కేసుల భయంతోనే ట్వీట్! మోదీకి జగన్ మద్దతుపై రచ్చ..
posted on May 8, 2021 @ 2:13PM
ట్విటర్‌లో మోదీకి జగన్ సపోర్ట్. కట్ చేస్తే, సాక్షి మీడియాలో కేంద్ర వైఫల్యాలపై న్యూస్. ఓవైపు ప్రధానికి అండగా ఉండాలంటూ జగన్ హితవు. మరోవైపు, మోదీ చేతగాని తనం వల్లే దేశంలో కరోనా కల్లోలమంటూ సాక్షి పేపర్లో కథనాలు. ఇలా.. మోదీ, కేంద్రం, కరోనా అంశంలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నాడని అంటున్నారు. సీఎం జగన్ చేసిన ట్వీట్.. సాక్షిలో వస్తున్న స్టోరీస్.. జగన్‌రెడ్డి కాంట్రవర్సీ పాలిటిక్స్‌పై జాతీయ స్థాయిలో వెల్లువెత్తుతున్న విమర్శలు.. ఇవన్నీ ఏపీ కేంద్రంగా ఢిల్లీ స్థాయిలో కాక రేపుతున్నాయి. సీఎం జగన్‌ను దోషిగా బోనులో నిలబెడుతున్నాయి.
దేశంలో కరోనా కల్లోలం. ఇప్పటికే 2కోట్ల మందికిపైగా పాజిటివ్. 2 లక్షల మందికి పైగా మృత్యువాత. ప్రస్తుత విపత్కర పరిస్థితికి కారణం ఎవరంటే అన్ని వేళ్లూ ప్రధాని వైపే. అంతర్జాతీయ మీడియా మోదీని నిప్పులతో కడిగేస్తోంది. విమర్శలతో శల్యపరీక్ష చేస్తోంది. నిపుణులు హెచ్చరిస్తున్నా.. సెకండ్ వేవ్‌పై చేతులెత్తేసిన మోదీని ఇంటా, బయటా అంతా ఏకిపారేస్తున్నారు. వ్యాక్సిన్ కొరతకు, ఆక్సిజన్ లోటుకు ఆయన చేతగాని తనమే కారణమంటూ మోదీని తూట్లు పొడుస్తున్నారు. జనమంతా కరోనా దోషిగా నరేంద్ర మోదీపై దుమ్మెత్తిపోస్తుంటే.. ఏపీ సీఎం జగన్ మాత్రం ఆయన్ను ఏమీ అనొద్దంటూ వెనకేసుకు వస్తున్నారు.
కరోనా నియంత్రణపై ప్రధాని మోదీ గురువారం జరిపిన ఫోన్ సంభాషణను విమర్శిస్తూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేయడం.. దాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఖండించడం జాతీయ, ప్రాంతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ‘గౌరవనీయ ప్రధానమంత్రి ఫోన్ చేశారు. కేవలం ఆయన మనసులోని మాట చెప్పారు. దానికి బదులు పనికొచ్చే మాటలు చెప్పి, పనికొచ్చే మాటలు వింటే బాగుండేది’’ అంటూ హిందీలో ట్వీట్ చేశారు హేమంత్ . ఈ ట్వీట్‌కు ఏపీ సీఎం జగన్ కౌంటర్ ట్వీట్ చేశారు. ‘‘ప్రియమైన హేమంత్ సోరెన్, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. మన మధ్య ఎన్ని విభేదాలున్నా ఇలాంటి రాజకీయాలు చేయడం తగదని, అది మన జాతిని బలహీనపరుస్తుందని ఒక సోదరుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. మనం కొవిడ్‌పై పోరాడుతున్నాం. ఇది ఒకరినొకరు వేలెత్తి పించుకునే తరుణం కాదు. మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో మనమంతా చేయీచేయి కలిపి ప్రధానికి అండగా నిలవాల్సిన సమయమిది’అంటూ జగన్ ట్వీట్ చేశారు.
సీఎం జగన్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ మంట రాజేస్తోంది. ప్రధాని మోదీకి ససోర్ట్ చేస్తూ.. స్వయంగా మరో రాష్ట్ర సీఎంకు కౌంటర్ ఇస్తూ.. జగన్ ట్వీట్ చేయడం వెనుక పెద్ద రాజకీయమే నడిచిందనే అనుమానమూ వ్యక్తం అవుతోంది. సాధారణంగా ఇలాంటి మోదీ వ్యతిరేక ట్వీట్లపై బీజేపీ నాయకులే కౌంటర్లతో విరుచుకుపడుతుంటారు. కానీ ఈసారి ఆ పనిని ఏపీ సీఎం జగన్ తీసుకున్నారు. ప్రధాని మోడీని మద్దతుగా జార్ఖండ్ సీఎం చేసిన ట్వీట్ కు కౌంటరిచ్చారు. జగన్ ట్వీట్ జాతీయ స్థాయిలో రచ్చగా మారింది. జగన్ పై సీబీఐ, ఈడీ కేసులున్నాయి. గతంలో ఆయన జైలుకు వెళ్లారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు జగన్. ఏ క్షణాన్నైనా ఆయన బెయిల్ రద్దై జైలుకు వెళ్లేదు తెలియదు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం మద్దతు ఉంటేనే జగన్ కు రాజకీయ మనుగడ సాధ్యం. అందుకే మోడీకి మోకరిల్లుతూ అడక్కుండానే జగన్ ట్విట్టర్ లో మద్దతు ఇచ్చి కేంద్రాన్ని మచ్చిక చేసుకుంటున్నారనే చర్చ జాతీయ స్థాయిలో జరుగుతోంది.
ఇదే అర్ధం వచ్చేలా కాంగ్రెస్ ఎంపీ ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది. ‘కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వంటి పెద్ద నాయకుడి కుమారుడివై ఉండి.. సీబీఐ, ఈడీ దాడులకు భయపడి, మీ రాజకీయ ప్రయోజనాల కోసం మోదీతో ఇలా లాలూచీ పడటం సరికాదు. మీరు ఎదగాలి జగన్.. ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు’అంటూ సూటిగా, ఘాటుగా ఒడిశా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా చేసిన రీట్వీట్ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
తమిళనాడు దివంగత సీఎం జయలలిత నిచ్చెలి శశికళ సైతం జగన్ తీరుపై ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. ఇంతటి వెన్నుముఖ లేని నాయకుడు జగన్ అని తాను అనుకోలేదన్నారు. జగన్ ట్విటర్ ఐడీని.. బీజేపీ ఐటీ సెల్ హ్యాండిల్ చేస్తోందా? అని అనుమానం వ్యక్తం చేస్తూనే.. షేమ్ మిస్టర్ జగన్.. అంటూ శశికళ ట్వీట్ చేశారు. మోదీ చెప్పినట్టు చేసే మనిషి జగన్ అంటూ.. మరో ట్వీట్ కూడా చేశారు. తమిళనాడు, కేరళ, కర్నాటకలో లాక్‌డౌన్ పెట్టినా పట్టించుకోని జగన్.. త్వరలో ఆ రాష్ట్రాలను చూసి సిగ్గులేకుండా ఆయన లాక్‌డౌన్ పెడతారంటూ ఎద్దేవా చేశారు. ఇలా మోదీకి మద్దతుగా జగన్‌రెడ్డి చేసిన ట్వీట్ పై.. మోదీ మనిషంటూ జాతీయ స్థాయి నాయకులు జగన్మోహన్‌రెడ్డిని విమర్శలతో కుళ్లబొడుస్తున్నారు.
అయితే నేషనల్ లీడర్స్‌కి జగన్‌రెడ్డి నిజస్వరూపం గురించి సగం మాత్రమే తెలుసు. ఆయనలోని అపరిచితుడి స్వభావం వారికి పూర్తిగా తెలుసుండదు. జగన్‌రెడ్డి రాజకీయంగా ఎంత కన్నింగ్, ఎంత ఖతర్నాక్, ఎంత డబుల్ గేమ్ లీడరో ఏపీలోకి తొంగి చూస్తే కానీ అర్థం కాదు. తాజా మోదీ ఎపిసోడ్‌నే తీసుకుంటే.. మరింత లోతుగా పరిశీలిస్తే.. జగన్‌రెడ్డి ఆడుతున్న రెండు నాలుకల పొలిటికల్ గేమ్‌పై కాస్తైనా క్లారిటీ వస్తుంది. బీజేపీ జాతీయ స్థాయి నాయకులంతా ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉంటారు. అక్కడ ఏ చిన్న మాట అన్నా.. వారి దృష్టిలో ఇట్టే పడతారు. అందుకే మోదీపై తనకున్న భక్తిని, భయాన్ని చాటుకునేందుకు ఆయనే సొంతంగా ఈ ట్వీట్ చేశారని అంటున్నారు.
కట్ చేస్తే.. బీజేపీతో మిలాఖత్ అనే విషయం తెలిస్తే.. ఏపీ ప్రజలు జగన్‌ను అసహ్యించుకుంటారు. అందుకే, ఇక్కడి వారిని బురిడీ కొట్టించేందుకు.. తన సొంత సాక్షి మీడియాలో కేంద్రానికి వ్యతిరేకంగా వరుసగా ఆర్టికల్స్ వచ్చేలా చూసుకుంటున్నారు. కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ సాక్షి పేపర్‌లో గత కొన్ని రోజులుగా వరుస కథనాలు ప్రచురితమవుతున్నాయి. "డొల్ల పాలన.. గుల్ల ప్రజాస్వామ్యం".. "వ్యాక్సిన్ కూడా సరుకేనా?".. "ఈ ఫలితాలు కారుచీకట్లో కాంతిరేఖలు" .. ఇలా రకరకాల హెడ్డింగ్స్‌తో.. వేరు వేరు వ్యాసకర్తలతో.. కేంద్రానికి వ్యతిరేకంగా నిత్యం సాక్షి పేపర్లో విశ్లేషనాత్మక కథనాలు వస్తూనే ఉన్నాయి. అన్ని స్టోరీస్‌లోనూ కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉన్నారు.
వ్యాక్సిన్ కొరత, ఆక్సిజన్ లోటుకు కేంద్ర ప్రభుత్వ చేతగాని తనమే కారణం అనిపించేలా సాక్షి పేపర్లో కథనాలతో కడిగిపారేస్తున్నారు. మరి, ఇదేంటి? ట్విటర్‌లో జగన్ చెప్పిన నీతులేంటి? సాక్షి పేపర్లో వస్తున్న నీతిమాలిన కథనాలేంటి? ప్రస్తుత సంకట సమయంలో మోదీని అండగా ఉండాలంటూ, రాజకీయాలు తగవంటూ.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ట్విటర్‌లో నీతులు చెప్పి.. బీజేపీ జాతీయ నాయకుల మన్ననలు పొందారు జగన్. కానీ, రాష్ట్రానికి వచ్చే సరికి తన సొంత సాక్షి పేపర్‌లో కేంద్రాన్ని, మోదీని ఏకిపారేస్తూ కథనాలు రాయించడం.. జగన్ డబుల్ గేమ్ అడుతున్నారనడానికి నిదర్శనం అంటున్నారు విమర్శకులు.
ఏపీలో కరోనా కట్టడి విషయంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఆ ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోడానికే.. టీడీపీ నేతలపై పలు రకాల కక్ష సాధింపు చర్యలకూ దిగింది. మరోవైపు, సాక్షి మీడియాలో కరోనా పాపం కేంద్రానిదే అంటూ వార్తలు వచ్చేలా చేసి.. ఆ తప్పు తమది కాదని.. ప్రజలను తప్పుదారి పట్టించి.. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతోంది విపక్షం. అటు, జాతీయ స్థాయిలో కేంద్రానికి ఊడిగం చేస్తూ.. ఇటు రాష్ట్ర ప్రజల ముందు కేంద్రాన్ని దోషిగా చూపిస్తూ.. సాక్షి మీడియా ద్వారా మోదీపైకి ప్రజలను ఉసిగొల్పుతూ.. జగన్‌రెడ్డి అపరిచితుడిలా బిహేవ్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇదంతా జగన్‌రెడ్డి ఆడుతున్న రాజకీయ డబుల్ గేమ్ అంటున్నారు. అందుకే, బీవేర్ ఆఫ్ జగన్‌రెడ్డి అంటున్నారు రాజకీయ విమర్శకులు, తటస్థులు.