అధికారం కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలా?
posted on Apr 24, 2023 @ 2:15PM
కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బిజెపి..మరోమారు అధికారం కోసం ప్రయత్నించడంలో తప్పులేదు. అధికారంలో ఉన్న రాష్టాంల్లో మళ్లీ అధికారంలోకి రావాలనుకోవడంలోనూ తప్పులేదు. అలాగే కొత్తగా తెలంగాణ,ఎపీల్లోనూ కూడా కమలం వికసించాలని కోరుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. ఏ రాజకీయ పార్టీ అయినా.. అధికారం కోసం ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. అధికారం కావాలని ప్రయత్నించడంలోనూ తప్పులేదు.
దేశం అంతా తమ ఏలుబడిలో ఉండాలని కోరుకోవడాన్నీ తప్పుపట్టలేం. అయితే ఆఅధికారం ఎందుకోసం..ఎవరికోసం.. అన్న ప్రశ్నలు వేసుకోవాలి. కేవలం వెూడీని వెూయడానికేనా.. లేక ప్రజలకు మేలు చేయడానికా అన్న జనం, రాజకీయ ప్రత్యర్థులు, పరిశీలకులు సంధిస్తున్న ప్రశ్నలకు బీజేపీ అగ్రనాయకత్వం సమాధానం చెప్పి తీరాలి. పార్లమెంటులో సమస్యలపై చర్చకు సిద్ధం కాని వారు, విపక్షాలు ప్రశ్నించడాన్ని కూడా సహించలేని వారు అధికారం కోసం అర్రుచాడం ఏమిటన్నదే పరిశీలకులు సంధిస్తున్న ప్రశ్న.
అలాగే ప్రజలకు అధికారంలో ఉండగా చేసిన మంచేమిటో చెప్పుకొని మరోసారి అధికారం కోసం జనాలను ఓట్టు అడగాలి. ప్రజలకు మంచి చేసేందుకు ఎవరు ముందుకు వచ్చినా మంచిదే... ఆ పని బిజెపి చేస్తుందనుకుంటే ప్రజలు తప్పకుండా బిజెపినే ఆదరిస్తారు. కానీ బీజేపీ తీరు అందుకు భిన్నంగా ఉంది. అధికారం కోసం ప్రజల మధ్య విభేదాలు, విద్యేషాలు సృష్టించే వ్యాఖ్యలు చేయడానికి కూడా ఆ పార్టీ నేతలు వెనుకాడటం లేదు. తెలంగాణ పర్యటనలో భాగంగా చేవెళ్లలో నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా అభ్యంతరకరమైనవేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ ప్రకటించడం అందులో భాగమేనని అంటున్నారు.
అలాగే మోడీ మరో సారి ప్రధాని కావాలనుకోవడం లో తప్పులేదని, అయితే ఆ పదవి కోసం మరో పార్టీ నాయకుడు ప్రయత్నించడం ఎంత మాత్రం సరికాదన్న అర్ధం వచ్చేలా అమిత్ షా ప్రసంగం సాగింది. దేశంలో పీఎం సీటు ఖాళీగా లేదని అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రధాని పదవికి రెండు పర్యాయాలు మోడీని ప్రజలు ఎన్నుకున్నారు. వారికి మోడీ పాలన నచ్చితే మరో సారి ఆ అవకాశం ఇస్తారు. లేకుంటే.. మరో వ్యక్తికి అవకాశం ఇస్తారు. అంతే కానీ.. ప్రజలు అలా అవకాశం ఇవ్వడానికే వీల్లేదన్న ధోరణిలో అమిత్ షా చేసిన ప్రసంగం ప్రజల విచక్షణను అవమానించడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.