కరోనాతో అల్లాడుతున్న ఢిల్లీలో మరో ముప్పు!
posted on Apr 21, 2021 @ 2:42PM
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తో ఢిల్లీ అల్లాడిపోతోంది. ఢిల్లీలో కరోనా టెస్ట్ చేయించుకున్న ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా సోకినట్లు తేలుతోంది. ఫోన్ ఎత్తితే చాలు కనీసం ఒక బెడ్ అయినా ఏదో ఒక ఆసుపత్రిలో ఇప్పించమని అభ్యర్థన వస్తోంది. ఢిల్లీ వాట్సాప్ గ్రూప్‌ల్లో కరోనా మరణ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దేశ రాజధానిలో దాదాపు వారం రోజుల పాటు కర్ఫ్యూ విధించడమే పరిస్థితికి అద్దం పడుతోంది. కరోనాతో అల్లాడుతున్న దేశ రాజధానికి మరో గండం ముంచుకొస్తోంది.
కరోనా కేసులతో వణికిపోతున్న ఢిల్లీని ఇప్పుడు మరో భయం వేధిస్తోంది. ఢిల్లీలో డెంగీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నాయి. గత వారం రోజుల్లో కొత్తగా నలుగురు వ్యక్తులు డెంగీ బారినపడ్డారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 13కు పెరిగింది.ఇదే సమయంలో 2018లో ఢిల్లీలో 12 మంది డెంగీ బారినపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 22 మంది నగరంలో డెంగీకి చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు.
1996 నుంచి ప్రతి సంవత్సరం ఢిల్లీలో జులై-నవంబరు మధ్య డెంగీ కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. డెంగీ అనేది వ్యాక్సిన్ లేని వైరల్ వ్యాధి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నివాస పరిసరాల్లో దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గతేడాది డిసెంబరు 5 నాటికి ఢిల్లీలో దాదాపు 1000 డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా భయపెడుతున్న సమయంలో డెంగీ కూడా విస్తరించడంతో అధికారులు కలవరపడుతున్నారు. జనాలు కూడా ఏదీ డెంగీ జ్వరమో.. ఏదీ కరోనా జ్వరమో తెలియక ఆందోళన పడుతున్నారు.