రఘునందన్ కోర్టు మెట్లు ఎక్కనున్నారా?
posted on Apr 25, 2023 @ 10:38AM
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుది ప్రత్యేక శైలి. న్యాయవాద వృత్తినుంచి రాజకీయాల్లో వచ్చి తన వాగ్దాటితో అందరినీ ఆకట్టుకుంటున్న ఈయన ప్రస్తుతం దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిద్యం వహిస్తున్నారు. అయితే రఘునందన్ రావును వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి వాష్ ఔట్ చేయాలని బీఆర్ ఎస్ అధినేత ఎత్తుగడ వేసినట్టు వినికిడి. వచ్చే ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీఆర్ ఎస్ తరపున బలమైన అభ్యర్థిని ఎంపిక చేయాలని పార్టీ అధ్యక్షుడు కే. చంద్ర శేఖరరావు యోచిస్తున్నారు. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ అయిన కొత్త కోట ప్రకాశ్ రెడ్డిని దుబ్బాక నుంచి పోటీ చేయించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశ్ రెడ్డి వరుసగా 2014, 2019 ఎన్నికల్లో మెదక్ లోకసభ నుంచి పోటీ చేసి గెలుపొందారు. మూడోసారి కూడా మెదక్ నుంచి ప్రకాశ్ రెడ్డి గెలుపొందుతారు అని అందరూ ఊహించారు. కానీ మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అతన్ని మెదక్ లోకసభ నుంచి తప్పించి దుబ్బాక అసెంబ్లీకి పరిమితం చేశారు.
గత కొంత కాలంగా కొత్త కోట ప్రకాశ్ రెడ్డి మెదక్ లోకసభ నియోజకవర్గం కంటే దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం మీదే ఎక్కువ కాన్సన్ ట్రేషన్ చేస్తున్నారు. దుబ్బాక ప్రజలతో మమేకమవుతున్నారు. దుబ్బాకలో తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న రఘునందన్ రావు ను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. భాగ్యలక్ష్మి అమ్మవారిపై విద్వేష పూరిత ప్రసంగం చేసిన కేసులో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓవైసీ సోదరులను అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. ఓవైసీ సోదరులకు బెయిల్ ఇప్పించడంలో రఘునందన్ రావు కీలక పాత్ర పోషించారు. అడ్వకేట్ గా మంచి పేరు గడించిన రఘునందన్ రావ్ భారతీయ జనతా పార్టీ నుంచి దుబ్బాక నియోజక వర్గంలో 1,074 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాటి నుంచి నేటి వరకు దుబ్బాక ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్న రఘునందన్ రావును ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని బీఆర్ ఎస్ నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతోంది.
మంత్రి నిరంజన్ రెడ్డి ఇటీవలె రఘునందన్ రావు పై ఘాటు విమర్శలు చేశారు. రాజకీయాల నుంచి రఘునందన్ రావును తరిమి కొట్టాలని బీఆర్ఎస్ చూస్తోంది. రఘునందన్ రావ్ మళ్లీ అడ్వకేట్ ప్రాక్టీసు మొదలు పెట్టాల్సిందేనని బీఆర్ఎస్ శ్రేణులు వాఖ్యానిస్తున్నాయి. రఘునందన్ రావు పూర్వాశ్రమంలో టీఆర్ ఎస్ లో చురుకైన పాత్ర పోషించారు. అతను టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో రహస్యంగా సమావేశమైన ఆరోపణలతో టీఆర్ఎస్ నుంచి వైదొలిగాడు. తర్వాతి కాలంలో బీజేపీలో చేరి దుబ్బాక నుంచి పోటీ చేసి గెలుపొందారు.