వివేకా హత్య కేసు.. అవినాష్ అరెస్టు సరే.. తరువాతెవరు?
posted on Apr 24, 2023 @ 12:13AM
వివేకా హత్య కేసులో అవినాష్ అరెస్టు అనివార్యమని తేలిపోయింది. అయితే సుప్రీం కోర్టు ఈ కేసు విషయంలో మరో కీలక నిర్ణయం కూడా వెలువరించింది. వివేకా హత్య కేసు దర్యాప్తునకు తాను విధించిన గడువును తానే సడలించి మరో రెండు నెలల గడువు ఇచ్చింది. ఇక్కడ ప్రస్తావించి తీరాల్సిన విషయం ఏమిటంటే.. సీబీఐ గడువు పెంచాలని సుప్రీం కోర్టును కోరలేదు. కానీ సుప్రీం కోర్టు గడువును పొడిగించింది.
అంటే ఇప్పటి వరకూ అవినాష్ రెడ్డి అరెస్టుతో సీబీఐ దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చినట్లేనని ఇక వరుస చార్జిషీట్లు ఉంటాయనీ అంతా భావించారు. అందుకు భిన్నంగా సుప్రీం కోర్టు అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టి వేస్తూ విస్పష్ట తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను తప్పుపట్టింది. ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో ప్రతి అంశాన్నీ సీజేఐ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. ఒక దశలో ఆ పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంటామని అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు సుప్రీంను అభ్యర్థించినా, అందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. చివరకు హైకోర్టులో వాదనలు పూర్తయ్యే వరకైనా అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలన్న అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదుల అభ్యర్థనను సైతం సుప్రీం తోసి పుచ్చింది.
ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు, సీబీఐ దర్యాప్తు గడువును పెంచడం చూస్తుంటూ.. ఈ కేసుకు సంబంధించి మరింత లోతైన దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించిందని భావించాల్సి వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, అలాగే సీఎం సతీమణి భారతి పీఏ నవీన్ ను సీబీఐ ఇప్పటికే విచారించింది. మరో సారి వారిరువురికీ నోటీసులు జారీ చేసి విచారణకు రమ్మని పిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని న్యాయనిపుణులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే అవినాష్ రెడ్డి అరెస్టుతో సీబీఐ దర్యాప్తు కొలిక్కి వచ్చిందని భావించడానికి లేదనీ, ఈ కేసు మూలాల అన్వేషణలో భాగంగా సీబీఐ తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తట్టే అవకాశాలున్నాయనీ అంటున్నారు. కాగా వైఎస్ వివేకానందరెడ్డి కేసులో తాడేపల్లి ప్యాలెస్ పూర్తిగా ఇరుక్కుందన్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతున్నది. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవర్న విషయంలో ఇంత కాలంగా వ్యక్తమౌతున్న అనుమానాలు ఇప్పుడు దాదాపుగా నివృత్తి అయిపోయాయని అంటున్నారు. ఎందుకంటే తొలి సారి అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచినప్పటి నుంచీ వైసీపీ అగ్రనేతల్లో గాభరా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
ఆ తరువాత ముఖ్యమంత్రి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎం సతీమణి భారతి పీఏ నవీన్ లను సీబీఐ విచారించడంతో ఈ కేసులో వెనుక తాడేపల్లి మూలాలున్నాయన్న భావన పార్టీ శ్రేణుల్లోనే బలపడిందని చెబుతున్నారు. అన్నిటికీ మించి సీబీఐ విచారణ పూర్తియన తరువాత కృష్ణ మోహన్ రెడ్డి, నవీన్ అలను స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి తన కారులో కడప విమానాశ్రాయానికి, అక్కడ నుంచి తాడేపల్లి ప్యాలస్ కు చేర్చడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయని అంటున్నారు. అందుకే సుప్రీం కోర్టు వివేకా హత్య కేసు దర్యాప్తును మరో రెండు నెలలు పొడిగించడంతో సీబీఐ దర్యాప్తు మరింత లోతుకు సాగేందుకు మార్గం సుగమమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అలాగే 2019 మార్చి 15న వివేకా హత్యకు గురైన సమయంలో అప్పటి కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను సీబీఐ తాజాగా విచారించడం సంచలనం సృష్టించింది. ఎందుకంటే వివేకా హత్య కేసులో అప్పటి కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ హత్యా స్థలంలో వేలి ముద్రల గురించి, వివేకా శరీరంపై ఉన్న గాయాల గురించి మీడియాకు చెప్పారు. వివేకా నివాసానికి వెళ్లి మరీ విచారణ జరిపారు. ఆయననుంచి తాజాగా సీబీఐ కీలక సమాచారాన్ని రాబట్టిందని అంటున్నారు.