తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇప్పుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుండటంతో తిరమల భక్త జన సంద్రంగా మారింది. బుధవారం (అక్టోబర్ 1) తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 14 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (సెప్టెంబర్ 30) శ్రీవారిని మొత్తం 73 వేల275 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 973 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 77 లక్షల రూపాయలు వచ్చింది. 

క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన సీఎం రేవంత్

ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శన చేసి టీమ్ ఇండియాను విజయంలో కీలక పాత్ర పోషించి, మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ గా నిలిచిన క్రికెటర్   తిలక్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంగళవారం (సెప్టెంబర్ 30) భేటీ అయ్యాడు. హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా తిలక్ వర్మను అభినందించి సత్కరించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తిలక్ వర్మ తాను సంతకం చేసిన బ్యాట్ ను సీఎంకు బహూకరించాడు.    ఆసియాకప్ ఫైనల్ లో పాకిస్థాన్ పై టీమ్ ఇండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన తెలుగుతేజం తిలక్ వర్మపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ లు తిలక్ వర్మను అభినందిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.  మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌‌తో పిచ్‌ను పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకున్నాడనీ, ఒత్తిడిలోనూ అతని ప్రశాంతత, ప్రతిభ స్ఫూర్తిదాయకమనీ చంద్రబాబు ట్వీట్ చేశారు.  

రూ. 6.25 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

ఎర్రచందనం స్మగ్లింగ్ కు పుష్ప సినిమాలో చూపిన టెక్నిక్ లన్నీ దిగదుడుపే అన్న విధంగా గంజాయి స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాల ద్వారా సరుకు రవాణా చేస్తున్నారు.  పోలీసులకు చుక్కలు చూపి స్తున్నారు.   పుష్ప సినిమా తరహాలో కొత్త కొత్త ఐడియాలతో స్మగ్లర్లు పోలీసుల కళ్లు కప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం  తగ్గేదే అంటూ..  స్మగ్లర్ల దూకుడికి కళ్లెం వేసి అరెస్టులు చేస్తున్నారు. తాజాగా   ఓ నిందితుడు 6 కోట్ల పైచిలుకు విలువ గల గంజాయిని స్మగుల్ చేయడానికి ఉపయోగించిన విధానం పోలీసులనే విస్మయపరిచింది.  వివరాల్లోకి వెడితే.. రాజస్థాన్ లోని జోధ్ పూర్  జిల్లా  హానియా గ్రామానికి చెందిన విక్రమ్ విష్ణోయ్  అలియాస్ వికాస్ (22) అనే యువ కుడు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.   ఇతనికి దేవీలాల్ అలియాస్ కటు, ఆయుబ్ ఖాన్, రామ్ లాల్ అనే గంజాయి స్మగ్లర్లతో పరిచయం ఏర్పడింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విక్రమ్ గురించి తెలుసుకున్న ఈ ముగ్గురూ గంజాయి స్మగ్లింగ్ చేస్తే లక్షల్లో డబ్బులు ఇస్తామని ఆశ చూపించారు. ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్ గిరి నుండి రాజస్థాన్ రాష్ట్రానికి గంజాయిని రవాణా చేయడానికి ప్రతి సరుకుకు ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తామని విక్రమ్ కు హామీ ఇచ్చారు. అందుకు  ఒప్పుకొన్న విక్రమ్ వారి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే విక్రమ్ రాజస్థాన్   జైపూర్ నుండి మహారాష్ట్ర   లోని నాందేడ్ కు ఇనుపలోడును రవాణా చేసి అక్కడ దించివేసి...తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు వెళ్లి సిమెంట్ సంచులను కొనుగోలు చేశాడు. వాటిని లారీలో ఎక్కించుకొని ఒడిస్సాలోని మల్కాన్గిరి కి వెళ్లి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుండి సుమారు 1210 కిలోల గంజాయిని కొనుగోలు చేసుకుని వాటిని సిమెంట్ సంచుల కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలలో దాచిపెట్టి.. పైనుండి టార్పాలిన్ తో లోడును కప్పాడు. అనంతరం హైదరా బాదు నుండి రాజ స్థాన్ వైపు ప్రయా ణం సాగించాడు. అయితే..  మహే శ్వరం ఎస్ఓటి బృందానికి విశ్వ సనీయమైన సమా చారం రావడంతోమంగళవారం (సెప్టెంబర్ 30) అబ్దుల్లాపూర్మెట్ పోలీసులతో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సిమెంట్ లోడుతో వస్తున్న లారీలో తనిఖీలు నిర్వహించారు. పోలీసులు తనిఖీలు చేసినా కూడా సిమెంటు సంచులు తప్ప మరేమీ కనిపించలేదు. అయితే పోలీసులు అనుమానంతో మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో.. లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలను గుర్తించారు. వాటిలోని గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.   ఆరు కోట్ల పాతిక లక్షల రూపాయలు విలువ చేసే  1210 కిలోల గంజాయిని స్వాధీనం చేసు కున్నారు. నిందితు డిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. 

థర్మల్ పవర్ ప్లాంట్ లో ప్రమాదం.. తొమ్మిది మంది మ‌‌ృతి

తమిళనాడులోఘోర విషాదం సంభవించింది. చెన్నై సమీపంలోని ఎన్నూర్ థర్మల్ పవర్ ప్లాంట్ లో మంగళవారం (సెప్టెంబర్ 30)పై కప్పు కుప్పకూలి తొమ్మిది మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం సంభవించిన వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తలరించారు.  ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.  మృతులంతా ఉత్తరాదికి చెందిన కార్మికులే.   ప్రస్తుతం క్షతగాత్రులకు చెన్నైలోని రాయపురం స్టాన్లీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.   ఎన్నూర్ పవర్ ప్లాంట్ ప్రమాద ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ప్రభుత్వ వ్యయంతో మెరుగైన చికిత్స అందజేయాలని ఆదేశించారు. 

సినిమాల‌పైనా ట్రంప‌పు కోత‌!

ఇక‌పై మీరు అమెరికాలో కూర్చుని ఓజీ త‌ర‌హా అచ్చ తెలుగు సినిమా చూడాలంటే.. చాలా చాలా క‌ష్టం. ఆ టికెట్ రేట్లు కూడా మీ వాలెట్ కి చిల్లు పెట్ట‌డం ఖాయం. ఎందుకంటే మ‌న ట్రంప్ మామ‌.. ఇక్కడా త‌న ప్రతాపం చూపించేశారు. వంద శాతం సుంకాల‌తో విరుచుకుప‌డ్డారు. బాహుబ‌లి ముంద‌రి వ‌ర‌కూ టాలీవుడ్ సినిమాల ప‌రిస్థితి ఏంటంటే.. హాలీవుడ్ సినిమాల ముందు మ‌న సినిమాలు తేలిపోయేవి. దీంతో బడ్జెట్ ఎక్కువైనా ప‌ర్లేదు.. క్వాలిటీ త‌గ్గ‌కుండా పీరియాడిక్స్ ని వ‌ద‌ల‌కుండా వ‌రుస వెంబ‌డి సినిమాలు చేస్తూ వ‌స్తోంది తెలుగు చిత్ర‌సీమ‌.  స‌రిగ్గా ఇదే విష‌యాన్ని చిరంజీవి నాటి సీఎం జ‌గ‌న్ ని క‌లిసిన‌పుడు అన్నారు కూడా. ఎందుకంటే మ‌న ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌ను వెతుక్కుంటూ రావాలంటే ఆ మాత్రం పెట్టుబ‌డి పెట్ట‌క త‌ప్ప‌డం లేద‌న్నారు. దీంతో మ‌న సినిమాలు హాలీవుడ్ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఇర‌గ‌దీయ‌డం మొద‌లు పెట్టాయి. మ‌న బాహుబ‌లి, దేవ‌ర వంటి సినిమాలు చైనా, జ‌పాన్ లో కూడా ఆడ్డం మాత్ర‌మే కాదు.. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించ‌డం మొద‌లు పెట్టాయి. దీంతో లోబడ్జెట్- హై ఎండ్ ఎంట‌ర్ టైన్మెంట్ కి కేరాఫ్ గా నిలుస్తున్నాయి మ‌న చిత్రాలు. ఇక మేన‌రిజమ్స్ సంగ‌తి స‌రే స‌రి. త‌గ్గేదే ల్యే.. అనేది ఇప్పుడు హాలీవుడ్ లెవ‌ల్ ట్రెండింగ్. ఆ మాట‌కొస్తే మ‌న పుష్ప పుష్ప పుష్ప సాంగ్ కి టైం స్క్వైర్ సెంట‌ర్లోనూ విదేశీయులు డ్యాన్సులు  ఆడారంటే ప‌రిస్థితేంటో అర్ధం చేసుకోవ‌చ్చు.  ఇప్ప‌టికే మ‌న ఇస్రో హాలీవుడ్ చిత్ర సీమ‌ను వెక్కిరిస్తోంది. కార‌ణం.. హాలీవుడ్ చిత్రాల బ‌డ్జెట్ లోప‌లే మ‌నం రాకెట్లు నింగిలోకి వ‌దిలేస్తున్నాం. దీంతో ఇదొక క‌డుపు మంట‌. ఆపై మ‌న అరిటాకు భోజ‌నాలు, క‌ట్టు బొట్టు తీరు తెన్నుకు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. మొన్న‌టి కుంభ‌మేళాకు ఎంద‌రో విదేశీ ప్ర‌ముఖులు రావ‌డం మాత్ర‌మే కాకుండా.. వారంతా ఇక్క‌డి దేవ‌త‌ల నామ‌స్మ‌ర‌ణ చేసి కాషాయం క‌ట్టి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అంతే కాదు మ‌న మంత్ర తంత్రాలు, ఆయుర్వేదం, శిల్ప‌క‌ళా చాతుర్యం.. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఒక మానియా క్రియేట్ చేస్తోంది. మొన్న‌టి వ‌ర‌కూ మ‌న వాళ్లు విదేశీ అల‌వాట్ల‌తో ఎక్క‌డ చెడిపోతారో అన్న భ‌యం నుంచి ప‌శ్చిమ నాగ‌రిక‌త క్ర‌మంగా అంత‌రించి పోయి.. ప్ర‌పంచ‌మంతా భార‌తీయ‌త ప‌రుచుకుపోతుందా అన్న దృశ్యం క‌నిపిస్తోంది. అంత‌గా మ‌న సంస్కృతీ సంప్ర‌దాయాలు ప్ర‌పంచ వ్యాప్త‌మై పోతున్నాయి. వీట‌న్నిటీకీ వాహ‌కంగా మారుతోంది మ‌న భార‌తీయ సినిమా. మ‌న సంస్కృతీ సంప్ర‌దాయాల‌ను మోసుకెళ్ల‌డంలో ఇవి ముందుంటున్నాయి. దానికి తోడు ఏ హాలీవుడ్ సినిమాలో ఉండ‌ని న‌వ‌ర‌సాలు మ‌న సినిమాల్లో క‌నిపిస్తాయ్. దీంతో హండ్రెడ్ ప‌ర్సెంట్ ఎంట‌ర్టైన్మెంట్ ప‌క్కా. అలాంటి సినిమాల‌కు భాషా బేధం లేకుండా విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌టంతో క‌న్ను కుట్టిన ట్రంపాసురుడు వీటిపై కూడా త‌న టారీఫుల‌తో విరుచుకుప‌డుతున్నాడు. త‌మ హాలీవుడ్ సినిమాల నాణ్య‌తా ప్ర‌మాణాలు కూడా మ‌న భార‌తీయ సినీ నైపుణ్యం ముందు ఎక్క‌డ కొట్టుకుపోతాయో అన్న భ‌యం కొద్దీ ట్రంప్ ఈ దిశ‌గా వంద శాతం సుంకాల మోత మోగిస్తున్న‌ట్టు తెలుస్తోంది.  ఈ ట్రంప్ ఇంకా ఎన్నేసి చిత్రాలు న‌మోదు చేస్తారో చూడాల్సి ఉంది. గ‌తంలో కొందరు పాల‌కులు జుట్టు ప‌న్ను వంటివి కూడా వేసేవారు. అలా ట్రంప్ త‌మ దేశంలో గాలి పీల్చే వారిపైనా ప‌న్ను విధించినా ఆశ్చ‌ర్యం లేదంటున్నారు కొంద‌రు. ఇప్ప‌టికే త‌మ త‌మ ఇంటికి డ‌బ్బు పంపే వారిపైనా క‌న్నేసి బిగ్ బిల్  తీసుకొచ్చిన ట్రంప్ ఇంకెన్ని అరాచ‌కాలు సృష్టిస్తాడో అన్న ఆందోళ‌న మొద‌లైంది.. ఎన్నారై వ‌ర్గాల్లో.

జగన్ గ్రేట్ ఎస్కేప్.. దసరా తరువాత యూకే ట్రిప్!

వైఎస్ రాజశేఖరరెడ్డి  కుమారుడు జగన్, కుమార్తె షర్మిల మధ్య చాలా కాలంగా తగాదా నడుస్తోంది. తొలుత ఆస్తుల తగాదాగా మొదలైనా.. చివరకు వైఎస్ రాజకీయ వారసత్వ యుద్ధంగా మారింది.  దీంతో అన్నాచెళ్లెళ్ల మధ్య వైరం విమర్శలు, ప్రతి విమర్శల యుద్ధంగా పరిణమించింది. అన్నను విమర్శించి, ఎండగట్టడంతో షర్మిల రెండాకులు ఎక్కువే చదివారు. పైగా వైఎస్ ఆకస్మిక మరణం తరువాత అన్నకు అండగా నిలిచి, ఆయన జైలులో ఉన్నప్పుడు పార్టీ భారమంతా ఒంటిచేత్తో మోసి, సుదీర్ఘ పాదయాత్ర కూడా చేసిన షర్మిల అప్పట్లో జగనన్న విడిచిన బాణాన్ని అంటూ జనానికి చేరువ అయ్యారు.   జగన్ అంగీకరించినా, అంగీకరించకపోయినా.. 2019 ఎన్నికలలో జగన్ పార్టీ వైసీపీ ఘన విజయంలో సంహభాగం వాటా షర్మిలకు కూడా ఉందంటారు పరిశీలకులు, వైఎస్ అభిమానులు. అయి తే జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత  జగన్ సొంత చెల్లిని దూరం పెట్టారు. దీంతో ఇప్పుడు అన్నా చెళ్లెల్ల మధ్య జరుగుతున్న వారసత్వ పోరులో సానుభూతి షర్మిల వైపే ఉందని చెప్పాలి. దానికి తోడు తల్లిని కూడా జగన్ దూరం పెట్టడం వైఎస్ అభిమానులకు పెద్దగా రుచించలేదు. దీంతో కుటుంబపరంగా, వైఎస్ అభిమానుల అండ పరంగా జగన్ దాదాపు ఏకాకి అనే చెప్పాలి.   ఇందుకు ఉదాహరణగా.. నాడు అంటే వైఎస్ ఆకస్మిక మరణం తరువాత, 2019 ఎన్నికల సమయంలోనూ వైఎస్ కుటుంబం మొత్తం ఐక్యంగా నిలిచి జగన్ కు మద్దతు పలికింది. అలాగే.. నాడు జగన్ కు అనుకూలంగా సానుభూతి వెల్లువెత్తడానికి కారణమైన వివేకా హత్య, కోడికత్తి దాడి కేసుల్లో ఇప్పుడు వెళ్లన్నీ ఆయనవైపే చూపిస్తున్నాయి. అలాగే నాడు జగన్ కు కొండంత అండగా నిలిచిన చెల్లి వైఎస్ షర్మిల ఇప్పుడు ఆయనకు ప్రత్యర్థిగా మారారు. నాడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనంలోకి వచ్చిన షర్మిల ఇప్పుడు తాను జగన్ కు గురిపెట్టిన బాణం అంటూ ఊరూవాడా చుట్టేస్తున్నారు.  జగన్ ను నియంత అంటున్నారు.  అలాగే వైఎస్   ఆత్మ అని గుర్తింపు పొందిన కేవీపీరామచంద్రరావు సైతం  షర్మిల పక్కన నిలబడ్డారు.   ఇక 2024 ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయం తరువాత షర్మిల విమర్శల పదును మరింత పెరిగింది. తన కుమారుడే వైఎస్ రాజకీయ వారసుడని ప్రకటించడమే కాకుండా, వైఎస్ ఆజన్మాంతం వ్యతిరేకించిన బీజేపీతో జగన్ కుమ్మక్కు అయ్యారని సోదాహరణంగా వివరిస్తున్నారు. ఇక అన్నిటికీ మించి  జగన్ ప్రస్తుతం పీకల్లోతు కష్టాలలో ఉన్నారు. పార్టీ పరాజయం, అలాగే చుట్టుముడుతున్న కేసులు, అధికారంలో ఉన్నప్పుడు అండగా నిలిచి.. తనను విమర్శించిన వారిపై బూతులతో చెలరేగిపోయిన ఫైర్ బ్రాండ్ లీడర్లంతా ఇప్పుడు సైలంట్ అయిపోరారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలంటూ అడపాదడపా జగన్ ఆందోళనలకు పిలుపు నిచ్చినా లీడర్లు కానీ, క్యాడర్ కానీ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ఇంత కాలం కోర్టు కేసుల విషయంలో ఉన్న వ్యక్తిగత మినహాయింపు ఇకపై ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఈ దశలో జగన్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయినట్లు కనిపిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఆ కారణంగానే దసరా వరకూ బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమై, ఆ తరువాత  యూకే పర్యటన అంటూ తాడేపల్లి ప్యాలెస్ ను, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కొంత కాలం పాటు స్కిప్ చేసే యోచనలో ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కవిత రాజీనామా ఆమోదం ఎప్పుడంటే?

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. నిజమే.. అయితే ఆమె రాజీనామాను మండలి చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు. అంటే టెక్నికల్ గా కల్వకుంట్ల కవిత ఇప్పటికే ఎమ్మెల్సీయే. కవిత తన రాజీనామాను స్పీకర్ ఫార్మాట్ లోనే ఇచ్చారు. ఆ విషయాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయంగా చెప్పారు. అంతే కాదు.. కవిత.. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరుతూ తనకు ఫోన్ కూడా చేశారని గుత్తా తెలిపారు.  అయితే రాజీనామా ఆమోదం విషయంలో మాత్రం ఆయనేం చెప్పలేదు.  ఎందుకంటే.. గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. గుత్తా పేరుకు బీఆర్ఎస్ యే అయినా.. కుమారుడిని కాంగ్రెస్ లో చేర్చిన తరువాత నుంచీ ఆయన ఆ పార్టీకి ఒకింత సన్నిహితంగానే మెలుగుతున్నారని బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి.  ఎంత కాదనుకున్నా.. మండలి చైర్మన్ గా ఆయన తటస్థం అనే చెప్పాలి. అందుకే కల్వకుంట్ల కవిత రాజీనామా ఆమోదానికి ఆయనకు ఎటువంటి రిజర్వేషన్లూ ఉండే అవకాశం లేదు. మరి కల్వకుంట్ల కవిత రాజీనామా ఆమోదం విషయంలో ఆయన ఎందుకు తాత్సారం చేస్తున్నారూ అంటే.. కవిత రాజీనామా ఆమోదిస్తే.. ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే? కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆమె పదవీ కాలం 2028 వరకూ ఉంది. దీంతో ఇప్పుడు ఆమె రాజీనామాను ఆమోదిస్తే ఉప ఎన్నిక అనివార్యం. అదే జరిగితే కాంగ్రెస్ కు ఒకింత ఇబ్బందే. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థలలో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేదు. ఎందుకంటే వాటి కాలపరిమితి పూర్తై ఏడాది దాటిపోయింది. స్థానిక సంస్థలలో సభ్యులెవరూ లేరు.  స్థానిక ఎన్నికల తరువాత ఆ కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్ని ఉంటుంది. అందుకే  కవిత రాజీనామా ఆమోదం విషయంలో మండలి చైర్మన్ తాత్సారం చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో స్థానిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత బహుశా కవిత రాజీనామా ఆమోందం పొందుతుందేమో అంటున్నారు పరిశీలకులురాజీనామా ఆమోదంపై వేచి చూడాలని మండలి చైర్మన్ కు సంకేతాలు వచ్చినట్లుగా భావిస్తున్నారు. 

స్థానిక ఎన్నికలు.. కల్వకుంట్ల కవిత నిర్ణయం ఏంటి?

తెలంగాణలో స్థానిక నగారా మోగింది.  బీఆర్ఎస్ పుంజుకుంటుందా? బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ కు లబ్ధి చేకూరుస్తుందా?  వంటి అంశాలకన్నా.. ఇప్పుడు  రాజకీయ వర్గాలలో  కల్వకుంట్ల కవిత నిర్ణయం ఏంటి? అన్నదానిపైనే చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కల్వకుంట్ల కవిత, ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ సభ్యత్వంలో సహా పార్టీకి రాజీనామా చేసేశారు. తెలంగాణ జాగృతి పేరిట ఆమె రాజకీయాలు చేస్తున్నారు. అవసరమైతే సొంత పార్టీ ఏర్పాటు చేస్తానని కూడా చెబుతున్నారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలలో ఆమె అభ్యర్థులను నిలబెడతారా? నిలబెట్టి గెలిపించుకోగలరా? లేకుంటే ఆమె అభ్యర్థులను పోటీలో పెట్టడం వల్ల బీఆర్ఎస్ కా, కాంగ్రెస్ కా ఏ పార్టీకి ప్రయోజనం చేకూరుతుంది? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.   ఆమె విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు మంగళవారం (సెప్టెంబర్ 30) తిరిగి వచ్చారు. వచ్చిన వెంటనే క్షణం  ఆలస్యం చేయకుండా తెలంగాణ జాగృతి ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యారు.   బతుకమ్మ వేడుకల కోసం విదేశాలకు వెళ్ళిన‌ కవిత అక్కడ రాజకీయ ప్రసంగాలు చేశారు. రెండు దశాబ్దాల పాటు తాను తెలంగాణ కోసం, బీఆర్ఎస్ కోసం అన్నీ వదులుకుని పని చేశానని చెప్పుకున్నారు. పార్టీ తనను వద్దనుకుంది కనుకనే రాజీనామా చేశాననీ చెప్పారు. తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలిపారు. అందుకే ఇప్పుడు తెలంగాణ స్థానిక ఎన్నికల సందర్భంగా కవిత తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అదీ కాక హైదరాబాద్ వచ్చీ రావడంతోనే   జాగృతి నేతలతో భేటీ కావడంతో ఆమె కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఒక వేళ  స్థానిక  ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరుపున పోటీ చేయాలన్న నిర్ణయం తీసుకుంటే.. బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉంటుందన్న ఆసక్తీ రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఆమె జాగృతి తరఫున అభ్యర్థులను నిలబెడితే.. బీఆర్ఎస్ పై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది.  రాష్ట్రంలో మూడు ద‌శ‌ల్లో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు, రెండు ద‌శ‌ల్లో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. పంచాయ‌తీల్లో పార్టీ గుర్తుపై ఎన్నిక‌లు జ‌ర‌గ‌క‌పోయినా, పార్టీలు బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థులే రంగంలోకి దిగుతారు. ఇక‌, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నికలు మాత్రం పార్టీల గుర్తుల‌పైనే జ‌రుగుతాయి. పోటీ ప్రధానంగా అధికార కాంగ్రెస్‌, విప‌క్ష బీఆర్ఎస్‌ల ఉంటుందన్న అంచనాలు ఉన్నప్పటికీ ఏదో మేరకు బీజేపీ ప్రభావం చూపుతుందని అంటున్నారు. అయితే కవిత తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థులను రంగంలోకి దింపితే సీన్ మారిపోయే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరివీలకులు విశ్లేషిస్తున్నారు.   కవిత బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. ఆ పార్టీ అధినేత, తన తండ్రి అయిన కేసీఆర్ పై మాత్రం ఈగ వాలనీయడం లేదు. తండ్రి సెంటిమెంట్ ను బలంగా పండిచడం కోసం ఆమె ఇటీవల తండ్రి సొంత ఊరైన చింతకుంటకు వెళ్లి మరీ తెలంగాణ సంబురాలలో పాల్గొని వచ్చారు. ఈ నేపథ్యంలో కవిత తెలంగాణ జాగృతి తరఫున స్థానక సమరంలోకి దిగితే.. ఆమె కచ్చితంగా త‌న తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ఫొటోతోనే ప్రచారం నిర్వహిస్తారు. ఇది అనివార్యంగా బీఆర్ఎస్ కు ఒకింత ఇబ్బందికరమే అంటున్నారు.  ఆమె వల్ల బీఆర్ఎస్ నష్టపోవడమే కాదు.. కాంగ్రెస్ కు ప్రయోజనం చేకూరడం కాడా  ఖాయమంటున్నారు.

లండన్ లో గాంధీ విగ్రహానికి అపచారం

భారత జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహానికి లండన్ లో అపచారం జరిగింది. లండన్ లోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని గుర్తు తెలియనివ్యక్తులు ధ్వంసం చేసేశారు.   జాతిపిత కాంస్య విగ్రహం పునాదిని పగలగొట్టారు.  అక్కడితో ఆగకుండా విగ్రహం దిమ్మపై భారత వ్యతిరేక నినాదాలు రాశారు. సరిగ్గా మరో రెండు రోజులలో జాతి పిత జయంతి ఉండగా, గాంధీ జయంతిని ప్రపంచమంతా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకోనున్న తరుణంగా గాంధీ విగ్రహం ధ్వంసం సంఘటన సంచలనం సృష్టించింది. ఇది కేవలం గాంధీ విగ్రహంపై దాడి మాత్రమే కాదనీ, ఆయన అహింసా సిద్ధాంతంపై దాడనీ అంటున్నారు. కాగా లండన్ లో గాంధీ విగ్రహం ధ్వంసం ఘటనపై భారత్ హైకమిషన్ స్పందించింది. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఇలా ఉండగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

కుక్కపిల్లకు కోతి తల్లి.. తల్లడిల్లుతున్న తల్లి కుక్క

అప్పుడే పుట్టిన ఓ కుక్కపిల్లకు తానే తల్లి అనుకుంటోంది ఓ వానరం. శునకం పిల్లపై ఆ వానరం కనబరుస్తున్న ప్రేమ అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తోంది. అదే సమయంలో తన పిల్ల కోసం ఆ కుక్క పిల్ల తల్లి తల్లడిల్లుతున్న తీరు అయ్యో పాపం అనీ అనిపిస్తోంది. ఇంతకూ విషయమేంటంటే  జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో  అప్పుడే పుట్టిన కుక్కపిల్లను తన పిల్ల అనుకొని ఒక వానరం ఎత్తుకెళ్ళింది. ఆ కుక్కపిల్లను హత్తుకుని ముద్దులు పెడుతూ గ్రామం అంతా తిరుగుతోంది.   కుక్కపిల్ల కోసం తల్లికుక్క తల్లడిల్లిపోతోంది. కోతి చెట్లు, ఇళ్ల కప్పులపై కుక్కపిల్లను హత్తుకుని తిరుగుతుంటే.. తల్లి కుక్క ఆ వానరం వెంటే కింద నేలపై అరుస్తూ పరుగులు పెడుతోంది.   స్థానికులు ఎంత ప్రయత్నం చేసినా   కుక్క పిల్లను మాత్రం ఆ కోతి వదలడంలేదు. మామూలుగా పిల్లి, కుక్క స్నేహం, మేకపిల్లకు పాలిస్తున్న కుక్క లాంటి వాటిని చూసి ఉంటాం. అయితే ఇలా తన జాతి కాని జంతువు పిల్లను తన పిల్లేనన్న భ్రమలో వానరం ఆ కుక్కపిల్లపై చూపుతున్న అనురాగం, ఆప్యాయతా మాత్రం విస్తుగొలుపుతున్నాయి. అదే సమయంలో పిల్లను దూరం చేసుకున్న ఆ తల్లి కుక్క అల్లాడుతున్న తీరు కంటనీరు తెప్పిస్తోందని అంటున్నారు స్థానికులు. 

అంతర్వేది వద్ద సముద్రం వెనక్కి.. సంకేతమేంటి?

కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్రం అనూహ్యంగా 500 మీటర్ల మేర వెనక్కు తగ్గింది. సోమవారం (సెప్టెంబర్ 29)న ఒక్కసారిగా సముద్రం వెనక్కు వెళ్లడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. నిత్యం ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతూ ఉండే అంతర్వేది తీరంలో సముద్రం వెనక్కు తగ్గడం దేనికి సందేశం అన్న చర్చ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.    సముద్రం దాదాపు అరకిలోమిటరు మేర వెనక్కు వెళ్లడం పట్ల   మత్స్యకారులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సునామీ వంటి ప్రకృతి విపత్తు ముందు సముద్రం ఇలా వెనక్కి వెడుతుందని అంటున్నారు.  సముద్రం గోదావరి కలిసే సంగమ స్థలంగా అంతర్వేది ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. అంతర్వేదిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని మహిమాన్విత దేవుడిగా భక్తులు కొలుస్తుంటారు. అలాగే అంతర్వేది తీరం, సంగమ ప్రాంతం కూడా కావడంతో ఇక్కడికి పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అటువంటి అంతర్వేదిలో సముద్రం వెనక్కు వెళ్లి మట్టి మేటలు వేసింది. సాధారణంగా సముద్రం వెనక్కు వెళ్లినప్పుడు ఇసుక మేటలు ఏర్పడతాయనీ, అయితే అసాధారణంగా మట్టిమేటలు ఏర్పడటం భయంగొల్పుతోందనీ స్థానికులు చెబుతున్నారు.  ఆటు సమయంలో సముద్రం వెనక్కు వెళ్లడం సర్వసాధారణమే అయినా ఇంతగా అంటే అరకిలోమీటరకు పైగా వెనక్కు వెళ్లడం అన్నది ఇదే తొలిసారని అంటున్నారు.    కాగా అంతర్వేది వద్ద సముద్రం వెనక్కు వెళ్లడంపై స్పందించిన అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.  టెక్నాలజీ అప్లికేషన్ ఫర్ వెదర్ మానిటరింగ్)  జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా  బృందాలు ఇక్కడకు చేరుకుని పరిశీలిస్తున్నాయి.  

బద్రి నారాయణుడి అలంకారంలో మలయప్పస్వామి

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన మంగళవారం (సెప్టెంబర్ 30)  ఉదయం స్వామివారు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా, కన్నులపండువగా సాగింది.  భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.  సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత, ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయన్నది భక్తుల విశ్వాసం. ఇక మంగళవారం (సెప్టెంబర్ 30) రాత్రి శ్రీవారు చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు.  అలాగే బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన బుధవారం (అక్టోబర్ 1)న శ్రీవారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది.  

మహాగౌరి అలంకరణలో శ్రీశైలం భ్రమరాంబికాదేవి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదవ రోజు మంగళవారం (సెప్టెంబర్ 30) భ్రమరాంబికాదేవి మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాగౌరి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి , బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు, వేదపండితులు వేదమంత్రాలతో, మంగళవాయిద్యాల నడుమ, సుగంధ ద్రవ్యాలతో, ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీ భ్రమరాంబికాదేవి మహాగౌరి అలంకారంలో అలానే శ్రీమల్లికార్జునస్వామి అమ్మవారు నందివాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చారు. పూజల అనంతరం వర్షం కారణంగా శ్రీస్వామి అమ్మవారికి ఆలయ పురవీధుల్లో జరగవలసిన గ్రామోత్సవం నిలుపదల చేశారు. ఆలయ ప్రాకారం లోనే స్వామి అమ్మవార్ల ఉత్సవం నిర్వహించారు. గ్రామోత్సవం రద్దు కావడంతో ఆలయంలోనే ఉత్సవాల సందర్భంగా కేరళ చండీమేళం, కేరళ సంప్రదాయ డ్రమ్స్,కొమ్ము కోయ నృత్యం,థయ్యం సంప్రదాయ నృత్యం, విళక్కు సంప్రదాయ నృత్యం,స్వాగత నృత్యం, సంప్రదాయ నాట్యల భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పూజా కార్యక్రమాలలో ఈవో శ్రీనివాసరావు దంపతులు అర్చకులు,ఆలయ అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ కు ఎనిమిది కొత్త ఎయిర్ పోర్టులు

ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన కనెక్టివిటీ విస్తరణ శరవేగంగా సాగుతోంది, రాష్ట్రానికి ఎనిమిది కొత్త విమానాశ్రాయాలు రానున్నాయి.  ఇవి రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో గ్రామీణ ప్రాంతాలను అనుసం ధానిస్తాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణ, వాణిజ్య సదుపాయం గణనీయంగా మెరుగుపడుతుంది. రాష్ట్రంలో కొత్తగా  శ్రీకాకుళం, తుని, తాడేపల్లిగూడెం, అమరావతి, ఒంగోలు, దగదర్తి, కుప్పం, నాగార్జున సాగర్‌లలో  విమానాశ్రయాలు రానున్నాయి.  మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, లోకల్   ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపడమెరుగుపరచడం లక్ష్యంగా కొత్త విమానాశ్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప, రాజమండ్రి, వైజాగ్‌లలో ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి.  మరో ఎనిమిది విమానాశ్రాయాలు త్వరలో రానున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల సంఖ్య 14కు పెరుగుతుంది. ఇక వీటికి తోడు.. విమానయాన రంగంలో వివిధ శాఖల నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలోజీఎంఆర్ ఏవియేషన్ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. ఇది విమానయానరంగానికి అవసమైన నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందించేందుకు దోహదపడుతుంది. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాలను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కానీ నిర్వహిస్తాయి.  రాష్టరంలో ప్రస్తుతం ఉన్న ఎయిర్ పోర్టులలో విజయవాడ , విశాఖపట్నం తిరుపతిలు అంతర్జాతీయ విమానాశ్రయాలు కాగా మిగిలినవి లోకల్ ఎయిర్ కనెక్టివిటీకి దోహదం చేస్తున్నాయి.   

సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్పస్వామి

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల  వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఏడవ రోజు మంగళవారం (సెప్టెంబర్ 30) ఉదయం శ్రీవారు సూర్యప్రభ వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఇక రాత్రి  చంద్రప్రభ వాహనాలపై ఊరేగి భక్తులకు కనువిందు చేయనున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా గత ఆరు రోజుల్లో  గరుడ వాహనంతోపాటు వివిధ వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చిన మలయప్పస్వామి ఆరో రోజైన సోమవారం రాత్రి గజవాహనంపై  మాడ వీధుల్లో ఊరేగారు. అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు స్వామివారిని వాహ‌న‌సేవ‌లో ద‌ర్శించుకున్నారు. 

వరద గుప్పిట్లోనే తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాలను వర్షాలూ వదలడం లేదు. వరదా విడవడం లేదు. వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయని అనుకునే లోగానే.. ఉత్తరాంధ్ర పరిసరప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం ప్రభావంతో అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో  మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇలా ఉండగా, కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం కొనసాగుతోంది.  సోమవారం సాయంత్రానికి  ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.61,960 క్యూసెక్కులుగా ఉంది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  ఇక గోదావరికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 45,70 అడుగులు ఉండగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 9 లక్షల 71 వేల 784 క్యూసెక్కులు ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  ఇక్కడ కూడా వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.బుధవారం నాటికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం 12 నుంచి 12,5 క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.  వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కృష్ణా, గుంటూరు, బాపట్ల, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కర్నూలు జిల్లాల్లో    సహాయక చర్యల కోసంఎన్డీఆర్ఎఫ్,  ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు.  

హస్తినకు ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం (సెప్టెంబర్ 30) ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.  మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకోనున్న ఆయన విశాఖలో వచ్చే నెల 14, 15 తేదీల్లో సీఐఐతో కలిసి నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తారు. భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాల్లోని పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం రోడ్‌షోలు నిర్వహిస్తూ ఇప్పటికే పారిశ్రామిక వేత్తలను  ఏపీకి ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో   ఐటీసీ మౌర్యలో జరిగే ఈ పార్టనర్ షిప్ కర్టెన్ రైజన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం ఆయన కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ లతో భేటీ అవుతారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేసి బుధవారం (అక్టోబర్1)న ఢిల్లీ నుంచి నేరుగా   విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ నుంచి గజపతి నగరం దత్తి గ్రామం  వెడతారు. ఆ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత అమరావతి చేరుకుంటారు.  

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచీ కూడా భక్తులు తిరుమలేశుని దర్శనానికి వస్తుంటారు. అటువంటి తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్త జన సంద్రంగా మారింది. మంగళవారం (సెప్టెంబర్ 30) ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శానిని 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక సోమవారం (సెప్టెంబర్ 29) శ్రీవారిని 81 వేల 526 మంది దర్శించుకున్నారు. వారిలో 25 వేల 304 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 14 లక్షల రూపాయలు వచ్చింది. 

బీఆర్‌ఎస్ పార్టీ కోసం 20 ఏళ్లు నా జీవితాన్ని దారబోశా : కవిత

  లండన్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతామని అభిమానులతో కవిత అన్నారు. తెలంగాణ, బీఆర్‌ఎస్ పార్టీ కోసం 20 ఏళ్లు నా జీవితాన్ని దారబోశానని తెలిపారు. లండన్‌లోని తెలంగాణ ప్రవాసులతో కవిత ముఖాముఖి మాట్లాడారు. తెలంగాణ జాగృతిని దేశానికి రోల్‌ మోడల్‌గా నిలపాలన్నదే సంకల్పమని చెప్పారు. సామాజిక తెలంగాణ కోసం జాగృతి పనిచేస్తుందన్నారు.. నా వెనక ఏ జాతీయ పార్టీ లేదు.. జాతీయ పార్టీల్లో చేరే ఆలోచ లేదని కవిత అన్నారు. పార్టీ లోపల చీలికలు రాకూడదని ఎన్నో ఇబ్బందులు భరించాను. ఆ సమయంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నాను. నా ఓటమి నుంచి 2023 శాసన సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి వరకు కుట్రలే కొనసాగాయి. అయితే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లోనే మాట్లాడాల్సి వచ్చింది. ఈ విషయాలు ప్రజల్లోకి వచ్చిన తర్వాత స్పందించకపోతే సరికాదు. అందుకే నా అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాను. పార్టీ నన్ను అక్కర్లేదనుకుంది కాబట్టే.. నేను కూడా పార్టీ ఇచ్చిన పదవిని వదిలేశాని కవిత పేర్కొన్నారు. నియమావళి ప్రకారం రాజీనామా చేశాను. కానీ, ఇంకా శాసన మండలి ఛైర్మన్‌ ఆమోదించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నేను ఈ స్థితికి రావడానికి కారణం అవతలి వాళ్లే. కష్టమని తెలిసినా మాజీ సీఎం కేసీఆర్‌ బిడ్డగా ధైర్యంగా ముందుకు వెళ్తాను. జైలు జీవితం నాలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అది నన్ను సమూలంగా మార్చేసింది. నిజమైన మార్పు కోసం తెలంగాణ ఉద్యమకారులు ఒక్కటై పనిచేయాలి’’ అని కవిత అన్నారు.