మళ్లీ వెయ్యి రూపాయల నోట్లు.. నిజమేనా?
posted on Dec 20, 2022 9:26AM
డిమానిటైజేషన్ తరువాత మాయమైపోయిన వెయ్యి రూపాయల నోట్లను మళ్లీ తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయం మేరకు వచ్చే ఏడాది జనవరి నుంచి వెయ్యి రూపాయల నోట్లు చెలామణిలోకి రానున్నాయా? ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వెయ్యి రూపాయల నోట్లు మళ్లీ రాబోతున్నాయన్న చర్చ తెరమీదకు వచ్చింది. త్వరలోనే రెండు వేల రూపాయల నోట్లు పూర్తిగా రద్దవుతాయని, వాటి స్థానంలో తిరిగి వెయ్యి రూపాయల నోట్లు అందుబాటులోకి వస్తాయని ప్రచారం జరుగుతోంది.
అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు వెయ్యి రూపాయల నోట్లు విడుదల కావట్లేదని తెలుస్తోంది. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని ఫ్యాక్ట్ చెక్ తేల్చేసింది. ఇటువంటి ప్రచారాలను నమ్మొద్దని పేర్కోంది. రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడాన్ని ఆర్బీఐ ఎప్పుడో ఆపేసిందని ఇటీవల కేంద్రం లోక్‌సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో త్వరలోనే రెండు వేల రూపాయల నోట్లను కేంద్రం రద్దు చేస్తుందన్న ఊహాగానాలు మెదలయ్యాయి. అలాగే త్వరలో వెయ్యి రూపాయల నోట్ల విడుదల కానున్నాయన్న ప్రచారమూ మొదలైంది.
అయితే ఈ రెండు ప్రచారాలలోనూ వాస్తవం లేదని పీఐబీ అనే ఫ్యాక్ట్ చెక్ సంస్థ తెలిపింది. రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదని అవి పూర్తి స్థాయిలో చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. పీఐబీ సంస్థ ప్రభుత్వ పథకాలపై జరిగే ప్రచారాల విషయంలో వాస్తవాలు వెలికి తీస్తుంది. ప్రజల సందేహాలు తీరుస్తుంది.