ర‌ష్మిక మంథాన‌కు విజ‌య్‌తో... ఇది ఎన్నో నిశ్చితార్ధ‌మో తెలుసా!

  సినీ జంట‌ల మ‌ధ్య పెళ్లిళ్లు ఈనాటివి కావు. కృష్ణ విజ‌య‌నిర్మ‌ల‌, జీవిత రాజ‌శేఖ‌ర్, స‌మంత నాగ‌చైత‌న్య‌, ఇప్పుడు చూస్తే గీత గోవిందం జంట‌.. ర‌ష్మిక మంథాన‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంథాన కులాలు, ప్రాంతాలు వేర్వేరు. విజ‌య్ సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. తండ్రి వ‌ర్ధ‌న్ దేవ‌ర‌కొండ‌.. ఇండ‌స్ట్రీని ఏలేయ‌డానికి హైద‌రాబాద్ వ‌చ్చారు.  ఇక  దేవ‌ర‌కొండ ప్రొఫైల్ ఏంటో చూస్తే.. ఆయ‌న 1989, మే 9న హైద‌రాబాద్ లో గోవ‌ర్ధ‌న్, మాధ‌వి దంప‌తుల‌కు పుట్టారు. వీరి స్వ‌స్త‌లం తెలంగాణ‌లోని నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా, తుమాన్పేట్ గ్రామం. తండ్రి వ‌ర్ధ‌న్ దేవ‌ర‌కొండ‌కు సినిమాల‌పై ఉన్న మ‌క్కువ కార‌ణంగా విజ‌య్ పుట్ట‌క ముందే హైద‌రాబాద్ వ‌చ్చారు. సినిమా న‌టుడ‌వ్వాల‌నుకున్నారు. కానీ అది కుద‌ర‌క ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో చేశారు. డీడీ వంటి ప‌లు టీవీ చానెళ్ల‌లో డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్ లో ప‌ని చేసి సీరియ‌ల్స్ లో చేస్తూ వ‌చ్చారు.  ఇక విజ‌య్ విద్యాభ్యాసం మొత్తం అనంత‌పురం జిల్లా పుట్ట‌ప‌ర్తి శ్రీస‌త్య‌సాయి ఉన్న‌త పాఠ‌శాల‌లో జ‌రిగింది. ఇక్క‌డే విజ‌య్ కి క‌థార‌చ‌న‌, న‌ట‌న పై మ‌క్కువ ఏర్ప‌డిన‌ట్టు  చెబుతారు విజ‌య్. ఆపై ఇంట‌ర్ హైద‌రాబాద్ లిటిల్ ఫ్ల‌వ‌ర్ కాలేజీలో, బ‌దృకా కాలేజ్ ఆఫ్ కామ‌ర్స్ లో డిగ్రీ కంప్లీట్ చేశారు విజ‌య్.  ఆ త‌ర్వాత నాట‌కాల్లో రాణించిన విజ‌య్.. నువ్విలా సినిమాలో చిన్న పాత్ర‌తో తెరంగేట్రం చేశారు. 2012లో వ‌చ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లోనూ ఒక పాత్ర పోషించారు. 2015లో విడుద‌లైన ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యంలో చేసిన రిషి కేరెక్ట‌ర్ తో బాగా గుర్తింపు వ‌చ్చింది. ఇక 2016లో విడుద‌లైన పెళ్లిచూపులు సినిమాలో హీరో పాత్ర ద్వారా ఆయ‌న న‌ట‌న‌కు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లందాయి. ఇది విజ‌య్ కెరీర్ లో అతి పెద్ద హిట్ గా నిలిచింది. 2017లో ద్వారక‌, అంత‌గా విజ‌యం సాధించ‌లేదు. అదే సంవ‌త్స‌రం విడుద‌లైన అర్జున్ రెడ్డితో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విజ‌య్ దేవ‌ర కొండ క‌ల్ట్ క్లాసిక్, మాస్ ర్యాంపేజ్, ట్రెండ్ సెట్ట‌ర్ వంటి ప‌దాల‌కే కొత్త నిర్వ‌చ‌నం చెప్పారు. ఈ న‌ట విశ్వ‌రూపానికి విజ‌య్ స్టార్ డ‌మ్ ఆకాశానికి అంటింది. 2018 తొలినాళ్ల‌లో వ‌చ్చిన ఏ మంత్రం వేసావెతో మన ముందుకు వచ్చి ఆ సినిమా తో నిరాశ పరిచాడు. మళ్ళీ అదే సంవత్సరంలో వచ్చిన గీత గోవిందంతో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు విజ‌య్. మళ్ళీ వెంటనే 2018లో నోటాతో మరొక పరాజయాన్ని చ‌వి చూసాడు. ఆ తర్వాత 2018లో  టాక్సీవాలాతో మ‌రో చ‌క్క‌టి విజ‌యం న‌మోదు చేశాడు. తాను వివాహ‌మాడ‌బోతున్న ర‌ష్మిక మంథాన‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన చివ‌రి సినిమా మాత్రం 2019లో వ‌చ్చిన డియ‌ర్ కామ్రెడ్. త‌ర్వాత ఈ ఇద్ద‌రి మ‌ధ్య మూవీ లేదు. కానీ వీరికి గీత గోవిందంలో క‌ల‌సి న‌టించ‌డం ద్వారా చిగురించిన ప్రేమ ప‌రిణ‌యానికి దారి తీసిన‌ట్టు తెలుస్తోంది.  అదే ఇప్పుడు వివాహ నిశ్చితార్ధం వ‌ర‌కూ వ‌చ్చింది. ర‌ష్మికా మంథాన 1996 ఏప్రిల్ 5న క‌ర్ణాట‌క‌లోని కొడ‌గు జిల్లాలోని విరాజ్ పేట్ లో జ‌న్మించారు. కూర్గ్ ప‌బ్లిక్ స్కూల్లో చ‌దివిన ర‌ష్మిక  M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిట‌రేచ‌ర్ లో బ్యాచిలర్ డిగ్రీ సాధించారు. రష్మికా బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఇన్- 2014 జాబితాలో చోటు సంపాదించారు. 2016లో ఆమెకు 24వ స్థానం లభించగా, 2017లో తొలిస్థానంలో నిలిచారు.. కిరాక్ పార్టీ అనే క‌న్న‌డ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన ర‌ష్మిక అంచెలంచెలుగా ఎదిగి నేష‌న‌ల్ క్ర‌ష్ అంటూ అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకునే స్థాయికి చేరారు. 2024 అక్టోబ‌ర్ లో ర‌ష్మిక‌ను కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్- I4C కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితుల‌య్యారు.   ఇక్క‌డ మ‌రో ట్విస్ట్  ఏంటంటే.. ర‌ష్మిక త‌న తొలి చిత్రం కిరాక్ పార్టీ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే ర‌క్షిత్ శెట్టి ప్రేమ‌లో ప‌డ్డారు.  2017 జూలైలో వీరి నిశ్చితార్ధం కూడా జ‌రిగింది. త‌ర్వాత ఏమైందో ఏమో వారి మ‌ధ్య అనుబంధం చెడిన‌ట్టుగా క‌నిపిస్తోంది. దానికి తోడు ర‌ష్మిక క‌ర్ణాట‌క బోర్డ‌ర్ దాటి, ఛ‌లోతో తెలుగులోకి ప్ర‌వేశించి ఆపై గీత గోవిందంగా మేడం అనిపించుకుని అటు పిమ్మ‌ట డియ‌ర్ కామ్రెడ్ ద్వారా కామ్రెడ్ బిరుదాంకితురాలై స‌రిలేరు నీకెవ్వ‌రులో అర్ధ‌మ‌వుతోందా! అంటూ ప్రేక్ష‌కుల‌ను చ‌క్కిలిగింత‌లు పెట్టి.. ఇలా చెప్పుకుంటూ పోతే చావాతోనూ నేష‌న‌ల్ వైడ్ పాపుల‌ర్ కావ‌డంతో.. ఆమె నెక్స్ట్ లెవ‌ల్ అన్న పేరు సాధించారు. అలాంటి ర‌ష్మిక‌తో లైగ‌ర్, కింగ్ డ‌మ్ వంటి విరుస ప‌రాజ‌యాలు ఎదుర్కుంటున్న ఈ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ తో నిశ్చితార్ధం వ‌ర‌కూ వ‌చ్చింది ఆమె ప్రేమ వ్య‌వ‌హారం. ఈ నిశ్చితార్ధ‌మైనా ర‌ష్మిక జీవితంలో క‌ళ్యాణ  గ‌డియ‌లు తీస్కురావాల‌ని.. పీపీపీ డుండుండుం మోత మోగించాల‌ని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ విజ్-ర‌ష్. పెయిర్.. హ్యాపీ మేరీడ్ లైఫ్!!!

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంలో పిటిషన్‌

  తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం సుప్రీం కోర్టుకు చేరింది.  రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ  వంగ గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి సెప్టెంబరు 29న సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈనెల 6న పిటిషన్‌పై విచారణ జరపనుంది. ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ప్రతివాదులుగా చేర్చారు.  రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దంటూ గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పును పొందుపరిచారు. మరోవైపు రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తోంది. దీనిపై 8న తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. మరోవైపు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ.. మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొన్నాది  

వ‌న్డే కెప్టెన్సీ నుంచి...రోహిత్ ఔట్!

  రోహిత్ శ‌ర్మ‌ను వ‌న్డే కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డంపై పెద్ద ఎత్తున ర‌చ్చ న‌డుస్తోంది. ఒక స‌మ‌యంలో ఆయ‌న ఫ్యాన్స్ భారీ  ఎత్తున సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై ఫైర్ అవుతున్నారు. కార‌ణం 2023 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ రోహిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాకు కోల్పోయాక‌.. ఎలాగైనా స‌రే ఆయ‌న సార‌ధ్యంలోని భార‌త జ‌ట్టు ఈ సారిక క‌ప్పు  కొల్ల‌గొట్టాల‌న్న‌ది ఫ్యాన్స్ డిజైర్, డ్రీమ్, డెస్టినీ, ఎగ్సెట్రా, ఎగ్సెట్రా, ఎగ్సెట్రా. అయితే రోహిత్ ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించి.. ఆ బాధ్యత‌ల‌ను ఇంగ్లండ్‌తో  జ‌రిగిన‌ పీట‌ర్సన్- టెండూల్క‌ర్ సీరీస్ డ్రా చేసిన గిల్ కి అప్ప‌గించారు. ఏది ఏమైనా.. రోకో జంట‌(రోహిత్- కోహ్లీ) ద్వారా వ‌ర‌ల్డ్ క‌ప్ అందుకోవాల‌న్న‌ది అభిమానుల చిర‌కాల కోరిక‌. ఈ క‌ల నెర‌వేర‌కుండానే.. బీసీసీఐ రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీ పై వేటు వేయ‌డం ఎవ్వ‌రూ జీర్ణించుకోలేక పోతున్నారు. అప్ప‌టికీ రోహిత్ ఈ మ‌ధ్య తాను అత్యంత క‌ష్ట‌మైన ఫిట్ నెస్ టెస్టు సైతం పాస‌య్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌నే వ‌న్డే కెప్టెన్ అనుకున్నారంతా. ఈలోగానే భార‌త్ క్రికెట్ బోర్డు.. రోహిత్ ను సార‌ధ్య బాధ్య‌త‌ల నుంచి  త‌ప్పించ‌డంతో.. ఇదీ ప‌రిస్థితి. ఏది ఏమైనా బీసీసీఐ చెప్ప‌క చెప్పిన విష‌య‌మేంటంటే.. రోహిత్ శ‌ర్మ కెరీర్ దాదాపు ముగిసింద‌ని. ఈ లెక్క‌న రోహిత్ మ్యాజిక‌ల్ ఇన్నింగ్స్ ఇక‌పై మ‌నం చూడ్డం ఒక‌ర‌కంగా చెబితే, అసాధ్యం.  ఒక వేళ ప్లేయ‌ర్ గా ఆయ‌న ఏదైనా మెరుపు ఇన్నింగ్స్ ఆడితే దాంతో స‌రిపుచ్చుకోవ‌ల్సిందే త‌ప్ప‌.. వేరే దారి లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు అభిమానులు. బ్యాడ్ ల‌క్ ఫ్యాన్స్. యువ‌ర్ ఆల్ టైం గ్రేట్ కెప్టెన్సీ ఇక దాదాపు క‌నుమ‌రుగే.రోహిత్ ఆల్ టైం గ్రేట్స్ లో ఒక‌రిగా ఎందుకంటారంటే.. మ‌న‌కు వ‌ర‌ల్డ్ క‌ప్పులు అందించిన కెప్టెన్లు ముగ్గురే ముగ్గురు. వారు ఒక‌రు క‌పిల్ కాగా, మ‌రొక‌రు ధోనీ. ఇక మూడో కెప్టెన్ గా వీరి స‌ర‌స‌న  నిలిచిన ఏకైక కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఒక్క‌డే. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ తృటిలో చేజారినా.. ఎట్ట‌కేల‌కు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ అయితే సాధించి భార‌తీయుల మ‌న‌స‌సు చూర‌గొన్నాడు రోహిత్. ఇక‌పై అభిమానులు ఆ స్థాయి విధ్వంస‌క‌ర ఓపెనింగ్ స్టైల్ ని అభిషేక్ లో చూసుకోవ‌ల్సిందేన‌ని నిరాశ వ్య‌క్తం చేస్తోంది యావ‌త్ క్రిక‌ట్ ప్రేమికుల ప్ర‌పంచం.  

ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు

  ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలకు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.  ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వారు తెలిపారు.విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం,   అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నాది.  ఇప్పటికే భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోతున్నాయి. వంశధార, నాగవళి నదులు పొంగి పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది నిరాశ్రయులు అయ్యారు. తాజాగా హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని  ఐఎండీ  తెలిపింది.

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి దారుణ హత్య

  అమెరికాలోని టెక్సాస్ లో గుర్తు తెలియని ఓ వ్యక్తి జరిపిన కాల్పులలో తెలుగు యువకుడు మృతి చెందాడు. దీంతో ఆ యువ కుడి ఇంట్లో విషాదఛా యలు అలుముకున్నాయి. ఎల్బీనగర్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్, టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న పోలే జగన్ మోహన్ కుమారుడు పోలే చంద్రశేఖర్(27)... ఇతను 2023లో అమెరికాలోని టెక్సాస్ లో డెంటల్ సర్జరీ లో మాస్టర్స్ చదువుకోడానికి వెళ్ళాడు. చంద్రశేఖర్ డెల్టన్ లో గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పనిచేస్తున్నాడు.  అయితే ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో గుర్తు తెలియని నల్ల జాతీయుడు తన వాహనంలో గ్యాస్ నింపుకోవడానికి వచ్చి ఒక్కసారిగా చంద్రశేఖర్ పై కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయాడు. ఈ కాల్పుల దాడిలో చంద్రశేఖర్ అక్కడి కక్కడే మృతి చెందాడు. సమా చారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చంద్రశేఖర్ మృతదేహాన్ని హాస్పిటల్ కి తర లించారు.. కొడుకు మరణించాడన్న వార్త వినగానే తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.  ఈ విషయం తెలుసుకున్న వెంటనే సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరియు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తో కలిసి మృతుడి తండ్రి జగన్ మోహన్ ఇంటికి వెళ్లి సంతాపం తెలియజేశారు ‌. తన కొడుకు మృతదేహాన్ని ఇండియాకి తీసుకు వచ్చేందుకు సహా యం చేయాలని హరీష్ రావును కోరారు.  వీలైనంత త్వరగా మృతదే హాన్ని భారతదే శానికి తీసుకువస్తా మని మాజీ మంత్రి హామీ ఇచ్చారు.  

జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక...బీజేపీ త్రిసభ్య కమిటీ

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అధిష్టానం అభ్యర్థి ఎంపిక కోసం నాయకులు, పార్టీ కేడర్ నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు  త్రిసభ్య కమిటీని నియమించింది. ఇందులో  మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, పార్టీ సీనియర్ నేత, అడ్వొకేట్ కోమల ఆంజనేయులు ఉన్నారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.  మరోవైపు కాషాయ పార్టీ నుంచి బరిలో దిగేందుకు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైన విషయం తెలిసిందే. అదేవిధంగా ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీ సుభాష్, మాధవీ లత టిక్కెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  మరోవైపు  బీఆర్‌ఎస్  పార్టీ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత  బరిలో నిలుస్తుందని ఇప్పటికే అధినేత కేసీఆర్ ప్రకటించారు. హస్తం పార్టీ నుంచి  నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్, దానం నాగేందర్, వి.హనుమంత రావు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ అక్టోబర్ 6న స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించి అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు.   

అరకు కాఫీకి బిజినెస్ లైన్ అవార్డు.. అభినందించిన చంద్రబాబు

చంద్రబాబు అరకు కాఫీకి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని అరకు ప్రాంతంలో  సాగయ్యే ఈ కాఫీ రుచిలో మేటి అని గుర్తించిన చంద్రబాబు ఈ కాఫీకి అంతర్జాతీయంగా మంచి  బ్రాండ్ గా గుర్తింపు పొందేలా ప్రోత్సాహం అందించారు. ఒక దశలో ఆయనే స్వయంగా అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. దాదాపు ప్రతి వేదికపైగా ఈ కాఫీ విశిష్ఠతను వివరించారు. తన సతీమణి  నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటనలో భాగంగా అరకు వెళ్లినప్పుడు చంద్రబాబు ప్రత్యేకంగా ఆమెకు ఫోన్ చేసి మరీ అరకు కాఫీ తాగాలని సూచించారు. అప్పట్లో ఈ విషయాన్ని భువనేశ్వరి స్వయంగా మీడియాకు చెప్పి.. తాను అరకు కాఫీ తాగుతున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పట్లో ఈ ఫొటో విపరీతంగా వైరల్ అయ్యింది. అంతేనా అరకు కాఫీ విశిష్ఠతను చంద్రబాబు మోడీకి వివరించి, ఆ కాఫీ రుచి చూపించారు. దీంతో మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ఈ కాఫీ గురించి ప్రస్తావించారు. ఈ కాఫీ సాగుద్వారా అరకు గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగిన విషయాన్ని వివరించారు. ఆ విధంగా అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు అరకు కాఫీని ప్రమోట్ చేశారు. ఇప్పుడు ఆ అరకు కాఫీకి  ప్రతిష్ఠాత్మక బిజినెస్ లైన్ పురస్కారం దక్కింది. ఈ నేపథ్యంలో గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ ఎండీ కల్పన కుమారి, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సుధారాణి శనివారం (అక్టోబర్ 4) ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ప్రతిష్ఠాత్మక  బిజినెస్ లైన్ నుంచి ఫైనాన్షియల్ ట్రాన్స్ ఫర్మేషన్ విభాగంలో పురస్కారం దక్కడంపై వారిని చంద్రబాబు అభినందించారు.  అవార్డును, ప్రశంసా పత్రాన్ని   పరిశీలించారు. జీఐ ట్యాగ్ పొందిన తర్వాత అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ బ్రాండ్ గా మారిందని చంద్రబాబు చెప్పారు. గిరిజన ప్రాంతంలో  సేంద్రియ విధానంలో సాగు అవుతున్న అరకు కాఫీ స్వచ్ఛత, సువాసనలతో పాటు ప్రత్యేక రుచి కూడా కలిగి ఉంటుందన్నారు. ఆ కారణంగానే అరకు కాఫీకి మంచి బ్రాండ్ అనే పేరు వచ్చిందన్న సీఎం.. కాఫీ సాగు ద్వారా అరకులోని గిరిజనుల జీవన శైలిలో మార్పు వచ్చిందన్నారు.  

గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి!

పోలవరం పనులు ఇక రాకెట్ వేగంతో సాగనున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనుల పూర్తికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులకు నిర్దుష్ట గడువు నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై చంద్రబాబు శుక్రవారం (అక్టోబర్ 3) అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పనులు పూర్తి కావాలనీ, అందుకు అనుగుణంగా ప్రణాళికా బద్ధంగా అధికారులు పనుల వేగం పెంచాలని ఆదేశించారు. అదే సమయంలో పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అన్నారు. అవసరమైన అనుమతులను  కేంద్ర జలసంఘం, నిపుణుల కమిటీ నుంచి   తీసుకుని పనుల్ని పూర్తి చేయాలని ఆదేశించారు.  డయాఫ్రం వాల్ మొత్తం 63,656 క్యూబిక్ మీటర్లకు గానూ 37,302 క్యూబిక్  మీటర్ల మేర పనులు పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు. బట్రస్ డ్యామ్ పనులు వందశాతం పూర్తి అయినట్టు తెలిపారు. వైబ్రో కాంపాక్షన్ పనులు కూడా 74శాతం మేర పూర్తయినట్లు సీఎంకు తెలియ చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఈఏడాది డిసెంబరు  నాటికి డయాఫ్రం వాల్ పనులు పూర్తి కావాలన్నారు. ప్రాజెక్టులో ప్రధానమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల్ని నవంబరు 1 నుంచి  ప్రారంభించాలని.. 2027 డిసెంబర్ నాటికి కంప్లీట్ చేయాలని చంద్రబాబు అధికారులకు డెడ్ లైన్ విధించారు. అలాగే.. భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం వంటి వన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు.  దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న పోలవరం వద్ద పర్యాటకులను ఆకర్షించేలా నిర్మాణాలు ఉండాలన్న సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నుంచి భద్రాచలం, పాపికొండలు, దిగువన ధవళేశ్వరం వరకూ వివిధ ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టు కనెక్టివిటీ కింద ఐకానిక్ రోడ్డు నిర్మించాలని స్పష్టం చేశారు. దీనిని జాతీయ రహదారికి అనుసంధానించేలా చూడాలన్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా అఖండ గోదావరి ప్రాజెక్టును చేపట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్టులో పనుల పురోగతిని ఎప్పటి కప్పుడు తెలుసుకునేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆర్టీజీఎస్ కు అనుసంధానించాలని సూచించారు 

ముగిసిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

  తెలంగాణలో సంచలనంగా మారిన పార్టీ ఫిరాయింపు కేసులో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఈరోజు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీరి తరఫు న్యాయవాదులు విచారణలో భాగంగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్‌ల విచారణ ముగిసిన విషయం తెలిసిందే. ఈ నెల 1న జరగాల్సిన విచారణ వాయిదా పడటంతో, మహిపాల్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ఇవాళ స్పీకర్ ఎదుట వాదనలు వినిపించారు. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్‌కి ఫిర్యాదు చేసింది. కానీ, రోజులు గడుస్తున్నా నిర్ణయం రాకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో, స్పీకర్ సంబంధిత ఎమ్మెల్యేలకి నోటీసులు పంపారు. దానం నాగేందర్‌, కడియం శ్రీహరి తప్ప మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని అఫిడవిట్‌ల ద్వారా స్పష్టీకరించారు. ఫిర్యాదుదారులు తమ ఆధారాలను సమర్పించగా, విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారా? లేక మరికొంత సమయం కోరుతారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.  

పొన్నంపై అంజన్ కుమార్ యాదవ్ ఫైర్.. కారణమేంటంటే?

జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపుతోంది. జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న నేతల సంఖ్య భారీగా ఉండటంతో అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్నది తేల్చుకోలేక పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. మీనాక్షి నటరాజన్ ను రంగంలోకి దింపి ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నాలు చేస్తున్నది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ లో మాత్రం అధిష్ఠానం ప్రయత్నాలు అధిష్ఠానానివే..  అన్నట్లుగా ఉంది. ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఇక పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలు టీకెట్ పై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్టీలో విభేదాలు కూడా జూబ్లీ బైపోల్ ముంగిట రచ్చకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్ నాయకుడు  అంజ‌న్ కుమార్ యాద‌వ్ మంత్రి పొన్నం మీద ఫైర్ అయ్యారు. తన కుమారుడు ఎంపీగా ఉండటంపై కామెంట్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు అంజన్ కుమార్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు. జూబ్లీ టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది హైకమాండ్ నిర్ణయిస్తుంది, దీనిపై మాట్లాడడానికి మధ్యలో పొన్నం ప్రభాకర్ ఎవరంటూ ఫైర్ అయ్యారు. పొన్నం ప్రభాకర్ కంటే తాను చాలా సీనియర్ ని అని అంటూ.. కాంగ్రెస్ లో ఒకే కుబుంబం నుంచి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చాలా మంది ఉన్నారంటూ ఓ పెద్ద లిస్టు చెప్పారు. ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టివిక్రమార్క ఉండగా, ఆయన అన్న మల్లు రవి ఎంపీగా ఉన్నారని గుర్తు చేశారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి, మంత్రి కొమటిరెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ల పేర్లు ప్రస్తావించారు. ఇలా ఒకే కుటుంబం నుంచి రెండు పదవులు ఉన్నవారు చాలా మంది ఉన్నారన్నారు. అటువంటప్పుడు తన కుమారుడు ఎంపీ అయితే జూబ్లీ బైపోల్ లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.  ఇక జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి తనకు అన్ని అర్హతలూ ఉన్నాయన్న అంజన్ కుమార్ యాదవ్ పార్టీ అధిష్ఠానం తనకే టికెట్ ఇస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఆ ధీమాతోనే ఆయన ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించేశారు.  జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున కటౌట్ లు ఏర్పాటు చేశారు. ఇంటింటి ప్రచారాన్ని కూడా షురూ చేసేశారు.  

ఆసీస్ సిరీస్‌కు కెప్టెన్‌గా శుభమన్ గిల్

  టీమిండియా వన్డే కెప్టెన్‌గా  శుభమన్ గిల్‌కు బీసీసీఐ  బాధ్యతలు అప్పగించింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ నెల 19 నుంచి ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు  జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికీ చోటు దక్కింది. జస్ప్రీత్ బూమ్రాకు రెస్ట్ ఇచ్చారు. గాయం కారణంగా రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య దూరమయ్యారు. అయితే.. కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించడంతో అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. ఈ మేరకు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మరోవైపు.. మార్చిలో ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ తర్వాత రోహిత్, కోహ్లీ ఇద్దరూ మళ్లీ కనబడలేదు. ఆస్ట్రేలియాలో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ల కోసం భారత జట్లను ఇవాళ సెలక్టర్లు ఎంపిక చేశారు. వన్డే సిరీస్‌లో ఇద్దరికీ స్థానం కల్పించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో 19 రోజుల వ్యవధిలో భారత్‌ ఎనిమిది మ్యాచ్‌లు (3 వన్డేలు, 5 టీ20లు) ఆడనుంది. అక్టోబరు 19న వన్డే సిరీస్‌ ఆరంభమవుతుంది. వన్డే జట్టు : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్(వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ద్రువ్ జురేల్, యశస్వి జైశ్వాల్. ట్వీ20 జట్టు : సూర్య కుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బూమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.

డిజిట‌ల్ బుక్ ఫార్ములా... జగన్‌కే రివ‌ర్స్

  జ‌గ‌న్‌కి ఎంత టైం బ్యాడో చెప్ప‌డానికిదో మ‌చ్చు తున‌క కాబోలు. అదేంటంటే ఆయ‌న డిజిట‌ల్ బుక్ ఓపెన్ చేసి.. మిమ్మ‌ల్ని ఎవ‌రైనా వేధిస్తే.. మ‌రీ ముఖ్యంగా మీరు కూట‌మి ప్ర‌భుత్వం నుంచి అన‌వ‌స‌ర కేసులు ఇత‌ర‌త్రా వేధింపుల‌కు లోనైతే.. మిమ్మ‌ల్ని ఎవ‌రు వేధిస్తున్నారు.. అన్న పూర్తి వివ‌రాల‌ను మీరు మ‌న డిజిట‌ల్ బుక్ లోకి ఎక్కించాలి.. ఆపై మ‌నం అధికారంలోకి వ‌చ్చాక‌.. వారు స‌ప్త స‌ముద్రాల ఆవ‌ల దాగి ఉన్నా వ‌ద‌ల‌కుండా వెంటాడి మ‌రీ రివేంజ్ తీర్చుకుందాం. ఇదీ జ‌గ‌న్ తీస్కొచ్చిన డిజిట‌ల్ బుక్ ప్ర‌ధానోద్దేశం. ఇది చూస్తుంటే రివ‌ర్స్ అయ్యేలా క‌నిపిస్తోంది.. మాములుగా అయితే ఈ డిజిట‌ల్ బుక్ కి ప్ర‌త్య‌ర్ధి  పార్టీలు, మ‌రీ ముఖ్యంగా టీడీపీ, జేఎస్పీ, బీజేపీ వారిపై కంప్ల‌యింట్లు రావాలి. కానీ ఎంత చిత్ర‌మంటే చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధిక సంఖ్య‌లో వైసీపీ  కార్య‌క‌ర్త‌ల నుంచి మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కంప్ల‌యింట్లు రావ‌డంతో ఒక్క‌సారిగా  పార్టీ షాక‌య్యింది. అస‌లు పార్టీ ఇంత ఘోరంగా ఎందుకు ఓడిందో అప్ప‌డు అర్ధ‌మైంద‌ట‌.. జ‌గ‌న్ కి. ఇక్క‌డ మ‌నం ఒక్క‌రే ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా మ‌ద్యం కుంభ‌కోణం వంటి వాటి ద్వారా దోచుకుంటున్నాం. మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతో మంచి వారు, స‌చ్చీలురు అనుకుంటూ వ‌చ్చార‌ట జ‌గ‌న్. కానీ వారు కూడా సేమ్ టూ సేమ్.. అదే ఫ్లో మెయిన్ టైన్ చేస్తున్న‌ట్టు ఆయ‌న‌కు అంత వ‌ర‌కూ అర్ధ‌మ‌య్యింది కాదు. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ ఓట‌మికి ప్ర‌ధాన  కార‌ణం వాలంటీర్లుగానే భావిస్తూ వ‌చ్చారు. అందుకే ఇటీవ‌ల ఒక స్ట్రాంగ్ డెసిష‌న్ తీస్కున్నారాయ‌న‌. ఒక వేళ మ‌నం అధికారంలోకి వ‌స్తే.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసి.. ఆపై కార్య‌క‌ర్త‌ల‌పైనే ఆధార ప‌డాల‌ని భావించిన జ‌గన్ కి డిజిట‌ల్ బుక్ ద్వారా ఈ విష‌యం తెలియ‌డంతో ఏం చేయాలో పాలు పోలేద‌ట‌. మ‌హిళా మంత్రుల‌ని మ‌నం త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీల్లేదని అంటారు ఫ్యాను పార్టీ వ‌ర్గాలు వారు.. రోజా ఆడుదాం ఆంధ్ర ద్వారా,  ర‌జ‌నీ స్టోన్ క్ర‌ష‌ర్ య‌జ‌మానులు, ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల ద్వారా భారీగానే దోచుకున్న‌ట్టు స‌మాచారం. ఉండ‌వ‌ల్లి శ్రీదేవిని అడిగితే విడుద‌ల ర‌జ‌నీ గురించి, ఆమె ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంత వెన‌కేసుకొచ్చారో ఏకంగా ఒక చిట్టా త‌యారు చేశారంటే ప‌రిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు.  అంత భారీగా ఉంటాయి ర‌జ‌నమ్మ లీల‌లు అంటారు ఉండ‌వ‌ల్లి శ్రీదేవిలాంటి కొంద‌రు. స‌రే శ్రీదేవికంటే తాను డాక్ట‌ర్ అయితే ఆరోగ్య శాఖ త‌న‌కివ్వాల్సింది ర‌జ‌నీకిచ్చార‌నే అసూయ ఉండొచ్చ‌ని లైట్ తీస్కుంది పార్టీ అధిష్టానం. ఇప్పుడుగానీ అస‌లు విష‌యం అఫిషియ‌ల్ గా తెలిసి రాలేద‌ట జ‌గ‌న్ కి. అంత‌గా ఆమెపై ఫిర్యాదులు వెల్లువ‌ల అందుతున్నాయ‌ట‌. ఇక రోజా అయితే టీటీడీ చ‌రిత్ర‌లోనే క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో.. టోకెన్లు అమ్మి సొమ్ము చేసుకున్న‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయ్. ఈ విష‌యంపై మా ద‌గ్గ‌ర బోలెడు ఆధారాలున్నాయంటారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. ఇవి మ‌చ్చుకు కొన్ని మాత్ర‌మే.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో.. ఆయా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ద్వారా సాగిన అవినీతి కాండకు జ‌గ‌న్ భారీ మూల్యం చెల్లించుకోవ‌ల్సి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అప్ప‌టికీ లీలా మాత్రంగా వీట‌న్నిటి గురించి విన్న జ‌గ‌న్ వారి వారి ప్రాంతాల నుంచి ఆయా లీడ‌ర్ల‌ను త‌ర‌లించి ఇత‌ర ప్రాంతాల్లో పోటీ చేయించినా ఫ‌లితం లేకుండా  పోయింది. ఇప్పుడు జ‌గ‌న్ కి మ‌రింత స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతున్న విష‌యం ఏంటంటే.. తాను వీరి మాయ‌లో ప‌డిపోయి.. వారు తెర వెన‌క ఏం  చేస్తున్నారో అస్స‌లు ప‌ట్టించుకోలేక పోయాన‌ని తీవ్రంగా బాద ప‌డుతున్నార‌ట‌. ఆ మాట‌కొస్తే వాళ్ల‌ను నిల‌దీసే  ప‌రిస్థితి  కూడా లేదు. అందుకు రీజ‌న్.. తాను కూడా త‌లాపాపం తిలాపిడికెడు అన్న‌ట్టు.. త‌మ హ‌యాంలో చేసిన అవినీతి య‌జ్ఞంలో పీక‌లోతు మునిగి పోయి ఉండ‌ట‌మే.. అన్న‌ది అస‌లు విష‌యంగా తెలుస్తోంది. మ‌రి చూడాలి ర‌జ‌నీతో పాటు మ‌రి ఎంద‌రిపై డిజిటల్ బుక్ లో కంప్ల‌యింట్లు వ‌స్తాయో.

రాహుల్ త‌ర్వాత... గాంధీల శ‌కం ముగిసిన‌ట్టేనా?

  రాహుల్ త‌ర్వాత... గాంధీల శ‌కం ముగిసిన‌ట్టేనా? ఈ ప్ర‌శ్న ఎందుకు త‌లెత్తిందంటే.. తాజాగా వ‌య‌నాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ కేర‌ళ‌లోని అరికోడ్ లో జ‌రిగిన  ర్యాలీలో ప్ర‌సంగించిన త‌ర్వాత  త‌న ఇద్ద‌రు పిల్ల‌లు మిరాయా, రైహాన్ ల‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేశారు. కాబోయే గాంధీ కుటుంబ వార‌సులుగా వీరిద్ద‌రే అన్న సంకేతాలిచ్చారామె. అయితే ఇక్క‌డొచ్చే చిక్కేంటంటే.. సాంకేతికంగా వీర్ని మిరాయా వాద్రా, రైహాన్ వాద్రాగా పిల‌వాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో చూస్తే రాహుల్ త‌ర్వాత ఈ గాంధీ అన్న శ‌బ్ధం ఈ కుటుంబం చివ‌ర వినిపించ‌డం ఇక మాయ‌మ‌య్యేలా క‌నిపిస్తోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అన్న‌ది గాంధీ కుటుంబ వార‌స‌త్వంగా వింటూ వ‌స్తున్నాం. ఆ మాట‌కొస్తే రాజీవ్ గాంధీని పెళ్లాడిన సోనియా సైతం గాంధీగానే ఇక్క‌డ పిల‌వ‌బ‌డ్డారు. క‌ట్ చేస్తే ఇప్పుడు స‌మ‌స్య ఏంటంటే రాహుల్ త‌ర్వాత ఆ కుటుంబం నుంచి గాంధీ అన్న ఇంటి పేరు దాదాపు క‌నుమ‌ర‌గు కానుంద‌నే చెప్పాలి. కార‌ణం.. రాహుల్ గాంధీకి అధికారికంగా పెళ్లి కాలేదు. ఆపై ఆయ‌న‌కంటూ పిల్ల‌లున్నార‌న్న విష‌యం  కూడా ఎవ‌రికీ తెలీదు. దీంతో ఈ కుటుంబం నుంచైతే గాంధీ అన్న స‌ర్ నేమ్ ఇక‌పై వినిపించే ఛాన్స్ లేదు. రాహుల్ గాంధీయే ఈ ప‌రంప‌ర‌లో చివ‌రి వార‌వుతారు. అయితే ఇక్క‌డ మ‌రొక అవ‌కాశం లేక పోలేదు. అదే మేన‌కాగాంధీ, వ‌రుణ్ గాంధీ. సంజ‌య్ గాంధీ కుమారుడైన‌ వ‌రుణ్ గాంధీ కి కూడా ఇద్ద‌రు కూతుళ్లు. వీరు పేర్లు ఆద్య‌, అన‌సూయ‌. వీరి పేర్ల చివ‌ర గాంధీ అన్న శ‌బ్ధం వినిపిస్తుంది. కానీ వారు కుమార్తెలు కావ‌డంతో. వారి ఇంటి పేరు కూడా మారే అవ‌కాశ‌ముంది. అచ్చం ప్రియాంక గాంధీ వాద్రాలాగా.  మొత్తంగా ఈ త‌రం త‌ర్వాత కూడా ఒక వార‌సుడు.. అది  కూడా గాంధీ అన్న ఇంటి పేరును ప్ర‌పంచం ముందు స‌గ‌ర్వంగా నిల‌ప‌డానికి త‌గిన యోధుడు  క‌నుచూపు మేర క‌నిపించ‌డం లేదు. వ‌చ్చే రోజుల్లో రాహుల్ త‌న ఓట్ల చోరీ ప్ర‌చారం ఫ‌లించి.. పీఎం అయితే.. గాంధీ వంశం నుంచి అయ్యే చివ‌రి పీఎం ఈయ‌నే అవుతారు. ఆ త‌ర్వాత గాంధీల చ‌రిష్మా క్ర‌మేణా క‌నుమ‌రుగ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. బీజేపీ గానీ గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్టి రాహుల్ గాంధీని కూడా రాకుండా చేస్తే.. రాజీవ్ గాంధీయే చివ‌రి గాంధీస్ ఫ్యామిలీ కా పీఎం. అంతే సంగ‌తులు చిత్త‌గించ‌వ‌ల‌యును అన్న‌ట్టుగా మార‌నుంది ప‌రిస్థితి. ఆ మాట‌కొస్తే ఒరిజిన‌ల్ గాంధీకి ప్ర‌తిగా లాల్ బ‌హ‌దూర్ శాస్త్రిని తెర‌పైకి తేవాల‌ని విస్తృతంగా ప్ర‌య‌త్నిస్తోంది ఆర్ఎస్ఎస్.  ఇటీవ‌ల జ‌రిగిన శ‌తాబ్ది ఉత్స‌వాల్లో మోహ‌న్ భ‌గ‌వ‌త్ అన్న మాట ఏంటంటే ఇవాళ గాంధీ జ‌యంతే కాదు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి జ‌యంతి కూడా అన్న కామెంట్ చేశారు. ఈ లెక్క‌న చూస్తే గాంధీ అన్న శ‌బ్ధం విన‌బ‌డ‌కుండా చేయ‌డంలో ఇటు ఒక వ‌ర్గం ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. అటు ఆ కుటుంబం నుంచి కూడా సాంకేతికంగా ఇందుకు స‌హ‌కారం అందుతోన్న విధం క‌ళ్ల‌కు క‌డుతోంది. మ‌రి  మీరేమంటారు!!!

ఆటో డ్రైవర్ల కోసం యాప్.. చంద్రబాబు

రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.   రాష్ట్రంలో స్త్రీ శక్తి' పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆదాయం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లకు అండగా  నిలిచే లక్ష్యంగా ఆటో డ్రైవర్ల సేవలో అనే కొత్త పథకానికి  రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.  ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు రూ. 436 కోట్ల చెక్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి  సీఎం పవన్ కళ్యాణ్ అందజేశారు. ఈ సందర్భంగా  ఆటో డ్రైవర్లకు అనేక కష్టాలు ఉన్నాయి.. గతంలో రోడ్లు గతుకులతో ఆటోలు తరచూ రిపేర్లకు గురయ్యేవి, ఆటో డ్రైవర్ల ఒళ్లు హూనం అయ్యేది ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు.    రాష్ట్రంలోని రోడ్లన్నీ బాగు పడుతున్నాయి. రూ. 3400 కోట్ల రూపాయలు వ్యయం చేసి రోడ్లు బాగు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.  ఇకపై రోడ్లపై గుంతలు పడకుండా చూసుకోవలసిన బాధ్యత మీదేనన్న ఆయన జరిమానాల జీఓ రద్దు చేస్తాం, సీసీటీవీలో అంతా రికార్డ్ అవుతోంది కాబట్టి అందరూ క్రమశిక్షణతో ఉండాలన్నారు. ఆటో డ్రైవర్ల  కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి పాలనలో ప్రజల కష్టాలు తీరాయని చెప్పిన చంద్రబాబు.. సంక్షేమం లబ్ధిదారుల దరికి చేరిందన్నారు. ఆటో డ్రైవర్ల కోసం ఒక యాప్ తయారు చేస్తామని చెప్పిన ఆయన ఆ యాప్ ద్వారా బుకింగ్ లు వచ్చేలా చేస్తామన్నారు. ఇకపై ఆటో స్టాండ్ లకు వెళ్లి పడిగాపులు పడే అవసరం లేకుండా ఆటో డ్రైవర్లకు గిరాకీ లభించేలా సాంకేతికత ద్వారా సహకారం అందిస్తామని చెప్పారు.   ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి యాప్ ద్వారా మీకు అవకాశాలు దొరికేలా చేస్తాం. ఆటో, మాక్సి క్యాబ్, క్యాబ్ డ్రైవర్లందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.  మీకు మంచి చేసిన కూటమి ప్రభుత్వం గురించి పది మందికి చెప్పండని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ముందు వరకూ అంటే 16 నెలల కిందటి వరకూ వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయనీ, పాలన ఎక్కడికక్కడ ఆగిపోయిందని చెప్పిన చంద్రబాబు.. తాను అధికార పగ్గాలు చేపట్టిన తరువాత మళ్లీ అన్నిటినీ గాడిన పెట్టానని చెప్పారు.అంతకు ముందు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఉంవల్లి నుంచి ఆటోలో వేదిక వద్దకు వచ్చారు. 

పీకే నీకు ద‌మ్ముంటే... బీహార్ కింగ‌య్యి చూపించు!

  పీకే అంటే ప‌వ‌న్ క‌ళ్యాన్ మాత్ర‌మే కాదు ప్ర‌శాంత్ కిషోర్ అని కూడా. ఒక ద‌శ‌లో రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఒక ఊపు ఊపింది పీకే మేనియా. 2019 ఎన్నిక‌ల్లో మొద‌ట టీడీపీ చేస్కోవ‌ల్సిన పీకే ఒప్పందం త‌ర్వాత జ‌గ‌న్ ఎగ‌రేసుకుపోవ‌డం. ఆయ‌నిచ్చిన స‌ల‌హా సూచ‌న‌ల‌తో.. ప్ర‌త్యేక హోదా డ్రామాలాడి ఎలాగోలా జ‌గ‌న్ గెల‌వ‌డం ఒక గ‌త చ‌రిత్ర‌. దీంతో పీకే ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల మీద ప‌డ్డం క్ర‌మేణా మొద‌లైంది. అక్క‌డి నుంచి పీకే, ఆయ‌న ఐ ప్యాక్ టీం వేరు వేరుగా మార‌డం.. ఆపై ఆయ‌న శిష్యులు రాహుల్ శ‌ర్మ‌, సునీల్ క‌నుగోలు వంటి వారు కూడా ఆయ‌నంత‌టి వారు కావ‌డం. మ‌రీ ముఖ్యంగా  సునీల్ క‌నుగోలు క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ని అదే ఊపులో తెలంగాణ లోనూ కొన‌సాగించి ఇక్క‌డా ఆ పార్టీని గెలిపించ‌డం వ‌ర‌కూ పీకే మానియా య‌ధేచ్చ‌గా న‌డిచింద‌నే చెప్పాలి. గ‌త ఎన్నిక‌ల టైంలో కేసీఆర్‌తో కూడా పీకే మంత‌నాలు జ‌ర‌ప‌డం సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు లేటెస్టుగా పీకే ఏమంటున్నాడంటే.. రేవంత్ బీహారీల‌ను తిట్టార‌నీ.. ఆయ‌న్ను ఎలాగైనా స‌రే ఈ సారికి ఓడించి ప్ర‌తీకారం తీర్చుకుంటానంటారు పీకే. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో అతి క‌ష్టం మీద గెలిచార‌నీ.. ఈసారికి ఆయ‌న్ను ఎలాగైనా స‌రే ఓడించి తీరుతాన‌ని శ‌ప‌థం చేశారు ప్ర‌శాంత్ కిషోర్. ప్ర‌స్తుతం పీకే, ఆయ‌న టీములు వేరు వేరు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ని  నిండా ముంచింది పీకే కి చెందిన ఐప్యాక్ టీమే. ఊహించ‌ని విధంగా మ‌న సీట్ల సంఖ్య పెర‌గ‌బోతుంద‌ని ఊద‌ర‌గొట్టిన ఈ టీం అన్న‌ట్టుగానే జ‌గన్ కి ఎవ‌రూ ఊహించ‌ని విధంగా 11  సీట్లు వ‌చ్చాయి. దీంతో పీకే పెప్ అయిపోయింద‌న్న టాక్ స్ప్రెడ్ అయ్యింది. అలాంటి పీకే ప్ర‌స్తుతం బీహార్ లో జ‌న్ సూర‌జ్ పార్టీ అని ఒక‌దాన్ని పెట్టి..  రాజ‌కీయ‌పు అడుగులు వేస్తున్నా రు. ఈ క్ర‌మంలో ఆయ‌న రాజ‌కీయ భ‌విత‌వ్యానికే దిక్కులేదు. ఆయ‌నొచ్చి ఇత‌రుల రాజ‌కీయ భ‌విత‌వ్యం అంతు  చూస్తామ‌న‌డ‌మేంటి? కింగ్ మేక‌ర్ పొజిష‌న్ నుంచి కింగులా మారుతామ‌న్న తాప‌త్రయం గ‌ల పీకే.. దానిపై మొద‌ట‌ ఫోక‌స్ పెట్ట‌కుండా ఇంకా పాత‌కాలపు స్ట్రాట‌జిస్టు గానే థింక్ చేస్తే ఎలా??? అన్న‌ది మరొక కామెంట్. ఫ‌స్ట్ మీర‌క్క‌డ కింగ‌వ్వండి సార్.. ఇత‌రులను బొంగు చేయ‌డం సంగ‌తి చూద్దాం అన్న‌ది ఆయ‌న‌కు కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు విసురుతున్న స‌వాల్.

కన్నతల్లినే కడతేర్చాడు!

కనీ పెంచిన తల్లిని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకో వలసిన కొడుకు అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో   కల కలం రేపింది. రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన  మానుపాటి ఐల్లమ్మ(50) ను ఆమె కుమారుడే దారుణంగా హత్య చేశాడు. వివరాలిలా ఉన్నాయి.  మానుపాటి ఐల్లమ్మ  కుమా రుడు శ్రీకాంత్(37)   మద్యానికి బానిసై నిత్యం తల్లితో డబ్బుల కోసం గొడవపడేవాడు.     ఇదే క్రమంలో శ్రీకాంత్   మద్యం సేవించి ఆ మత్తులో ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వ మంటు తల్లితో గొడవపడ్డాడు. దుర్భాషలాడాడు. అయినా ఐలమ్మ మాత్రం కుమారుడికి డబ్బులు ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పేసింది. దీంతో ఆగ్రహం పట్టలేని  శ్రీకాంత్ తన తల్లి ఐల్లమ్మ తలపై సుత్తితో గట్టిగా  కొట్టి.... పదునైన చాకుతో ఇమె మెడలో పొడిచి పారిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి,  రక్తపు మడుగులో పడి ఉన్న ఐల్లమ్మను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.   కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

ఆటో నారాయణ!

ఆటో డ్రైవర్ల కష్టాన్ని సీఎం చంద్రబాబు దగ్గరగా చూశారనీ, అందుకే వారి కష్టాలను తీర్చేందుకే  ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి  పొంగూరు నారాయణ అన్నారు.  స్త్రీ శక్తి పథకం వల్ల నష్టపోతున్నామంటూ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో వారికి అండగా నిలిచేందుకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేందుకు చంద్రబాబు ముందుకు వచ్చారని వెల్లడించారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం అమలు చేయడం వల్ల ఏపీ ప్రభుత్వంపై రూ.466 కోట్ల భారం పడనుందని వివరించారు. స్త్రీ శక్తి పథకం వల్ల జీవనోపాధి ఇబ్బంది ఎదురైన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం చేసి సీఎం చంద్రబాబు గొప్ప మనసు చాటుకున్నారని మంత్రి నారాయణ కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న చంద్రబాబు నాయుడు,  ఆటో డ్రైవర్ల కోసం కూడా నూతన పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. అలాగే ఆటో యజమానుల కోసం ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్‌ను కుదించిందని, రూ.20 వేలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ ను ప్రభుత్వం రూ.3 వేలకు తగ్గించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద అందే సహాయం వాహన రిపేర్లు, కుటుంబ అవసరాలు, ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు సీఎం చంద్రబాబుని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా నారాయణ కోరారు.  ఇక పోతే ఆటో డ్రైవర్ల సేవలో పథకం శనివారం (అక్టోబర్ 4) నుంచి ఆరంభమైన సందర్భంగా  ఒంగోలులో జరిగిన ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా చెప్పారు. 

వీధికుక్కల దాడిలో విదేశీ కోచ్ కు గాయాలు

దేశంలో మరీ ముఖ్యంగా దేశరాజధాని నగరంలో వీధికుక్కల బెడద మరో సారి దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో విదేశీ కోచ్ లపై వీధికుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఆ స్టేడియంలో పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనేందుకు కెన్యా కుచెందిన కోచ్ పై స్టేడియం ప్రాంగణంలో వీధికుక్కలు దాడి చేశాయి.  దీంతో ఈ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్లు, సహాయక సిబ్బంది భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.  కెన్యా స్ప్రింట్స్ కోచ్  డెన్నిస్ మరాగియా మ్వాన్జో శుక్రవారం (అక్టోబర్ 3) ఉదయం వార్మప్ ట్రాక్‌పై తమ అథ్లెట్లకు శిక్షణ ఇస్తుండగా వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి.  ఈ దాడిలో ఓ కుక్క కోచ్ కులికాలి పిక్కపై గట్టిగా కరిచింది.   అక్కడే ఉన్న మెడికల్ టీమ్ స్పందించి ఆయనకు ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు   యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే పటిష్ఠ భద్రత ఉన్న స్టేడియం ప్రాంగణంలోనే వీధికుక్కలు ఓ విదేశీ కోచ్ పై దాడి చేసి గాయపరిచన సంఘటన భీతిగొల్పుతోందని పారా అథ్లెట్లు అంటున్నారు. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

కొండాపూర్ లో కూల్చివేతలు.. ఆక్రమణలను తొలగించిన హైడ్రా

హైడ్రా ఆక్రమణలపై మరోసారి కొరడా ఝుళిపించింది. కొండాపూర్ లోని 36 ఎకరాల ప్రభుత్వ భూమిలోని ఆక్రమణలను తొలగించింది.  కొండాపూర్ లోని ఆర్టీఏ కార్యాలయం పక్కన భిక్షపతి నగర్‌లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని కొందరు షెడ్లు వేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వీరంతా చిరు వ్యాపారులే అయినా.. వారు ఆక్రమించి షెడ్లు వేసుకున్న భూమి విలువ 3600 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా. హైడ్రా సిబ్బంది శనివారం ఈ ఆక్రమణలను తొలగించారు.  వ్యాపారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన అధికారులు, వారిని భూమి ఖాళీ చేయమని ఆదేశించారు. కూల్చివేతల సమయంలో ఎవరూ అడ్డు రాకుండా ఆ ప్రదేశానికి రెండు కిలోమీటర్ల దూరంలో బ్యారికేడ్లు నిర్మించి నిలిపివేశారు.  ఈ స్థలంపై కోర్టు వివాదాలన్నీ తేలిపోయి.. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో హైడ్రా శనివారం ఆక్రమణలను తొలగించింది.