కర్నూల్ లో చంద్రబాబుపై కేసు
posted on May 7, 2021 @ 6:26PM
తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కర్నూలులో కేసు నమోదైంది. కరోనా నేపథ్యంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ చంద్రబాబుపై న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. కర్నూలులో ఎన్440కే వైరస్ ఉందంటూ చంద్రబాబు భయపెడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదును స్వీకరించిన కర్నూలు వన్ టౌన్ పోలీసులు, చంద్రబాబుపై 188, 505/1/బి/2, 54 సెక్షన్లు, జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఏపీలో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు రికార్డ్ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతోంది. ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏపీలో గుర్తించిన కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరించారు. అత్యంత వేగంగా విస్తరించడంతో పాటు తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఏపీ నుంచి వచ్చేవారిపై అంక్షలు విధించింది ఢిల్లీ సర్కార్. ఒడిశా సర్కార్ కూడా ఆంక్షలు అమలు చేస్తోంది. ఏపీ వైరస్ డేంజర్ కాబట్టే రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయని చెబుతున్నారు.
ఏపీలో కోవిడ్ పరిస్థితులపై పార్టీ నేతలతో సమీక్షించిన చంద్రబాబు... ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కరోనా విజృంభిస్తున్నా సరిగా స్పందించడం లేదని మండిపడ్డారు. వ్యాక్సిన్ కోసం ఆర్డర్లు కూడా ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. రోజుకు 20 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. పాజిటివిటీ రేటు 25 శాతానికి పెరిగింది. అయినా సీఎం కరోనాపై సమీక్షలు జరపడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ ట్యాంకులు, కరెంటు స్తంభాలకు వైసీపీ రంగులు వేయడానికి... తీయడానికి రూ.3,000 కోట్లు తగలేశారు. ఆ మాత్రం ఖర్చు కూడా వ్యాక్సిన్లపై చేయలేరా? ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.45 కోట్లు మంజూరు చేసి చేతులు దులుపుకొంటారా? ప్రజల ప్రాణాలు కాపాడే పద్ధతి ఇదేనా’’ ప్రశ్నించారు. వ్యాక్సిన్లు ఇచ్చి ప్రాణాలు కాపాడాలని సూచించారు.
రాష్ట్రప్రభుత్వానికి చంద్రబాబు సలహాలు ఇస్తే వైసీపీ నేతలు బూతులు తిడుతున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వపరంగా నిర్వహిస్తున్న 108, 104 వాహనాలు అందుబాటులో లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే జేబులు గుల్లవుతున్నాయని మాజీ మంత్రి అయ్యన్న చెప్పారు. కరోనా పరీక్షలు చేయించుకొన్న వారికి ఫలితం రావడానికి 4 రోజులు పడుతోందని, ఈలోపు కు టుంబంలో అందరికీ ఈ వ్యాధి వ్యాపిస్తోందని టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కామెంట్లపై సుబ్బయ్య ఫిర్యాదు చేయడంతో కర్నూల్ పోలీసులు కేసు నమోదు చేశారు.