తెలంగాణలో ఆంధ్రా మేయర్లు!.. అక్కడ సెటిలర్లదే రాజ్యం..
posted on May 8, 2021 @ 3:50PM
ఖమ్మం కార్పొరేషన్ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మహిళలకే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు వరించాయి. ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ. డిఫ్యూటీ మేయర్ షేక్ ఫాతిమా జోహ్రా. అయితే, వీరిద్దరు తెలంగాణ రాష్ట్రీయ సమితి నుంచే ఎన్నికైనా.. వీరి స్వస్థలం మాత్రం ఆంధ్రా ప్రాంతం కావడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ గడ్డపై.. ఆంధ్రలో పుట్టిన ఇద్దరు మహిళలు.,. అధికార పీఠంపై కూర్చోవడం విశేషంగా మారింది. ఏపీకి సరిహద్దు జిల్లా అయిన ఖమ్మం రాజకీయ భిన్నత్వం చర్చనీయాంశమైంది.
ఖమ్మం మేయర్‌గా ఎన్నికైన నీరజ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఆగిరిపల్లి గ్రామం. ఆమెకు పెదపారుపూడికి చెందిన పునుకొల్లు రామబ్రహ్మంతో వివాహం జరిగింది. ఈ కుటుంబం 1988లో ఖమ్మం వచ్చి వ్యాపార రంగంలో సెటిల్ అయ్యారు. 2005లో టీడీపీ తరపున 23వ డివిజన్ నుంచి తొలిసారిగా కౌన్సెలర్‌గా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత 2016లో 17వ డివిజన్ కార్పోరేటర్‌గా గెలిచారు. తాజా, ఎన్నికల్లో 26వ డివిజన్‌లో గెలిచి.. ముచ్చటగా మూడోసారి కార్పొరేటర్ కావడమే కాకుండా.. ఏకంగా మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులతోనే మేయర్ పీఠం దక్కింది. కమ్మ సామాజిక వర్గం కావడమూ కలిసొచ్చింది. మేయర్ నీరజ భర్త రామబ్రహ్మం.. మంత్రి పువ్వాడ, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకూ సన్నిహితుడే. రామబ్రహ్మం మూడు దఫాలుగా డీసీసీబీ డైరెక్టర్‌గా ఎన్నికవుతూ వస్తున్నారు. మొదట తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం టీఆర్ఎస్‌లో కీలక నేతగా ఎదిగారు.
ఇక డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన షేక్ ఫాతిమా జోహ్రా స్వస్థలం గుంటూరు. 1984 మే 10న జన్మించిన ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఆమె భర్త ముక్తార్ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు నమ్మిన బంటుగా ఉన్నారు. గతంలోనే ముక్తార్‌కు సుడా డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం మైనారిటీ కోటాలో ముక్తార్ భార్యకు డిప్యూటీ మేయర్ పదవి వరించింది.
ఖమ్మం కార్పొరేషన్‌లో మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ సెటిలర్సే కావడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఖమ్మంను సెటిలర్ల గుమ్మం అంటారు. పేరుకు తెలంగాణ అయితే.. ఇక్కడి భాష, యాస, అలవాట్లు, ఆచారాలపై ఆంధ్ర ప్రభావం ఎక్కువ. ఏపీతో సుదీర్ఘ సరిహద్దులు.. విస్తృత బంధుత్వాలు.. ఉండటమే ఇందుకు కారణం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలు జిల్లాల నుంచి అనేక మంది ఖమ్మంకు వలస వచ్చి.. వ్యవసాయంతో పాటు వివిధ వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తున్నారు. ఇలా సెటిల్ అయిన వారిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే అధికం. విద్య, వైద్య రంగం, మైనింగ్, సింగరేణి, కేటీపీఎస్ తదితర రంగాలలో ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయిన వారి సంఖ్య చెప్పుకోదగినదే. ఈ క్రమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పలు ఉద్యమాల్లోనూ ఆంధ్ర సెటిలర్లు పెద్ద సంఖ్యలో భాగస్వామ్యమై గట్టిగానే పోరాడారు. ఉద్యమంలో తమ వంతుగా చురుకైన పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ సాకారం అనంతరం.. సీఎం కేసీఆర్ సైతం సెటిలర్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. గణనీయంగా ఉన్న సెటిలర్ల ఓటు బ్యాంకును టీఆర్ఎస్ వైపునకు తిప్పుకున్నారు. తాజాగా, ఖమ్మం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన మహిళలకు ఇచ్చి.. రెండు పదవులతో.. రెండు సామాజిక వర్గాలు.. రెండు ప్రాంతల ఓటర్లను గంపగుత్తగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు.