అంతర్వేది వద్ద సముద్రం వెనక్కి.. సంకేతమేంటి?
posted on Sep 30, 2025 @ 12:40PM
కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్రం అనూహ్యంగా 500 మీటర్ల మేర వెనక్కు తగ్గింది. సోమవారం (సెప్టెంబర్ 29)న ఒక్కసారిగా సముద్రం వెనక్కు వెళ్లడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. నిత్యం ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతూ ఉండే అంతర్వేది తీరంలో సముద్రం వెనక్కు తగ్గడం దేనికి సందేశం అన్న చర్చ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సముద్రం దాదాపు అరకిలోమిటరు మేర వెనక్కు వెళ్లడం పట్ల మత్స్యకారులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సునామీ వంటి ప్రకృతి విపత్తు ముందు సముద్రం ఇలా వెనక్కి వెడుతుందని అంటున్నారు.
సముద్రం గోదావరి కలిసే సంగమ స్థలంగా అంతర్వేది ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. అంతర్వేదిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని మహిమాన్విత దేవుడిగా భక్తులు కొలుస్తుంటారు. అలాగే అంతర్వేది తీరం, సంగమ ప్రాంతం కూడా కావడంతో ఇక్కడికి పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అటువంటి అంతర్వేదిలో సముద్రం వెనక్కు వెళ్లి మట్టి మేటలు వేసింది. సాధారణంగా సముద్రం వెనక్కు వెళ్లినప్పుడు ఇసుక మేటలు ఏర్పడతాయనీ, అయితే అసాధారణంగా మట్టిమేటలు ఏర్పడటం భయంగొల్పుతోందనీ స్థానికులు చెబుతున్నారు. ఆటు సమయంలో సముద్రం వెనక్కు వెళ్లడం సర్వసాధారణమే అయినా ఇంతగా అంటే అరకిలోమీటరకు పైగా వెనక్కు వెళ్లడం అన్నది ఇదే తొలిసారని అంటున్నారు.
కాగా అంతర్వేది వద్ద సముద్రం వెనక్కు వెళ్లడంపై స్పందించిన అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. టెక్నాలజీ అప్లికేషన్ ఫర్ వెదర్ మానిటరింగ్) జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందాలు ఇక్కడకు చేరుకుని పరిశీలిస్తున్నాయి.