జడ్జీల కొరతతో కుప్పలుగా పేరుకుపోతున్న కేసులు
posted on Dec 20, 2022 @ 4:08PM
న్యాయం జరగడం ఆలస్యం అయితే న్యాయం జరగనట్టే అంటారు. ప్రస్తుతం దేశంలో న్యాయం సత్వరంగా జరిగే పరిస్థితే లేదు. ఎందుకంటే న్యాయస్థానాల తీర్పులు వెలువడటంలో అసాధారణ జాప్యం జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం న్యాయమూర్తుల కొరత. పేరుకుపోతున్న అపరిష్కృత కేసుల సంఖ్య లక్షలు దాటేస్తున్నది. వీటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని, న్యాయమూర్తుల సంఖ్య పెంచడంతోనూ సమస్య తీరిపోదనీ నిపుణులు అంటున్నారు. ప్రతిభావంతులైన న్యాయమూర్తులు లభ్యం కావడం లేదని న్యాయ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ చైర్మర్ సుశీల్ మోడీ అన్నారు. సీజేఐ జస్టిస్ చంద్ర చూడ్ అయితే.. కేవలం న్యాయమూర్తల సంఖ్య పెంచడం వల్లనే ఈ సమస్య పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు.
వెరసి ఇరువురూ కూడా సమస్య పరిష్కారానికి కొత్త తరహాలో ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి భావంతులైన, సమర్థులైన హైకోర్టు న్యాయమూర్తులు లభ్యం కావడం తగ్గిపోతుంటే.. మరో వైపు ఏటా పదుల సంఖ్యలో న్యాయమూర్తులు పదవీ విరమణ చేస్తున్నారు. ప్రస్తుతం న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు. కొత్త న్యాయమూర్తుల నియామకం లేకుండా ఏటా పదుల సంఖ్యలో న్యాయమూర్తులు పదవీ విరమణ చేయడం వల్ల కేసుల పరిష్కారం విషయంలో జాప్యం తీవ్రమవ్వడం వినా మరో ప్రయోజనం లేని పరిస్థితి. అందుకే న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును పెంచాలన్న సూచనను సాక్షాత్తూ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నుంచి వచ్చింది.
మొత్తానికి, సుప్రీంకోర్టు, హైకోర్టులలో పేరుకుపోతున్న కేసులను సాధ్యమైనంత త్వరగా తగ్గించడాని కి క్రియాశీల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయంలో ఎలాంటి భిన్నాబిప్రాయం లేదు.
ఇక పెండింగ్ కేసుల విషయానికి వస్తే.. దేశం లోని న్యాయస్థానాలలో మొత్తం 4.70 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అధికారిక సమాచారం. సుప్రీం కోర్టులో 70,154 కేసులు, దేశంలోని 25 హైకోర్టులలో మార్చి నాటికి 58,94,060 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి నివారించడానికి న్యాయ వ్యవస్థలోనే అంతర్గతంగా ఒక సిస్టమ్ డెవలప్ చేసుకోవలసిన అవసరం ఉంది.
పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్యను పరిశీలించడం, నియామకాలను మదింపు చేయడం వంటివి ఆ సిస్టమ్ నియంత్రణ లో ఉండాలి. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించ డానికి ఒక స్ట్రాటజీ అవసరం ఎంతైనా ఉంది. ఉన్నత న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలో ప్రతి కేసు పరిష్కారానికీ ఒక నిర్దిష్ట కాల పరిమితి విధించాల్సి ఉంది.యప డుతున్నారు.
అలాగే ఆన్‌లైన్, డిజిటల్ కోర్టుల ఏర్పాటు ద్వారా న్యాయ వ్యవస్థను ఎక్స్ పాండ్ చేయడం వల్ల కేసుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. అన్నిటి కంటే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే పెండింగ్ కేసుల్లో సింహభాగం ప్రభుత్వానికి చెందినవే. అంటే పెండింగ్ లో ఉన్న కేసుల్లో ఎక్కవ కేసులలో ప్రభుత్వాలే ప్రతివాదులు. ఈ కేసుల పరిష్కారంలో ప్రభుత్వపరంగా ఉండాల్సిన చొరవ ఉండటం లేదు. న్యాయ వ్యవస్థలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు న్యాయ మూర్తుల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఫలితంగా తీర్పులు వెలువరించడంలో జాప్యం అనివార్యమౌతోంది.
హై కోర్టులలో 50 శాతం కూడా న్యాయమూర్తుల కొతర ఉంది. త్వరితగతిన కేసులను పరిష్కరించడానికి తాము చేయగలిగినంత చేస్తున్నామని కేంద్రం ప్రకటనలైతే చేస్తోంది కానీ , ఆచరణలో మాత్రం చొరవ కనిపించడం లేదు. నిజంగా న్యాయం జరగాలంటే ముందు న్యాయవ్యవస్థలో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.