తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభ పరిష్కారం కోసం దిగ్విజయ్ సింగ్
posted on Dec 20, 2022 @ 12:16PM
తెలంగాణ కాంగ్రెస్ లో ముదిరిన సంక్షోభంపై అధిష్ఠానం దృష్టి సారించింది. ఒక వైపు సీనియర్ల అలక, మరో వైపు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి చేరిన నాయకుల రాజీనామాలతో రాష్ట్ర కాంగ్రెస్ లో పరిస్థితులు వేగంగా దిగజారుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ లో సంక్షోభ నివారణకు పార్టీ హైకమాండ్ చర్యలు ప్రారంభించింది. పార్టీలో సీనియర్ నేత, సంక్షోభ నివారణలో దిట్టగా గుర్తింపు పొందిన దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపింది. తెలంగాణ కాంగ్రెస్ సలహాదారు బాధ్యతలను దిగ్విజయ్ సింగ్ కు అప్పగించింది. ఆయన నేడో రేపే రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ పీసీసీ కమిటీల నియామకం రాష్ట్ర కాంగ్రెస్ లో చిచ్చు రేపిన సంగతి విదితమే.
టీపీసీసీ చీఫ్ రేవంత్ కు వ్యతిరేకంగా సీనియర్లంతా కట్టకట్టుకుని విమర్శలు గుప్పిస్తుంటే.. వారికి దీటుగా రేవంత్ వర్గం కూడా గళం విప్పింది. సీనియర్ల విమర్శలు, వ్యాఖ్యలకు నోటితో కౌంటర్ ఇవ్వడమే కాకుండా చేతలతో చెక్ కూడా పెట్టే యత్నం చేసింది. ఇందులో భాగంగానే వలస నేతలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి వర్గం రాజీనామాలతో కౌంటర్ ఇచ్చింది.
టీపీసీసీ కమిటీల్లో పదవులు పొందిన 12 మంది నేతలు తమ తమ పదవులకు రాజీనాలు చేశారు. తాము రాజీనామా చేసి త్యజించిన పదవులను తమను వలస నేతలంటూ కామెంట్లు చేస్తున్న సీనియర్లకు ఇవ్వాలని అధిష్ఠానానికి సూచించారు. ఈ మేరకు వారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ కులేఖ రాశారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ లో పరిస్థితి అదుపుతప్పుతోందని గ్రహించిన పార్టీ హైకమాండ్ డిగ్గీ రాజాను రంగంలోకి దింపింది. ఆయనను టీ కాంగ్రెస్ అడ్వయిజర్ బాధ్యతను అప్పగించింది.నేడో రేపో దిగ్విజయ్ సింగ్ టీ. కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతారని అంటున్నారు.