వరద గుప్పిట్లోనే తెలుగు రాష్ట్రాలు
posted on Sep 30, 2025 @ 10:34AM
తెలుగు రాష్ట్రాలను వర్షాలూ వదలడం లేదు. వరదా విడవడం లేదు. వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయని అనుకునే లోగానే.. ఉత్తరాంధ్ర పరిసరప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం ప్రభావంతో అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇలా ఉండగా, కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.61,960 క్యూసెక్కులుగా ఉంది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇక గోదావరికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 45,70 అడుగులు ఉండగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 9 లక్షల 71 వేల 784 క్యూసెక్కులు ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ కూడా వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.బుధవారం నాటికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం 12 నుంచి 12,5 క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కృష్ణా, గుంటూరు, బాపట్ల, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కర్నూలు జిల్లాల్లో
సహాయక చర్యల కోసంఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు.