టీడీపీకి అనుకూల పరిస్థితుల్లోనూ మాడుగుల త‌ల‌భారం

ప‌రిస్థితులు అనుకూలిస్తున్న‌పుడు పాత స‌మ‌స్య‌లు వెన్నాడితే ఇబ్బందే. స‌మ‌సిపోయి ఉండ‌వ‌చ్చ‌ని అనుకోవ‌డ‌మే పొర‌పాటు. ఇపుడు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుకి ఉమ్మ‌డి విశాఖ జిల్లా మాడుగుల నియోజ‌క‌వ‌ర్గం మార‌ని గాయంగానే త‌యార‌యింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో అంత‌టా అనుకూల గాలులు వీస్తుండ‌గా మాడుగుల వ‌ర్గ‌పోరు ప‌రిష్కారానికి స్వ‌యంగా రంగ‌ప్ర‌వేశం చేయాల్సిన వ‌స్తుంది. ఇపుడు ఎక్క‌డ‌యినా స‌రే చిన్న‌పాటి విభేదాలు, వ‌ర్గ‌పోరులు ప్ర‌స్తుతం పార్టీకి ఉన్న అవ‌కాశాలపై ప్ర‌భావం చూప‌క పోవు. అందువ‌ల్ల మాడుగ‌ల‌లో మూడు వ‌ర్గాల‌ను ఒక్క‌టిగా చేయాల్సిన భారం బాబు పైనే ప‌డింది. అయితే స‌మ‌స్య‌ను అక్క‌డివారు త‌మ అధినేత‌, పార్టీ ప్ర‌తిష్ట దృష్ట్యా ప‌రిష్క‌రించుకుంటే బాబుకు మేలు చేసిన‌వారే అవుతార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.   ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నం జిల్లా మాడుగుల నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి   పెద్ద  స‌మస్య‌గా మారింది. ఇక్క‌డ 2014, 2019లోనూ టీడీపీ వ‌ర్గ‌పోరు బ‌య‌ట‌ప‌డ‌టంతో వైసీపీకి గ‌ట్టి పోటీ ఇవ్వ‌లేక‌  ఓడిపోయింది. ఆ రెండు ప‌ర్యాయాలు వైసీపీ త‌ర‌ఫున బూడి ముత్యాల‌నాయుడు విజ‌యం సాధించారు. అప్పుడు టీడీపీ త‌ర‌ఫున పోటీచేసిన గ‌విరెడ్డి నాయుడు ఓడిపోయారు.  ముత్యాల నాయుడు ప్ర‌స్తుతం జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్నారు.  2009లో ఇదే నియోజకవర్గం నుంచి గవిరెడ్డి రామా నాయుడు గెలుపొందడం గమనార్హం. గవిరెడ్డి  రామానాయుడు అంత కీలకంగా ఉండటం లేదని భావించిన టీడీపీ అధిష్టానం ఇటీవల పివీజీ కుమార్ కి ఇన్ ఛార్జి బాధ్యతలు అప్పగించింది.  గవిరెడ్డి రామానాయుడు ఆ సమయంలో ప్రతి గ్రామంలోనూ సీనియర్లను నిర్ల‌క్ష్యం చేయ‌డంతో వారు అసమ్మతివాదులుగా తయారై ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. 2014  ఎన్నికల్లో ఈ గ్రూపు  విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు నాయ కత్వంలో గవిరెడ్డి రామానాయుడిని ఓడించారని చెబుతున్నారు. ఇప్పటికీ ఈ అసమ్మతి గ్రూపు కొనసాగుతోందని  ఇక్క‌డ ప్ర‌చారంలో వుంది. గతంలో టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా గవిరెడ్డి రామా నాయుడు ఉన్నప్పుడు ఆయన గ్రూపుతో పాటు పైలా ప్రసాదరావు గ్రూపు ఉండేది. నియోజకవర్గంలో పార్టీ కేడర్ ని   ఏకం చేయడంలో గవిరెడ్డి విఫలమ య్యారని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇన్ఛార్జి బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించారు. అప్పట్లో  పార్టీ కార్య‌క‌లాపాల్లో చురుగ్గా ఉన్న‌  పీవీజీ కుమార్ కి ఆ బాధ్యతలు  అప్పగించారు. దీంతో మాడుగుల నియోజకవర్గంలో మూడు గ్రూపులు ఏర్పడ్డాయి. ఒక  గ్రూపుకు గవిరెడ్డి రామానాయుడు, రెండో గ్రూపు పీవీజీ కుమార్,  మూడ‌వ‌ గ్రూపు  పైలా ప్రసాదరావు నాయకత్వం  వహిస్తు న్నారు. టీడీపీ అధిష్టానం ఆశించింది ఒకటైతే,  ఇక్కడ జరిగింది మరొకటి .  పార్టీలో రెండు గ్రూపులు కాస్తా మూడు గ్రూపులు కావ‌డంతో నియోజకవర్గంలోని టీడీపీ కేడర్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని  అంటు న్నారు. దీంతో ఏమి చెయ్యాలో అర్థంకాక టీడీపీ అధినేత చంద్రబాబు తల పట్టుకుంటున్నారని పేర్కొం టున్నారు. ఇటీవల చోడవరంలో జరిగిన అనకాపల్లి జిల్లా టీడీపీ మినీ మహానాడుకు కార్యకర్తలను తరలించడం లోనూ కుమార్ వెనుకబడ్డారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నియోజక వర్గ సమీక్షా సమావేశంలో ఈ గ్రూపులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరో వైపు ఇదే సమయంలో పైలా పౌండేషన్ చైర్మన్ పైలా ప్రసాదరావు టీడీపీకి రూ.25 లక్షలు విరాళాన్ని అంద జేశారు. ఈ నేపథ్యంలో మాడుగుల అసెంబ్లీ సీటును చంద్రబాబు వీరి ముగ్గురిలో ఎవరికి కేటాయిస్తారో అని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుం టున్నారు.

మంత్రిని నిలదీసిన మహిళపై మద్యం కేసు!

రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నది సామెత. ఇప్పుడు జగన్ సర్కార్ తలచుకుంటే కేసులకు కొదవా అని ఆ సామెతను మార్చుకోవలసిన పరిస్థితి ఏపీలో ఉంది. విపక్ష నేతలు, సొంత పార్టీ ఎంపీ.. సామాన్యులు, మాన్యులు అన్న తేడా లేదు. సర్కార్ ను విమర్శించినా, ప్రశ్నించినా కేసులు పెట్టడానికి పోలీసులు రెడీ అయిపోతుంటారు. కేసు పెట్టినా పెట్టకున్నా పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి కూర్చోబెడతారు. అక్కడ నుంచి రాయబారాలు, హెచ్చరికలు, బెదరింపులు. అవేవీ ఫలించకపోతే.. ఇక కేసు పెట్టి జైల్లో తోయడమే.  జగన్ సర్కార్ ను ఎదిరించినా, నిలదీసినా ఇక అంతే సంగతులు. అలా సర్కార్ ను నిలదీసిన వారు విపక్ష నేతలైనా, సామాన్య జనులైనా వారిని వెంటాడి వేధించడం ఏపీలో షరా మామూలే అన్నట్లుగా తయారైంది. తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి సంగతి తీసుకున్నా, ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడైనా, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. ఇలా చెప్పుకుంటూ పోతే అంకెలు కూడా సరిపోవు. అంతెందుకు ప్రభుత్వ విధానాలను విమర్శించిన సొంత పార్టీ ఎంపీపై కూడా కేసులు పెట్టి వేధించిన చరిత్ర జగన్ సర్కార్ ది. ఇప్పుడు జగన్ సర్కార్ తాజాగా నమోదు చేసిన కేసు చూస్తుంటే ఇక రాష్ట్రంలో ప్రభుత్వానికి తందానా అనకపోతే కేసులు ఎదుర్కొని జైళ్లలో కూర్చోవడం తప్ప మరో గత్యంతరం లేదా అనిపించక మానదు. ఇంతకీ విశేషమేమిటంటే, గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సత్య సాయి జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి సత్యనారాయణను ఓ మహిళ నిలదీశారు. తనకు  పిఛన్ తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తన ఇంటికి రావద్దనీ, వస్తే చెప్పుతో కొడతాననీ హెచ్చరించారు. సహజమే.. ఇంత కాలం వచ్చిన పింఛన్ ను కారణం లేకుండా తీసేస్తే ప్రశ్నించడం సహజమే. ఒకింత ఆగ్రహం ఎక్కువ అయితే.. ఇంటికి రావద్దనడమూ.. ముఖం మీదే తలుపులు మూసేయడమూ, వస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించడమూ తప్పెలా అవుతుంది. ఆమె తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇంటికి ఆహ్వానించడమైనా, రావద్దని అనడమైనా.. ఆ ఇంటి యజమానుల ఇష్టం. దానికి కాదనడానికి ఏ ప్రభుత్వానికీ అధికారం లేదు. ఒక సామాన్య మహిళ జగన్ ప్రభుత్వంపై, మంత్రి శంకర నారాయణపై తన ఆగ్రహాన్ని అలా వెళ్లగక్కింది. అప్పటికి ఊరుకుని వెనుదిరిగిన మంత్రి ఆ తరువాత తన అధికార ప్రతాపాన్ని చూపారు. మంత్రిని నిలదీసిన మహిళను పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్లారు. మద్యం కేసు పెట్టారని అంటున్నారు. అయితే ఆ విషయం ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. కానీ ఆమెను పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్లడం నిజం. ఆ తరువాత సొంత పూచీకత్తుపై విడుదల చేయడమూ నిజం. సరిగ్గా మంత్రి శంకరనారాయణను నిలదీసి ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేసిన మరునాడే పోలీసులు ఆమెను స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఎస్టీ వర్గానికి చెందిన ఆ మహిళ ఒక కూలీ. కూలి పని చేసుకుని పొట్టపోసుకునే ఆమె కూలీ పనులు చేసే చోట ఓ ఇసుక దిబ్బలో కర్నాటక బ్రాండ్ మద్యం ప్యాకెట్లు  దొరికాయంటూ పోలీసులు ఆమెను స్టేషన్ కు తీసుకువెళ్లారు.  

మూడు రాజధానుల బిల్లు కోసమేనా..?

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీలు ప్రకటించడం, వాయిదా వేయడం ఏపీ సర్కార్ కు ఒక ఆనవాయితీగా మారిపోయినట్లుగా కనిపిస్తోంది. సాధారణంగా అసెబ్లీ వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ లేదా అక్టోబర నెలలలో నిర్వహిస్తుంటారు. అయితే జగన మాత్రం ఈ సారి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను జూలైలోనే నిర్వహిస్తామని ప్రకటించారు. అంతా నిజమే కాబోలు అనుకున్నారు. అయితే ఇప్పుడు సమవేశాలు జూలైలో కాదంటున్నారు. ఏలిన వారు ఏం చెబితే అది వినాలి అంత కంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇంతకీ జగన్ అసలు అసెంబ్లీ సమావేశాలను జూలైలోనే నిర్వహించాలని ఎందుకు భావించారు? మళ్లీ అంతలోనే ఎందుకు వాయిదా వేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం జగన్ పార్టీ శ్రేణుల నుంచే వస్తోంది. జగన్ కేబినెట్ లో మంత్రి గుడివాడ అమర్నాద్ ఉరుములేని పిడుగులా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలోనే మళ్లీ మూడు రాజథానుల బిల్లును తీసుకువస్తామని ప్రకటించారు. అసెంబ్లీ వాయిదాకు ఆ బిల్లు రూపకల్పన ఇంకా పూర్తికావడమే కారణమై ఉండవచ్చునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవంగా ఈ మూడేళ్లలో జగన్ సర్కార్ ఎన్నడూ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పట్ల శ్రద్ధ చూపలేదు. ఇక తప్పదు నిర్వహించి తీరాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మళ్లీ వాయిదా వేసింది.  ఈ సారి అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులు పెట్టబోతున్నట్లు మీడియా సాక్షిగా జగన్ సర్కార్ పలు లీకులు ఇచ్చింది. కీలకం అనగానే జగన్ సర్కార్ కు అన్నిటి కంటే కీలకం, ప్రధానం, ప్రాముఖ్యం మూడు రాజధానులేనని తెలిసిందే. కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పటి నుంచి.. అంటే మూడు రాజధానుల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అనివార్యంగా ఉపసంహరించుకున్నప్పటి నుంచీ న్యాయపరమైన సలహాలు తీసుకుని మరో సారి ఆ బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకురావలన్న లక్ష్యంతోనే వైసీపీ సర్కార్ ఉంది.  ఇటీవలి   వైసీపీ ప్లీనరీలో కూడా తమ విధానం మూడు రాజధానులేనని విస్పష్ట ప్రకటన కూడా చేశారు.   అసెంబ్లీలో మూడు రాజధానుల  బిల్లు మళ్లీ ప్రవేశపెట్టనున్నట్లు కూడా చెప్పరు.  అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది.ఆ తీర్పును సవాల్ చేస్తూ  ప్రభుత్వం ఇంకా సుప్రీం కోర్టుకు వెళ్లలేదు.    సుప్రీంలో సవాల్ చేసినా ఫలితం ఉండదన్న న్యాయ నిపుణుల సలహాతోనే జగన్ సర్కార్ సుప్రీం కు వెళ్లలేదని పరిశీలకులు అంటున్నారు. ఇక మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఉన్న ఏకైక ఆప్షన్ అసెంబ్లీలో మరో సారి బిల్లు ప్రవేశ పెట్టడమే.  అందుకోసమే ఈ నెలలోనే నిర్వహించాలని భావించిన అసెంబ్లీ వర్షాల సమావేశాలను వాయిదా వేశారని చెబుతున్నారు. పకడ్బందీగా బిల్లు రూపొందించి  అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశ పెట్టడానికి జగన్ సర్కార్ నిర్ణయించుకుందనీ, అందుకే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను వాయిదా వేసిందనీ విశ్లేషిస్తున్నారు.

ఎనిమిదేళ్ల కైలీ.. మ‌న‌సు బ‌హు దొడ్డ‌ది!

బాల్యంలో తండ్రిని కోల్పోవ‌డం జీవితంలో ఎదిగేకొద్దీ పెనుబాధ‌నే ఇస్తుంది. వెన్నుద‌న్నుగా ఉండా ల్సిన తండ్రి లేక‌పోవ‌డం ఆర్ధికంగా, మాన‌సికంగానూ పిల్ల‌ల‌కు స‌మ‌స్యే. పెద్ద‌వారు ఆ ప‌రిస్థితుల‌ను అర్ధంచేసుకుని భ‌విష్య‌త్ జీవితానికి గ‌తాన్ని వ‌దిలే య‌గ‌ల్గుతారు. కానీ  పిల్ల‌లు ఆట‌పాట‌లు, స్కూలు జీవితంలో ప్ర‌తీ సంద‌ర్భంలో తండ్రి లోటు బాగా స‌మ‌స్యాత్మ‌కంగా మారు తుంది. స్కూలు స్నేహితులు, చుట్టుప‌క్క‌ల వారి పిల్ల‌లు, వారి త‌ల్లిదండ్రుల‌ను చూస్తున్న‌పుడు తండ్రిలేని పిల్ల‌ల ప‌రిస్థితి వ‌ర్ణ‌నా తీతం. బ‌య‌టికి చెప్పుకోలేని బాధ వెన్నాడుతూనే వుంటుంది. ఇలాంటి ప‌రిస్థితులు త‌న స్నేహి తులుగాని, మ‌రెవ్వ‌రుగానీ ఎదుర్కోరాద‌ని షెబోయ్‌గాన్‌కు చెందిన కైలీ బ్రూనెట్ అనే ఎనిమిదేళ్ల పిల్ల అనుకుంది.  ఆమె తండ్రి ఆత్మహత్యచేసుకున్నాడ‌ని తెలుసుకున్న‌ది. అస‌లు ఆత్మ‌హ‌త్య ఎందుకు చేసుకుంటా ర‌న్న‌ది ఆమెకు తెలియ‌లేదు. అనేకానేక కార‌ణాలు ఉండ‌వ‌చ్చ‌ని ఎంద‌రో చెప్పారు. కానీ దానికి సంబంధించిన‌ అవగాహన కోసం డబ్బును సేకరించేందుకు ఎనిమిదేళ్ల చిన్నారి నిమ్మరసం స్టాండ్‌ను ఏర్పాటు చేసింది. ఎనిమిదేళ్ల విస్కాన్సిన్ అమ్మాయి, ఇతర పిల్లలు తల్లిదండ్రులు లేకుండా ఎదగ కుండా చూసుకోవడానికి తన వంతు సహాయం చేయాలనుకుంది. ఆత్మహత్య నివారణ కోసం ఆమె నిమ్మరసం 800 షిల్లింగులు సేకరించింది. షెబోయ్‌గాన్‌కు చెందిన కైలీ బ్రూనెట్, తన తండ్రి 32 ఏళ్ల జోర్డాన్ వేక్‌ఫీల్డ్‌తో కలిసి డిస్క్ గోల్ఫ్, వీడియో గేమ్‌లు ఆడటం పార్కు లకు వెళ్లడం గుర్తుచేసుకుంది. అతను చాలా స‌ర‌దా మ‌నిషి, త‌న పట్ల శ్రద్ధ వహించేవాడు. అతను ఎప్పుడూ ఏ విష‌యంలోనూ అస్స‌లు కూతురుని కోప‌గించుకునే వాడు కాదు. కైలీ తండ్రి నవంబర్ 2019లో ఆత్మహత్యతో చనిపోయాడు. అప్ప‌టికి ఆమె చాలా చిన్న వయస్సులో ఉన్నందున, అతను ఎలా చని పోయాడో ఆ సమయంలో కైలీ తల్లి ఆమెకు చెప్పలేదు. ఆమె  తల్లి  30 ఏళ్ల బ్రిటనీ బ్రూనెట్-తిమ్మెస్చ్ ఆ  అపరాధ భావం తోనే ఉండేది.  కానీ ఆమె ఆ సంద‌ర్భాన్ని, సంఘ‌ట‌ న‌ను వివ‌రించే మాన‌సిక స్థితిలో లేదు. అంద‌రూ ఆమెను అర్ధంచేసుకుని చాలాకాలం నుంచి మౌనం వ‌హించారు.  షెబోయ్‌గాన్ ఏరియా స్కూల్ డిస్ట్రిక్ట్ సబ్ సెక్రటరీ అయిన బ్రూనెట్-తిమ్మెష్ కి  తన కూతురు  కైలీ థెరపిస్ట్ ఒక‌రోజు క‌లిశారు. మాట‌ల మ‌ధ్య‌లో ఆమె కైలీకి  అర్ధ‌మ‌య్యేలా మెల్ల‌గా చెప్ప‌మ‌ని కోరారు.  మీరు చివరికి ఆమెకు ఏదో ఒక రోజు చెప్పవలసి ఉంటుంది. ఆమె పెద్ద‌ద‌వుతోంది. పిల్లలు మాట్లా డటం మొదలుపెట్టబోతున్నారు అనీ హెచ్చ‌రించారు. కానీ కొన్ని నెలల క్రితం, కైలీ తన తల్లిని అడిగింది.. తన తండ్రి ఎలా చనిపోయాడో తెలుసుకోవాలనుకుంటున్నానని. కానీ ఆమెకు ఆ సంగ‌తి తెలియ కుండా వుండ‌డ‌మే అవసరమ‌ని  ఆమె తల్లి చెప్ప‌లేదు.  మ‌రో రెండు నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ వారి మధ్య పెద్ద చ‌ర్చ‌ జరిగింది. ఈ సంవత్సరం జూలై 9న తన తండ్రి   పుట్టినరోజును పురస్క రించుకుని, కైలీ అతని జ్ఞాపకార్థం నిమ్మరసం స్టాండ్‌ను ఏర్పాటు చేయా లని నిర్ణయించుకుంది, తద్వారా వచ్చిన మొత్తాన్ని షెబోగాన్‌లోని మెంటల్ హెల్త్ అమెరికాకు విరా ళంగా ఇచ్చింది. సేవలను పొందలేని వ్యక్తులకు సేవలను పొందేందుకు సహాయం చేయాలని ఆమె కోరుకుంది, తద్వారా ఇది మరొక వ్యక్తికి జరగదు లేదా మరొక పిల్లవాడు తల్లిదండ్రులు లేకుండా వెళ్లవలసిన అవసరం లేదని ఆమె తల్లి వివరించింది. కైలీ జులై 1, జూలై 8న రెండు రోజులలో నిమ్మ రసం విక్రయించి మొత్తం 800 షిల్లింగులు వసూలు చేసింది. ఇప్పుడు, ఆమె దీనిని వార్షిక సంప్రదా యంగా మార్చాలని యోచిస్తోంది. కైలీ చిన్న‌పిల్లే.. మ‌న‌సు దొడ్డ‌ది.

క్లౌడ్‌బ‌ర్‌స్ట్‌... వ‌రుణుడి అస్త్ర‌మా.. విదేశీ అస్త్ర‌మా? !

గ‌త ప‌ది రోజులుగా అన్ని ప్రాంతాల్లోనూ వ‌ర్షాలు కుమ్మ‌రించిన‌ట్లు ప‌డుతున్నాయి. మంచి  వ‌ర్షాకాలం కాకున్నా కుంభ‌వృష్టి ప‌డింది, ప‌డుతోంద‌న్న వార్త‌లే వింటున్నాం, చూస్తున్నాం. కానీ ఇవేమంత‌గా మ‌రీ ఆనందం పంచ‌డం లేదు. మేఘారే.. మేఘా..మేఘా.. అంటూ గెంతులెయ్య‌డానికీ వీలులేదు.  అకాల వ‌ర్ష‌మే. అన్ని ప్రాంతాలూ భారీగా న‌ష్ట‌పోయాయి. కానీ స‌మ‌యంగాని స‌మ‌యంలో వ‌చ్చిన ఈ కుంభ‌వృష్టి  వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌ల‌ను ఆలోచించేట్టు చేసింది. తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం దీన్ని విదేశీ కుట్ర‌గానే భావిస్తున్నారు. మ‌రి ఇవి వారు పంపిన మేఘ‌శ‌రాలా లేదా క్లౌడ్ బ‌ర్‌స్ట్ అనేది శాస్త్ర‌వేత్త‌లే తేల్చాలి.   ఈ కుంభవృష్టి అనేది చాలాకాలం నుంచి వింటున్న మాట‌. ఇటీవ‌లి కాలంలో వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌లు అంటున్న మ‌రొక ప‌దం  క్లౌడ్ బ‌ర్‌స్ట్‌! అంటే ఒక గంటలో ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో 110 మిల్లీ మీ టర్ల వర్షం పడితే దానిని కుంభ వృష్టి లేదా క్లౌడ్ బ‌ర్‌స్ట్‌ అంటారు. కుంభం అంటే కుండ అలాగే ఒక కుండ బద్దలు అయ్యి దాని లోని  నీళ్ళు  ఒకేసారి  బయటికి వస్తే ?  క్లౌడ్ బ‌ర్‌స్ట్ అనేది చాలా  అరుదుగా  జరిగే  ప్రక్రియ. దీనిని  కృత్రి మంగా సృష్టించలేరు. అలా చేయాలంటే ఒకే చోట మేఘాలని ఆపేసి అవి  కురి సేట్లుగా చేయాలి. కానీ మేఘాలు ఏమన్నా మేకలు, గొర్రెలా ?  ఒకే చోట ఆపి అవి వర్షం పడేట్లుగా చేయ డానికి ? కృత్రిమ మేఘాలని సృష్టించ వచ్చు అదీ ఆ ప్రాంతంలో కొద్దో గొప్పో మేఘాలు ఉండాలి. కృత్రిమ మేఘా లని సృష్టించి కృత్రిమంగా వర్షాలు కురిపించ వచ్చు అదీ చాలా కొద్ది మొత్తంలో మాత్రమే. గతంలో రాజ శేఖర రెడ్డి గారి హయాంలో కృత్రిమ వర్షం కురిపించడానికి వెదర్ రాడార్ [డాప్లర్ రాడార్] లని  నెల కొల్పి ఆకాశం నుండి విమానం ద్వారా సాలిడ్ సిల్వర్ అయోడిన్[సిల్వర్ అయోడిన్ స్ఫటికములు రూపంలో ] మేఘాలలోకి వదులుతారు అలా వదిలిన సిల్వర్ అయోడిన్ స్ఫటికములు మేఘాలలోని తెమని గ్రహించి వాటిని వర్షంలా కురిసెట్లు చేస్తాయి. విమానం ఖర్చు,సిల్వర్ అయోడిన్ ఖర్చు తడిసి మోపడయింది కానీ వర్షాలు పడలేదు అప్పట్లో దాంతో ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు. అలాంటిది దట్టమ యిన మేఘాలని అదీ ఒకే చోట నిలిపి ఉంచి అవి వర్షించేట్లుగా చేయడం అసంభవం.  గత వారం రోజులుగా పడుతున్న వర్షాలు ఎక్కడా కూడా ఒకే రకంగా పడలేదు. కుండాపోతాగా అదీ ఒక్క గంటలో 100 మిల్లీ మీటర్ల వర్షం ఎక్కడ పడ్డది ? క్లౌడ్ బ‌ర్‌స్ట్ అనేది 2015 లో ముంబై నగరంలో అదీ ఒకే రోజులో 110 మిల్లీ మీటర్ల వర్షం పడ్డది. దాంతో ముంబై నగరం వారం రోజులుపాటు స్తంబించిపోయింది. పల్లపు ప్రాంతాలు 4 అడుగుల లోతు నీళ్ళలో మునిగిపోయాయి అదీ వరదనీరు అరేబియా సముద్రం లోకి దారి తీసే డ్రైనేజీ వ్యవస్థ మూసుకు పోవడం ఒక కారణం అయితే సముద్రం నీరు భూమి మీదకి ఎదురు తన్నడం రెండవకారణం నీళ్ళు నిలిచిపోవడానికి. ఒక గంటలో ఒక చదరపు కిలోమీటర్ ప్రాంతంలో 100 లేదా 110 మిల్లీ మీటర్ల వర్షం పడితే దానిని క్లౌడ్ బ‌ర్‌స్ట్‌ అంటారు కానీ ఈ మధ్య కాలంలో అలాంటి సంఘటన జరిగిన దాఖలాలు లేవు.  ఇక అమరనాథ్  లో వారం క్రితం వచ్చిన దానిని ఫ్లాష్ ఫ్లడ్ అంటారు. హిమాలయ ప్రాంతాలలో ఇవి సర్వ సాధారణంగా జరిగేదే ! వర్షాకాలం మేఘాలు హిమాలయ పర్వత శ్రేణుల దగ్గర ఆగిపోతాయి ఎందుకంటే అంతకంటే ఎత్తులో అవి వెళ్లలేవు వాతావారణం చల్లగా ఉండడం వలన మేఘాలు ఎక్కువ ఎత్తులోకి వేళ్ళలేక అక్కడే ఆగిపోయి ఆ మేఘాలు వర్షించడానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అవి వర్షిస్తాయి. అమరనాథ్  ప్రాంతంలో ఎత్తైన పర్వత ప్రాంతాలు ఉన్నాయి అక్కడ మంచు కరిగి ఆ నీళ్ళు అక్కడే నిలవ ఉంటాయి వాటికి తోడు పెద్ద వర్షం పడితే ఆ నీరు బురదని తనతో తీసుకొని కిందకి వేగంగా ప్రవహిస్తుంది. ఇది నిత్యం జరిగేదే అక్కడ. డానికి విదేశీ కుట్ర అని ప్రజలకి అర్ధంకాని టెక్నికల్ పదాలని వాడి అయోమయం పడేట్లు చేస్తున్నారు కొందరు.    ఇక మహారాష్ట్రలోని గోదావరి పరీవాహక ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీరు ఎప్పుడూ లేనిది నాశిక్ పట్టణాన్ని కూడా ముంచేసింది  అయితే వరద  నీరు వెళ్ళే  ప్రాంతాలు  కబ్జాకి గురవడం మూలంగా ఎటూ పోక చివరకి నాశిక్ పట్టణాన్ని ముంచేసి అలాగే దిగువకి ప్రవహించి తెలంగాణ లోని పరీవాహక ప్రాంతాలని ముంచేసింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో ఎక్కడా క్లౌడ్ బ‌ర్‌స్ట్‌ అయినట్లు వాతావరణ శాఖ ప్రకటించలేదు. వారం రోజులుగా ఆగకుండా కురిసిన వర్షాల వల్ల వచ్చిన సమస్య ఇది.  ఇక మూసీ నది కాచ్మెంట్ ప్రాంతాలలో ఎలాంటి కట్టడాలు కట్టడాన్ని నిషేధించే 111 GO రద్దు చేయడం ఇప్పుడు చర్చకి దారి తీస్తుంది. కాచ్మెంట్ ఏరియాలో కట్టాడాల మీద నిషేధం ఉంటేనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఆ ప్రాంతాలలో ఇల్లు,అపార్ట్మెంట్ లు కడితే నీళ్ళు ఎక్కడికి పోతాయి ? కాళేశ్వం పంప్ హౌస్ మునిగిపోయి అందులో ఉన్న హెవీ పంప్ లు చెడిపోవడం వాటిని కాపాడే ఫ్లడ్ వాల్ మూడేళ్ళ కిందటే కూలిపోవడం వలన నీళ్ళు పంప్ హౌస్ లోకి వెళ్ళి పంప్ లు చెడిపోయాయి వాటిని  మళ్ళీ పనిచేయెట్లు చేయాలంటే కానీసం 1000 కోట్లు ఖర్చు అవుతుందేమో ? పంప్ లలోకి బురద వెళ్ళి పోయి నీళ్ళు మొత్తం వెనక్కి వెళ్ళిపోయి వాటిని పనిచేయించాలంటే కనీసం 6 నెలలు పడుతుంది. అంచేత క్లౌడ్ బ‌ర్‌స్ట్‌ అని విదేశీ కుట్ర అని ఏవేవో చెప్పేస్తే అవి విని నమ్మే వాళ్ళకి కొంచెం ఊరట.

విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా

ఉప రాష్ట్రప‌తి ఎన్నికలో విప‌క్షాల అభ్య‌ర్థిగా మాజీ గ‌వ‌ర్న‌ర్ మార్గ‌రెట్ అల్వా పోటీ లో దిగనున్నారు.   ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ నివాసంలో సమావేశమైన విపక్షాలు మార్గరెట్ అల్వా అభ్యర్థిత్వాన్ని ఖారారు చేశాయి. ఆ తరువాత శరద్ పవార్ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పేరును ప్రకటించారు.  తనను విప‌క్షాల ఉమ్మడి ఉప రాష్ట్రప‌తి తనను ఎంపిక చేయడాన్ని  గౌర‌వ‌ంగా భావిస్తున్నట్లు అల్వా పేర్కొన్నారు.  తన మీద మీద న‌మ్మ‌కం ఉంచినందుకు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నానని  ట్వీట్ చేశారు. కాగా, ఆమె గ‌తంలో గోవా, రాజ‌స్థాన్, గుజ‌రాత్, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేశారు. మ‌రోవైపు, విప‌క్ష పార్టీలు అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల కేంద్ర మంత్రి గ‌జేంద్ర షెకావ‌త్ స్పందిస్తూ… త‌మ‌కు మెజారిటీ ఉంద‌ని, ఇత‌ర అభ్య‌ర్థి గెలిచే అవ‌కాశం లేద‌ని అన్నారు. విప‌క్షాలు అభ్య‌ర్థిని పోటీకి దింప‌క‌ుండా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.  1969లో   రాజకీయాల్లోకి ప్రవేశించిన అల్వా కాంగ్రెస్‌లో  కీలక పదవులు చేపట్టారు. 1974లో తొలిసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. 1980,1986,1992లో వరుసగా రాజ్యసభకు నియమితులయ్యారు. 1999లో ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో పోటీ చేసి మార్గరెట్‌ అల్వా పరాజయం పాలయ్యారు.  2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. ఆ తర్వాత నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. గోవాకు 17వ గవర్నర్‌గా సేవలందించారు. గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా పనిచేశారు.  

సోనియా చుట్టూ చిక్కు ముళ్ళు

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, వయసు 76 సంవత్సరాలు. దేశానికి స్వాతంత్రం రావడానికి  ఇంచుమించుగా ఒక ఒక సంవత్సరం ముందు, 1946 డిసెంబరు 9న ఆమె జన్మించారు. సోనియా గాంధీ ఎక్కడో ఇటలీలో పుట్టినా, భారత రాజకీయాల్లో ఆమె, చాలా కీలక భూమికను పోషించారు. ఇంచు మించుగా1998 నుండి. రెండు దశాబ్ధాలకు పైగా, ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. మధ్యలో, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినా, 2019 ఎన్నికలలో పార్టీ వరసగా రెండవ సారి ఘోరంగా ఓడిపోయిన నేపధ్యంలో ఆయన కాడి దించేశారు. అప్పటికే సోనియా వయసు, 70 ప్లస్... అయినా ఆమె మరో మారు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికీ, ఆమె అదే పదవిలో కొనసాగుతున్నారు. అంతేకాదు, 2004 నుంచి 14 వరకు పదిసంవత్సరాల పాటు,దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాజకీయ నాయకురాలిగా కితాబులు అందుకున్నారు.  అయితే, ఇప్పడు పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఇప్పుడు ఆమె అన్ని వైపులా నుంచి సమస్యలు ఎదుర్కుంటున్నారని, ఎవరో కాదు, కాంగ్రెస్ నాయకులే అంటున్నారు. రాజకీయ విశేషకులూ అదే అంటున్నారు. ఓ వంక, వయసు, వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలు. మరో వంక రాజకీయంగా ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లు ఆమెను కదలకుండా చేస్తున్నాయి. మరో  వంక కాంగ్రెస్ పార్టీని వరస ఓటములు వెంటాడుతున్నాయి. సీనియర్ నాయకులు చాలా వరకు పార్టీకి దూరమయ్యారు. సమస్యల సుడి గుండం నుంచి గట్టేక్కించే సామర్ధ్యమున్న గులాం నబీ ఆజాద్ వంటి నాయకులు ఇప్పటికీ ఇంకా పార్టీలో ఉన్నా, ప్రత్యేక గ్రూప్ ( జీ 23) గా ఏర్పడి  పార్టీ వ్యవహరాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, యధేచ్చగా సాగుతున్న వలసలు పార్టీ నాయకత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.  ఈ నేపధ్యంలో సోనియా గాంధీ ఇంతవరకు ఎప్పుడూ ఎదుర్కోని  సమస్యలను ఎదుర్కుంటున్నారని అంటున్నారు. అవన్నీ ఒకెత్తు అయితే, కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అగ్ర నాయకత్వం, కాంగ్రెస్ పుంజుకునే సంకేతాలు కనిపించిన ప్రతి సందర్భంలోనూ, పాత దస్త్రాలు తిరగేసి కేసులను తిరగతోడుతోందని, ముఖ్యంగా గాంధీ ఫ్యామిలీ టార్గెట్  గా బీజేపీ, ముందరి కాళ్ళకు బంధాలు వేసేందుకు సిబిఐ, ఈడీ ఇతర కేంద్ర విచారణ సంస్థలను ఉసిగోలుపుతోందని, కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే  నేషనల్ హెరాల్డ్ కేసులో సొనియా గాంధీ, రాహుల్ గాంధీ విచారణ ఎదుర్కుంటున్నారు. ఇద్దరికీ సమన్లు జారీ అయ్యాయి. రాహుల్ గాంధీని ఈడీ ఐదు రోజుల పాటు విచారించింది. అయితే, అనారోగ్యం (కొవిడ్) కారణంగా గతంలో విచారణకు హాజరు కాలేక పోయిన సోనియా గాంధీకి జూలై 22 విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున, ఈడీ విచారణ మరోసారి వాయిదా వేస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.  అదలా ఉంటే ఇప్పుడు తాజాగా, 2002లో జరిగిన గుజరాత్‌ అల్లర్ల వ్యవహారంలో ఆ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి, (ప్రస్తుత ప్రధాని) నరేంద్ర మోడీని అప్రతిష్ఠ పాలుచేసి  గుజారత్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సోనియా గాంధీ కుట్ర చేశారనే .. ఆరోపణను బీజేపీ  తెరపైకి తెచ్చింది. గుజరాత్‌ అల్లర్లపై దర్యాప్తు చేస్తున్న సిట్‌.. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో చేసిన కీలక వాఖ్యల ఆధారంగా  రాజకీయ దుమారానికి  బీజేపీ శ్రీకారం చుట్టింది.  గుజరాత్ అల్లర్లను అడ్డు పెట్టుకుని , మోడీని అప్రతిష్ఠపాలు చేయడంతో పాటుగా   గుజారత్ ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు సోనియా గాంధీ కుట్ర చేసారని,  బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర తీవ్ర ఆరోపణ చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దివంగత నేత అహ్మద్‌ పటేల్‌ పాత్ర కూడా ఈ కుట్రలో ఉందన్నారు. సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌కు ఆయన రూ.30లక్షలు ఇచ్చారని  వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలలో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా, ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న సోనియా గాంధీ చుట్టూ చిక్కు ముళ్ళు విచ్చుకుంటున్నాయి అనేది మాత్రం నిజం అంటున్నారు.

సీఎం కామెంట్స్ పై పొలిటికల్ క్లౌడ్ బరస్ట్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన, ఈ మాట మేఘాల మాటేమో కానీ, రాజకీయాలలో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. పెద్ద దుమారాన్నే రేపింది. ఇప్పుడు, వరదలు, ప్రజల కష్టనష్టాల విషయం పక్కకు పోయింది, కాళేశ్వరంలో మునక వివాదమూ పక్కకు పోయింది. ‘క్లౌడ్డ్ బరస్ట్’ చుట్టూనే రాజాకీయ దుమారం చెలరేగుతోంది., రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణం కావచ్చని, అనుమానం వ్యక్తం చేస్తూనే, ముఖ్యమంత్రి కేసీఆర్ విదేశాల కుట్ర  కోణాన్ని కూడా తెరమీదకు తెచ్చారు.   నిజానికి, ముఖ్యమంత్రికి అలాంటి అనుమానం ఏదైనా ఉంటే, అందుకు సంబదించి సమాచారం ఏదైనా తమ వద్ద ఉన్నా, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళితే, ఎవరికీ అభ్యతరం ఉండేది కాదు. పోనీ కేంద్రంతో మాటలు లేవు, కాబట్టి, కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లక  పోయినా, సంబంధిత అధికారాలను లేదా శాస్త్ర వేత్తలను సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చినా  అదో రకంగా ఉండేది. కానీ, ముఖ్యమంత్రి కేసిఆర్ అదేమీ లేకుండా, ఒక మాట అనేశారు. నిజానికి, అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రాజకీయ నాయకులు ఇలాంటి అసత్యాలు, అర్థ సత్యాలను ఆశ్రయించడం కొత్తేమీ కాదు. అందులోనూ, కేసీఆర్  అలాంటి విద్యలో సిద్దహస్తులనే విషయంలో ఎవరికీ అనుమానం లేదు.  ముఖ్యమంత్రి కనీసం హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులను సంప్రదించినా, కొంత క్లారిటీ వచ్చేది కావచ్చును. నిజానికి, హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తనకైతే క్లౌడ్ బరస్ట్ గురించి పెద్దగా తెలియదని, తమ వద్ద ఉన్న సమాచారం మేరకు  వాతావరణ హెచ్చరికలు జారీ చేశామని చెప్పారు. ప్రకృతిలో వచ్చిన మార్పుల కారణంగా మాత్రమే వర్షాలు కురిసి వరదలు సంభవించాయని చెప్పారు. అంటే, ముఖ్యమంత్రి చెప్పిన క్లౌడ్ బరస్ట్ కథ కట్టు కథ కావచ్చనే అనుమానం వ్యక్త పరిచారని అనుకోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి ఏ ఆధారాలు లేకుండా, విదేశాలు కుట్రతో "క్లౌడ్‌ బరస్ట్‌" చేయడం వల్లే వరదలు వచ్చాయని, బహిరంగ ప్రకటన ఎందుకు చేశారు? ఏ ఉద్దేశంతో, ఈ వ్యాఖ్యలు చేశారు? అలాగే. గతంలో ఒకసారి  కశ్మీర్’లోని లద్ధాక్ – లేహ్’లో మరోమారు ఉత్తరఖండ్ లో చేశారని అన్నారు. ఈమధ్య గోదావరి పరివాహక ప్రాంతంలోనూ చేస్తున్నారని గ్లూమీ .. గ్లూమీ ( అస్పష్ట) సమాచారం ఉందని అన్నారు. కావచ్చును, ముఖ్యమంత్రి ఏదీ  నిర్దారణగా చెప్పా లేదు, ఎవరి మీద వేలెత్తి చూపలేదు. కానీ, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తమకే స్పష్టత లేని సమాచారం ఆధారంగా, అంత సీరియస్ వ్యాఖ్య, ఇంత బేఫర్వాగా ఎలా చేస్తారు, అనేదే ఇప్పడు రాజకీయ వర్గాల్లో వివాదం అవుతోంది. మరోవంక, చైనా పేరు కూడా తెరమీదకు వచ్చింది.  నిజానికి వరదల విషయంలో మొదటి నుంచి ప్రభుత్వం బేఫర్వా గానే వ్యవహరిస్తోంది. విపత్తు ముంచు కోస్తోందని హెచ్చరికలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు.నిమ్మకు నీరెత్తి నట్లు వ్యహరిస్తూ వచ్చింది. ముఖ్యమంత్రి, కూడా వర్షాలు, వరదల మీద అధికారులతో రివ్యూ చేసినా,  విలేకరుల సమావేశంలో  రెండే రెండు ముక్కల్లో ఆ విషయన్ని తేల్చేశారు. ఆ  తర్వాత రెండున్నర గంటలు రాజకీయ విమర్శలకు వినియోగించుకున్నారు. ఆ తర్వాత, కాళేశ్వరం మునకతో ప్రభుత్వం మరింత ఇరకాటంలో పడింది. చివరకు, గవర్నర్ తమిళి సై, వరద పోటెత్తిన భద్రాచలంలో పర్యటించేందుకు కదిలిన తర్వాత గానీ, ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాలలో పర్యటించే ఆలోచన చేయలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపద్యంలో ముఖ్యమత్రి క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం సృష్టించాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అయితే, విదేశాలు కుట్రతో "క్లౌడ్‌ బరస్ట్‌" చేయడం వల్లే వరదలు వచ్చాయని స్వయాన సీఎం కేసీఆర్‌ చెప్పడంపై కేంద్రం వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి,హోదాలో మాట్లాడిన మాటలను కేంద్రం పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ నుంచి కుట్ర సమచారాన్ని రాబట్టాలన్నారు. ఇలాంటి సమాచారం ఏదైనా ఉంటే కేంద్ర భద్రతా విభాగానికి సమాచారం ఇవ్వాల్సిన భాధ్యత కేసీఆర్‌కు ఉందని గుర్తుచేసిన రేవంత్‌.. అలా చేయని పక్షంలో కేంద్రమే కస్టడీలోకి తీసుకుని విచారించాలన్నారు. కేసీఆర్‌ దోపిడీకి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని రేవంత్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న లోపాలు, అవినీతిని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే క్లౌడ్ బరస్ట్‌ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆక్షేపించారు.  మరో వంక  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఈ శతాబ్దపు పెద్ద జోక్‌ అని ఎద్దేవా చేశారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్‌ పడరాని పాట్లు పడుతున్నారని, విదేశీ కుట్ర పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. అదలా ఉంటే ఇప్పుడు కేసేఆర్ చేసిన,  విదేశీ కుట్ర వ్యాఖ్యలు రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశంలోనూ దుమారం రేపుతున్నాయి.జాతీయ టీవీ చానల్స్’లోనూ కేసీఆర్ వ్యాఖ్యలఫై చర్చ మొదలైంది. ఇక ఇప్పుడు ఈ ‘పొలిటికల్ క్లౌడ్’  ఎటు తిరుగుతుందో, ఏమౌతుందో ..

తెలంగాణాతో  కేంద్రం  కొత్త  ర‌చ్చ‌

గొడ‌వ‌ప‌డాల‌నుంటే ముగ్గు స‌రిగాలేద‌నీ గొడ‌వ‌ప‌డొచ్చు. మ‌న ప‌ని పొరుగువారికి న‌చ్చ‌కున్నా చిన్న చిత‌కా కార‌ణాల‌తో సూటి పోటీ మాట‌ల‌తో యుద్ధానికి సన్న‌ద్ధ‌మ‌వుతారు. కేంద్రానికి, రాష్ట్రాల‌కు మ‌ధ్య స‌త్సంబంధాలు లేక‌పోతే దేనిక‌యినా స‌మ‌స్య‌లు, లేనిపోని త‌గ‌వుల‌కు దిగ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం మోదీజీ నాయ‌క‌త్వంలోని  బిజెపి ప్ర‌భుత్వం తెలంగాణా టిఆర్ ఎస్ ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌తీదానికి క‌న్నెర్ర‌జేయ‌డంతో పాటు ఏదో ఒక కార‌ణం చెప్పి ఇర‌కాటంలో ప‌డేస్తోంది. ఇపుడు తాజాగా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య  మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై రాజకీయ చిచ్చు రాజుకుంది. ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు, అక్రమాలు జరిగాయని, అసలు ఆ పథకం నిబంధనలకే విరుద్ధమైన పనులు చేశా రంటూ కేంద్ర ప్రభుత్వం తమ అధికారులతో రాష్ట్రంలో తనిఖీలు చేయిస్తోంది. దీన్ని క‌క్ష‌సాధింపు చ‌ర్య‌గానే రాష్ట్రం భావిస్తోంది.  కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఏకంగా 16 బృందాలను తెలంగాణకు పంపింది. వీరు రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఉపాధి హామీ పనులను పరిశీలిస్తున్నారు. కొన్ని చోట్ల ఆయా జిల్లాల కలెక్టర్లను కూడా వెంటబెట్టుకుని వెళ్తున్నారు. చాలా పనులు నిబంధ నల ప్రకారం జరగలేదని, కొన్నిరకాల పనులు అసలు ఈ పథకం కింద చేయకూడనివి ఉన్నాయని తేల్చేస్తున్నారు. వాటికి సంబంధించిన నోటీసులు ఇవ్వడం, కేంద్రానికి లేఖ రాయడం వంటి ప్రక్రియలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే రాష్ట్ర ప్రభు త్వం మాత్రం ఉపాధి హామీ పథకంలో రైతు వేదికలు నిర్మిస్తే తప్పా? అని ప్రశ్నిస్తోంది. భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ తనిఖీలేంటని తప్పుబడుతోంది. పశ్చిమ బెంగాల్‌లో ఉపాధి హామీ పథకాన్ని ఆపి నట్లుగా ఇక్కడ కూడా ఆపేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆరోపణలు చేశారు.  వాస్తవానికి ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏటా భారీ ఎత్తున నిధులు  వస్తున్నాయి. ఆ నిధులను పథ కంలో నిర్దేశించిన పనులకే వాడాలి. అదే సమయంలో పనులు సక్రమంగా ఉండాలి. అయితే ఈ రెండు విషయాల్లోనూ తేడాలు న్నాయని కేంద్రం భావిస్తోంది. రైతు వేదికలు, కల్లాల నిర్మాణానికి ఈ పథకం కింద అనుమతి లేదని చెబుతోంది. అయితే  రైతు వేదికలు, కల్లాల నిర్మాణాలకు కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించామని కొన్ని సంద ర్భాల్లో రాష్ట్ర నేతలు చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు మాత్రం నరేగా కింద రైతు వేదికలు నిర్మిస్తే తప్పేంటని, ఆస్తుల కల్పనే చేశామని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణ నుంచి దేశానికి ఇచ్చింది ఎక్కువ, దేశం నుంచి తెలంగాణకు వచ్చింది తక్కువ అన్న వాదనను కూడా బలంగా తెరపైకి తెచ్చారు.  అస‌లే  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటికే ధాన్యం కొనుగోలు అంశంపై యుద్ధం జ‌రుగుతోంది. తాజాగా తలెత్తిన ఉపాధి హామీ పనుల వివాదం మ‌రో త‌ల‌భారం కానుంద‌ని టిఆర్ఎస్ భావిస్తోంది.  నరేగా పథకం కింద ఏటా రాష్ట్రానికి రూ.4 వేల కోట్లకు పైగా నిధులొస్తాయి. 2021-22లో రూ.4,763 కోట్లు వచ్చాయి. 11 కోట్ల పని దినాలు ఇప్పుడు సుమారుగా 15 కోట్ల పనిదినాలకు పెరిగాయి. వాస్తవానికి ఈ నిధుల అంశంపైనా కొంతకాలం నుంచీ బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య వివాదం ఉంది. నరేగా నిధులను కేంద్రమే భారీగా ఇస్తోందని చెప్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే కూలీలకు ఇవ్వాల్సిన వేతనాలను కూడా కేంద్రం ఇచ్చినంతగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్కువగా ఇస్తోందని ఆరోపి స్తోంది. పనుల్లో నాణ్యత కూడా లేదని, కొన్ని పనులను చేయకుండానే బిల్లులు తీసుకుంటున్నార‌న్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలం క్రితం నుంచి కేంద్రమే నేరుగా ఉపాధి హామీ కూలీల బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల్లోకి నిధులు వేయడం ప్రారంభించింది. బీజేపీ నేతల వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా ప్రతి విమర్శలు చేస్తూ వస్తున్నారు. అన్ని రాష్ట్రాలతోపాటే తెలంగాణకూ ఇస్తున్నారని, తాము మాత్రం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా దేశం కోసం కేంద్రానికి నిధులు ఇస్తు న్నామ‌ని అంటున్నారు. మొత్తంమీద ఇన్నివేల కోట్లకు సంబంధించిన పథకం వల్ల వచ్చే ఓట్ల ప్రయోజనాన్ని ఎవరు పొందా లన్న విషయంలో నూ రాజకీయం మొదలైంది. అది క్రమంగా పెరిగి పెరిగి వివాదంగా మారింది.    ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రైతు వేదికలు, కల్లాల నిర్మాణం, చెరువుల పూడికతీత, కందకాలు, ఇతర నిర్మాణ పనులు చేపట్టిన విధానంపై కేంద్ర బృందాలు ఈ రెండురోజుల నుంచి ఆరా తీస్తున్నాయి. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని నిజామాబాద్‌, పెద్దపల్లి, మెదక్‌, సిద్డిపేట, సూర్యాపేట, కరీంనగర్‌, నాగర్‌కర్నూల్‌, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూ బాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, రాజన్న సిరిసిల్ల, ములుగు తదితర జిల్లాల్లోని గ్రామాల్లో పర్యటించి ఈ బృందాలు క్షేత్రస్థాయి విచారణ జరుపుతున్నాయి. ఆదివారం కూడా ఈ బృందాలు తమ తనిఖీలను కొనసాగించనున్నాయి. కాగా జూన్‌ 9 నుంచి 12 వరకు కూడా ఐదు జిల్లాల్లో తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్దంగా పనులు జరిగినట్లు గుర్తించాయి. ఉన్నత స్థాయి అనుమతులు పొందకుండానే  పనులు విభజించారని ఆక్షేపించాయి. దీంతోపాటు సోషల్‌ ఆడిట్‌, వివాదాల పరి ష్కార వ్యవస్థలు సరిగా పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశాయి. తాజాగా 18 జిల్లాల్లో మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను పంపించడమే మ‌రో గొడ‌వ‌కు దారితీస్తోంది. ఇది ఖ‌చ్చితంగా టిఆర్ ఎస్ ప్ర‌భుత్వాన్ని అవ‌మా నించ‌డ‌మేన‌నే అభిప్రాయాలు విన‌ప‌డుతున్నాయి. 

శంక‌రా..నారాయ‌ణా.. ఎంత‌టి అవ‌మానం!

పాల‌న బాగుంటే అంద‌రూ ఆద‌రిస్తారు. పాల‌న బాగుంటే అంద‌రికీ గౌర‌వం ల‌భిస్తుంది. క‌బుర్లు చెబుతూ ప‌బ్బం గ‌డుపు దామ‌నుకుంటే అవ‌మానాల‌కు సిద్ధం కావాలి. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఆగ్ర‌హాన్ని అంత సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేద‌న్న‌ది మ‌రోసారి రుజువ‌యింది. గ‌డ‌ప గ‌డ‌ప‌కు అనే కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్ర‌జ‌ల నుంచి తిరుగుబాటు, అవ‌మానాలు ఎదుర్కొంటున్నారు. ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాలు, అందిస్తున్న ప‌థ‌కాల ఫ‌లాల గురించి వాక‌బు చేయ‌డా నికి వెళుతోన్న‌వారికి ప్ర‌జ‌ల నుంచి తిట్ల దండ‌క‌మే ప‌డుతోంది. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని శెట్టిపల్లి తండాలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి,  వైసీపీ ఎమ్మెల్యే శంకర నారాయణకు చేదు అనుభవం ఎదురైంది.  వితంతు పింఛన్‌ను రద్దు చేసినందుకు ఓ గిరిజన మహిళ రగిలిపోయింది. తన ఇంటి వద్దకు ఇంకోసారి వస్తే చెప్పుతో కొడతానని హెచ్చరించింది. శనివారం మధ్యాహ్నం పెనుకొండ మండలం శెట్టిపల్లి తండాకు అధికారులు, పార్టీ నాయకులతో కలిసి శంకర నారాయణ గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఇంటింటికీ వెళ్లారు. ఈ క్రమంలో లలితాబాయి ఇంటి వద్దకు చేరుకోగానే ఆమె బంధువులు పింఛన్‌ రద్దు విషయాన్ని ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఇంతలో లలితా బాయి అనే మ‌హిళ బయటకు వచ్చి తన భర్త ఆనందనాయక్‌ పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని, అప్పటి నుంచి తనకు వితంతు పింఛన్‌ వచ్చేదని తెలిపింది. స్థానిక వైసీపీ నాయకులు తనకు పింఛన్‌ రాకుండా చేశారని, 11 నెలల నుంచి పింఛన్‌ అందడంలేదని ఎమ్మెల్యేకి వివరిం చింది. అంతా విన్న ఎమ్మెల్యే, తరువాత చూద్దాంలే.. అని చెప్పి, తేలిగ్గా తీసుకుని ముందుకు వెళ్లిపోయారు. దీంతో లలితా బాయి రగిలి పోయింది. ఏమిచ్చి పోగొట్టుకున్నారని మా ఇంటికాడికి వచ్చినార్రా.. ఇంకోసారి మా ఇంటి ముందుకొస్తే చెప్పుతో కొడతా. ఒకసారి మా ఇంటిని చూడండిరా..అని ఆగ్రహం వ్యక్తంచేసింది. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఇక్కడికి రా.. అని ఎమ్మెల్యేపై  తొడ కొట్టింది. శెట్టిపల్లికి చెందిన లలితాబాయి, ఆనందనాయక్‌ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఆనంద్‌ పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భర్త చనిపోయాక లలితాబాయి కూలి పనులకు వెళ్లి బిడ్డలను పోషించింది. స్థానికంగా పనులు లేనప్పుడు బెంగళూరుకు వలస వెళ్లి వస్తుంటుంది. స్థానికంగా ఉండదన్న సాకుతో వైసీపీ నేతలు ఆమె పింఛన్‌ను రద్దు చేయించినట్లు తెలిసింది.ఈ విషయాన్నే విన్నవించినా ఎమ్మెల్యే తేలిగ్గా తీసుకోవడంతో లలితాబాయి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.

 లడఖ్ లో  ప్లాస్టిక్ వ్యర్థాలతో  రోడ్లు

హిమాలయ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ, కార్బన్ తగ్గించే లక్ష్యంతో ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లను నిర్మించాలని లడఖ్ ప్ర‌భుత్వం నిర్ణయించింది. కనీసం ప‌ది శాతం రోడ్లు ప్లాస్టిక్‌తో నిర్మించనున్నారు. దీని కోసం సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టి ట్యూట్ (సిఆర్ ఆర్ ఐ) స్థానిక ఇంజ నీర్లకు శిక్షణనిచ్చింది. లడఖ్‌లోని రోడ్డు నిర్మాణంలో ప్రాక్టీస్ వ్యర్థాలను తప్పనిసరిగా ఉప యోగిం చాలని లడఖ్‌లోని పిడబ్ల్యుడి శాఖ కార్య‌ద‌ర్శి ఈ విషయమై ఒక ఉత్తర్వు జారీ చేశారు. లడఖ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు స్థిరమైన పరిష్కారాన్ని కనుగొనడానికి, లడఖ్‌లోని అన్ని తారు రోడ్లు ప్లాస్టిక్ సీసాలు, కంటై నర్లు మొదలైన వాటితో సహా కనీసం ప‌ది శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను కలిగి ఉండాల‌ని ఉత్త‌ర్వులో పేర్కొన్నారు. లేహ్, కార్గిల్‌లో ప్లాస్టిక్ మెషీన్లను ముక్కలు చేసేలా డిపార్ట్‌మెంట్ నిర్ధారిస్తుంది. రోడ్ల నిర్మాణంలో కనీసం ప‌ది శాతం ప్లాస్టిక్‌ను ఉప యోగించాలని ఉత్త‌ర్వు పేర్కొంది. లడఖ్ అడ్మినిస్ట్రేషన్ స్థానిక ఇంజనీర్లకు శిక్షణను ప్రారంభించింది, ఇక్కడ సిఆర్ ఆర్ ఐ, న్యూఢిల్లీ శాస్త్రవేత్తలు గ్రామీణ ఇంజనీ రింగ్ రింగ్, గ్రామీణాభివృద్ధి విభాగం, సరిహద్దు రోడ్ల సంస్థ (బిఆర్ ఓ), నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొ రేషన్ (ఎన్‌హెచ్ ఐడిసి) నుండి ఇంజనీర్ల కోసం వర్క్‌షాప్‌లు లేహ్, కార్గిల్ జిల్లాలలో నిర్వహించారు. ఈ శిక్షణ లడఖ్‌లోని శీతల వాతావరణ పరిస్థితులలో రహదారి నిర్మాణ కార్యకలాపాలలో మెరుగుదలలను తెస్తుందిని, రహదారి నిర్మాణ సాంకేతి కతలలో ప్లాస్టిక్ వ్యర్థాలను బాగా ఉపయోగించడంలో ఇంజనీర్లకు సహాయపడుతుందని కమిషనర్ కార్య‌ద‌ర్శి అజిత్ కుమార్ సాహు తెలిపారు. న్యూఢిల్లీలోని సిఆర్ ఆర్ ఐకి చెందిన ఐదుగురు ప్రధాన శాస్త్రవేత్తల బృందం గత వారం నుండి స్థానిక ఇంజనీర్‌లతో శిక్షణా సమా వేశాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు, శిక్షణ సమయంలో ఆ ప్రాంతం ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగం, స్థానికంగా లభించే వ‌స్తు వినియోగం, వేగవంతమైన రహదారి నిర్మాణం కోసం కోల్డ్ మిక్స్ టెక్నాలజీని జోడించింది. గత కొన్ని సంవత్సరా లుగా లడఖ్‌లో పేరుకుపోయిన టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేసేందుకు ఇటువంటి సాంకేతికతపై పని సహాయపడు తుందని డివిజనల్ కమిషనర్ లడఖ్ తెలియజేశారు. లడఖ్ అధికారులు, ఇంజనీర్లు రోడ్డు నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి ఉపయోగించేందుకు అధునాతన పద్ధతులను నేర్చుకుంటారు, ఇది కార్బన్ త‌ట‌స్థ‌ లడఖ్‌ను తయారు చేయా లనే దృక్పథానికి అనుగుణంగా లడఖ్ పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడుతుంద‌ని ఆయన చెప్పారు.

జై  జ‌గ‌దీప్‌..  జ‌గ‌న్ 

ఎవ‌ర‌న్నా అవ‌స‌రంలో వున్న‌పుడు మ‌ద్ద‌తుకోసం అడుగుతారు. మ‌న‌కు వీలున్నంత‌వ‌ర‌కూ ఇబ్బంది లేద‌నిపిస్తే ఓకే అంటాం. ప్ర‌స్తుత రాజకీయ‌ప‌రిస్థితుల్లో బిజెపి, వైసీపీ స్నేహం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సీఎం జ‌గ‌న్‌కు చాలా అవ‌స‌రం గ‌నుక ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి త‌మ అభ్య‌ర్ధిగా బిజెపి జ‌గ‌దీప్ దిన‌క‌ర్‌ను ప్ర‌క‌టించ‌గానే ఇక్క‌డ‌నుంచి జ‌గ‌న్ ఓకే అని మ‌ద్ద‌తు ప్ర‌క‌టించేశారు. అంతేకాదు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి జ‌గ‌దీప్‌గారికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఆదివారం ఏకంగా హిందీలో ట్వీట్  చేయ‌డ‌మూ అయిపో యింది. రైతు బిడ్డ జగదీప్‌ ధనకర్‌ని ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించినందుకు తనకు చాలా సంతోషం కలిగించిందని ఆయన పేర్కొన్నారు. జగదీప్ ధన్‌కర్‌ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆయనకు మద్దతు తెలిపింది వైఎ స్సార్సీపీ. వైఎస్సార్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్‌ ధన్‌కర్‌ కే జైకొట్టింది. రాష్ట్రపతి ఎన్నిక‌ ల్లోనూ బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన వైఎస్సార్సీపీ  ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనూ అలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. అయితే అంద‌రికంటే ముందుగానే జ‌గ‌న్ మ‌ద్ద‌తు తెలియ‌జేయ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. వాస్త వానికి జ‌గ‌న్ పార్టీ త‌ర‌ఫున ఇంకా ఓకే అన‌క‌పోయినా, విజ‌య‌సాయి రెడ్డి మ‌ద్ద‌తు ప్ర‌క‌ట‌న పార్టీప‌రంగా చెప్పిన‌ట్టేన‌ని విశ్లేష కులు అనుకుంటున్నారు. విజయసాయిరెడ్డి ప్రస్తుతం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. రాజ్యసభలో వైసీపీకి ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను వైసీపీ అధికారిక ప్రకటనగానే భావించవచ్చు. ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు విషయంలో కొంత వివాదం జరిగిన విషయం తెలిసిందే. మేం అడగకుండానే వైసీపీ మద్దతు ఇచ్చిందని బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి వై.స‌త్య‌కుమార్‌ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై విరుచు కుపడిన వైసీపీ నేతలు  బీజేపీ హైకమాండ్ కోరితేనే తాము మద్దతు తెలిపినట్లు ఎదరుదాడికి దిగారు. ఆ తర్వాత ఈ అంశంపై కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ కూడా స్పందించారు. ముర్ముకు మద్దతు ఇవ్వాలని తాము వైసీపీని కోరామని స్ప‌ష్టంచేశారు. సత్యకుమార్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఐతే ఇప్పుడు మాత్రం అడగకుండానే జగదీప్‌ ధన్‌కర్‌కి వైసీపీ మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక, తెలంగాణ అధికార ప‌క్షం టిఆర్ ఎస్ విష‌యానికి వ‌స్తే,  నరేంద్ర మోదీయే టార్గెట్‌గా కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ముకు కాకుండా.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మ‌ద్ద‌తునిచ్చారు. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మరి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ నిర్ణయం తీసుకుంటార న్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి కూడా విపక్షాల అభ్యర్థికే మద్దతు తెలుపుతారా? లేదంటే బీజేపీ రైతు బిడ్డగా చెబుతున్న జగదీప్‌కు జైకొడతారా? అన్నది తెలియాల్సి ఉంది.

భ‌గ‌త్‌సింగ్ ఎవ‌రికంటే తీవ్ర‌వాది సిమ్ర‌న్‌జిత్  జీ!

దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న స‌మ‌యంలో భ‌గ‌త్‌సింగ్ అనే కుర్రాడు త‌న జీవితాన్ని లెక్క చేయ‌కుండా బ్రిటీష్‌వారికి బుద్ధిచెప్పాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడు. అప్ప‌టి దేశ‌భ‌క్తి అంత‌టిది. దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ యువ‌త దేశాన్ని దాస్య శృంఖ లాల నుంచి విముక్తి చేయ‌డానికి రంగంలోకి ఉరికారు. త‌మ వంతు కాగ‌లిన కార్యాన్ని సాధించారు. ప్రాణాలు కోల్పోయారు. మ‌ర‌ణాన్ని ముద్దాడారు. అలాంటి దేశ‌భ‌క్తుడు, భ‌గ‌త్‌సింగ్ తీవ్ర‌వాదిగా పంజాబ్ ఎంపి సిమ్ర‌న్‌జిత్ సింగ్‌గారికి ఎలా అనిపించాడో మ‌రి. అయినా ఆ కాలం వేరు, ఇప్ప‌టి రాజ‌కీయ‌ప‌రిస్థితులు వేరు.  భ‌గ‌త్‌సింగ్ ఒక ఇంగ్లీషు అధికారిని కాల్చి చంపాడ‌ని, అసెంబ్లీలో స‌భ జ‌రుగుతుండ‌గా బాంబులు విసిరాడ‌ని సిమ్రాన్ జిత్ ఆరో ప‌ణ‌. కానీ అప్ప‌టి దేశ‌భ‌క్తి ఆవేశం, న‌ర‌న‌రాన స్వ‌తంత్ర కాంక్ష వున్న‌పుడు అప్ప‌టి కుర్రాళ్లు అంత‌టి ఆవేశాన్ని ప్ర‌ద‌ర్శిం చారు. అది త‌ప్ప‌ని ప‌రిస్థితి. కానీ ఆయ‌న అలా చేసి వుండ‌క‌పోవ‌చ్చ‌న్న‌ది మాన్‌సింగ్ గారి అభిప్రాయం. అస‌లు మాన్‌గారు ఈ విధంగా ఏదో ఒక‌టి చ‌ర్చ‌నీయంశంగా మార్చ‌డం ప‌రిపాటి.  గ‌తంలో 2007లో ఈయ‌నే భ‌గ‌త్‌సింగ్‌ను చిన్న‌పాటి ఉగ్ర‌వాది అన్నారు. అంతటితో ఆగ‌క 2015లో ఛండీగ‌ఢ్ విమానా శ్ర‌యానికి భ‌గ‌త్‌సింగ్ పేరు పెట్ట‌డానికి కూడా తిర‌స్క‌రించారు. ఎంపీ గారికి కామెంట్లు చేయ‌డం చాలా ఇష్టం. అలా రాజ‌కీయ చ‌ర్చ‌ల్లో హాట్ హాట్‌గా త‌న పేరు అంద‌రినోటా విన‌డ‌మూ ఆయ‌న‌కు ఇష్టం కావ‌చ్చు. అందుకే చాలా కాలం నుంచి మొన్న ఎంపీ అయ్యేవ‌ర‌కూ కూడా ఇలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూనే వున్నారు. అయితే పంజాబ్ ప్ర‌జ‌లు ఈ పెద్దాయ‌న మాట‌లు అంత సీరియ‌స్‌గా తీసుకోలేదు. కానీ పంజాబ్ మంత్రి గుర్మీత్‌సింగ్ మీత్ హ‌య‌ర్ మాత్రం మండిప‌డుతున్నారు. అందుకే  పెద్దాయ‌న్ను ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని  గుర్మీత్ డిమాండ్ చేస్తున్నారు. 

డాల‌ర్ నోటు తీసింది.. ఆస్ప‌త్రిపాల‌యింది!

ఇంటి బ‌య‌టో, అలా రోడ్డుమీద వెళుతూంట‌నేనో ప‌ది రూపాయ‌ల నోటో, వందనోటో క‌న‌ప‌డ‌గానే ఠ‌క్కున తీసి ఎవ‌రూ గ‌మ‌నిం చ‌క ముందే జేబులో పెట్టేసుకుంటాం. ఇది చాలా స‌హ‌జం. ఎవ‌రో బొత్తిగా స్పృహ‌లేకుండా ప‌డేసుకున్నారు అనీ అనుకుంటాం. ఎవ‌ర‌న్నా గ‌మ‌నిస్తే మాత్రం మ‌ర్యాద‌గా వెళ్లి అడుగుతాం మీదా, మ‌రెవ‌రిద‌యినానా అని. ఇదుగో ఇలా కింద‌ప‌డిన‌ది, రోడ్డుమీద క‌నిపించింద‌నీ తీసిన నోటే రెనీ పార్స‌న్ కొంప ముంచింది. అనారోగ్యానికి గురై ఆస్ప‌త్రిపాల‌యింది.  అదేమిటి రోడ్డుమీద నోటు తీస్తే అంత అస్వ‌స్థ‌త‌కు గుర‌యిందా అని అనుమానం వ‌చ్చింది గ‌దూ?   నిజ‌మే. నేష్‌వ‌లీ, టెన్నిసీ కి చెందిన రెనీ పార్స‌న్ త‌న భ‌ర్త  జ‌స్టిన్‌, కుటుంబ స‌మేతంగా వారి ప్రాంతంలోని మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్ కి వెళ్లింది. అక్క‌డి రెస్ట్ రూమ్‌కి వెళ్లిందామె. చంక‌లో మూడు నెల‌ల పాప కూడా వుంది. అక్క‌డ ఆమెకు కొంత దూరంలో నేల‌మీద ఒక డాల‌ర్ నోటు క‌న‌ప‌డింది. అంతే మ‌రో ఆలోచ‌న‌లేకుండా ఠ‌క్కున తీసింది. మాన‌వ స‌హ‌జం.. అమలాపుర‌మైనా, అమెరికా అయినా!  కొంత‌సేప‌టి త‌ర్వాత ఆమె త‌న బిడ్డ‌ను తీసుకుని మ‌ళ్లీ ప్ర‌యాణానికి కారులో ఎక్కింది. కొద్ది దూరం వెళ్లిన‌ప్ప‌టి నుంచి ఏదో తెలియ‌ని ఇబ్బందులు మొద‌ల‌య్యాయి. హ‌ఠాత్తుగా బుజాల‌నొప్పులు మొద‌లై శ‌రీర‌మంతా నొప్పులు మొద‌ల‌య్యాయి. ఒక్క‌సారిగా శ‌రీరాన్ని క‌ద‌ప‌లేని స్థితి ఏర్ప‌డిందిట‌. అది గ‌మ‌నించిన ఆమె భ‌ర్త వెంట‌నే ఆమెను ఏమ‌యింద‌ని ప‌ల‌క‌రించాడు.  ఆమె బాధ‌ప‌డుతోంది, ఒక్క మాటా మాట్లాడలేక‌పోతోంది. అంతేకాదు శ్వాస తీసుకోవ‌డ‌మూ క‌ష్ట‌మైపోయింది. క‌ళ్లు మూసుకు పోతున్నాయి. ఆమె భ‌ర్త జ‌స్టిన్ ఆమెను నిద్ర‌లోకి జార‌కుండా చేయ‌డానికి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఫోన్ తీసి వెంట‌నే ద‌గ్గ‌ర‌లోని ఆస్ప‌త్రికి ఫోన్ చేశాడు. అంత‌కుముందే ఫైర్‌వ‌ర్క్ ఉద్యోగులతో మాట్లాడాడు. వారు కారు ద‌గ్గ‌ర‌కి ప‌రుగున వ‌చ్చి ఆస్ప‌త్రికి తీసికెళ్ల‌డానికి అన్ని ఏర్పాట్లు నిమిషాల్లో చేశారు. ఆమె క్ష‌ణాల్లో స్పృహ కోల్పోయి, ప‌డిపోయింది.  అత‌నికీ ఆమె వ‌లె శ్వాస ఇబ్బంది మొద‌లైంది. కానీ మాట్లాడ‌గ‌లుగుతున్నాడు. అస‌లు దీనంత‌టికీ కార‌ణం  ఆమె తీసిన నోటు వ‌ల్ల‌నే అని తేలింది. ఆ నోటుకి ప్ర‌మాద‌క‌ర‌మైన ఫెంటానిల్ అనే మందు రాసి వుందని డాక్ట‌ర్లు తెలుసుకున్నారు. రెనీ పార్స‌న్ ఓ వారం రోజుల త‌ర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్ల‌గ‌లిగింది. చూశారా నోటు ఎంత ప‌నిచేసిందో. అంటే  ఎవ‌రో ఆ నోటు మీద పూసిన ప్ర‌మాద‌క ర‌సాయ‌నం మ‌రెవ‌రి మీద‌నో ఉప‌యోగించాల‌నుకున్నారు. బ‌హుశా అంత‌కు ముందే వారికి తెలీకండా ఆ నోటు కింద‌ప‌డి వుండ‌వ‌చ్చు. పోలీసులు ఆ నోటు ర‌హ‌స్యం తెలుసుకునే ప‌నిలోనే వున్నారు.

ఉచితాలపై మోడీ వ్యాఖ్యలు.. కేజ్రీవాల్ ఫైర్..జగన్ మౌనానికి కారణమదేనా?

ప్రధాని  నరేంద్ర మోడీ ఎందుకు చేశారో, ఎవరిని టార్గెట్ చేసి  పేల్చారో తెలియదు కానీ ఓట్ల  కోసం ఉచిత  పంపిణీల(పథకాలు) పై ఆయన చేసిన వ్యాఖ్యలు  దేశ  వ్యాప్తంగా సంచలనం  సృష్టించాయి. ముఖ్యంగా  ఆంధ్రప్రదేశ్ లో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున  చర్చ  జరుగుతోంది. కచ్చితంగా ఏపీ  ప్రభుత్వ తీరును  ఎండగడుతూనే  మోడీ పరోక్షంగా  ఫ్రీ బీస్  పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని  విపక్షాలు గట్టిగా నొక్కి  చెబుతున్నాయి. అయితే మోడీ వ్యాఖ్యల టార్గెట్ జగన్ అని విపక్షాలు అంటున్నా.. ఏపీ  సీఎం  జగన్ మాత్రం  ఇప్పటి  వరకూ మోడీ వ్యాఖ్యలపై  స్పందించలేదు. దేశలో ఏ రాష్ట్ర్రం చేయని విధంగా ఏపీలో సంక్షేమానికి  పెద్ద పీట వేశామనీ, దేశం  మొత్తం  తన ప్రభుత్వ విధానాలను అనుసరించడమే  మిగిలి ఉందనీ తన  భుజాలను తానే  చరిచేసుకుంటూ  సంక్షేమ  లబ్ధిదారులకు సొమ్ముల పంపిణీ  సభలలో ప్రసంగాలు చేసే  జగన్  ఇప్పుడు మోడీ వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని విపక్షాలు  విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే మోడీ లక్ష్యం ఒకటి అయితే ఆయన విమర్శ బాణం మరొక  చోట తగిలిందా  అన్న  అనుమానాన్ని  పరిశీలకులు వ్యక్తం  చేస్తున్నారు. మోడీ  వ్యాఖ్యలపై ఏపీ  సీఎం  జగన్  మౌనంగా ఉంటే...  ఢిల్లీ  సీఎం  కేజ్రీ  వాల్  మాత్రం  ఘాటుగా స్పందించారు. నేరుగా  ప్రధాని  పేరు ప్రస్తావించకుండానే.. ఉచిత విద్య, ఉచిత విద్యుత్ పథకాలు కేవలం ఉచిత పథకాలు  కావని కేజ్రీవాల్ అన్నారు. అవి భవిష్యత్  తరాల  బాగు కోసం ఇప్పుడు పెడుతున్న పెట్టుబడి లాంటివన్నారు. ఉచిత విద్య వల్ల  పేదలు చదువుకుని దేశ ప్రగతిలో, ఉత్పాదకతలో భాగస్వాములౌతారని  అన్నారు. అలాగే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వల్ల వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయనీ వివరించారు. నిజమైన ఉచితాలనేవేమైనా ఉంటి  అవి బడా వ్యాపారులకు చేసే వేల కోట్ల రూపాయల మాఫీలేనని రిటార్డ్  ఇచ్చారు. అంతే  కానీ ఢిల్లీ  ప్రభుత్వం  18 లక్షల మందికి ఉచిత విద్య, రెండు కోట్ల మంది పేదలకు ఉచిత వైద్యం ఉచిత పథకాల కిందకు రావని అన్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య ద్వారా దేశ ప్రగతిని మా వంతు సహకారం అందిస్తున్నట్లేఅన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో మొహల్లా క్లినిక్  లు అద్భుత  పాత్ర్  వహిస్తున్నాయని చెప్పుకొచ్చారు. రాజకీయ  పార్టీలకు  విరాళాలిచ్చి, బ్యాంకుల  నుంచి  వేల కోట్ల  రూపాయలు అప్పులు తీసుకున్న బడా  వ్యాపార సంస్థలు, పారిశ్రామిక  వేత్తలకు చేసే  రుణ మాఫీ  నిజమైన ఉచిత పథకమని కేజ్రీవాల్ అన్నారు. శ్రీలంక పర్యటనలో అదానీకి కోట్లాది  రూపాయల కాంట్రాక్టు  కోసం మీరు చేసిన దౌత్యం నిజమైన  ఉచిత  పథకమని మోడీని ఉద్దేశించి  కేజ్రీవాల్ విమర్శించారు.  అయితే ఉచితాలపై మోడీ చేసిన సంచలన వ్యాఖ్యలపై నిజంగా భుజాలు తడుముకుని స్పందించాల్సిన జగన్ మౌనంగా ఉండటానికి  కారణమేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  నోరెత్తి  మాట్లాడితే.. కేసుల దొంతర కదులుతుందన్న భయమా.. భవిష్యత్ లో అప్పుపట్టదన్న బెరుకా  అని  ప్రశ్నిస్తున్నారు.  

తిలా పాపం తలా పిడికెడు!

నిజం. దేశంలో ప్రతిపక్షాలకు అవకాశాలు క్షీణిస్తున్నాయని, ఇది దురదృష్టకర పరిణామంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ చేసిన వ్యాఖ్యలో నిజముంది.  ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పని తీరు, రోజు రోజుకు, రాను రాను రాజు గుర్రం ...  సామెతను గుర్తుకు తెస్తోంది.  నిజానికి, ప్రతిపక్షాల పాత్ర క్షీణించడం ఒక్కటే కాదు, భర్త ప్రజాస్వామ్య వ్యవస్థ అంతకు మించిన సవాళ్ళనే ఎదుర్కుంటోంది. అందుకే, పతనమవుతున్న ప్రజాస్వామ్య విపువల గురించిన ఆందోళన ఆలోచనన పరులు అందరిలోనూ వుంది. అందరినీ కలవరానికి గురి చేస్తోంది. ఈ మధ్య కాలంలోనే, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా రాజకీయ వ్యవస్థ దిగజారిపోతున్న తీరు పట్ల ఇదే రీతిన ఆందోళన వ్యక్తం చేశారు.  అయితే, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నట్లుగా, ప్రతిపక్షాల స్పేస్ తగ్గిపోవడం ఒక్కటి మాత్రమే కాదు, ఇంకా అనేక రుగ్మతలతో ప్రజస్వామ్య వ్యవస్థ రోజురోజుకు దిగాలవుతోంది. ప్రజాస్వామ్య విలువలు పతన మవుతున్నాయి. నిజమే గతంలో రాజకీయ పార్టీలు, నాయకుల మధ్య రాజకీయ వైరుధ్యం మాత్రమే ఉండేది.  అంతే గానీ, చట్ట సభల లోపల గానీ, వెలుపల గానీ రాజకీయ నాయకుల మధ్య వ్యక్తిగత శతృత్వం అనేది మచ్చుకైనా కనిపించేంది కాదు. ఇదుకు చరిత్రలో చాలా ఉదహారణలు కనిపిస్తాయి. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి  లేదు. జస్టిస్ ఎన్వీ రమణ అన్నట్లుగా, గతంలో ప్రతిపక్ష నాయకులు కీలక పాత్ర పోషించేవారు. ప్రభుత్వం, ప్రతిపక్షం పరస్పరం గౌరవించుకునేవి. కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్షానికి అవకాశాలు క్షీణిస్తున్నాయి.ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, చట్ట సభలు, రాజకీయ వికృత క్రీడకు వేదికగా మారుతున్నాయి. అందుకే, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నట్లుగా, సమగ్రంగా చర్చలు, పరిశీలనలు లేకుండా బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. చివరకు వేల లక్షల కోట్ల ప్రజాధనంతో ముడిపడిన బడ్జెట్ కూడా చర్చ లేకుందానే ఆమోదం పొందుతోంది.  అందుకే, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రాజకీయ ప్రత్యర్థులను విరోధులుగా భావించరాదన్నారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులను చూస్తున్నామని, ఇది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదని స్పష్టం చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమంటే ప్రతిపక్షాన్ని కూడా బలోపేతం చేయడమన్నారు. బలమైన, శక్తిమంతమైన, చురుకైన ప్రతిపక్షం పరిపాలనను మెరుగుపర్చడానికి, ప్రభుత్వ కార్యకలాపాలను సరిచేయడానికి సహకరిస్తుందన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య సహకారం ఒక ప్రగతి శీల ప్రజాస్వామ్యానికి దారి తీస్తుందని చెప్పారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయడంలో విఫలమైతే మార్పు రూపంలో ప్రజలు తమ ఇష్టాన్ని వ్యక్తం చేయడాన్ని చరిత్ర చూసిందని గుర్తుచేశారు.  అవును. చీఫ్ జస్టిస్ చెప్పినట్లుగా, ప్రతి పక్షాలకు స్పేస్ లేక పోవడం కానీ, ఇతర ప్రజాస్వామ్య రుగ్మతలు కానీ, ప్రజస్వామ్య వ్యవస్థను, స్పూర్తిని చిన్నాభిన్నం చేస్తున్నాయి. అయితే, ఇందుకు ఎవరు బాధ్యులు? అంటే, నిజం చెప్పాలంటే, అందరూ బాధ్యులే, తిలాపాపం తలా పిడికెడు.

ఓట్ల కోసం ఉచిత పంపిణీపై ప్రధాని మోడీ ఉచిత హెచ్చరికలు..!

మాకు ఓటేయండి చాలు... ఇంక మీరేం చేయనవసరం లేదు. మీ అవసరాలన్నీ మేమే ఉచితంగా  తీర్చేస్తాం. కాలు బయటపెట్టకుండా మీకు సకల సౌకర్యాలూ ఇంటి ముంగిటకు తీసుకువచ్చి అమరుస్తాం అన్న రీతిలో  ఎన్నికలలో  విజయమే  లక్ష్యంగా పార్టీలు, ప్రభుత్వాలూ  పోటీలు పడి మరీ  హామీలు గుప్పించేస్తుండటం ఇటీవలి  కాలంలో బాగా ఎక్కువ అయిపోయింది.  అన్నీ ఉచితంగా ఇచ్చేస్తామంటూ హామీలు గుప్పించేసి, తీరా అధికారం చేపట్టిన తరువాత వాటి అమలుకు  రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతున్నా సరే  అనివార్యంగా నిబంధనలన్నిటికీ తిలోదకాలిచ్చేసి మరీ  అప్పులు  చేస్తున్నాయి. ఇంత  చేసినా ఇచ్చిన హామీల  అమలుకు సరిపోక.. రాష్ట్రాలకు రాష్ట్రాలు దివాళా ముంగిట నిలబెడుతున్నాయి. అన్నీ ఉచితమంటూనే.. రోజు గడవడానికి ఆదాయం కోసం ప్రజలపైన పన్నులు విధించి ముక్కు పిండి వసూలు చేస్తూ వారి జీవితాలనూ కుదేలు చేస్తున్నాయి. తెలుగు  రాష్ట్రాల ప్రభుత్వాల  ప్రస్తుత స్థితి ఇందుకు ఉదాహరణగా  చెప్ప వచ్చు. ముఖ్యంగా  ఆంధ్రప్రదేశ్  విషయాన్నే తీసుకుంటే..  అప్పులు కూడా చేసి మరీ ఉచితాలకు లక్షల కోట్లు ఖర్చు వ్యయం చేస్తోంది.  అదే చేత్తో నిత్యావసర ధరలన్నీ విపరీతంగా  పెంచేసి ఆ ప్రజల నెత్తినే బండ పడేస్తోంది. పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి  రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ చేయడానికి కూడా సిద్ధమైపోయింది ఏపీ సర్కార్. ఏపీ  దుస్థితికి  పరోక్షంగా కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా కారణమే. రాజకీయ ప్రయోజనం ఆశించి కేంద్రం ఏపీ అడ్డగోలు అప్పులకు అంతకంటే అడ్డగోలుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. ఈ  పరిస్థితుల్లో మోడీ ఉచితాలు ప్రమాదకరం అంటూ తనదైన స్టైల్ లో ఓ హెచ్చరిక జారీ చేశారు.  యూపీలో బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ ఉచిత పథకాలపై రాష్ట్రాలకు సూచన లాంటి హెచ్చరిక చేశారు. ఇది  దేశ అభివృద్ధికి విఘాతమని ఉద్ఘాటంచేశారు.   దేశ ప్రగతికి ఫ్రీ బీస్  గొడ్డలి పెట్టు వంటివన్నారు. ఉచితాలు అనర్ధదాయకమనీ, వీటిని నియంత్రించే విషయంలో  రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి నిర్ణయం తీసుకోవాలని, లేదా కేంద్రం ఈ దిశగా చట్టం  చేయాలని కేంద్ర ఎన్నికల  సంఘం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.  అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చే పార్టీలను, ప్రభుత్వాలను నియంత్రించే దిశగా చట్టం రావలసిన అవసరం ఉందనడంలో సందేహం  లేదు. కేబినెట్ పరిమాణాన్ని నియంత్రించేందుకు చట్టం తీసుకువచ్చిన విధంగానే ఈ ఫ్రీ బీస్ హామీలను నియంత్రించే దిశగా కూడా చట్టం తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉందని రాజ్యాంగ నిపుణులు గత కొంత కాలంగా నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. అయితే అధికారమే పరమావధిగా భావిస్తున్న రాజకీయ పార్టీలు ఈ దిశగా పడే ప్రతి అడుగుకూ ప్రతిబంధకంగా మారుతున్నారు. రుణ మాఫీ హామీని విమర్శించిన నోటితోనే కేంద్రం కూడా రుణ మాఫీ హామీ ఇచ్చిన సంగతినీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అసంబద్ధం కాదు. అయితే ఉచితాలు అనర్ధం అంటూ మోడీ చేసిన వ్యాఖ్య ఏ విధంగా చూసినా హర్షించాల్సిందే. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశారు. ఏ వ్యూహంతో ఈ హెచ్చరిక చేశారు అన్న దానిపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ప్రధానిగా మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచీ ఆయన అనుసరిస్తున్న విధానాలన్నీ  బీజేపీ పాలిత రాష్ట్రాలకు అనుకూలంగా, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఇరుకున పెట్టేలా ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన కేటాయింపులు, నియామకాలు, ప్రధాన్యతల విషయంలో దేశానికి ప్రధానిగా కాకుండా గుజరాత్ ప్రధానా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పలు రాష్ట్రాలు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సందర్భం ఏదైనా, అవసరం ఎలాంటిదైనా ప్రధాని నోటి వెంట ఓట్ల కోసం ఉచిత పంపిణీలు దేశ భవితకు ప్రమాదకరమన్న మాటలు మాత్రం అక్షర సత్యమని పరిశీలకులు అంటున్నారు.   మోడీ ఆశీస్సులు లేకుండానే కుప్ప తెప్పలుగా అప్పులు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు తిలోదకాలిచ్చేసి మూడేళ్లలోనే రాష్ట్ర భవిష్యత్ ను అంధకార బంధురంగా మార్చేసిన ఏపీ గురించి ఆయన ఏం చెబుతారనీ ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ తీరు దేశ భవిష్యత్ కు ప్రతిబంధకం కాదా అని ప్రశ్నిస్తున్నారు.ఏపీ అడగడమే ఆలస్యం అన్నట్లుగా అప్పులకు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ఏపీలా అడ్డగోలుగా అప్పులు చేసి మరీ ఓట్ల కోసం పెట్టుబడిగా పెట్టిన రాష్ట్ర్రాల నిగ్గు తేల్చి వాటిని నియంత్రించడమే కాకుండా నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తేనే మోడీ మాటలకు విశ్వసనీయత ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.

ఈ బాబా చెప్పిన‌వ‌న్నీ జ‌రిగాయి

జీవితంలో అన్నీ అనుకున్న‌ట్టే జ‌ర‌గ‌వు, ఊహించ‌నివే ఎక్కువ జ‌రుగుతాయి అంటూంటారు త‌త్వ‌వేత్త‌లు. అందుక‌నే ఎలాంటి త‌ట్టుకోలేని క‌ష్టం వ‌చ్చినా దేవుడి ద‌గ్గ‌ర‌కో, మ‌న‌సుకు శాంతి క‌లిగించే న‌మ్మ‌క‌మైన బాబాల ద‌గ్గ‌ర‌కో వెళ్ల‌డం మ‌న‌లో చాలా మందికి అల‌వాటు. ఇది వారి వ్య‌క్తిగ‌త ఆలోచ‌న‌, న‌మ్మ‌కాల మీద‌నే ఆధార‌ప‌డివుంటుంది. కొంద‌రికి కొన్ని అతీత‌శ‌క్తులు ఇప్ప టికీ వున్నాయ‌న్న‌ది అపుడ‌పుడు రుజువ‌వుతుంటుంది. ఇలాంటివి ఎక్కువ‌గా ఆసియా, ఆఫ్రికా దేశాల్లోనే వింటాం, చూస్తాం. ఇలాంటి బాబాయే బాబా వాంగా.  ఆమె అస‌లు పేరు వంగెలియా పందెవా గుస్టరోవా ప్ర‌తీవారికి త‌మ భ‌విష్య‌త్తు తెలుసుకోవాల‌న్న కోరిక ఉంటుంది. దానికి పేద‌, ధ‌నిక అనే తేడాలుండ‌వు. కొంద‌రు కొంద‌రిని ఎంతో న‌మ్ముతారు. కొంద‌రు చెప్పిన‌వి చెప్పిన‌ట్టు జ‌రుగుతూంటాయి కూడా. కొన్నిసార్లు అంద‌రం న‌మ్మ‌వ‌ల‌సి వ‌స్తుంది.  బ‌ల్గేరియా వాసులు బాబా వాంగా వ‌ద్ద‌కు వెళుతూంటారు. ఆమె ప‌ట్ల‌ వారికి అపార న‌మ్మ‌కం. ఎందుకంటే అమెరికా ట్విన్ ట‌వ‌ర్స్ మీద ఉగ్ర వాదుల దాడుల గురించి ఆమె ముందే చెప్పారు. స‌రిగ్గా అలానే జ‌రి గింది. ఇలాంటివి ఆమె ఎన్నో చెప్పారు.   బాబా వాంగాని సిద్ధ‌గురువుగా బ‌ల్గేరియా ప్ర‌జ‌లు భావిస్తారు. అంతెందుకు ఇటీవ‌ల జ‌రిగిన‌వాటిలో దాదాపు అన్నీ ఆమె ముందే చెప్పార‌ట‌. 2022లొ జ‌రిగేవి అన్నీ చెప్పార‌ట‌. ఆమె చెప్పిన‌ట్టే ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌ర‌గ‌డం చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఆమె ను  అంద‌రూ బాల్క‌న్ల నోస్ట్రాడామ‌స్‌గా పిలుస్తారు. ఈమె 1996లో క‌నుమూశారు. కానీ ఆమె 5079 వ‌ర‌కూ ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌రిగే చాలా సంఘ‌ట‌న‌లు వివ‌రించిందిట‌! 2020లో పుతిన్‌, ట్రంప్ జీవితాల్లో ప్ర‌మాదం ఉంద‌ని అలాగే కెమిక‌ల్ వార్ వ‌ల్ల యూర‌ప్లో మాన‌వాళి ఊహించ‌ని ఘోరం జ‌రిగే ప్ర‌మాదం వుంద‌ని ఆమె చెప్పార‌ట‌. బాబా వాంగా గురించి క‌థ‌లు క‌థ‌లుగా బ‌ల్గేరియా అంత‌టా చెప్పుకుంటూంటారు. ఆమెకు ఈ శ‌క్తులు రావ‌డం గురించీ ఒక క‌థ వుంది. ఒక‌సారి ఒక తుపాను గాలికి ఆమె చిక్క‌కున్నార‌ట‌. ఆ విప‌రీత గాడుపు ఆమెను ఎత్తి కింద‌ప‌డేసింది. ఆమె త‌ల‌కు దెబ్బ త‌గిలి దుమ్మంతా క‌ళ్ల‌లో ప‌డి చూపు పోయింద‌ట‌. చిత్ర‌మేమంటే, ఆ దుర్ఘ‌ట‌నే ఆమెకు ఈ అతీత‌శ‌క్తులు ఇచ్చింద‌ని ప్ర‌చారంలో వుంది.  ఏదేమ‌యినప్ప‌టికీ, బాబా వాంగా చెప్పిన‌వన్నీ జ‌రుగుతుండ‌డంతో ఆమెను దైవ‌దూత‌గా భావిస్తు్నారు బ‌ల్లేరియ‌న్లు.  2020లో ట్రంప్ బ్రెయిన్ ట్యూమ‌ర్ తో బాధ‌ప‌డ‌తార‌ని ఆమె చెప్పిన‌ట్టే జ‌రిగింది. అలాగే రష్యా పుతిన్ పై త‌న అధికారిక కార్యా ల‌యంలోనే హత్య‌కు గుర‌వుతారు, లేదా ఆయ‌న త‌ప్పించుకునే అవ‌కాశం కూడా ఎంతో వుంద‌ని చెప్పారు. అంతేకాదు యూర‌ప్ ముస్లిం ఉగ్రవాదుల దాడిలో చిత్త‌వుతుంద‌నీ చెప్పారు. ఆమె చెప్పిన‌వేవీ త‌ప్ప‌లేదు. ఐఎప్ ఐఎస్ వికృత రూపంతో ప్ర‌భావం చూపుతుం ద‌ని, అమెరికా 44వ ప్రెసిడెంట్ గా ఆఫ్రికా-అమెరిక‌న్ అవుతాడ‌ని వాంగాయే ముందుగా చెప్పారు.   ఇలాంటివారు చాలా అరుదుగా వుంటారు. భార‌త దేశంలో పూర్వం రుషులు ఇలానే చెప్పేవార‌ని మ‌న పురాణాలు పేర్కొంటు న్నాయి. కానీ ఇలాంటివారిలానే చాలామంది ఇపుడు బాబాల‌మంటూ దొంగ‌లు త‌యారవుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఎవ‌ర్ని న‌మ్మాలో అర్ధంగాని సందిగ్ధ‌తా ఏర్ప‌డిన మాటా నిజ‌మే. 

ఆ అమ్మ ప్రేమకు ఫిదా కాని వారుంటారా?

అమ్మ ప్రేమకు  హద్దులుండవు. అమృతం కూడా అమ్మ ప్రేమ ముందు దిగదుడుపే.. అందుకే అంటారు అమ్మ అని. తన బిడ్డ భద్రత కోసం, క్షేమం  కోసం అమ్మ ఎంతకైనా తెగిస్తుంది. బిడ్డ కోసం ఆ  అమ్మ పడిన  తపన కళ్లు చెమర్చేలా  చేస్తుంది. అయితే  ఆ అమ్మ మనిషి కాదు.. ఓ ఏనుగు. తన పిల్లను  రక్షించుకోవడం  కోసం ఆ  అమ్మ ఏనుగు పడిన తపన, తాపత్రేయం, బాధ, వేదన  మనసును కదిలించేస్తుంది. ఈ సంఘటన థాయ్ ల్యాండ్ లోని నకోన్ నాయక్ప ప్రాంతంలో  జరిగింది. గున్న ఏనుగు ప్రమాద వశాత్తూ గుంతలో పడిపోయింది. ఆ గున్న ఏనుగు తల్లి తన బిడ్డను  రక్షించుకోవడానికి పడిన తపన, తాపత్రేయం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆ అమ్మ ప్రేమకు  ఫిదా అవుతున్నారు.  పిల్లను రక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది.  గుంత చుట్టూ తిరుగుతూ   బిడ్డను ఎలాగైనా కాపాడాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో తీవ్ర ఒత్తిడికి లోనై మూర్ఛిల్లింది. సమాచారం అందుకున్న స్థానిక జూ  అధికారులు అక్కడకు వచ్చి తల్లి ఏనుగుకు మత్తు మందు ఇచ్చారు. ఆ తరువాత గున్న  ఏనుగును గుంత  లోనుంచి బయటకు తీసి  రక్షించారు. స్ఫృహలోకి  వచ్చిన తరువాత తల్లి  ఏనుగు పిల్లతో కలిసి  అడవిలోకి వెళ్లిపోయింది.