వరుడి పేరుకు మ్యాచ్ అయ్యే కానుక.. ఏమిటో తెలుసా?
posted on Dec 19, 2022 @ 1:45PM
పెళ్లి కానుకలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. స్నేహితులు పెళ్లి కానుకగా పాలసీతా ఇచ్చిన ఉదంతాలు చూశాం. అలాగే కండోమ్ లు ఇచ్చిన సందర్బాలు కూడా ఉన్నాయి. అయితే ఉత్తర ప్రదేశ్ లో మాత్రం పెళ్లి కూతురి తండ్రి తన అల్లుడికి ఇచ్చిన కానుక మాత్రం ఎవరికైనా షాక్ కలిగించక మానదు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ నిబంధనల ఉల్లంఘనులు, నేరస్థులు, పన్ను ఎగవేతదారులు ఇలా ఒకరేమిటి తప్పు చేశారనిపిస్తే చాలు వాళ్ల ఇళ్ల మీదకు బుల్ డోజర్లను పంపించేస్తుంటారు. అందుకే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను బుల్డోజర్ సిఎం అని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తుంటారు.
ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కూ, పెళ్లికుమారుడికి వధువు తండ్రి ఇచ్చిన కానుకకూ సంబంధం ఏమిటంటారా? ఉంది. ఆ సంబంధం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే ముందుగా వరుడి పేరు తెలుసుకుని తీరాలి. సరే వివరాల్లోకి వెళితే.. యూపీలోని దేవ్‌గావ్ గ్రామానికి చెందిన రిటైర్డ్ సైనికుడు పరశురామ్ కుమార్తె నేహాకు నౌకాదళంలో పనిచేస్తున్న సౌఖర్ గ్రామానికి చెందిన యోగేంద్ర అలియాస్ యోగికి ఈ నెల 15న వివాహం జరిగింది.
ఈ సందర్భంగా నేహా తండ్రి తన అల్లుడికి ఇచ్చిన కానుక అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురి చేససింది. ఇంతకీ ఆ మామ తన కొత్తల్లుడికి ఇచ్చిన కానుక ఏమిటంటారు. బుల్డోజర్. ఔను బుల్డోజరే. పెళ్లి కొడుకు పేరు యోగి అవ్వడంతో సింబాలిక్ గా ఆయన తన అల్లుడికి బుల్ డోజర్ కానుకగా ఇచ్చాడు. ఇది పెళ్లికి వచ్చిన వారినే కాదు పెళ్లి కుమారుడినీ ఆశ్చర్య పరిచింది.
వరకట్నం వద్దన్న అల్లుడికి ఏదో ఒక బహుమతి ఇవ్వాలని భావించిన మామ తన అల్లుడికి కట్నంగా బుల్డోజర్‌ను ఇచ్చాడు పరశురామ్. ఇది చూసిన అక్కడి వారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. యోగి అన్న పేరున్నందుకు బుల్ డోజర్ బహుమతిగా వచ్చిందా బ్రో.. బాధపడకు.. అన్యాయాన్ని బుల్ డోజ్ చేసేయ్ అంటూ నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు సంధిస్తున్నారు. దీనిపై పెళ్లి కొడుకు యోగి మాట్లాడుతూ.. తాను కట్నం తీసుకోవడానికి నిరాకరించానని, ఎలాంటి డిమాండ్ చేయలేదని, అయితే మామగారు బుల్‌డోజర్‌ను సర్‌ప్రైజ్‌గా బహుమతిగా ఇచ్చారన్నారు.