మంత్రిని నిలదీసిన మహిళపై మద్యం కేసు!
posted on Jul 18, 2022 @ 11:35AM
రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నది సామెత. ఇప్పుడు జగన్ సర్కార్ తలచుకుంటే కేసులకు కొదవా అని ఆ సామెతను మార్చుకోవలసిన పరిస్థితి ఏపీలో ఉంది. విపక్ష నేతలు, సొంత పార్టీ ఎంపీ.. సామాన్యులు, మాన్యులు అన్న తేడా లేదు. సర్కార్ ను విమర్శించినా, ప్రశ్నించినా కేసులు పెట్టడానికి పోలీసులు రెడీ అయిపోతుంటారు. కేసు పెట్టినా పెట్టకున్నా పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి కూర్చోబెడతారు. అక్కడ నుంచి రాయబారాలు, హెచ్చరికలు, బెదరింపులు. అవేవీ ఫలించకపోతే.. ఇక కేసు పెట్టి జైల్లో తోయడమే. జగన్ సర్కార్ ను ఎదిరించినా, నిలదీసినా ఇక అంతే సంగతులు. అలా సర్కార్ ను నిలదీసిన వారు విపక్ష నేతలైనా, సామాన్య జనులైనా వారిని వెంటాడి వేధించడం ఏపీలో షరా మామూలే అన్నట్లుగా తయారైంది. తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి సంగతి తీసుకున్నా, ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడైనా, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. ఇలా చెప్పుకుంటూ పోతే అంకెలు కూడా సరిపోవు. అంతెందుకు ప్రభుత్వ విధానాలను విమర్శించిన సొంత పార్టీ ఎంపీపై కూడా కేసులు పెట్టి వేధించిన చరిత్ర జగన్ సర్కార్ ది. ఇప్పుడు జగన్ సర్కార్ తాజాగా నమోదు చేసిన కేసు చూస్తుంటే ఇక రాష్ట్రంలో ప్రభుత్వానికి తందానా అనకపోతే కేసులు ఎదుర్కొని జైళ్లలో కూర్చోవడం తప్ప మరో గత్యంతరం లేదా అనిపించక మానదు.
ఇంతకీ విశేషమేమిటంటే, గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సత్య సాయి జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి సత్యనారాయణను ఓ మహిళ నిలదీశారు. తనకు పిఛన్ తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తన ఇంటికి రావద్దనీ, వస్తే చెప్పుతో కొడతాననీ హెచ్చరించారు. సహజమే.. ఇంత కాలం వచ్చిన పింఛన్ ను కారణం లేకుండా తీసేస్తే ప్రశ్నించడం సహజమే. ఒకింత ఆగ్రహం ఎక్కువ అయితే.. ఇంటికి రావద్దనడమూ.. ముఖం మీదే తలుపులు మూసేయడమూ, వస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించడమూ తప్పెలా అవుతుంది. ఆమె తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇంటికి ఆహ్వానించడమైనా, రావద్దని అనడమైనా.. ఆ ఇంటి యజమానుల ఇష్టం. దానికి కాదనడానికి ఏ ప్రభుత్వానికీ అధికారం లేదు.
ఒక సామాన్య మహిళ జగన్ ప్రభుత్వంపై, మంత్రి శంకర నారాయణపై తన ఆగ్రహాన్ని అలా వెళ్లగక్కింది. అప్పటికి ఊరుకుని వెనుదిరిగిన మంత్రి ఆ తరువాత తన అధికార ప్రతాపాన్ని చూపారు. మంత్రిని నిలదీసిన మహిళను పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్లారు. మద్యం కేసు పెట్టారని అంటున్నారు. అయితే ఆ విషయం ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. కానీ ఆమెను పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్లడం నిజం.
ఆ తరువాత సొంత పూచీకత్తుపై విడుదల చేయడమూ నిజం. సరిగ్గా మంత్రి శంకరనారాయణను నిలదీసి ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేసిన మరునాడే పోలీసులు ఆమెను స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఎస్టీ వర్గానికి చెందిన ఆ మహిళ ఒక కూలీ. కూలి పని చేసుకుని పొట్టపోసుకునే ఆమె కూలీ పనులు చేసే చోట ఓ ఇసుక దిబ్బలో కర్నాటక బ్రాండ్ మద్యం ప్యాకెట్లు దొరికాయంటూ పోలీసులు ఆమెను స్టేషన్ కు తీసుకువెళ్లారు.