నోలో ఒక మాజీ జడ్జి భార్యకు మూడు రోజుల పాటు ఆసుపత్రిలో బెడ్ వసతి లభించక మృతి చెందారు. వారణాసిలో ఒక వ్యక్తి వారం రోజుల పాటు ఆసుపత్రిలో అడ్మిషన్ లభించక మరణించాడు. ఆ తర్వాత శవాన్ని తరలించేందుకు కూడా అంబులెన్స్ లభ్యం కాకపోవడంతో అతడి భార్య ఈ-రిక్షాలో తీసుకువెళ్లిన ఘటన సంచలనం రేపింది. వారణాసి హరిశ్చంద్ర ఘాట్‌లో కూడా కుప్పలు తెప్పలుగా అంత్యక్రియలు జరుగుతున్నాయని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో కరోనా టెస్ట్ చేయించుకున్న ప్రతి నలుగురిలో ఒకరికి కచ్చితంగా కరోనా సోకినట్లు తేలుతోంది. ఫోన్ ఎత్తితే చాలు కనీసం ఒక బెడ్ అయినా ఏదో ఒక ఆసుపత్రిలో ఇప్పించమని అభ్యర్థన వస్తోంది. ఢిల్లీ వాట్సాప్ గ్రూప్‌ల్లో కరోనా మరణ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దేశ రాజధానిలో దాదాపు వారం రోజుల పాటు కర్ఫ్యూ విధించడమే పరిస్థితికి అద్దం పడుతోంది.
కరోనా సెకండ్ వేవ్ తో దేశంలో ఇంతటి దారుణ పరిస్థితులు ఉన్నా రాజకీయ పార్టీలు, నేతల తీరు మాత్రం మారడం లేదు. తమకు ప్రజల ప్రాణాల కంటే ఓట్లు, సీట్లే ముఖ్యమన్నట్లుగా ప్రవరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. దీనిపై ఇప్పుడు దుమారం రేగుతోంది. కరోనా కట్టడి కోసం జనాలంతా ఇండ్లలోనే ఉండాలని చెబుతున్న ప్రధాని... బెంగాల్ ఎన్నికల ప్రచారానికి ఎందుకు వెళుతున్నారని విపక్షాలు, పలు సంస్థలు నిలదీస్తున్నాయి. బెంగాల్‌లో బహిరంగసభల్లో, రోడ్ షోలలో విస్తృతంగా పాల్గొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇచ్చి అక్కడ అభివృద్ధి అధ్వాన్నంగా ఉన్నదని చెప్పిన యోగి ఆదిత్యనాథ్ స్వయంగా కరోనాకు గురయ్యారు.
లక్షలాది మంది మాస్కులు లేకుండా సభల్లో, ప్రచారాల్లో పాల్గొన్నప్పటికీ బిజెపి నేతలు ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. కుంభమేళాకు ఆహ్వానిస్తూ ప్రధానమంత్రి చేసిన అభ్యర్థనలు పోస్టర్ల రూపంలో ఉత్తరాఖండ్ అంతటా వెలిశాయి. కరోనా పరిస్థితి విషమిస్తున్న దృష్ట్యా మిగిలిన నాలుగు దశలను ఒకే దశలో నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. మమతా బెనర్జీ ప్రచారాన్ని ఒకరోజు పాటు నిలిపివేసేందుకు చూపిన ఉత్సాహం ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రచారాన్ని కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడంలో చూపలేదనే ఆరోపణలు వస్తున్నారు. కరోనా కారణంగా తాము ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను బిజెపి నేతలు ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే రాహుల్ ఎన్నికల సభలను రద్దు చేసుకున్నారని కేంద్ర ఐటి, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. దేశంలో అందరికీ వాక్సిన్ ఇచ్చే ప్రయత్నం చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లేఖ రాసినందుకు కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేస్తూ తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ దాడి చేశారు. కొవిడ్ విషమ పరిస్థితులకు తగ్గట్లుగా ప్రజలు ప్రవర్తించడం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా అన్నారు. కాని ఈ దేశంలో నాయకులు మాత్రం కొవిడ్ రూల్స్ పాటించారా అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు.
పశ్చిమ బెంగాల్ తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లోని పాలకులు ఓట్ల రాజకీయంతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో ఉప ఎన్నిక జరగడంతో తిరుపతి లోక్ సభ పరిధిలో కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రస్తుత కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. కోవిడ్ భయపెడుతున్నా పంతానికి పోయి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించింది జగన్ రెడ్డి సర్కార్. ఆ ఎన్నికల తర్వాత ఏపీలో కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. తెలంగాణలో అయితే మరీ దారుణం. ప్రస్తుతం పరిస్థితి చేయిదాటి పోయే పరిస్థితుల్లో ఉన్నా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తోంది తెలంగాణ సర్కార్. ఏప్రిల్ 30న రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. రాష్ట్రంలో కరోనా తీవ్రంగా ఉన్నా.. నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఎన్నికలున్న ప్రాంతాల్లో జనాలు భయంతో వణికిపోతున్నారు. తమ ప్రాణాలతో ఆటలాడుతూ ఎన్నికలు నిర్వహిస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్నికలు ఇప్పుడు నిర్వహించాల్సి అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏండ్ల కొద్ది ప్రత్యేక అధికారుల పాలన సాగిన సందర్బాలు ఉన్నాయని... అయినా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పట్టుబట్టి మరీ ఎన్నికలు జరపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.