వరద పరిస్థితిపై సీబీఎన్ సమీక్ష, రిజర్వాయర్లు, చెరువులూ నింపాలని ఆదేశం

గోదావరి, కృష్ణా నదులకు వరద, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో  వర్చువల్ గా సమీక్షించారు.  డైనమిక్ ఫ్లడ్ మేనేజ్ మెంట్, నీటి వనరుల సంపూర్ణ వినియోగంపై ఆయనీ సందర్భంగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.  ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని రియల్ టైమ్ లో ఎస్టిమేట్ చేసి.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  అదే విధంగా కురిసిన వర్షాన్ని రెయిన్ గేజెస్ ద్వారా గణించి... వరద యాజమాన్యం పకడ్బందీగా చేయాలని చంద్రబాబు ఆదేశించారు.  అన్ని రిజర్వాయర్లను పూర్తిగా నింపాలని, అలాగే చెరువులను నీటితో నింపాలన్నారు.   ఇలా ఉండగా  ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 6.57 లక్షల క్యూసెక్కుల వరద ఉందని అధికారులు తెలిపారు. వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి పంపుతున్నట్లు వివరించారు. ఇక సోమవారం (సెప్టెంబర్ 29) దాదాపు  7 లక్షల క్యూసెక్కులకుపైగా వరద రావొచ్చని అంచనా వేస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా చంద్రబాబుకు వివరించారు.  శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందన్నారు. అదే విధంగా  ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం  10.12 లక్షల క్యూసెక్కులు ఉందనీ, ఇది మరింత పెరిగి   11.50 లక్షల క్యూసెక్కు చేరే అవకాశం ఉందన్నారు.   చెరువులు నింపడంతో పాటు భూగర్భ జలాల పెంపునకు అవసరమైన అన్ని ప్రణాళికలు అమలు చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అలాగే  వరదల కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలనీ,  వరద ప్రభావిత ప్రాంతాల్లో  అన్ని శాఖల అధికారులూ  సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలన్నారు. 

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఈ సారి చర్చిలో

అమెరికాలో  మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మిషిగాన్ లోని గ్రాండ్ బ్లాంక్ లో ఆదివారం (సెప్టెంబర్ 28)న ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. చర్చిలో ఆదివారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి కారులో నేరుగా చర్చిలోకి దూసుకొచ్చి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో  ముగ్గురు మరణించగా, మరో తొమ్మండుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పులలో నిందితుడు కూడా హతమయ్యాడు.   కాగా దుండగులు కాల్పులు జరిపిన అనంతరం చర్చికి నిప్పుపెట్టాడు. దీంతో చర్చిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

పరామర్శలోనూ ప్రగతి, సంక్షేమంపైనే చర్చలు!

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్ర, ప్రగతి, ప్రజా సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యత తెలిసిందే. ఈ విషయంలో కూటమి భాగస్వామ్య పార్టీల నేతల చిత్తశుద్ధికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే సంఘటన ఆదివారం (సెప్టెంబర్ 28) చోటు చేసుకుంది. గత ఐదారు రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతూ హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్ ను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా కూడా ఇరువురి మధ్యా అధికారిక కార్యక్రమాలపైనా, రాష్ట్రప్రగతి, ప్రజాసంక్షేమంపైనే చర్చ జరిగింది. తొలుత చంద్రబాబు పవన్ కల్యాణ్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇందుకు పవన్ కల్యాణ్ జ్వరం నియంత్రణలోకి వచ్చిందనీ, అయితే దగ్గు మాత్రం తగ్గలేదనీ చెప్పారు. అక్కడితో ఆగకుండా గత ఐదు రోజులుగా తాను అధికారిక కార్యక్రమాలలో పాల్గొన లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరిరువురి మధ్యా అక్టోబర్ మాసంలో కూటమి ప్రభుత్వం చేపట్టనున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది.   వీరిరువురి మధ్యా భేటీలో మెగాడీఎస్సీ సక్సెస్ ప్రస్తావన కూడా వచ్చింది.  అలాగే వచ్చే నెల 4 నుంచి ప్రారంభించనున్న ఆటో డ్రైవర్ల సేవలోపథకం, . స్త్రీ శక్తిద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర అంశాలపై చర్చించారు.  అదే విధంగా వచ్చే నెల 16న ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనపై కూడా చర్చ జరిగింది.  

ట్రోఫీ లేకుండానే టీమ్ ఇండియా సంబరాలు.. ఎందుకంటే?

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో దాయాది దేశాన్ని టీమ్ ఇండియా మూడు సార్లు మట్టి కరిపించింది. కాగా ఈ టోర్నీ మొత్తం పాకిస్థాన్ జట్టు వ్యవహరించిన తీరు అత్యంత వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కనీస క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించకుండా పాకిస్థాన్ జట్టు,  పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ వ్యవహరించిన   తీరు పట్ల క్రీడా పండితులు విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయెబ్ అక్తర్ అయితే.. పాక్ జట్టు గెలవడం మరిచిపోయిందన్నారు.  అదలా ఉంచితే ఇండియాపై ఒక్క టోర్నీలోనే హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసిన పాకిస్థాన్.. ఫైనల్ లో ఓటమిని జీర్ణించుకోలేకపోయింది. ప్రజంటేషన్ సెర్మనీలో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ రన్నరప్ గా నిలిచినందుకు అందించిన చెక్ ను తీసుకున్న వెంటనే పక్కకు విసిరేశాడు.  అంతకు ముందు మ్యాచ్ ముగిసిన తరువాత ప్రజంటేషన్ సెర్మనీకి చాలా చాలా జాప్యం జరిగింది. ఇందుకు కారణం పాకిస్థాన్  క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ చేతుల మీదుగా ఆసియా కప్ టోర్నీ విజేతలకు ట్రోఫీ అందజేయాలని ఐసీపీ తీసుకున్న నిర్ణయం. అయితే భారత్. పాకిస్థాన్ జట్ల మధ్య దౌత్య సంబంధాలు సరిగా లేని విషయాన్ని ప్రస్తావిస్తూ టీమ్ ఇండియా పీసీబీ చైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోలేమని నిర్వాహకులకు ముందుగానే తెలియజేసింది. ఈ విషయమై చర్చోపచర్చలు జరగడంతో ప్రజంటేషన్ సెర్మనీకి మ్యాచ్ పూర్తియిన తరువాత గంటకు పైగా సమయం పట్టింది. చివరకు ప్రజంటేషన్ సెర్మనీకి పీసీబీ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ వేదికమీదకు వచ్చారు.   సరే దీనికి ప్రతిగా భారత్ కూడా దీటుగా స్పందించింది. పీసీబీ చైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి నిర్ద్వంద్వంగా నిరాకరించింది. దీంతో ఆయన అలిగారు. ట్రోఫీతో సహా వేదికపై నుంచి వెళ్లిపోయారు. అయినా టీమ్ ఇండియా ఖాతరు చేయలేదు. ట్రోఫీ చేతులో లేకుండానే సంబరాలు చేసుకుంది.  

ఫైనల్ లో పాక్ పై విజయం.. ఆసియాకప్ విజేత టీమ్ ఇండియా

ఆసియాఆసియా కప్ ఫైనల్ లో పాకిస్థాన్ ను చిత్తు చేసి టీమ్ ఇండియా విజేతగా నిలిచింది. దుబాయ్ లోని రింగ్ ఆప్ ఫైర్ స్టేడియంలో  ఆదివారం (సెప్టెంబర్ 28) జరిగిన ఫైనల్ లో టీమ్ ఇండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ఆసియాకప్ చాంపియన్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో  ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ కు అద్భుత ఆరంభం లభించింది. అయితే ఆ తరువాత టీమ్ ఇండియా బౌలర్లు అద్భుతంగా పుంజుకుని పాకిస్థాన్ ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. పాకిస్థాన్ ఓపెనర్లు భారత బౌలింగ్ అటాక్ ను సమర్థంగా ఎదుర్కొన్నారు. పాకిస్థాన్ తొలి వికెట్ 84 పరుగుల వద్ద పడింది. 57 పరుగులు చేసిన ఫారన్ ను వరుణ్ వర్మ ఔట్ చేశారు. ఆ తరువాత పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కోల్పోయింది. భారత బౌలర్లలో కులదీప్ యాదవ్: 4 వికెట్లు తీయగా, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రెండెసి వికెట్లు తీసుకున్నారు. ఇక స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమ్ ఇండియా త్వరత్వరగా మూడు వికెట్లు కోల్పోయింది. 20 పరుగులకే కీలకమైన అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, స్కిప్పర్ సూర్యకుమార్ యాదవ్ వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడింది. అయితే హైదరాబాద్ కుర్రోడు తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్ తో టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చాడు. తిలక్ వర్మకు సంజు శాంసన్, శివమ్ దుబెలు చక్కటి సమకారం ఇచ్చారు. తిలక్ వర్మ 69 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ విజయంతో భారత్‌ తొమ్మిదోసారి ఆసియాకప్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది.  ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. మూడుసార్లూ భారత్ విజయం సాధించింది. అయితే ఫైనల్ మ్యాచ్ లో మాత్రం పాకిస్థాన్ గట్టిగా పోరాడింది. మ్యాచ్ ను చివరి ఓవర్ వరకూ తీసుకు వెళ్లింది.  

కిక్కిరిసిన తిరుమల కొండ...ప్రైవేట్ వాహనాలకు నో ఎంట్రీ

  శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవను తిలకించేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు. మాడ వీధుల గ్యాలరీలు పూర్తిగా నిండిపోవడంతో మరింత మంది భక్తులను లోపలికి అనుమతించలేదు. దీంతో మేదర మిట్ట, నందకం, లేపాక్షి ప్రాంతాల వరకు భక్తులు బారులు తీరారు. అనూహ్యంగా పెరిగిన రద్దీ కారణంగా అలిపిరి ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. కార్లు, బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు కిలోమీటర్లకొద్దీ నిలిచిపోయాయి.  దీంతో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. భద్రతా పరంగా అలిపిరి టోల్‌గేట్ వద్ద టీటీడీ విజిలెన్స్, పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కొండపైకి అనుమతిస్తున్నారు. ఈ చర్యలతో వాహనాల కదలిక నెమ్మదించినప్పటికీ, స్వామివారి సేవ కోసం భక్తులు ఓపికతో వేచి చూశారు. ఈ భారీ రద్దీని అదుపు చేసేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. నాలుగు మాడ వీధులు భక్తులతో నిండిపోయాయి. గరుడ సేవను సమీపం నుంచి చూడాలనే ఉత్సాహంతో వేలాది మంది భక్తులు శనివారం రాత్రి నుంచే గ్యాలరీలలో స్థానం దక్కించుకుని రాత్రంతా జాగారం చేశారు. చలి వాతావరణాన్ని పట్టించుకోకుండా ఎదురుచూస్తున్న వారికి టీటీడీ సిబ్బంది పాలు, బిస్కెట్లు, తాగునీరు అందించారు. భక్తుల భద్రత, సౌకర్యం కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా మాడ వీధులలో శాంతిభద్రతలు కాపాడేందుకు 64 మంది ప్రత్యేక సిబ్బంది, 14 మంది అధికారులు నియమించారని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కఠినమైన భద్రతా చర్యలు అమలు చేశారు.  

బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్

  భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ ఎన్నికయ్యారు.ఇవాళ బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) ఆయన ఎంపికను అధికారికంగా ప్రకటించారు. సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీ తర్వాత ఈ పదవిని అలంకరించిన మూడో మాజీ క్రికెటర్‌గా 45 ఏళ్ల మన్హాస్ నిలిచారు. గత ఆగస్టులో రోజర్ బిన్నీ రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. అప్పటి నుంచి రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) నుంచి మిథున్ మన్హాస్ పేరు నామినేట్ చేయబడగా, చివరికి ఏజీఎంలో ఆయన అధికారికంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో ఇతర కీలక పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. వైస్ ప్రెసిడెంట్‌గా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా దేవాజిత్ సైకియా కొనసాగగా, సంయుక్త కార్యదర్శిగా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా, కోశాధికారిగా రఘురామ్ భట్ కొత్తగా బాధ్యతలు చేపట్టారు. మన్హాస్ నియామకంపై కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఆనందం వ్యక్తం చేస్తూ, “జమ్మూకశ్మీర్‌లోని దూరప్రాంతం దోడాకు చెందిన మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చారిత్రక ఘట్టం” అని వ్యాఖ్యానించారు. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ తరఫున 147 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 9,714 పరుగులు చేసిన మన్హాస్, అనంతరం జమ్మూకశ్మీర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి కోచ్‌గా కూడా సేవలందించారు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, పుణె వారియర్స్ ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున ఆడిన ఆయన, తన అనుభవం, మృదుస్వభావం వల్ల భారత క్రికెట్‌కు కొత్త దిశనిస్తారని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో గ్రూపు-2 ఫలితాలు రిలీజ్

  తెలంగాణలో గ్రూపు-2 ఫలితాలు విడుదల అయ్యాయి. టీజీపీఎస్సీ  చైర్మన్ బుర్రా వెంక‌టేశం రిజల్ట్స్ రిలీజ్ చేశారు. మొత్తం 783 పోస్టులకుగానూ ఎంపికైన 782 మంది జాబితాను వెల్లడించింది. ఒక్క పోస్టును కోర్టు కేసు కారణంగా పెండింగ్‌లో ఉంది. మొత్తం 18 కేట‌గిరిల‌కు సంబంధించి.. ఎంపికైన వారి జాబితాను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన‌ట్లు పేర్కొన్నారు.  ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి. https://www.tspsc.gov.in/ కాగా, 783 పోస్టులకు గాను 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి మూడు దశల్లో ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను పూర్తి చేశారు. సెప్టెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. తుది ప్రక్రియ అంతా ముగియడంతో.. ఈ గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన అంతిమ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేశారు. తర్వాత వెను వెంటనే గ్రూప్ 3 ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్రూప్-2 నోటిఫికేష‌న్‌ను 2022లో విడుద‌ల చేయ‌గా, 2024 డిసెంబ‌ర్ 15, 16 తేదీల్లో రాత‌ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. దాదాపు 2,49,964 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే.. ఓఎంఆర్‌ పత్రాల్లో లోపాలు, బబ్లింగ్ సరిగా చేయకపోవడం వంటి కారణాలతో 13,315 మందిని కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. మిగిలిన 2,36,649 మంది అభ్యర్థులకు సంబంధించిన మార్కులు, జనరల్ ర్యాంక్ లిస్ట్‌ను ఈ ఏడాది మార్చి 11న టీజీపీఎస్సీ విడుదల చేసింది.

పవన్‌‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

  గత ఐదు రోజులుగా వైరల్‌ ఫీవర్ బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను, సీఎం చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్‌ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. డాక్టర్లు విశ్రాంతి అవసరమని సూచించినప్పటికీ మంగళవారం శాఖాపరమైన అంశాలపై అధికారులతో డిప్యూటీ సీఎం టెలికాన్ఫరెన్సులు నిర్వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది.  తొలి మూడ్రోజుల్లోనే దాదాపు రూ.250 కోట్ల కలెక్షన్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆదివారం సెలవుదినం కావడంతో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా సోమవారం నాటికి రూ.300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని సినీ వర్గాలు తెలిపాయి. పవన్‌ కల్యాణ్‌ వైరల్‌ జ్వరంతో బాధపడుతున్నట్లు ఐదు రోజుల క్రితం ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.  

శ్రీలంక నుంచి కాకినాడ మత్స్యకారుల విడుదల

  శ్రీలంక జాఫ్నా జైల్లో నిర్బంధంలో ఉన్న నలుగురు కాకినాడ జాలర్లు స్వదేశానికి తిరుగు పయనం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ భవన్ నుంచి జాలర్ల విడుదలకు తక్షణ చర్యలు చేపట్టడంతో ఈనెల 26న నలుగురు జాలర్లను శ్రీలంక కోస్ట్ గార్డ్ సిబ్బంది భారత్ కు అప్పగించారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ సమీపంలోని మండపం వద్ద శ్రీలంక కోస్ట్ గార్డు సిబ్బంది ఈ నలుగురిని  భారత్ కోస్ట్ గార్డ్ కు అప్పగించారు. తమిళనాడు లోని మండపం నుంచి  నౌకలో బయలుదేరిన నలుగురు మత్స్యకారులు ఈనెల 30న కాకినాడకు చేరుకోనున్నారు.   2025 ఆగస్టు 3 తేదీన కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు — కె. శ్రీను వెంకటేశ్వర్, కర్రినోకరాజ్ బొర్రియా, చందా నాగేశ్వరరావు, బ్రహ్మనందంలు పడవ కొనుగోలు చేయడానికి నాగపట్నంకు బయలుదేరారు. తిరిగి ప్రయాణించే సమయంలో నావిగేషన్ లోపం కారణంగా శ్రీలంక జలాల్లోకి కొట్టుకుపోయి, జాఫ్నా తీరం సమీపంలోకి చేరుకున్నారు. వారిని శ్రీలంక నౌకాకాదళం అదుపులోకి తీసుకొని, జాఫ్నా పోలీసులకు అప్పగించింది.  2025 ఆగస్టు 4వ తేదీ నుంచి ఈ నలుగురు మత్స్యకారులు ఏడు వారాలకు పైగా జాఫ్నా జైలులో ఉన్నారు. 52 రోజులుగా జాఫ్నా జైల్లో నిర్బంధంలో ఉన్న నలుగురిని స్వదేశానికి తిరిగి రప్పించే అంశంపై ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు జాఫ్నాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా నిరంతర సంప్రదింపులు చేశారు.  ఢిల్లీ లోని కోస్ట్ గార్డ్ కార్యాలయం ద్వారా నలుగురు  మత్స్యకారులను స్వదేశానికి రప్పించేలా ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ మంతనాలు జరిపారు. ఈ మేరకు ఈ నెల 26 తేదీన శ్రీలంక అధికారులు నలుగురు మత్స్యకారులను భారత్‌కు అప్పగించారు. ఏపీ ప్రభుత్వం తక్షణం స్పందించి సంప్రదింపులు చేయకపోతే ఈ నలుగురు మరో ఆరు నెలల పాటు జాఫ్నా జైల్లో గడపాల్సి వచ్చేదని అధికారులు చెప్తున్నారు.

న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతా : సీఎం రేవంత్‌

  భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.  రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ భవనం, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్-1 నిర్మాణాలకు శంకుస్థాపన ముఖ్యమంత్రి చేశారు. తనకు ఇక్కడ భూములు ఉన్నాయని అందుకే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నరని కొందరు అంటున్నారు. నాకు భూములు ఉంటే అందరికీ కనిపిస్తాయి. దాచిపెడితే దాగవు అని తెలిపారు.  ఎన్నాళ్లుగా న్యూయార్క్, సింగపూర్, దుబాయ్, గురించి చెప్పుకొంటాం మనం కూడా అలా తయారు కావాలి కదా నాకు పదేళ్లు సమయం ఇవ్వండి..న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతామని రేవంత్ తెలిపారు.  విజయదశమి రాష్ట్ర ప్రజలకు అన్ని విజయాలను చేకూరుస్తుందని అన్నారు. కుతుబ్ షాహీలు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే, వైఎస్సార్, చంద్రబాబు దాన్ని కొనసాగించారు.ఆ నాయకులు ఆలోచన చేశారు కాబట్టే ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడుతున్నామని, వారు మనకెందుకులే అనుకుంటే ఓఆర్ఆర్, శంషాబాద్, హైటెక్ సిటీ వచ్చేవి కాదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు.  ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ కల్పిస్తున్నామని, ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి కేంద్రాన్ని ఒప్పించామని, అమరావతి నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్  వస్తుందని, చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామని, కోర్టుల చుట్టూ తిరిగి నష్టపోవొద్దని, అందరిని ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు.  

లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ బాబా అరెస్ట్

  విద్యార్ధులను లైంగిక వేధించిన కేసులో చైతన్యానంద సరస్వతిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతడిని ఇవాళ తెల్లవారుజామున ఆగ్రాలో పోలీసులు అరెస్ట్ చేశారు. నైరుతి ఢిల్లీలోని శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్‌లో చదువుతున్న విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని  చైతన్యానంద సరస్వతిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.  మార్చి 2025లో ఒక విద్యార్థి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు దర్యాప్తు సందర్భంగా సంచలన విషయాలు బయటపడ్డాయి. మొత్తం 17 మంది విద్యార్థినులపై వేధింపులు జరిగినట్టు తేలడంతో, చైతన్యానంద పారిపోయాడు. అరెస్టు తప్పించుకోవడానికి చైతన్యానంద ముందస్తు బెయిల్ పిటిషన్ వేశాడు. కానీ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు దాన్ని తిరస్కరించింది.  విచారణలో అతను తాను ఐక్యరాజ్యసమితి ప్రతినిధినని చెప్పుకున్నాడని పోలీసులు కోర్టులో వెల్లడించారు. ఈ కేసు నేపథ్యంగా, చైతన్యానందకు చెందిన 18 బ్యాంకు ఖాతాలు, రూ.8 కోట్లు, 28 ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్తంభింపజేశారు. ఈ నిధులు అతను పార్థసారథి పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్ట్‌తో ముడిపడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థినులు ఫిర్యాదులో, రాత్రిపూట తమను బలవంతంగా చైతన్యానంద గదికి పిలిపించి శారీరక సంబంధానికి ఒత్తిడి చేసేవాడని చెప్పారు.  హాస్టల్ గదుల్లో సీసీటీవీలు అమర్చడం, విదేశీ పర్యటనలకు బలవంతం చేయడం, నకిలీ వాహన నంబర్ ప్లేట్లు వాడటం, మతాన్ని కవచంగా చేసుకుని మోసాలు చేయడం వంటి అంశాలు కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. ఒక విద్యార్థిని తనను బలవంతంగా మధురకు తీసుకెళ్లారని పేర్కొంది. ఈ ఆరోపణలన్నింటిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు, స్వామి చైతన్యానందపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు

  తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.  వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. మోహినీ అవతారం – మాయా మోహ నాశ‌నం ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు. వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల పెద్ద‌జీయ‌ర్‌స్వామి,  చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ చైర్మన్  బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. గ‌రుడ వాహ‌నం సాయంత్రం 6:30 గంటలకు విశేష‌మైన గరుడవాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు కటాక్షిస్తారు. గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.  

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో వన్యప్రాణులు

  ఎయిర్ పోర్ట్ లో అధికారులేకాక మరెవరికి కూడా ఎటువంటి అనుమానం కలగదని భావిస్తారో ఏమో తెలియదు కానీ... ఈ స్మగ్లర్లు ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ అక్రమంగా స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ వారి ఎత్తులను చిత్తు చేస్తూ అధికా రులు ఎంతో చాక చక్యంగా వారిని పట్టుకుని కటకటాల వెనక్కి పంపిస్తుంటారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి బ్యాగ్ లో ఉన్న వాటిని చూసి అధికారులు ఆశ్చర్యచకితులయ్యారు.... చివరకు ప్రయాణికుడిని అదుపులోకి తీసు కొనిజైలుకు పంపారు.  బ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన ఓ వ్యక్తి అటు... ఇటు చూస్తూ  కంగారుగా నడుచుకుంటూ వెళ్తుండగా కస్టమ్స్ అధికారులకు అతనిపై అను మానం కలిగింది... దీంతో అధికారులు వెంటనే అతన్ని ఆపి అతని బ్యాగును తెరిచి చూసి....షాక్ కు గురయ్యారు... బ్యాగులో వన్యప్రా ణులు ఉన్నాయి... ఎయిర్ పోర్ట్ లో ఉండే కస్టమ్స్ అధికారులకు ఎటువంటి అనుమానం కలగకుండా.... ఈ ప్రయాణికుడు బ్యాంకాక్ నుండి  వన్యప్రాణు లను బ్యాగ్ అడుగు భాగంలో పెట్టుకొని  శంషాబాద్ ఎయి ర్పోర్ట్ కు వచ్చాడు.  కానీ చివరకు అధికారుల చేతికి చిక్కాడు. అధికా రులు అతన్ని అదుపులోకి తీసు కొని అతని వద్ద నున్న ఒక మానిటర్ బల్లి, ఒక రెండు తెల్ల ఎర్ర చెవి స్పైడర్ తాబేలు, నాలుగు ఆకుపచ్చ ఇగువాన, 12 ఇగువానాస్ స్వాధీ నం చేసుకున్నారు. అనంతరం అధికారులు ఈ వన్య ప్రాణులను తిరిగి బ్యాంకాక్ కు తర లించారు. ప్రయాణి కుడిని అరెస్టు చేసి... ఇతను హైదరా బాద్‌కు వన్యప్రాణు లను ఎందుకు తీసుకో వచ్చాడు? ఎవరి కోసం తీసుకోవ చ్చాడు? అనే కోణంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు.

తమిళనాడు తొక్కిసలాటపై నలుగురిపై కేసు నమోదు

  తమిళనాడు కరూర్‌లో విజయ్‌ టీవీకే వ్యవస్థాపకుడు నిర్వహించిన ర్యాలీకి అనుమతులు 10,000 మందికే తీసుకున్నట్లు డీజీపీ జి. వెంకట్రామన్‌ వెల్లడించారు. అయితే సోషల్‌ మీడియాలో తప్పుదోవ పట్టించే ప్రకటనల కారణంగా ఫ్యాన్స్ ముందుగానే భారీ సంఖ్యలో హాజరయ్యారని చెప్పారు. రాత్రి 7.30 గంటలకు విజయ్‌ రాకముందే జనసందోహం ఏర్పడి తొక్కిసలాట జరిగింది.  అధికారులు ఈ కార్యక్రమానికి 1.2 లక్షల చదరపు అడుగుల స్థలం కేటాయించినప్పటికీ, ఊహించిన దానికంటే ఎక్కువ మంది రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని ఆయన వివరించారు. ఘటన స్థలానికి వెంటనే 2,000 మంది సిబ్బంది, సీనియర్‌ పోలీసు అధికారులను పంపించామని, ఒకే సభ్య కమిషన్‌తో దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. విజయ్‌ సహాయకులపై కేసు ఈ ఘటనలో విజయ్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్‌, జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ నిర్మల్‌ కుమార్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు లా అండ్‌ ఆర్డర్‌ ఏడీజీపీ ఎస్‌. డేవిడ్‌సన్‌ ధృవీకరించారు. ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. అలాగే మెగాస్టారక సినీ నటుడు చిరంజీవి ఎక్స్‌లో స్పందిస్తూ – “కరూర్‌ ర్యాలీ దుర్ఘటన బాధాకరం. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి” అని పేర్కొన్నారు.

తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా

తమిళనాడులోని కరూర్‌లో తన ప్రచారసభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.  నా హృదయం ముక్కలైంది. నేను భరించలేని బాధ, దుఃఖంలో ఉన్నాను. ఆ బాధ పదాల్లో వర్ణించలేనిది. కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని విజయ్‌ పేర్కొన్నారు. తమిళనాడు కరూర్‌లో విజయ్‌ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది.  ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 40 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. విజయ్‌ సభకు మధ్యాహ్నం చేరుకోవాల్సి ఉండగా, ఆరు గంటల ఆలస్యంగా రాత్రి వేళ ర్యాలీకి హాజరయ్యారు. ఈలోపు భారీ సంఖ్యలో జనాలు కూడగట్టుకోవడంతో అనూహ్య పరిస్థితి ఏర్పడింది.  విజయ్‌ ప్రసంగం ప్రారంభమైన క్షణాల్లోనే ఆయనను దగ్గరగా చూడాలన్న ఉత్సాహంతో కొందరు ముందుకు దూసుకెళ్లారు. ఫలితంగా పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఘటనపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. తొక్కిసలాట ఘటన స్ధలికి వెళ్లాలా? వద్ద అనే విషయంపై సమాలోచనలు జరుపుతున్నారు. అక్కడికి వెళ్లే వచ్చే  వచ్చే సెక్యూరిటీ సమస్యలు, వెళ్లకపోతే ఎదురయ్యే రాజకీయ విమర్శలను ఎలా ఎదర్కోవాలనే దానిపై  పార్టీనేతలతో చర్చిస్తున్నారు  

ఈనెల 30న సద్దుల బతుకమ్మ... ప్రభుత్వం కీలక నిర్ణయం

  రాష్ట్ర పండుగ సద్దుల బతుకమ్మపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30వ తేదీన సద్దుల బతుకమ్మ పండుగను అధికారికంగా జరుపుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు, అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు అందాయి. తెలుసుకున్నట్లుగా, ఈ నెల 21వ తేదీ ఆదివారం చిన్న బతుకమ్మ జరుపుకున్నారు. సాధారణంగా చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మ మధ్య తొమ్మిది రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన 29వ తేదీ సోమవారం సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని కొందరు భావించగా, మరికొందరు 30వ తేదీ మంగళవారం జరుపుకోవాలని సూచించారు. పూజారులు కూడా ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇక మరోవైపు, అక్టోబర్ 2న దసరా పండుగ జరుపుకోనున్నారు. అయితే అదే రోజు గాంధీ జయంతి కావడంతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం, మాంసం నిషేధం అమలులో ఉండనుంది.

ప్రాణం తీస్తోన్న అభిమానం

  చాలా మంది అంటుంటారు.. నువ్వంటే నాకు చ‌చ్చేంత అభిమాన‌మ‌ని. అది ఇదే. మ‌నం ఇటు హీరోలు, క్రికెట‌ర్లు కానీ, అటు దేవుళ్ల‌ను, లేదా ఇత‌ర‌త్రా కొన్ని కొన్ని విష‌యాల ప‌ట్ల పెంచుకునే అభిమానం కాస్తా ఇదిగో ఇలాంటి విషాద ఘ‌ట‌న‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. మొన్నంటే మొన్న త‌మ అభిమాన జ‌ట్టు బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ జ‌ట్టు ఐపీఎల్ క‌ప్పు కొట్టింద‌న్న ఒకే ఒక్క ఆలోచ‌న‌తో స్టేడియంకి వెళ్లి ఎంద‌రు చ‌నిపోయారో తెలిసిందే. ఈ మ‌ర‌ణాల విషాదం మ‌ర‌వ‌క ముందే మ‌రో తీవ్ర విషాదం. ఇప్పుడు చూస్తే ఇద‌య ద‌ళ‌ప‌తిగా అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకునే విజ‌య్ స‌భ‌కు వ‌చ్చిన వాళ్లు ఏకంగా 38 మంది స్పాట్ డెడ్ కాగా.. మ‌రి కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే క‌రూర్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు శోక సంద్రంలో మునిగిపోయింది. త‌మ త‌మ ఆశాజ్యోతులు ఆరిపోవ‌డంతో వారంతా క‌ల‌సి దీనంగా రోదిస్తుంటే.. దీనంత‌టికీ కార‌కుడైన విజ‌య్ కేవ‌లం ఒక గుండె ప‌గిలింద‌న్న ప్ర‌క‌ట‌న‌తో స‌రి పెట్టేశాడు. ఆ మాట‌కొస్తే మొన్నటి బెంగ‌ళూరు స్టేడియం ఘ‌ట‌న‌లో ఒక తండ్రి కొడుకును ఖ‌న‌నం చేసిన చోట నుంచి క‌ద‌ల‌కుండా ఏడ్చిన ఏడుపులు ఇప్ప‌టికీ క‌ర్ణాట‌క వాసుల గుండెల‌ను మెలిపెడుతూనే ఉన్నాయి. దేశ‌మంత‌టా కూడా ఆ తండ్రి దుఃఖం తీవ్రంగా లోచింప చేసింది. ఎవ్వ‌రూ కూడా ఆయ‌న క‌డుపుకోత‌కు మందు పూయ‌లేక పోయారు.    ఏం అభిమాన‌మిది? కోహ్లీ వ‌చ్చి ఆ తండ్రికి త‌న బిడ్డ‌ను అందివ్వ‌గ‌ల‌డా? ఇప్పుడు విజ‌య్ ప‌రిస్థితి కూడా అంతే ఏడుగురు చిన్న‌పిల్లలు చ‌నిపోయారు. ఒక సినిమా చేస్తే విజ‌య్ కి వంద కోట్ల‌యినా తిరిగి వ‌స్తాయోమో గానీ వీరి ప్రాణాలు తిరిగి తీసుకురావ‌డం సాధ్య‌మా? ఇటు పెద్ద‌ల‌కు కూడా బుద్ధి పాడు లేకుండా పోయింది. పిల్ల‌ల‌న్నాక సినిమా హీరోల‌ను ద‌గ్గ‌ర్నుంచి చూడాల‌ని మారాం చేస్తుంటారు. అలాగ‌ని ఇంత కిక్కిరిసే స‌భ‌లు త‌మ పిల్లా జెల్లా వెంట వేసుకుని రావ‌డ‌మేంటి?  పుష్ప 2 ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా జ‌రిగిన తొక్కిస‌లాట సంగ‌తి స‌రే స‌రి. ఆ త‌ల్లీ కొడుకుల జీవితాలు ఆగ‌మై పోయాయి. ఒక సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం. ఇప్పుడా తల్లి చ‌నిపోయిన కుర్రాడి ప‌రిస్థితేంటి? జీవిత‌మంతా ఆ త‌ల్లిలేని లోటుతో పాటు.. వెన్నంటే వ‌చ్చే ఆ విషాద జ్ఞాప‌కాలు, అది తెచ్చిన విప‌త్తును ఒక జీవిత కాల భారంగా భ‌రించాల్సిందేగా? దీనంత‌టికీ కార‌ణం పైసాకు ప‌నికిరాని అభిమానం. స‌రే ఇక్క‌డంటే మీరు సినిమా హీరోల‌ను ఆడి పోసుకుంటున్నారు. మ‌రి దేవుళ్ల ప‌రిస్థితేంటి? ఆయా ఉత్స‌వాలు, కుంభ‌మేళాల్లో పోయిన ప్రాణాలు ఎవ‌రి ఖాతాలో వేయాలి? అని అడిగే వారుండొచ్చు. ఇటీవ‌ల రెండు మూడు విషాద వార్త‌లు. ఒక‌టి తిరుమ‌ల శ్రీవారి వైకుంఠ ఏకాద‌శి తొక్కిస‌లాట కాగా, మ‌రొక‌టి సింహాచ‌లం అప్ప‌న్న గోడ కూలిన ఘ‌ట‌న‌.  ఇక కుంభ‌మేళా సంగ‌తి స‌రే స‌రి. ప‌విత్ర స్నానాల కోస‌మ‌ని వెళ్లిన వారు.. పై లోకాల‌కు చేరిపోయారు. కొంద‌రైతే తిరిగొస్తుండ‌గా జ‌రిగిన ప్ర‌మాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.   జ‌నం ఎక్కువ‌గా పోగ‌య్యే ఏ ప్రాంత‌మైనా స‌రే.. ఇదే ప‌రిస్థితి. ఎప్పుడేం జ‌రుగుతుందో చెప్పలేం. ప్రాణాలు అర‌చేత ప‌ట్టి బిక్కు బిక్కుమ‌నాల్సిందే. తిరిగి వ‌స్తామ‌న్న గ్యారంటీ లేదు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఇంట్లోంచి బ‌య‌ట‌కెళ్లి తిరిగి రావ‌డం ఏ మాత్రం న‌మ్మ‌కం లేని కండీష‌న్స్. స‌రే ఇదంటే బ‌తుకు పోరాటంలో త‌ప్ప‌దు. ఏదైనా ప‌నిబ‌డి, లేదా ఆఫీసు, స్కూలు, కాలేజీల‌కు వెళ్లి రావ‌డం అంటే త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితి. త‌మ త‌మ‌ అభిమాన క‌థానాయ‌కుడి స‌భ‌ల‌కు వెళ్ల‌డం, ఆ హీరో సినిమా విడుద‌లైతే ప్రీమియ‌ర్ షోల‌కు వెళ్ల‌డం, త‌మ క్రికెట్ హీరో క‌ప్పు కొట్టాడ‌న్న కోణంలో ఆయా విజ‌యోత్స‌వాల‌కు వెళ్ల‌డం.. వంటివి ఎంత చేటు తెస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇవేమైనా కూటికొచ్చేదా గుడ్డ‌కు వ‌చ్చేదా? అయినా స‌రే మ‌న‌సు ఆగ‌దు. అక్క‌డికెళ్లి ఏదో చూసెయ్యాల‌న్న త‌ప‌న తాప‌త్ర‌యం. వెంప‌ర్లాట‌. వెర‌సీ ప్రాణాల మీద‌కు తెస్తోన్న ప‌రిస్థితి.  ఆపై దైవ‌ ద‌ర్శ‌నాలు, కుంభ‌మేళాల‌కు వెళ్ల‌డం.. ఇదేం ఒక‌రొచ్చి చెప్పేది కాదు. ఆ మాట‌కొస్తే అక్క‌డికి వెళ్లాలన్న రూలు కూడా ఏమీ ఉండ‌దు. టీవీల్లోంచి చూసినా స‌రిపోతుంది. ఆ దేవుడు ఇందుగ‌ల‌డు అందులేడ‌న్న సందేహం లేదు. స‌ర్వాంత‌ర్యామి. ఇంట్లోంచి కొలిచినా ఇవ్వాల్సిన ఆశీస్సులు ఇస్తాడు.  కానీ వంద ఏళ్ల త‌ర్వాత వ‌చ్చే కుంభ‌మేళా అని, ఈ రోజు ద‌ర్శ‌నం చేస్తే మ‌న‌కు నేరుగా వైకుంఠ ప్రాప్తి అని.. ఇలా ఆయా ప్ర‌వ‌చ‌న క‌ర్త‌లు చెప్పింది విని.. వెళ్లిన వారి జీవితాల‌కు పుణ్యం రాక పోగా.. ఆయా కుటుంబాల్లో ఒక జీవితానికి స‌రిప‌డా విషాదం మాత్రం ఎదుర‌వుతోంది. వేలం వెర్రీ త‌నం త‌ల‌కెక్కి.. పిచ్చి పైత్యం ఎక్కువ‌య్యి.. ఇదిగో ఇంత‌టి తీవ్ర విషాదాన్ని కొని తెచ్చుకోవ‌డం మాత్రం నిజంగా చాలా చాలా బాధాక‌రం. ఇప్పటికి ఎన్ని ఘ‌ట‌న‌లు పున‌రావృతం అవుతున్నా.. వాటిని గ్ర‌హించ‌లేక పోవ‌డం మాత్రం బాధాక‌ర‌మేనంటారు ప‌లువురు సామాజిక వేత్త‌లు.

తిరుమలలో భక్తుల రద్దీ... దర్శనానికి 24 గంటలు

  తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ పెరిగింది. ఈ రోజు శ్రీవారి గరుడ వాహన సేవ జరుగనుండటంతో భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతోందని అధికారులు తెలిపారు. భక్తుల క్యూ కంపార్ట్ మ్మెంట్  దాటి ఆక్టోపస్ భవనం వరకు కొనసాగుతుంది. శనివారం శ్రీవారిని 75,006 మంది భక్తులు దర్శించుకోగా 45,413 మంది తలనీలాలు సమర్పించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చింది.  తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల కృష్ణారావు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వరలక్ష్మి శరత్ కుమార్  దంపతులు దర్శించుకున్నారు. భక్తులకు కూడా గరుడ వాహన సేవ దర్శనం కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని   టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి గరుడ వాహన సేవ దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. మూల విరాట్టు దర్శనం కోసం కూడా వేలాది మంది భక్తులు క్యూ లైనల్లో వేచి ఉన్నారని చెప్పుకొచ్చారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేసి.. సర్వదర్శనం క్యూ లైన్ గుండానే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నామని  ఈవో తెలిపారు.