సీఎం కామెంట్స్ పై పొలిటికల్ క్లౌడ్ బరస్ట్
posted on Jul 18, 2022 7:39AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన, ఈ మాట మేఘాల మాటేమో కానీ, రాజకీయాలలో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. పెద్ద దుమారాన్నే రేపింది. ఇప్పుడు, వరదలు, ప్రజల కష్టనష్టాల విషయం పక్కకు పోయింది, కాళేశ్వరంలో మునక వివాదమూ పక్కకు పోయింది. ‘క్లౌడ్డ్ బరస్ట్’ చుట్టూనే రాజాకీయ దుమారం చెలరేగుతోంది., రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణం కావచ్చని, అనుమానం వ్యక్తం చేస్తూనే, ముఖ్యమంత్రి కేసీఆర్ విదేశాల కుట్ర కోణాన్ని కూడా తెరమీదకు తెచ్చారు.
నిజానికి, ముఖ్యమంత్రికి అలాంటి అనుమానం ఏదైనా ఉంటే, అందుకు సంబదించి సమాచారం ఏదైనా తమ వద్ద ఉన్నా, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళితే, ఎవరికీ అభ్యతరం ఉండేది కాదు. పోనీ కేంద్రంతో మాటలు లేవు, కాబట్టి, కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లక పోయినా, సంబంధిత అధికారాలను లేదా శాస్త్ర వేత్తలను సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చినా అదో రకంగా ఉండేది. కానీ, ముఖ్యమంత్రి కేసిఆర్ అదేమీ లేకుండా, ఒక మాట అనేశారు. నిజానికి, అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రాజకీయ నాయకులు ఇలాంటి అసత్యాలు, అర్థ సత్యాలను ఆశ్రయించడం కొత్తేమీ కాదు. అందులోనూ, కేసీఆర్ అలాంటి విద్యలో సిద్దహస్తులనే విషయంలో ఎవరికీ అనుమానం లేదు.
ముఖ్యమంత్రి కనీసం హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులను సంప్రదించినా, కొంత క్లారిటీ వచ్చేది కావచ్చును. నిజానికి, హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తనకైతే క్లౌడ్ బరస్ట్ గురించి పెద్దగా తెలియదని, తమ వద్ద ఉన్న సమాచారం మేరకు వాతావరణ హెచ్చరికలు జారీ చేశామని చెప్పారు. ప్రకృతిలో వచ్చిన మార్పుల కారణంగా మాత్రమే వర్షాలు కురిసి వరదలు సంభవించాయని చెప్పారు. అంటే, ముఖ్యమంత్రి చెప్పిన క్లౌడ్ బరస్ట్ కథ కట్టు కథ కావచ్చనే అనుమానం వ్యక్త పరిచారని అనుకోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి ఏ ఆధారాలు లేకుండా, విదేశాలు కుట్రతో "క్లౌడ్ బరస్ట్" చేయడం వల్లే వరదలు వచ్చాయని, బహిరంగ ప్రకటన ఎందుకు చేశారు? ఏ ఉద్దేశంతో, ఈ వ్యాఖ్యలు చేశారు? అలాగే. గతంలో ఒకసారి కశ్మీర్’లోని లద్ధాక్ – లేహ్’లో మరోమారు ఉత్తరఖండ్ లో చేశారని అన్నారు. ఈమధ్య గోదావరి పరివాహక ప్రాంతంలోనూ చేస్తున్నారని గ్లూమీ .. గ్లూమీ ( అస్పష్ట) సమాచారం ఉందని అన్నారు. కావచ్చును, ముఖ్యమంత్రి ఏదీ నిర్దారణగా చెప్పా లేదు, ఎవరి మీద వేలెత్తి చూపలేదు. కానీ, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తమకే స్పష్టత లేని సమాచారం ఆధారంగా, అంత సీరియస్ వ్యాఖ్య, ఇంత బేఫర్వాగా ఎలా చేస్తారు, అనేదే ఇప్పడు రాజకీయ వర్గాల్లో వివాదం అవుతోంది. మరోవంక, చైనా పేరు కూడా తెరమీదకు వచ్చింది.
నిజానికి వరదల విషయంలో మొదటి నుంచి ప్రభుత్వం బేఫర్వా గానే వ్యవహరిస్తోంది. విపత్తు ముంచు కోస్తోందని హెచ్చరికలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు.నిమ్మకు నీరెత్తి నట్లు వ్యహరిస్తూ వచ్చింది. ముఖ్యమంత్రి, కూడా వర్షాలు, వరదల మీద అధికారులతో రివ్యూ చేసినా, విలేకరుల సమావేశంలో రెండే రెండు ముక్కల్లో ఆ విషయన్ని తేల్చేశారు. ఆ తర్వాత రెండున్నర గంటలు రాజకీయ విమర్శలకు వినియోగించుకున్నారు. ఆ తర్వాత, కాళేశ్వరం మునకతో ప్రభుత్వం మరింత ఇరకాటంలో పడింది. చివరకు, గవర్నర్ తమిళి సై, వరద పోటెత్తిన భద్రాచలంలో పర్యటించేందుకు కదిలిన తర్వాత గానీ, ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాలలో పర్యటించే ఆలోచన చేయలేదనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపద్యంలో ముఖ్యమత్రి క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం సృష్టించాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అయితే, విదేశాలు కుట్రతో "క్లౌడ్ బరస్ట్" చేయడం వల్లే వరదలు వచ్చాయని స్వయాన సీఎం కేసీఆర్ చెప్పడంపై కేంద్రం వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి,హోదాలో మాట్లాడిన మాటలను కేంద్రం పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ నుంచి కుట్ర సమచారాన్ని రాబట్టాలన్నారు. ఇలాంటి సమాచారం ఏదైనా ఉంటే కేంద్ర భద్రతా విభాగానికి సమాచారం ఇవ్వాల్సిన భాధ్యత కేసీఆర్‌కు ఉందని గుర్తుచేసిన రేవంత్.. అలా చేయని పక్షంలో కేంద్రమే కస్టడీలోకి తీసుకుని విచారించాలన్నారు. కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని రేవంత్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న లోపాలు, అవినీతిని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే క్లౌడ్ బరస్ట్ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆక్షేపించారు.
మరో వంక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ పడరాని పాట్లు పడుతున్నారని, విదేశీ కుట్ర పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని ఆరోపించారు.
అదలా ఉంటే ఇప్పుడు కేసేఆర్ చేసిన, విదేశీ కుట్ర వ్యాఖ్యలు రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశంలోనూ దుమారం రేపుతున్నాయి.జాతీయ టీవీ చానల్స్’లోనూ కేసీఆర్ వ్యాఖ్యలఫై చర్చ మొదలైంది. ఇక ఇప్పుడు ఈ ‘పొలిటికల్ క్లౌడ్’ ఎటు తిరుగుతుందో, ఏమౌతుందో ..