ఇప్పుడు తెలిసిందా విజ‌య్‌..రాజ‌కీయాలంటే ఏంటో!

  తమిళనాడులోని కరూర్‌లో.. సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌ ప్రచారసభ సందర్భంగా ఘోర విషాద ఘటన సంభవించింది. తొక్కిసలాట కారణంగా 40 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో విషాద ఘటనపై టీవీకే స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనకు డీఎంకే ప్రభుత్వమే కారణమంటూ విమర్శించింది. విజ‌య్ రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి ఎంతో కాలం కాలేదు. జ‌స్ట్ కొన్ని నెల‌లు మాత్ర‌మే అయ్యింది. గ‌తేడాది పార్టీ పెట్టిన విజ‌య్ వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో నేరుగా స్టాలిన్ పార్టీని ఢీ కొట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఎవ‌రితో పొత్తుల్లేవ్ ఒంట‌రిగా వ‌స్తా అంటూ బీరాలు ప‌లికాడు. ఇప్పుడు త‌న రాజ‌కీయ ప్ర‌చారానికి 40 మంది ప్రాణాల‌ను బ‌లి తీస్కున్నాడు. అంతే కాదు మీడియా ఈ విషాద‌ఘ‌ట‌న‌పై ప్ర‌శ్నించ‌డానికి ట్రై చేస్తే ఎయిర్ పోర్టులో మొహం చాటేసుకుని వెళ్లిపోయాడు. ఆపై త‌న గుండె బ‌ద్ధ‌లై పోయింద‌ని.. ఇప్పుడు నేను చెప్ప‌న‌ల‌వి కాని బాధ‌లో ఉన్నాన‌నీ ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నాడు. ఇంకా రాజక‌ీయ అరంగేట్రంలో బోణీ కొట్ట‌కుండానే.. ఆయ‌న ఖాతాలో ఇన్నేసి ప్రాణాలు. ఇపుడీ చితికిన బ‌తుకుల‌కు బాధ్యులెవ‌రు?  మృతుల్లో పిల్ల‌లు ఏడుగురు, మ‌హిళ‌లు 17 మంది వ‌ర‌కూ ఉండ‌గా.. 12 మంది ప‌రిస్తితి విష‌మంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశ‌ముంద‌ని అంటున్నారు క‌రూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి వైద్యులు. అనుకున్న షెడ్యూల్  ప్ర‌కారం కాకుండా విజ‌య్ నాలుగు గంట‌లు ఆల‌స్యంగా రావ‌డ‌మే అస‌లు కార‌ణంగా చెబుతున్నారు. ఎండ‌లో భారీ ఎత్తున త‌మ అభిమాన న‌టుడి కోసం ఎదురు చూసి చూసిన జ‌నం.. ఆయ‌న వ‌చ్చేస‌రిక‌ల్లా డీలా ప‌డిపోయారు. ఒంట్లో శ‌క్తి లేక నీర‌సించి పోయారు.  అప్ప‌టికీ విజ‌య్ త‌న ప్ర‌సంగం ఆపి.. నీళ్ల బాటిళ్లు విసిరేశారు. కానీ అప్ప‌టికే ప‌రిస్థితి అదుపు త‌ప్పింది. ఈ లోగా క‌రెంటు పోవ‌డంతో ఎవ‌రు ఎక్క‌డ ఎలా చిక్కారో తెలీదు. అంతా అగ‌మ్య‌గోచ‌రం. దీంతో ప‌రిస్తితి అదుపు త‌ప్ప‌డం. వారిలో పిల్ల‌లు, మ‌హిళ‌లు చిక్కుకోవ‌డంతో ఇదీ ప‌రిస్థితి. ఇలాంటిదేదో జ‌రుగుతుంద‌ని ముందే ఊహించిన స్టాలిన్ స‌ర్కార్ అప్ప‌టికీ ఆంక్ష‌లు విధించింది. అయినా స‌రే హైకోర్టుకెళ్లి వాటిని స‌వ‌రించుకుని మ‌రీ విజ‌య్ ఈ స‌భ ఏర్పాటు చేశారు. స‌మ‌యానికి రావ‌ల్సిన వాడు కాస్తా ఆల‌స్యం చేయ‌డంతో.. ఇంత విషాద‌ఘ‌ట‌న‌కు దారి తీసిన‌ట్టుగా తెలుస్తోంది. రాజ‌కీయాలంటే డైలాగులు కొట్టినంత ఈజీ కాదు.. జ‌నం నాడి ప‌ట్ట‌డం అంత తేలిక కాదు. ఇప్పుడీ విషాదం ఆయ‌న పార్టీ ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుంటుంది. సీఎం స్టాలిన్ అయితే క‌రూర్ కి ఆదివారం రావ‌ల్సింది శ‌నివార‌మే చేరుకున్నారు. ఇక ఆయ‌న త‌న‌యుడు, మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్  దుబాయ్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకుని మ‌రీ ఘ‌ట‌నా స్థ‌లి  చేరుకున్నారు.  ఇప్పుడు విజ‌య్ ప‌రిస్థితి చూస్తే త‌న పార్టీకి ప్ర‌చారంగా మారాల్సిన స‌భ కాస్తా దుష్ప్ర‌చారానికి వేదికైంది. ఇప్ప‌టికే స్టాలిన్ స‌ర్కార్ మృతుల‌కు 10 ల‌క్ష‌లు, క్ష‌త‌గాత్రుల‌కు ల‌క్ష ప్ర‌క‌టించారు. సినిమాకు వంద కోట్ల  మేర తీస్కునే విజ‌య్.. మ‌రి ఈ  ప్రాణాల‌కు ఎంత ఖ‌రీదు క‌డ‌తారో తేలాల్సి ఉంది.ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  

మండలిలో కాఫీ లొల్లి!

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శనివారం (సెప్టెంబర్ 27) కాఫీపై వైసీపీ సభ్యులు రచ్చరచ్చ చేశారు. చర్చించడానికి ప్రజాసమస్యలేవీ లేవన్నట్లుగా శాసనమండలిలో కాఫీకీ, అసెంబ్లీలో కాఫీకీ తేడా ఉందంటూ రెచ్చిపోయి సభను స్తంభింపచేశారు. విషయమేమిటంటే   శాసనసభలో అందించే కాఫీకి, శాసనమండలిలో అందించే కాఫీకి నాణ్యతలో తేడా ఉంటోందని మండలి చైర్మన్ మోషెన్ రాజు ఆరోపించారు. దీనిపై వైసీపీ సభ్యులు కాఫీతో పాటు భోజనాల విషయంలో కూడా వివక్ష చూపిస్తు న్నారంటూ ఆరోపణలు గుప్పించారు. రెండు సభల్లోనూ ఒకే నాణ్యతతో ఆహార పదార్థాలు అందించాలని చైర్మన్ అన్నారు. అయితే వైసీపీ సభ్యులు మాత్రం విషయాన్ని అంతటితో వదిలేయకుండా.. కాఫీపై చర్చకు పట్టుబట్టి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ పరిస్థితుల్లో మండలి చైర్మన్ సభను కొద్ది సేపు వాయిదా వేశారు.  కాగా ఈ విషయంపై స్పందించిన సభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వివరణ ఇస్తూ మండలి, అసెంబ్లీలలో ఒకే నాణ్యతతో ఆహారం ఇస్తున్నారని చెప్పారు. ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే పునరావృతం కాకుండా చూస్తామన్నారు.  

ట్రంప్, మోలానియా డిష్యూం.. డిష్యూం.. నిజమేనా?

అమెరికా దేశాధినేత డోనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియాల మధ్యసఖ్యత లేదా? వారిరువురూ తరచూ ఘర్షణ పడుతుంటారా? అంటే.. తాజాగా బయటపడిన ఓ వీడియోను బట్టి ఔననే అనాల్సివస్తున్నది. ఈ వీడియో ప్రకారం ఇరువురూ హెలికాప్టర్ లో ప్రయాణిస్తుండగా ఏదో విషయంపై తీవ్రంగా వాదించుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ వీడియో ఎప్పటిదంటే.. ఇటీవల న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు సతీసమేతంగా డోనాల్డ్ ట్రంప్ హాజరై తిరిగి వెళుతున్నప్పటిదని తెలుస్తోంది. తిరుగుప్రయాణంలో ట్రంప్, మెలానియాలు మెరైన్‌ వన్ హెలికాప్టర్‌లో ఘర్షణపడ్డారని ఆ వీడియో ద్వారా తెలుస్తోంది.  ట్రంప్ మెలానియా వైపు చూపుడువేలు చూపుతూ ఆగ్రహంగా మాట్లాడుతుంటే.. మెలానియా కూడా ఆగ్రహంగా తల అడ్డంగా తిప్పుతూ ట్రంప్ ను వ్యతిరేకిస్తున్నట్లు ఆ వీడియో చూస్తే అర్ధమౌతుంది. ఈ వీడియోను హెలికాప్టర్ బయట నుంచి ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.  

స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ జీవోపై హైకోర్టులో పిటిషన్

స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.   బీసీ రిజర్వేషన్ల  జీవో విడుదలతో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైందనీ, నేడో, రేపో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయనీ అంతా భావిస్తున్న తరుణంలో ఆ జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే  డ్రాఫ్ట్​ నోటిఫికేషన్​ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సీఎంకు అందజేశారు. అలాగే ఆయా స్థానాలకు  అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు.   ఈ తరుణంలో  హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన జీవో నంబర్​ 9పై  మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కేశవాపూర్‌ గ్రామానికి చెందిన మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో శనివారం (సెప్టెంబర్ 27) లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈయనే గతంలో కూడా  బీసీ రిజర్వేషన్లపై హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటికి   ప్రభుత్వం   జీవో విడుదల చేయలేదు. దీంతో ఆయన పిటిషన్ ను అప్పట్లో హైకోర్టు కొట్టివేసింది. పత్రికలలో కథనాల ఆధారంగా దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమని అప్పట్లో కోర్టు పేర్కొంది. ఇప్పుడు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో మాధవరెడ్డి మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై  సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

విద్యా సంస్కరణలు.. లోకేష్ కు ప్రపంచబ్యాంకు ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న విద్యా సంస్కరణలను ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. ముఖ్యంగా సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (సాల్ట్) కార్యక్రమాన్ని ప్రపంచ బ్యాంకు విశేషంగా ప్రస్తుతించింది. ఇటీవల విద్యా మంత్రి నారా లోకేష్‌తో ప్రపంచ బ్యాంకు ప్రతినిథులు భేటీ అయ్యారు. ఆ సందర్భంగా  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి విద్యారంగంలో అమలు చేస్తున్న సంస్కరణలు, ముఖ్యంగా సాల్ట్ అమలు తీరును ప్రశంసించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిథులు ఏపీలో అమలు అవుతున్న విద్యా సంస్కరణలు ఇండియాకే కాదు, మొత్తం దక్షిణాసియాకే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.   పెర్ఫార్మెన్స్ అసెస్‌మెంట్ ఫర్ లెర్నింగ్ ల్యాబ్‌లు (పీఏఎల్),   ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఎఫ్ఎల్ఎన్),అలాగే  కేంద్రీకృత పాఠశాల నాయకత్వ శిక్షణ వంటి కార్యక్రమాలు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు తార్కాణంగా పేర్కొన్నారు. అలాగే ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిని కూడా సందర్శించారు. ఆ సందర్భంగా స్థానిక రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నమూనాపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొందని పేర్కొన్నారు.  

15 నెలల్లో 4లక్షలకు పైగా ఉద్యోగాలు.. అసెంబ్లీ వేదికగా జాబ్ డేటా

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన 15నెలల కాలంలోనే గణనీయంగా ఉద్యోగాల సృష్టిజరిగింది. దీనిపై అసెంబ్లీ వేదికగా చంద్రబాబునాయుడు తమ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఇంత వరకూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎన్ని ఉద్యోగ నియామకాలు జరిగాయన్నదానిపై గణాంకాలతో సహా వివరించారు. గత 15 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో మొత్తం 4,71,574 ఉద్యోగాల కల్పన జరిగిందని వివరించారు. మెగా డీఎస్సీ ద్వారా 15 వేల 941 పోస్టులు, అలాగే వివిధ ప్రభుత్వ శాఖలలో 9,093 ఉద్యోగాలు ఇక పోలీసు శాఖలో  6వేల వంద పోస్టులు భర్తీ అయ్యాయని వివరించారు. అలాగే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, జాబ్ మేళాల ద్వారా 92 వేల149 మందికి ఉపాధి లభించిందన్నారు. వర్క్ ఫ్రం హోం మోడల్ లో 5 వేల 500 అవకాశాలు దక్కాయి.  ఉద్యోగ కల్పనలో అధిక శాతం ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. ప్రధానంగా  ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఐటీ, ఎంఎస్‌ఎంఈలు వంటి పరిశ్రమలలో 3లక్షల 48 వేల 891 మందికి ఉద్యోగాలు లభించాయి. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇంత వరకూ ఉద్యోగాలు లభించిన వారి పేర్లు, వారి హోదా, ఎక్కడ పని చేస్తున్నారు వంటి అన్ని వివరాలతో  పబ్లిక్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అంతే కాకుండా ఐదేళ్లలో 20 లక్సల ఉద్యోగాల భర్తీ చేసి తీరుతామనీ, ఇప్పటి వరకూ జరిగింది ప్రారంభం మా్రతమేననీ రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయనీ వివరించారు. 

ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు స్పీకర్ షెడ్యూల్

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణకు అసెంబ్లీ స్పీకర్ స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​ కార్యాలయం  శనివారం (సెప్టెంబర్ 27)షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో కాంగ్రెస్​ అధికా రంలోకి వచ్చిన తరువాత..  బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే.   భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే   కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్​ , బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​ కుమార్, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్​, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పటాన్ చెరు ఎమ్మెల్యే  మహిపాల్​రెడ్డి లు తెరాస గూటిని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతొ  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలలలో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ ను ఆదేశించింది. దీంతో స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో పలువురు తాము  బీఆర్​ఎస్​లోనే కొనసాగుతున్నట్లు ఆ నోటీసులకు బదులు ఇచ్చారు. దీంతో  స్పీకర్ వారిని విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం ఎమ్మెల్యేల విచారణకు షెడ్యూల్ విడుదల చేసింది. ఆ షెడ్యూల్ ప్రకారం. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రకాష్ గౌడ్, 12 గంటలకు కాలే యాదయ్య, మధ్యాహ్నం ఒంటి గంటకు మహిపాల్​రెడ్డి, 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని స్పీకర్ విచారించనున్నారు.  

లడక్.. నాడు సంబరాలు.. నేడు ఆగ్రహ జ్వాలలు కారణమేంటి?

సరిగ్గా ఆరేళ్ల కిందట లడక్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. పండుగ జరుపుకున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్ నుంచి విడిపోయి కేంద్రపాలిత ప్రాంతంగా లడక్ ఏర్పడాలన్న తమ స్వప్నం సాకారమైందంటూ అనందంతో పరవశించిపోయారు అయితే సరిగ్గా ఆరేళ్లు తిరిగే సరిగి.. లడక్ ఇప్పుడు ఆందోళనలతో అట్టుడికిపోతోంది.  నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. పోలీసు కాల్పులతో మరణాలు సంభవించాయి. ఆంక్షలు, కర్ఫ్యూలతో లడక్ ఉద్రిక్తంగా మారిపోయింది. ఆరేళ్ల నాటిసంబరాలు ఆవిరై ఇప్పుడు ఆగ్రహజ్వాలలుగామారడానికి కారణమేంటి? పరిస్థితి ఇలా మారడానికి వెనుక ఎవరున్నారు? అసలు  లడక్ ప్రజలు కోరుకుంటున్నదేమిటి?   ఈ ప్రశ్నలకు   లడక్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేయడంతోనే వారి డిమాం డ్లన్నీతీరిపోయినట్లేనని కేంద్రం భావించడమే ఇప్పటి ఈ పరిస్థితికి కారణమన్నదే సమాధానంగా వస్తున్నది. ఎందుకంటే లడక్ ప్రజలు తమ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా అంటే యూనియన్ టెరిటరీగా  మార్చడం పట్ల వ్యక్తం చేసిన ఆనందం, చేసుకున్న సంబరాలు ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా పడిన మొదటి అడుగుగా భావించడమేనని పరిశీలకులు అంటున్నారు. స్థానిక పాలన, తమ సాంస్కృతిక ప్రత్యేకతలను కాపాడుతూ లడక్ ను రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ లో చేర్చడం, స్థానికులకు ఉద్యోగాలు, భూ యాజమాన్యంలో ప్రత్యేక రిజర్వేషన్లు వంటి ఆకాంక్షలు ఉన్నాయి. యూనియన్ టెరిటరీగా మార్చి జమ్మూ కాశ్మీర్ నుంచి విడిపోవడం ఆ ఆకాంక్షల సాకారం దిశగా పడిన తొలి అడుగుగా భావించి లడక్ ప్రజలు ఆరేళ్ల నాడు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ ఆరేళ్లలో ఆ తొలి అడుగుతరువాత మరో అడుగు ముందుకు పడకపోవడం లడక్ ప్రజలలో అసహనానికి కారణమైంది. అందుకే ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆందోళనకారులు జరిపిన చర్చలు విఫలం కావడం అసహనాన్ని మరింత పెంచింది. ముఖ్యంగా  లేహ్‌లోని బౌద్ధులు, కార్గిల్‌లోని షియా ముస్లింలు  ఐక్యంగా ఆందోళనలకు ముందు పీఠిన నిలిచాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక లడక్ రాష్ట్రం కోసం శాంతియుతంగా నిరశన చేస్తున్న వారిని బలవంతంగా ఆస్పత్రికి తరలించడం, ఆందోళనను అణిచివేయడానికి పోలీసులను నియోగించడం,మరో సారి చర్చలంటే ఇప్పుడప్పుడే కాదని కేంద్ర మొండికేయడం వంటివి ఆందోళనకారులలో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తడానికి కారణమయ్యాయి. సరిగ్గా ఈ దశలోనే ఆందోళన యువత చేతుల్లోకి వెళ్లిపోయింది. అంటే రాహుల్ పదేపదే చెప్పే జెన్ జడ్ రంగంలోకి దిగిందన్న మాట.  ఈ దశలోనే ఆందోళన హింసాత్మక రూపం దాల్చడం, దాడులు, పోలీసు కాల్పుల వరకూ పరిస్థితి వెళ్లింది.   లేహ్, కార్గిల్‌లలో ‘అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్స్ ద్వారా ప్రత్యేక రాష్ట్రానికి ఉండే అన్నీ కల్పిస్తున్నామంటూ కేంద్రం చేస్తున్న వాదనను లడక్ వాదులు అంగీకరించడం లేదు.   కౌన్సిల్స్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కింద పరిమిత అధికారాలే ఉన్నాయని వాదిస్తున్నారు. లడక్ ప్రాంతం దేశ భద్రతకు సంబంధించినంతవరకూ అత్యంత సున్నితమైన, కీలకమైన ప్రాంతం అనడంలో సందేహం లేదు. ఇప్పటి పరిస్థితుల్లో లడక్ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడమూ జరిగే పని కాదు.. కానీ.. ప్రజల ఆకాంక్షలను అణచివేయాడం సరికాదు. వారితో చర్చల ప్రక్రియ కొనసాగిస్తూనే.. రాష్ట్ర హోదాకు ప్రత్యామ్నాయంగా  కౌన్సిల్స్ అధికారాలను  పెంచి, ఉద్యోగ, భూమి హక్కులపై స్పష్టమైన హామీలు ఇస్తే.. ప్రజాగ్రహం చల్లారే అవకాశం ఉంటుంది. ఆ దిశగా అడుగులు వేయకుంటే లడక్ నిత్యాగ్ని గుండంలా మండుతూనే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

సైబర్ మోసానికి గురైన కావలి ఎమ్మెల్యే

సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ సైబ‌ర్ మోసాల‌కి అతీతులు కారన్నట్లుగా బలౌతున్నారు. ఉన్నత విద్యావంతులు, ఐఏఎస్ అధికారులూ కూడా సైబర్ మోసగాళ్ల వలలో పడుతున్నారు. సైబర్ మోసాలపై ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తూ ప్రజలను అప్రమత్తులను చేస్తున్నా.. వారి వలలో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నవారి సంఖ్యపెరుగుతూనే వస్తున్నది. తాజాగా నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి   సైబర్ నేరగాళ్ల  చేతిలో మోసపోయిన వారి జాబితాలో చేరారు. సైబర్ నేరగాళ్లు ఆయన ఖాతా నుంచి 23.16లక్షల రూపాయలు దశలవారీగా కాజేశారు. వివరాల్లోకి వెడితే.. గత నెల  22న కావడి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి  ఓ ఫేక్ ఆర్టీఏ లింక్‌ వచ్చింది. దానిని   క్లిక్ చేసిన ఎమ్మెల్యే… అది తన కంపెనీ వాహనాల బకాయిలు అనుకున్నారు. కానీ ఆ లింక్ ను క్లిక్ చేయడమే ఎమ్మెల్యే  సిమ్ కార్డ్ బ్లాక్ కావడానికి కారణమైంది. వెంటనే స్పందించిన ఆయన, సిమ్ సమస్య పరిష్కరించేందుకు హైదరాబాద్‌లోని ఆధార్ విజిలెన్స్ విభాగాన్ని సంప్రదించారు.  దీంతో ఆయన  సిమ్ మళ్లీ పనిచేయడం ప్రారంభించింది. ఆ సమయంలో అసలు మోసం బయటపడింది. ఆయనకు చెందిన రెండు యాక్సిస్ బ్యాంక్ ఖాతాల నుంచి (ఆగ‌స్ట్‌ 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 16 వరకు) యూపీఐ ద్వారా దశల వారీగా  23,16,009 రూపాయలు గల్లంతయ్యాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి ఆయన కంపెనీ సిబ్బంది ద్వారా ఈ   ఆలస్యంగా తెలిసింది. వెంటనే స్పందించిన ఆయన , కావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

గుంటూరులో పానీపూరీ విక్రయాలు బంద్.. ఎందుకంటే?

గుంటూరు నగరంలో రోడ్లపై టిఫిన్ బండ్లు, పానీపూరీ విక్రయాలపై నిషేధం విధించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిషేధం విధించినట్లు గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు పేర్కొన్నారు.  గుంటూరు నగరంలో డయేరియా కేసులు పెరుగుతుండటంతో పానీ పూరి విక్రయాలు, టిఫిన్ బండ్లపై నిషేధం విధించారు. డయేరియా వ్యాప్తిని అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరునగరంలోని ప్రగతి నగర్, రామిరెడ్డితోట, రెడ్ల బజార్, సంగడి గుంట సహా తొమ్మిది ప్రాంతాలలో డయేరియా ప్రబలినట్లు అధికారులు గుర్తించారు. డయేరియా కేసులు అధికంగా నమోదు కావడంతో కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు. డయేరియా వ్యాప్తి అరికట్టేం దుకు తీసుకోవలసిన చర్యలపై గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నగరంలో రోడ్లపై టిఫిన్ బండ్లు, పానీపూరి విక్రయాలపై నిషేధం విధించాలని నిర్ణయించారు.డయేరియా వ్యాప్తికి కలుషిత నీరు, ఆహారం ప్రధాన కారణాలనీ, అందుకే  ముందుజాగ్రత్త చర్యగా పానీపూరీ బండ్లు, టిఫిన్ సెంటర్ల అమ్మకాలను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నిలిపివేయాలని నిర్ణయించినట్లు పులి శ్రీనివాసులు తెలిపారు. 

జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందే!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు నాంపల్లిలోని సీబీఐ కోర్టు యూకే పర్యటనకు అనుమతి ఇచ్చింది. అధికారం కోల్పోయిన తరువాత నుంచీ జగన్ ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమౌతూ అడపాదడపా ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు. పార్టీ నాయకులతో భేటీలు నిర్వహించి మళ్లీ యహలంక ప్యాలెస్ కు వెడిపోతున్నారు. కాగా ఈ నేపథ్యంలోనే జగన్  అక్రమాస్తుల కేసులో వ్యక్తిగతంగా కోర్టు హాజరు నుంచి ఇంకా ఎంత కాలం మినహాయింపు అంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో జగన్ తన యూరప్ పర్యటనకు అనుమతి కోరుతూ నాంపల్లిలోని సీబీఐ కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి సీబీఐ కోర్టు జగన్ యూరప్ పర్యటనకు అనుమతి ఇచ్చింది. వచ్చే నెల 1 నుంచి 30వ తేదీ లోపు 15 రోజుల పాటు జగన్ యూరోప్ పర్యటనకు అనుమతి మంజూరు చేసిన కోర్టు, ఆ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత  నంవంబర్ 14లోగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.  జగన్ అక్రమాస్తుల కేసులో ఇది కీలక పరిణామమని పరిశీలకులు అంటున్నారు. అది పక్కన పెడితే గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత జగన్ యూరోప్ పర్యటనకు వెళ్లడం ఇది రెండో సారి అవుతుంది.  కాగా జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపునకు ఇక తెరపడినట్లేనన్న చర్చ రాజకీయవర్గాలలో వినిపిస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు లభించిన మినహాయింపు అధికారం కోల్పోయిన తరువాత కూడా కొనసాగుతుండటం పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో నాంపల్లి కోర్టు నవంబర్ 14లోగా కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా జగన్ యూరోప్ పర్యటనకు అనుమతి కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్ సందర్భంగా సీబీఐ అనుమతి ఇవ్వరాదంటూ గట్టిగా అభ్యంతరం తెలిపింది. పలు ఆర్థిక నేరాల కేసులలో నిందితుడిగా ఉన్న వ్యక్తి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దంటూ ఆదేశించింది. కాగా జగన్ ఎన్నడూ కోర్టు షరతులను ఉల్లంఘించలేదంటూ జగన్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలూ విన్నమిదట.. కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇస్తూ పలు షరతులు విధించింది.  జగన్ తన పర్యటన పూర్తి వివరాలను కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది. అలాగే  యూరప్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నవంబరు 14వ తేదీలోపు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై స్వదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారో స్పష్టం చేస్తూ  మెమో సమర్పించాలని ఆదేశించింది. 

జగన్ అరెస్టుపై చంద్రబాబు ఏమన్నారంటే?

ప్రతీకార రాజకీయాల అన్నవి తన డిక్షనరీలోనే లేవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం (సెప్టెంబర్ 26) ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంపై తనకు విశ్వాసం ఉందన్నారు. జగన్ హయాంలో తనను అక్రమంగా అరెస్టు చేసిన సందర్భంగా  అప్పటి ప్రభుత్వం సృష్టించిన భయానక వాతావరణాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. తాను అరెస్టైనప్పుడు తనను పరామర్శించడానికి వచ్చిన పవన్ కల్యాణ్ ను మార్గమధ్యంలో ఆపేశారన్నారు. జగన్ హయాంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మద్దతు దారులు ఎవరినీ ఉపేక్షించలేదనీ, వారి ఆచూకీ తెలుసుకునేందుకు డ్రోన్లు కూడా ఉపయోగించారి చంద్రబాబు చెప్పారు.  తాను అధికారం చేపట్టిన తరువాత తలుచుకుంటే మొదటి రోజునే ఆయనను (జగన్) అరెస్టు చేయగలిగే వాడిననీ, అయితే తన విధానం అది కాదనీ అన్నారు. తాను అటువంటి రాజకీయ నాయ కుడిని కానని చంద్రబాబు చెప్పారు. చట్టాలపైనా, రాజ్యాంగంపైనా తనకు నమ్మకం ఉందన్నారు. ప్రతీకార రాజకీయాల గురించి ఎన్నడూ ఆలోచించననన్నారు, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందనీ చెప్పారు. అందుకే ప్రజలు తనను నాలుగో సారి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారన్న చంద్రబాబు, వారి నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయనని చెప్పారు.   

హైదరాబాద్ సీపీగా సజ్జనార్

తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐఏఎస్, ఐపీఎస్ లను బదలీ చేసింది. ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, 23 మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న శివధర్ రెడ్డిని డీజీపీగా నియమించింది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్ ను నియమించింది.   అగ్నిమాపక శాఖ డీజీగా పని చేస్తోన్న నాగిరెడ్డిని ఆర్టీసీ ఎండీగా బదలీ చేసింది. ప్రస్తతం ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ ను హైదరాబాద్ సీపీగా నియమించింది. అలాగే హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్ ను హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా అపాయింట్ చేసింది. ఇటీవల వరుస వివాదాలల్లో చిక్కుకుంటున్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనను స్పెషల్ సెక్రటరీగా నియమించింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‎గా హరిత నియమితులయ్యారు.   ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శిగా సురేంద్ర మోహన్‌ , జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా రిజ్వీ,  విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా శిఖా గోయల్,  గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్,  పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి,   ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్‌,  హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సీపీగా శ్రీనివాసులు, హైదరాబాద్ అడిషనల్ శాంతిభద్రతలను సీపీగా తసఫీర్ ఇక్బాల్,  వెస్ట్ జోన్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్,   సిద్దిపేట సీపీగా విజయ్ కుమార్,   నారాయణ పేట్ ఎస్పీగా వినీత్‌‌,  ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా సింధు శర్మ, రాజేంద్ర నగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్,  మాదాపూర్ డీసీసీగా రీతిరాజ్,  ఎల్బీ నగర్ డీసీపీగా అనురాధలు నియమితులయ్యారు. 

సృష్టిలో ముగిసిన ఈడీ సోదాలు

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో ఈడీ సోదాలు ముగిశాయి. గత రెండు రోజులుగా ఈడీ అధికారలు వేర్వేరు ప్రాంతాలలో నిర్వహించిన సోదాలు శుక్రవారం రాత్రి ముగిశాయి.   హైదరా బాద్ జోనల్ ఆఫీస్ కు చెందిన  ఈడి  అధికారులు  హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, కోల్ కత్తా సహా మొత్తం తొమ్మది ప్రాంతాలలో ఈ తనఖీలు నిర్వహించారు.   డాక్టర్ నమ్రత యూని వర్సల్ సృష్టి ఫెర్టిలిటీ & రీసెర్చ్ సెంటర్ పేరుతో అక్రమ సరోగసి రాకెట్ దందా కొనసాగించిన విషయం తెలిసిందే. ఈ  వ్యవ హారంలో పోలీ సులు ఇప్పటికే డాక్టర్ నమ్రతతో పాటు పలువురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.  హైదరా బాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్లో నమ్రతపై మోసం, మభ్యపెట్టడం, అక్రమ సరోగసి, చైల్డ్ ట్రాఫికింగ్ మొదలగు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో నమోదైన  ఎఫ్ఐఆర్ ఆధారం గా  ఈడి దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఈడి అధికారులు సోదాలు నిర్వహింొచారు. ఈ సోదాల్లో  ఈడి అధికారులు   కీలక పత్రాల తో పాటు మోసపోయిన జంటల వివరాలు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకు న్నారు. డాక్టర్ నమ్రత తన సెంటర్ లో పని చేస్తున్న సిబ్బంది, ఏజెంట్ల సహాయంతో గత పది సంవత్సరాలుగా  సరోగసి రాకెట్ నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ నమ్రత దేశవ్యాప్తం గా ఈ అక్రమ రాకెట్ నడిపినట్లుగా తేలింది. గుట్టు చప్పుడు కాకుండా గత పది సంవత్స రాలుగా ఈ  దందా  కొనసాగిం చినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. నమ్రత చేతిలో  మోసపోయిన ఓ  విదేశీ జంటకు ఇచ్చిన శిశువుకు డిఎన్ఏ టెస్టు చేయగా ఆ శిశువు వారి శిశువు కాదని తేలడంతో ఆ శిశువుకు పాస్పోర్ట్ నిరాకరించారు. ఇలా ఈడి దర్యాప్తు లో  డాక్టర్ నమ్రత మోసాలు బయట పడ్డాయి. గత రెండు రోజులుగా ఈడి చేసిన సోదాల్లో కీలక పత్రాలతో పాటు మోసపో యిన జంటల వివరాలు, నమ్రత కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.  

మూసీ వరద..చిగురుటాకులా వణుకుతున్న విశ్వనగరం!

తెలంగాణ వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది వరదతో ఉప్పొంగుతోంది. హైదరాబాద్ లోని జంట జలాశయాలు పూర్తిగా నిండటంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో మూసీ మహోగ్రరూపం దాల్చింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ దాదాపుగా నీటమునిగాయి. కుసుంపూర్, పురానాపూల్, చాదర్ ఘాట్, మలక్ పేట్, మూసారాంబాగ్, నాగోల్ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. ఇక మూసీకి ఆనుకుని ఉన్న అన్ని బ్రిడ్జీలపైనా రాకపోకలను నిలిపివేశారు.   జియాగూడ , కులుసంపూర , చాదర్ ఘాట్  , మూసారాంబాగ్ బ్రిడ్జిల పైనుంచి  వరద నీరు ప్రవహిస్తుండటంతో వాటిని మూసివేసి రాకపోకలను నిలిపివేశారు.   కాగా మూసీని ఆనుకుని ఉన్న ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లోని భారీ ఎత్తున వరద నీరు చేరింది. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ప్రయాణీకులు బస్టేషన్ లో చిక్కుకుపోయారు.  బస్టాండ్ లోపల చిక్కుకున్న ప్రయాణికులను అతి కష్టం మీద తాడు సాయంతో బయటకు తీసుకువచ్చారు.  ముందస్తు హెచ్చరికలు లేకుండా గండిపేట్ గేట్లు ఎత్తడంతో అనూహ్యంగా వరద ముంచెత్తిందని అంటున్నారు. ఇలా ఉండగా నార్సింగి, మంచిరేవుల మధ్య ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డులో వరదలో చిక్కుకున్న నలుగురిని హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి.   ఉస్మాన్ సాగర్  గేట్లు ఎత్తడంతో భారీగా వచ్చిన వరదతో సర్వీసు రోడ్డు మీద నుంచి వరద నీరు పొంగి పోర్లతోంది. ఆ మార్గంలో వెళ్లరాదని బారికేడ్లు పెట్టినా పట్టించు కోకుండా ఓ డ్రైవర్ ఆటో ట్రాలీ లో రోడ్ దాటేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆ ట్రాలీలో డ్రైవర్ తో పాటు నలుగురు ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి వరద తీవ్రత ఎక్కువ ఉండడంతో ఆటో ట్రాలీ ఆగిపోయింది. అక్కడే ఉన్న పోలీసులు, హైడ్రా సిబ్బంది  అప్రమత్తమై వాళ్ళని సురక్షితం గా కాపాడి,   ఆటో ట్రాలీ కి తాడు కట్టిబయటకు తీశారు.  

రోడ్డు ప్రమాదం లో ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక వైపు ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండగా మితిమీరిన వేగంతో వాహనం నడపడమే ఈ ప్రమాదానికి కారణమైంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడికక్కడ రోడ్లు జలమయమయ్యాయి. అయినా ఓ ఆటో డ్రైవర్ అతి వేగంగా ఆటో నడుపుతూ  కందుకూరు మండలంలోని పవర్ గ్రిడ్ వద్ద నియంత్రణ కోల్పోయి ఎదురుగా ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతులను యాచారం మండలం కురుమిద్దకు చెందినసత్తెమ్మ(50), శ్రీనివాస్(35), శ్రీధర్(25)గా గుర్తించారు. 

జలదిగ్బంధంలో ఎంజీబీఎస్

హైదరాబాద్‌లో   గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది.  శుక్రవారం కురిసిన భారీ వర్షంతో మూసీనది వరదతో పోటెత్తింది. దీనికి తోడు జంట జలాశయాల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో మూసీ నది మహోగ్రరూపం దాల్చింది.  దీంతో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎంజీబీఎస్ బస్టాండ్ నీట మునిగింది. బస్టాండ్ లోని వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. బస్టాండ్ నుంచి బయటకు వచ్చే మార్గంలేక బస్టాండ్ లోనే చిక్కుకుపోయారు. తాడు సాయంతో వారిని బయటకు తీసుకువచ్చారు.  హైడ్రాతో పాటు పోలీసులు రంగంలోకి దిగారు.  ముందస్తు హెచ్చరిక లేకుండా గండిపేట గేట్లు ఎత్తివేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు.  మూసీ వరద ఉధృతిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. శుక్రవారం (సెప్టెంబర్ 26) అర్ధరాత్రి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఎంజీబీఎస్ లో చిక్కుకున్న ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఉండగా మూసీ వరద ఉధృతి ఒక్క ఎంజీబీఎస్ కే పరిమితం కాలేదు. చాదర్‌ఘాట్ సమీపంలోని మూసానగర్‌లో  200 ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి.  ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.  మూసారాంబాగ్ వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. పురానాపూల్ ప్రాం తంలో కూడా పలు పల్లపుప్రాంతాలు జలమయమయ్యాయి. 

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇప్పుడు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుండటంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. శనివారం (సెప్టెంబర్ 27) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (సెప్టెంబర్ 26) శ్రీవారిని మొత్తం 75 వేల 358 మంది దర్శించుకున్నారు. వారిలో 29 వేల 166 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం  2 కోట్ల 58 లక్షల రూపాయలు వచ్చింది. 

మూసీకి భారీ వరద.. ముంపు ప్రాంతాల ప్రజల తరలింపు

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది మహోగ్రరూపం దాల్చింది. పోటెత్తి ప్రవహిస్తున్నది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. చాదర్ ఘాట్, శంకర్ నగర్ లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.   పురానాపూల్ ప్రాంతంలో మూసీ వరద రోడ్లను ముంచెత్తింది. జియాగూడ ప్రాంతంలో కూడా మూసీ ఉగ్రరూపం దాల్చింది. అక్కడ కూడా వరద నీరు రోడ్లపైకి రావడంతో రాకపోకలను నిలిపివేశారు. స్థానికులను అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరించారు. ముసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు.    ఇక వికారాబాద్ లో మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో టంగుటూరు మోకిల రోడ్డును మూసి వేశారు.  హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లలో నీటిమట్టం పెరగడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ వరద ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.