లక్ష్యం లేని బాణం.. షర్మిల
posted on Apr 25, 2023 7:29AM
వైఈసార్ టీపీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ అరంగేట్రానికి శ్రీకారం చుట్టిన సమయంలో చాలా మంది చాలా చాలా అనుమానాలు వ్యక్త పరిచారు. పక్క రాష్ట్రం ఏపీలో, సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా,ఆమె రాష్ట్రం వదిలి తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు వేలు పెటినట్లు? అనే చర్చ విస్తృతంగా జరిగింది.
అప్పట్లోనే ‘షర్మిల ఎవరు వదిలిన బాణం?’. అనే ప్రశ్న ప్రముఖంగా వినిపించింది. అయితే, ఇప్పడు అదొక రకంగా ముగిసన అధ్యాయం. అక్కడి నుంచి ఆమె చాలా దూరం ‘నడిచి’ వచ్చారు. వైఎస్సార్ టీపీ పేరిటి పార్టీని ఏర్పాటు చేశారు. ఆమె బాటలో ఆమె రాజకీయ అడుగులు వేస్తున్నారు. అయితే, ఇప్పుడు మళ్ళీ మరోమారు అదే ప్రశ్న, షర్మిల ఎవరు విసిరిన బాణం అనే ప్రశ్న మళ్ళీ తెరమీదకు వచ్చింది. ఆమె రాజకీయ లక్ష్యం ఏమిటి? ఆమె రియల్ టార్గెట్ ఎవరు? అసలు లక్ష్యం ఉందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఆమె వెంట ఎవరన్నారు, ఎవరు లేరు అనే విషయాన్ని పక్కన పెడితే, వైఎస్ షర్మిల వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు వీకరించినప్పటి నుంచి ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో మహా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అయన కుమారుడు కేటీఆర్,కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావు, మరో ఇంటి చుట్టం సంతోష కుమార్ ఇలా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న కేసీఆర్ కుటుంబం మొత్తాన్నిటార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి, ప్రధాన స్రవంతిలోని ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ నాయకుల కంటే, షర్మిలే తెరాస ప్రభుత్వాన్ని దుమ్ము దులిపేస్తున్నారు.
అయితే ఆ విమర్శలు, ఆ దూకుడు.. ఏ లక్ష్యం లేకుండా ఉంటున్నాయన్నది పరిశీలకుల విశ్లేషణ. నేను నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను.. ఎవరూ ఖండించొద్దు, ప్రతి విమర్శలు చేయవద్దు అన్నట్లుగా ఆమె తీరు ఉందని చెబుతున్నారు. దూకుడుగా వ్యవహరించడం, పోలీసులపై దాడి చేయడం వంటి తీరుతో జనానికి దగ్గర అవ్వచ్చని షర్మిల భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా సోమవారం (ఏప్రిల్ 24) నిరుద్యోగ సమస్యలపై ధర్నాకు సిద్ధమైన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. లోటస్ పాండ్ లోని ఆమె నివాసం నుంచి బయటకు వస్తుంటే.. ధర్నాకు అనుమతి లేదంటూ ఆపారు. దీంతో ఆమె పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, వారితో దురుసుగా ప్రవర్తించారు. చేయి కూడా చేసుకున్నారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ పీఎస్ కు తరలించారు.
అక్కడ నుంచి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రజా ఉద్యమాలలో అరెస్టులు కొత్త కాదు కానీ షర్మిల సోమవారం అరెస్టు కావడానికి దారి తీసిన పరిస్థితులకు ఆమె చేస్తున్న పోరాటానికీ సంబంధం లేదన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను పోలీసులు ధర్నాకు అనుమతి లేదంటూ అడ్డుకుంటే.. కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. అంతే కానీ విధినిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకోవడం వల్ల నేరం చేయడమే అవుతుంది కానీ మరొకటి కాదు. ఈ లాజిక్ ను ఆమె ఎలా మిస్ అయ్యారో అర్ధం కాదు.