యువతి కిడ్నాప్
posted on Dec 20, 2022 @ 1:47PM
తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో నిశ్చితార్ధం నిర్ణయించారని నవీన్ రెడ్డి అనే యువకుడు వందల మందితో వచ్చి యువతిని కిడ్నాప్ చేసిన ఘటన మరువక ముందే.. దాదాపు అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. తండ్రితో కలిసి గుడికి వెళ్లి వస్తున్న యువతిని కారులో వచ్చిన కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు.
అడ్డుకోబోయిన తండ్రిని తోసేసి మరీ ఆమెను కారులో ఎక్కించుకుని ఉడాయించారు. కాగా ఈ కిడ్నాప్ వ్యవహారం వెనుకా ప్రేమ వ్యవహారమే ఉందని అనుమానిస్తున్నారు. కాగా తండ్రిని తోసేసి యువతిని కిడ్నాప్ చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో మంగళవారం(డిసెంబర్ 20) జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మాడపల్లికి చెందిన గోలి శాలిని తండ్రితో కలిసి హనుమాన్ ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ కిడ్నాప్ జరిగింది. కాగా అదే గ్రామానికి చెందిన కటుకూరి జాన్ తన కుమార్తెను కిడ్నాప్ చేయించాడని శాలిని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు ఏడాది కింద కూడా జాన్ శాలినిని తీసుకు వెళ్లాడనీ, అప్పటికి శాలిని మైనర్ కావడంతో పోలీసులు జాన్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి శాలినిని తల్లిదండ్రులకు అప్పగించారు.
మైనారిటీ తీరిన శాలినికి వేరే యువకుడితో నిశ్చితార్ధం జరిగిన నేపథ్యంలో ఈ కిడ్నాప్ జరగడంతో పోలీసులు కూడా జాన్ పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శాలిని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజి ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు.