జూబ్లీ ఉప ఎన్నిక.. కొండవీటి చాంతాడు చిన్నబోయేలా ఆశావహుల సంఖ్య

జూబ్లిహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది.  అయితే కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకూ ఆ ఉప ఎన్నికలో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడుతోంది.  ఫలితంగా రోజు రోజుకూ ఆశావహుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. చివరకు అభ్యర్థిని ఎంపిక చేసిన తరువాత ఆసంతృప్తి భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది.  కాంగ్రెస్ పకడ్బందీగా, ప్రణాళికా బద్ధంగా జూబ్లీ ఉప ఎన్నిక రేసులోంచి మాజీ ఎంపీ అజారుద్దీన్ ను తప్పించిందని చెప్పుకున్నంత సేపు పట్ట లేదు.. మరింత మంది పోటీలోకి వచ్చేసి పార్టీకి తలనొప్పులు తీసుకురావడానికి. బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసి గెలిచి, ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరిన దానం నాగేందర్ నుంచి పలువురు నేతలు జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీకి సై అంటున్నారు. అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్.. ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడే చిన్నబోతుంది. అభ్యర్థి ఎంపిక విషయంలో జాప్యం కారణంగా ఇప్పుడు ఆశావహుల సంఖ్య పెరిగిపోయింది. ఎవరికి టికెట్ ఇస్తే ఎవరు అలకపాన్పు ఎక్కి అసమ్మతి జ్వాలలు ఎగిసిపడతాయన్న ఆందోళన కాంగ్రెస్ లో వ్యక్తం అవుతోంది. దీంతో  మీనాక్షి నటరాజన్ ను కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దింపింది. ఆశావహుల మధ్య సయోధ్య కుదిర్చి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయ సాధన అజెండాతో ఆమె హస్తిన నుంచి హైదరాబాద్ వస్తున్నారు. ఆమె ప్రయత్నాలు ఎంత వరకూ, ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సిందే.   జూబ్లీ ఉప ఎన్నిక తో పాటు స్థానిక ఎన్నికలలో కూడా పార్టీని విజయతీరాలకు చేర్చాలన్న వ్యూహంతో ఆమె పథక రచన చేయనున్నారు. ఇందు కోసం ఆమె వరుస సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా జూబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి ఎంపికపై ఆమె దృష్టి సారిస్తారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి పార్టీ సీనియర్ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.   ఆమె జూబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో పార్టీలో ఏకాభిప్రాయాన్ని తీసుకురాగలుగుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది. 

చంద్రబాబు నివాసానికి బాంబు బెదరింపు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాన్ని బాంబులతో పేల్చివేస్తామంటూ వచ్చిన ఈ మెయిల్ బెదరింపు కలకలం సృష్టించాయి. అలాగే ఈ నెల 6న చంద్రబాబు తిరుపతిలో పర్యటించనున్నారు. ఆ తిరుపతిలోని పలు ప్రాంతాలకు కూడా ఇదే ఉగ్ర సంస్థ నుంచి బెదరింపు ఈమెయిల్స్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసాలు సహా రాష్ట్రంలోని పలు కీలక ప్రదేశాలలో బాంబు పేలుళ్లు జరుపుతామంటూ ఈమెయిల్స్ రావడంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.  ఇటీవల రాష్ట్రంలో అనుమానికత ఉగ్రవాదుల అరెస్టు జరిగిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులు జరిగిన రోజుల వ్యవధిలో సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వ్యక్తులు, ప్రసిద్థ తిరుపతి ఆలయాలు లక్ష్యంగా బాంబు పేలుళ్ల బెదరింపులు రావడం కలకలం రేపింది.   హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్ అనే  ఉగ్ర సంస్థ నుంచి ఈ బెదరింపులు వచ్చాయి.  రాష్ట్ర వ్యాప్తంగా బాంబు పేలుళ్లకు ప్రణాళికలు రచించినట్లుగా ఈమెయిల్స్ ద్వారా హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్ సంస్థ హెచ్చరించింది. ఈ బెదరింపు ఈమెయిల్స్ లో పోలీసులు అలర్టయ్యారు. చంద్రబాబు, జగన్ నివాసాలు సహా తిరుపతిలోని పలు ప్రదేశాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలు నిర్వహించారు.  6న చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తిరుపతి, కాళహస్తి సహా పలు ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించారు.కాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ ఈమెయిల్స్ బెదరింపుల వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థకు పంపారు. 

పీవోకేలో ప్రజా తిరుగుబాటు?

ఆర్థికంగా, రాజకీయంగా, సామిజికంగా ఏడు దశాబ్దాలుగా వివక్షకు గురౌతున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) ప్రజలు పాకిస్థాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.  పీవోకే)లో స్వేచ్ఛా, స్వాతంత్ర్యం కోసం ప్రజలు ఆందోళనకు దిగారు. పాకిస్థాన్ పాలనను వ్యతిరేకిస్తూ రోడ్ల పైకి వచ్చారు.  ప్రజల ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేయడానికి పాకిస్థాన్ సైన్యాన్ని రంగంలోకి దింపింది. దీంతో ప్రజాందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. సైన్యాన్ని రంగంలోకి దింపి తమ ఆందోళనను అణచివేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రయత్నించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పీవోకే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని పరిశీలకులు అంటున్నారు. ఆందోళనకారులతో చర్చలకు పాకిస్థాన్ ప్రభుత్వం కమిటీని నియమించింది. అయితే ఆందోళనకారులతో ఆకమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆందోళనలను అణచివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.  అయితే ఆందోళన కారులు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. ఈ ప్రజాందోళనకు అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) నాయకత్వం వహిస్తున్నది. పీవోకేకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తిన ఏఏసీ.. పాకిస్థాన్ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచింది.  పీవోకే అసెంబ్లీలో పాకిస్థాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలని కోరుతోంది. ఈ 12  స్థానాల వల్ల  స్థానిక ప్రజల ప్రాతినిథ్య హక్కుకు భంగం వాటిల్లుతోందని ఏసీసీ చెబుతోంది.  అలాగే గోధుమ పిండిపై సబ్సిడీ, మంగ్లా జలవిద్యుత్ ప్రాజెక్టు ఆధారంగా విద్యుత్ చార్జీలను తగ్గించాలనీ కూడా ఏసీసీ డిమాండ్ చేస్తున్నది. ఏడు దశాబ్దాలుగా ప్రాథమిక హక్కులకు కూడా నోచుకోకుండా సాగుతున్న పరిస్థితి ఇంకానా ఇకపై కుదరదంటూ ఏసీపీ కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది. ప్రజాగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే.. పీవోకే ప్రజల ప్రాథమిక హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నది.  అయితే ఈ ప్రజాందోళనను ఉక్కుపాదంతో అణచివేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం భావిస్తోంది.  వేల మంది సైనికులు, పోలీసులను మోహరించింది. ఈ ఆందోళనను అణచివేయడానికి  పంజాబ్ ప్రావిన్స్ నుంచి కూడా పోలీసులను తరలించి ఇక్కడ మోహరించింది.  ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది.  

ఆటో సేవలో పథకం లబ్ధిదారులు ఎందరంటే?

రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఈ రోజు నుంచి ప్రారంభమైంది.  రాష్ట్రంలో స్త్రీ శక్తి' పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆదాయం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లకు అండగా  నిలిచే లక్ష్యంగా ఆటో డ్రైవర్ల సేవలో అనే కొత్త పథకానికి  రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన ప్రతి ఆటో, క్యాబ్ డ్రైవర్‌కు రూ.15,000 ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు.  మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తమకు ఆదాయం గణనీయంగా తగ్గిపోయి, కుటుంబ పోషణ కష్టంగా మారిందన్న  ఆటో, క్యాబ్  ట్యాక్సీ డ్రైవర్ల ఆవేదనను పరిగణనలోనికి తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని ఆదుకునేందుకు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకానికి  శుక్రవారం (అక్టోబర్ 3) జరిగిన కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది. దీంతో ఈ పథకం పట్టాలెక్కింది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరయ్యారు. ఈ పథకం కింద రా ష్ట్ర వ్యాప్తంగా  2,90,669 మంది డ్రైవర్లు లబ్ధి పొందుతారు.  

‘అనంత’కు స్వచ్ఛ జిల్లా పురస్కారం

ఆంధ్రప్రదేశ్ లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత నిర్వహణలో ఉత్తమంగా నిలిచిన పట్టణాలు, జిల్లాలకు ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర పురస్కారాలను ప్రకటించింది. ఈ పురస్కారాలను సోమవారం (అక్టోబర్ 2) విజయవాడలో ప్రదానం చేస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారా ప్రదానోత్సవం జరుగుతుంది. ఇక స్వచ్ఛ జిల్లా అవార్డును అనంతపురం దక్కించుకుంది.   ఈ అవార్డుల వివరాలను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ మేనేజింగ్ డైరెక్టర్  అనీల్‌కుమార్‌రెడ్డి శనివారం( అక్టోబర్ 4)  ప్రకటించారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏటా ఇచ్చే ఈ అవార్డులలో  మూడు లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల విభాగంలో  మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు తాడిపత్రి, బొబ్బిలి మున్సిపాలిటీలు అగ్రస్థానాల్లో నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,326 మంది ఈ పురస్కారాలకు ఎంపిక చేయగా, వారిలో  రాష్ట్రస్థాయిలో 69 మంది, జిల్లా స్థాయిలో 1,257 మంది ఉన్నారు. 

నిరాడంబరంగా విజయ్ దేవరకొండ, రష్మికల వివాహ నిశ్చితార్థం

టాలీవుడ్ లో మరో ప్రేమజంట పెళ్లి పీటలు ఎక్కనుంది. గత కొంత కాలంగా విజయ్ దేవర కొండ, రష్మిలకు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వారిరువురి ప్రేమాయణం నిజమేనని తేలిపోయింది. ఇరువురి వివాహ నిశ్చితార్థం శనివారం (అక్టోబర్ 4) ఉదయం విజయ్ దేవరకొండ నివాసంలో జరిగింది. గోప్యంగా జరిగిన ఈ వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహిత బంధువులు, స్నేహితులు హాజరయ్యారు.  ఇరువురూ కలిసి తొలి సారిగా గీత గోవిందం అనే సినిమాలో నటించారు. ఆ సినీమా మంచి సక్సెస్ సాధించింది. ఆ సినీమా షూటింగ్ సమయంలోనే ఇరువురి మధ్యా ప్రేమ చిగురించిందని చెబుతారు. ఆ తరువాత డియర్ కామ్రేడ్ అనే సినీమాలో కూడా విజయ్ దేవరకొండ, రష్మికలు జంటగా నటించారు. అప్పటి నుంచీ వీరి బంధం మరింత బలపడిందని సీనీ వర్గాల టాక్. కలిసి విహార యాత్రలకు వెళ్లడం నుంచి పలు సందర్భాలలో వీరిరువురి ప్రేమగురించిన వార్తలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. అయితే తమ మధ్య ఉన్న ప్రేమ గురించి విజయ్ దేవరకొండ కానీ, రష్మిక కానీ ఇప్పటి వరకూ స్పందించలేదు.   ఇప్పుడు వివాహ నిశ్చితార్థంతో తమ మధ్య ఉన్న అనుబంధాన్ని చాటారని చెప్పాలి. ఇరు కుటుంబాల అంగీకారంతో నిరాడంబరంగా ఇరువురి వివాహ నిశ్చితార్థం జరిగిందని చెబుతున్నారు.  వీరి వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుందని అంటున్నారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిట లాడుతుంటుంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా గత పది రోజులుగా భక్త జన సంద్రంగా మారిన తిరుమలలో ఇప్పుడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో శనివారం (అక్టోబర్ 4) భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తారు. ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఆక్టోపస్ భవనం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 73 వేల 581 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 976 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 60 లక్షలు వచ్చింది.  

మాదన్నపేట బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు

  నేటి సమాజంలో రోజురోజుకీ  మాన వత్వం ,మంచితనం నశించిపోతున్నాయి... డబ్బుకున్న విలువ బంధాలకు, అనుబంధాలకు లేకుండా పోయింది. ఆస్తికోసం కన్న తల్లిదండ్రులు, తోడబుట్టిన వారిని సైతం చంపేందుకు సిద్ధపడుతున్నారు. మాదన్నపేటలో బాలిక హత్య కేసు వెనుక కూడా ఆస్తి తగాదాలే కారణ మని పోలీసులు తేల్చారు. కంచన్బాగ్ లో నివాసం ఉంటు న్న మహమ్మద్ అజీమ్, షబానా బేగం కూతురు హుమేయని సుమ్మయ్య (07).... ఈ బాలిక తన తల్లితో కలిసి మాదన్నపేట చావనిలో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది... అయితే గత రెండు రోజుల నుండి పాప కనిపిం చకపోవడంతో కంగారు పడిన తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా తల్లి షబానా బేగానికి ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్ లో  బాలిక మృత దేహం కనిపించింది.  దీంతో తల్లి షబానా బేగం వెంటనే పోలీ సులకు సమాచా రాన్ని అందించింది. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు పాప చేతులు కాళ్లు కట్టేసి ఉండడంతో ఇంటి సభ్యులే హత్య చేసి ఉంటా రని అనుమానిం చారు. అదే కోణం లో దర్యాప్తు కొనసా గించగా....నిందితుల రంగు బయట పడింది... తల్లి షబానా బేగం కు మరియు ఆమె సోదరుడికి మధ్య గత కొన్నాళ్లుగా ఆస్తి పంపకాల విష యంలో తగాదాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో షబానా బేగం తన కూతురు సుమ్మయ్య ను తీసుకొని తల్లిగారిం టికి వచ్చింది. .. ఒక వైపు ఆస్తి పంపకాల తగాదా... మరోవైపు బాలిక ఇంట్లో బాగా అల్లరి చేస్తుంది. దీంతో విసుగు చెందిన మేనమామ, అత్త ఇద్దరు కలిసి పాప కాళ్లు, చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడ కుండా చేశారు.. కొన ఊపిరితో కొట్టుమిట్టాలుతున్న పాపను తీసుకువెళ్లి ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్ లో పడేశారు. పాపను హత్య చేసి తమ కేమీ తెలియనట్టు నటించారు.. పాప అల్లరి తో పాటు ఆస్తి పంపకాల విష యంలో తేడాలున్న నేపథ్యంలోనే మేనమామ, అత్త కలిసి హత్య చేసిన ట్లుగా పోలీసులు నిర్ధారించారు. పోలీసులు నిందితు లిద్దరిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.  

తిరుమలలో కన్నుల పండువగా భాగ్ సవారి ఉత్సవం

  వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన భాగ్‌ సవారి ఉత్సవం శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్‌సవారి” ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.  పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రేవేశించి మాయమైపోతారు. అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనని విషయం గ్రహించి పశ్చాత్తాపపడుతాడు. వెంటనే అమ్మవారిని బంధీనుండి విముక్తురాలుని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు.  తన భక్తునియొక్క భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు.ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ ”భాగ్‌సవారి” ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. స్వామివారు సాయంత్రం 4 గంటలకు వైభ‌వోత్స‌వ మండ‌పం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకొని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. అంత‌కుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్‌సవారి ఉత్స‌వం సంద‌ర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో తిరుమ‌ల  చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఇతర ఆలయ అధికారులు, శ్రీ‌వారి భక్తులు పాల్గొన్నారు.  

కోటికి పైగా విలువ చేసే అక్రమ మద్యం డంప్ సీజ్

  అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం తయారు చేస్తున్న డంపును ఎక్సైజ్, స్థానిక పోలీసులు సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాలు మేరకు తంబళ్లపల్లె నియోజకవర్గం, మొలకలచెరువులో రూ. కోటికి పైగా విలువ చేసే అక్రమ మద్యం తయారీ డంప్ ను ఎక్సైజ్ అధికారులు శుక్రవారం కనుగొన్నారు. స్థానికంగానే పెద్ద ఎత్తున నకిలీ మధ్యాన్ని తయారు చేస్తున్న 9 మందిని పట్టుకుని ఎక్సైజ్, స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన అక్రమ మద్యం, తయారీకి వినియోగించే యంత్రాలు, ముడిసరుకు సీజ్ చేశారని పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా అక్రమ మద్యం  తయారీ రాజకీయ నాయకుల కనుసన్నల్లో జరుగుతుంది

కమలం నేతల మధ్య కాంట్రాక్టు పనుల రచ్చ

  కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ లో కమలం నేతల మధ్య కాంట్రాక్టు పనుల రచ్చ సొంత పార్టీలో కాక రేగుతోంది. జమ్మలమడుగులో కమలం నేతల మధ్య కాంట్రాక్టు పనుల వ్యవహారం రచ్చ రచ్చగా మారడం జమ్మలమడుగులోనే కాదు జిల్లా రాజకీయాల్లో కూడా రాజకీయ చర్చలకు దారితీశాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో అభివృద్ధి పనులు చేపడుతున్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సి.ఎం రమేష్ కు చెందిన రిత్విక్ కంపెనీ పై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు ఇటీవల దాడులకు పాల్పడ్డారు.  ఈ వ్యవహారం కమలం పార్టీలో వర్గపోరు ను తలపిస్తోంది. సి.ఎం రమేష్ కు చెందిన రిత్విక్ కన్ స్ట్రక్షన్ కంపెనీ గండికోటలో ఏ.పి టూరిజం శాఖ చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపుగా రూ.55 కోట్లు విలువైన అభివృద్ధి పనులను టెండర్లు దక్కించుకుని పనులు చేపడుతున్నారు. ఈ పనులకు సంబంధించి గత‌ నెల 22 న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు.  తమ గ్రామ సమస్యల పరిష్కారం అయిన తర్వాత, అధికారులు చూసిన వెళ్ళిన  తర్వాత పనులు చేపట్టాలని హెచ్చరించారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే ఆదినారాయరెడ్డి వర్గీయులు వాహనాల్లో దాదాపు 50 మంది జమ్మలమడుగు నుండి బయలు దేరి గండికోటలోని రిత్విక్ కన్ స్ట్రక్షన్ కంపెనీ క్యాంప్ ఆఫీస్ పైన, కంటైనర్ దాడి చేసి  ధ్వంసం చేశారు.  అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని దుర్భషలాడి బయటకు పంపారు.  కంప్యూటర్లు, చైర్లు పగలగొట్టారు. గండికోటలోని గుర్రపుశాల వద్ద జెసిబితో చేపడుతున్న పనులను నిలిపివేశారు. గండికోటలో జరుగుతున్న పనులను అర్ధంతంగా నిలిచిపోయ్యాయి. జమ్మలమడుగులో గత కొంత కాలంగా రమేష్ నాయుడు, ఆదినారాయణ రెడ్డి మధ్య అధిపత్యం తారా స్థాయికి చేరుకుంది. ఒకే నియోజకవర్గానికి చెందిన ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు కావడంతో పోలీసులకు సైతం పాలుపోని పరిస్తితి గా మారింది. టిడిపిలో కొనసాగే సమయంలోనే ఈ ఇద్దరి మధ్య ఏర్పడ్డ అగాధం  ప్రస్తుతం బిజెపిలో కొనసాగింపు అన్న చందంగా తయారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా  కావస్తున్నా రమేష్ నాయుడు, ఆదినారాయణ రెడ్డి మధ్య మరింతగా అధిపత్య పోరు  కొనసాగిస్తున్నట్లు కనిపిస్తుంది.  జమ్మలమడుగు స్థానిక ప్రజాప్రతినిదిగా ఆదినారాయణ రెడ్డి కొనసాగుతున్నప్పటికీ ఎంపి రమేష్ నాయుడు అధిపత్యం ఏంటి అన్నది ఆది వర్గీయు లు చెప్పుకొస్తున్నారు. అభివృద్ధి పనుల కాంట్రాక్టు దక్కించుకొని చేపట్టడంలో తప్పేముందని సీఎం రమేష్ వర్గీయులు చెప్పకు వస్తున్నారు. గండికోట అభివృద్ధి పనులను రమేష్ నాయుడు కు చెందిన కన్స్ట్రక్షన్ కంపెని సొంతం చేసుకోవడంతో మరో మారు లోకల్ గా బడా నేతల మధ్య అధిపత్యం తారా స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు . తాజాగా జరిగిన గండికోట గొడవలో ఇద్దరు ప్రజాప్రతినిధులకు చెందిన అనుచరుల మద్య ఉద్రిక్తత పరిస్థితులు దారి తీశాయి.  విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాల మధ్య దాడికి పాల్పడిన కొందరిని అదుపులో తీసుకున్నారు. రిత్విక్ కన్ స్ట్రక్షన్ మేనేజర్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం జమ్మలమడుగు అభివృద్ధిలో ఇద్దరు కమలం పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య కొనసాగుతున్న అధిపత్యం ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందోనని కూటమి నేతలకు పొలిటికల్ టెన్షన్ తప్పడం లేదు.  

తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు...ఎన్ని కోట్లంటే?

  దసరా పండుగ అంటేనే మందు , విందు.... మందు లేనిదే ముక్క కూడా దిగదు.... దసరా సీజన్‌లో జరిగే మద్యం అమ్మకాలే ఇందుకు ప్రత్యేక సాక్ష్యంగా చెప్ప వచ్చు...ఎప్పటిలాగే మందుబాబులు ఈ ఏడాది కూడా దుమ్మురేపాయి... కొన్ని కోట్ల ఆదాయం వచ్చినట్లుగా ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది మద్యం సేల్స్ పెరగడంతో ఎక్సైజ్ శాఖకు కొంత మేరకు ఊరట లభించిందని చెప్పవచ్చు... అసలు ఈ సంవత్సరం దసరా పండగ మరియు గాంధీ జయంతి రెండు ఒకే రోజు వచ్చాయి... దీంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగవని అనుకున్నారు. కానీ  మందుబాబులు ఎవ్వరు ఊహించని రీతిలో కొనుగోలు చేశారు. దీంతో మద్యం అమ్మకాలు అసాధారణ స్థాయిలో జరిగాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి ఈరోజు మద్యం దుకాణాలతోపాటు మాంసం దుకాణాలను కూడా మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మందుబాబులు తెలివిగా ఆలోచించి ఒకటి రెండు రోజుల ముందే ఇంట్లో పెట్టుకోవడానికి వైన్ షాప్ ల వద్ద క్యూలు కట్టారు... ఈ విధంగా మందుబాబులు సెప్టెంబర్ 30, అక్టోబర్ ఒకటో తేదీలలో పెద్ద మొత్తంలో కొనుగోలు జరిపారు. దీంతో ఊహించని స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి... సెప్టెంబర్ 29వ తేదీన 278 కోట్లు అమ్మగా సెప్టెంబర్ 30వ తేదీన 33 కోట్లు విక్రయించారు.  అక్టోబర్ ఒకటో తేదీన 86.23 కోట్లు అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ మూడు రోజుల అమ్మకాలపై 60 నుండి 80% ఇంకా పెరిగాయి... దసరా వారంలో మద్యం అమ్మకాలు దాదాపు 1000 కోట్లకు చేరినట్లుగా అంచనా... మూడు రోజుల్లోనే6.71 లక్షల లిక్కర్ కేసులు, 7.22 లక్షల బీరు కేసులు అమ్ముడుపోయినట్లు సమాచారం... 2024 సెప్టెంబర్ లో 28 38 కోట్లు ఆదాయం రాగా ఈ ఏడాది 2025 సెప్టెంబర్ నెలలో 3048 కోట్లు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు గత ఏడాదితో పోలిస్తే ఏడు శాతం పైగా మద్యం సేల్స్ పెరిగినట్లుగా అధికారులు తెలిపారు..‌ డిస్ట్రిబ్యూటర్లు స్టాక్ అందుబాటులో ఉంచడం వల్లే విక్రయాలు ఊహించని రీతిలో జరిగాయని స్పష్టం వ్యక్తం చేశారు.

ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

  ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినేట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో ల్యాండ్‌ ఇన్సెంటివ్‌ ఫర్‌ టెక్నికల్‌ హబ్స్‌ (లిఫ్ట్) పాలసీ 2024-29  అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.15వేల ఆర్థిక సాయం అందించే పథకాన్ని రేపు ముఖ్యమంత్రి  లాంఛనంగా ప్రారంభించనున్నారు.  కారవాన్‌ పర్యాటకానికి, అమృత్‌ పథకం 2.0 పనులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది.  అమరావతి సహా రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలకు భూకేటాయింపుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కుష్ఠు వ్యాధి పదం తొలగించేందుకు వీలుగా చట్టసవరణ చేయాలని నిర్ణయించింది.  విద్యుత్‌ శాఖకు సంబంధించి పలు ప్రతిపాదనలకు,  కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది.

పెదనాన్న వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య

  ఒకవైపు తండ్రి మరణం....మరోవైపు పెదనాన్న వేధింపులు.... ఇంకోవైపు నానమ్మ తాతయ్య శాపనార్థాలు వీటన్నిటిని భరించలేక ఓ మైనర్ బాలిక బలవన్మరణానికి పాల్పడిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి పోచమ్మ గడ్డలో నివాసం ఉంటున్న అనురాధ అనే మహిళకు అంజలి, పింకీ (17) అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భర్త చనిపోయాడు. అనురాధ ఓ చిన్న ఉద్యోగం చేస్తూ పిల్లలని చదివిస్తుంది.  అయితే అనురాధ నివాసం ఉంటున్న ఇంటిని ఎలాగైనా సరే సొంతం చేసుకో వాలని బావ శీను అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అనురాధ మరియు ఆమె ఇద్దరు పిల్లలను బయటకు పంపాలని నిర్ణయించుకున్న బావ శీను ప్రతిరోజూ  వారితో గొడవపడి మానసికంగా వేధింపు లకు గురి చేయడం మొదలుపెట్టాడు. నిన్న రెండో తేదీన తల్లి ఇంట్లో లేని సమయంలో పెదనాన్న శీను వచ్చి నానా గొడవ చేసాడు.  తన తండ్రి చనిపోయిన తర్వాత అతనికి రావలసిన డబ్బుల కోసం మరియు ఇంటి కోసం సొంత పెదనాన్న వచ్చి ఇంటి ముందు పెద్ద ఎత్తున గొడవ చేస్తూ అవమానపరిచాడు. దీంతో పింకీ(17) తీవ్ర మనస్థా పానికి గురై సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కి చీరతో ఊరేసుకొని ఆత్మ హత్య చేసుకుంది పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒకవైపు నాన్న చనిపోవడం తో అమ్మ ఒక్కతే పని చేస్తూ మా ఇద్దరిని చదివి స్తుంది. ఇంట్లో కావలసిన సరుకులు తీసుకురావడమే కాకుండా నా కాలేజ్ ఫీజు కూడా  కడు తుంది.  ఒక్కతే ఇవన్నీ పనులు చేస్తుంది...మరో వైపు పెదనాన్న ప్రతిరోజు ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉండడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ వింతగా చేస్తు న్నారని... పెదనాన్న డబ్బుల కోసం... తాము ఉంటున్న ఇంటి కోసం.... ఇలా మమ్మల్ని వేధింపు లకు గురి చేస్తు న్నాడని పెదనాన్న తో పాటు నానమ్మ, తాతయ్య కూడా ప్రతిరోజు మమ్మల్ని తిట్టిపోస్తున్నారని.. ఈ అవమానాన్ని భరించలేకే తాను ఆత్మహత్య చేసు కుంటున్నానని తన చావుకు పెదనాన్నే కారణం అంటూ పింకీ తన సూసైడ్ నోట్ లో పేర్కొంది... తన కూతురు మరణానికి కారణమైన శీలను కఠినంగా శిక్షించాలంటూ తల్లి అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతురాలు పింకీ రాసిన సూసైడ్ నోట్ ను ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు...

వైభవంగా శ్రీరామమందిరం శంకుస్థాపన

  నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు పాతపాళెంలో శ్రీరామమందిరం శంకుస్థాపన మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు, గ్రామస్తులు, మత్స్యకారులు పెద్దఎత్తున హాజరై శోభాయమానంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భానికి ముఖ్య అతిథులుగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గీతలు, వేద మంత్రాల నడుమ ఆలయ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా మాజీ మంత్రి  సోమిరెడ్డి  మాట్లాడుతు, “శ్రీ రామచంద్రుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని భక్తిశ్రద్ధలతో చేపట్టిన ఆలయ నిర్మాణానికి నేను ఎల్లప్పుడూ సహకరిస్తాను” అని అన్నారు. మత్స్యకారులు ఎంతో ఆత్మీయంగా కలసి చేపట్టిన ఈ సేవా కార్యక్రమానికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా వీలైనన్ని నిధులు మంజూరు చేసేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.

ఒంటరి ఏనుగు హల్చల్

  చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో ముసలిమడుగు గ్రామం పరిసరాల్లో ఒక ఒంటరి ఏనుగు ప్రజలను హడలెత్తిస్తోంది. ఏనుగుల క్యాంపు దగ్గర ప్రహరీ గోడను తోసేసి లోపలికి దూసుకెళ్లిన ఆ ఏనుగు, అక్కడున్న కుంకి ఏనుగుల వాసన పట్టుకుని వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలోకి చేరిన వెంటనే ఆ ఏనుగు గింకరించడంతో గ్రామస్థులంతా భయంతో పరుగులు తీశారు.  రైతుల పంట పొలాలే ప్రధాన బలైపోయాయి. వరి, చెరుకు, అరటితోటలు తొక్కి నాశనం చేస్తూ ఏనుగు రాత్రింబవళ్లు సంచరిస్తోంది. అప్పులు చేసి పంటలు పండిస్తున్నామని. కానీ ఒక్క రాత్రిలో ఏనుగు వచ్చి మొత్తం పంటలను నాశనం చేస్తోంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో కాపలా కాస్తూ రాత్రంతా నిద్రలేకుండా గడుపుతున్నామని ప్రజలు భయాందోళనకు గురవుతుండగా, రైతుల కష్టాలు బుగ్గిపాలు అవుతుందని వారు వాపోయారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

అలయ్ బలయ్ ఐక్యతకు ప్రతీక : వెంకయ్యనాయుడు

  హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి  ఆధ్వర్యంలో ఆలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గోన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతు వేషభాషలు వేరయిన  వేరయినా అందరం భారతీయులమనే భావనతో కలిసి ముందుకెళ్తున్నామని  వెంకయ్యనాయుడు అన్నారు.“ అలయ్‌ బలయ్‌ అసలైన ఉద్దేశం ఐక్యత, కలిసి ఉండడమే” అని అన్నారు. గత ఇరవై ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయ కృషిని ఆయన ప్రశంసించారు. కులం, మతం, వర్ణం, వర్గం, జాతి పేర్లతో ప్రజలను విభజించే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని స్పష్టం చేశారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చినా భారతీయులమనే బంధంతో అందరం కలిసే ఉంటామన్నారు. అలయ్‌ బలయ్‌ వంటి వేడుకల ద్వారా ఐక్యతా సందేశం వ్యాప్తి చెందడం ఆనందకరమని పేర్కొంటూ, దత్తాత్రేయ, విజయలక్ష్మిలను వెంకయ్యనాయుడు అభినందించారు. ప్రతి సంవత్సరం దసరా పండుగ ముగిసిన మరుసటి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన అతిథులకు దత్తాత్రేయ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ థీమ్‌తో స్టేజ్‌తో ఏర్పాటు చేశారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, సినీ నటులు నాగార్జున, బ్రహ్మానందం, ఏపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి, సీపీఐ నేత నారాయణ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, తెలంగాణ జన సమితి నేత ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వి. హనుమంత రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి.. ఎవరో తెలుసా?

నిర్మాతగా మారిన పారిశ్రామిక వేత్త రామ్ తాళ్లూరి ఇప్పుడు రాజకీయ నాయకుడయ్యారు.  ఔను జనసేన అధినేత రామ్ తాళ్లూరికి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు.  ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. పలు ఐటీ కంపెనీలు ఉన్న వ్యాపార వేత్త అయిన రామ్ తాళ్లూరి.. అటు తరువాత సినిమా నిర్మాతగా కూడా మారారు.   డిస్కో రాజా, నేల టికెట్, చుట్టాలబ్బాయి, మట్కా మరియు మెకానిక్ రాకీ వంటి చిత్రాలను నిర్మించినా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. అది పక్కన పెడితే.. రామ్ తాళ్లూరి ఛారిటీ కార్యక్రమాలు పవన్ కల్యాణ్ దృష్టిని ఆకర్షించాయి. జనసేన ఆవిర్బావం నుంచీ కూడా రామ్ తాళ్లూరి జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలిచారు. గత కొన్నేళ్ల నుంచీ జనసేన సోషల్ మీడియా వింగ్ వ్యవహారాలలో చురుకుగా పాల్గొంటున్నారు.  అలాగే తెలంగాణలో కూడా జనసేన కోసం రామ్ తాళ్లూరి పని చేస్తున్నారు. జనసేన, జనసేనాని పవన్ కల్యాణ్ కు అభిమాని అయినా ఇప్పటి వరకూ రామ్ తాళ్లూరి పవన్ కల్యాణ్ తో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా నిర్మించలేదు. అయినా జనసేన పట్ల అంకిత భావంతో గత పదేళ్లుగా పని చేస్తున్న రామ్ తాళ్లూరిని పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. ముందు ముందు ఆయనకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్న పవన్ కల్యాణ్ కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవిని రామ్ తాళ్లూరికి కేటాయించడం ఆయన నిబద్ధతపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా జనసైనికులు అభివర్ణిస్తున్నారు. 

బీహార్ లో పీకే ప్రభావమెంత?.. లాభమెవరికి.. నష్టం ఎవరిది?

ఒకప్పుడు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే.. ఇప్పుడు తన పార్టీకి తాను ఎన్నికల వ్యూహాలు రచించుకుంటున్నారు. ఔను ఒక్కప్పుడు ఏ రాష్ట్రంలోనైనా ఫలానా పార్టీ అధికారంలోకి రావాలంటే.. ఆ పార్టీకి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల స్ట్రాటజిస్ట్ అయ్యి ఉండాలి అని అంతా భావించారు.   2014 ఎన్నికలలో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరడానికైనా, 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్నా.. అలాగే పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి వరుసగా మూడో సారి అధికార పగ్గాలను అందుకున్నారన్నా.. అందుకు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలే కారణమన్నది  పరిశీలకులు విశ్లేషణ.  అలాంటి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు సొంతంగా జన సురాజ్ పేరుతో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని త్వరలో బీహార్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో ఓంటరిగా రంగంలోకి దిగుతున్నారు. ప్రశాంత్ కిశోర్ స్వరాష్ట్రం బీహార్ అయినప్పటికీ ఈ సారి ఆయన ఎన్నికల వ్యూహాలు ఫలించే అవకాశాలు అంతంత మాత్రమేనన్నది పరిశీలకుల విశ్లేషణ. మూడేళ్ల కిందట సరిగ్గా ఇదే నెలలో ఆయన జగన్ సూరజ్ పార్టీ అధినేతగా బీహార్ లో పాదయాత్ర ఆరంభించారు. అప్పటి నుంచీ రాష్ట్రమంతటా తిరుగుతూనే ఉణ్నారు. ఇప్పటి వరకూ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 5500 గ్రామాలను పాదయాత్ర ద్వారా చుట్టేశారు. భారీ ర్యాలీలు, బహిరంగ సభల వంటివి లేకుండానే.. తన పాదయాత్రలో భాగంగా ఇల్లిల్లూ తిరుగుతున్నారు. భారీ ర్యాలీలూ, ప్రసంగాలకు దూరంగా. ఆయన ప్రజలలో మమేకమై వారి సమస్యల పరిష్కారం విషయంలో గట్టిగా నిలబడతానని హామీ ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ పట్ల యువత ఆకర్షితులౌతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే బీఆర్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ప్రజా హృదయాలను గెలుచుకున్నారంటున్నారు.  బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు, ఓటమి అన్న అంశాల జోలికి పోకుండా జనసురాజ్ పార్టీ అన్ని నియోజకవర్గాలలోనూ పార్టీ వాయిస్ ను వినిపించాలన్న లక్ష్యంతో ప్రశాంత్ కిశోర్ ముందుకు సాగుతున్నారు. విశ్వసీయ సమాచారం మేరకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. బీఆర్ లో ప్రధాన పోరు ఎన్డీయే, ఇండియా కూటముల మధ్యే ఉందని సర్వేలు చెబుతున్నాయి. అంతే కాకుండా స్వల్ప మొగ్గు ఇండి కూటమి (బీహార్ లో మహాఘట్ కూటమి) వైపే ఉందని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. బీహార్ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ జనసూరజ్ పార్టీ కీలక పాత్ర పోషించనుందని ఆ సర్వేలు చెబుతున్నాయి. పార్టీ ఏర్పాటు చేసిన తరువాత తొలి సారి ఎన్పికల రణరంగంలోకి అడుగుపెట్టిన శాంత్ కిషోర్ తన పార్టీ అభ్యర్థులను అన్ని నియోజకవర్గాలలోనూ నిలబెట్టనున్నారు. సర్వేల అంచనా ప్రకారం ప్రశాంత్ కిషోర్ జన సూరజ్ పార్టీ  8 నుంచి 11 శాతం ఓట్లు సాధించే అవకాశాలున్నాయి. అయితే సీట్ల పరంగా మాత్రం ప్రశాంత్ కిషోర్ జీరో నంబర్ తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుందంటున్నారు. ఇక రాష్ట్రంలో నితీష్ కుమార్ ప్రభుత్వం తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని సర్వేలు పేర్కొన్నాయి. ప్రశాంత్ కిశోర్ పార్టీ ఎనిమిది నుంచి 11 శాతం ఓట్లు సాధించడమంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీల్చడమే అవుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆ సంగతి అటుంచితే..ప్రకాంత్ కిషోర్ కొత్త పార్టీతో తొలి సారి ఎన్నికల రణరంగంలోకి దిగి ఆ మాత్రం ఓట్ షేర్ సాధించడంటే మాటలు కాదని అంటున్నారు.