అమరావతి లో ఇన్సైడర్ ట్రేడింగ్ నిజంగా జరిగిందా?.. ఇవిగో ఆధారాలు!!
posted on Dec 27, 2019 @ 2:30PM
అమరావతి లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అమరావతి ఒక కులానికి చెందిన రాజధాని అని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రధానంగా ఈ ఆరోపణలతోనే రాజధాని తరలింపు నిర్ణయాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే అసలు అమరావతిలో నిజంగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా? నిజంగానే అమరావతి ఒక కులం గుప్పిట్లో ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
2014 లో అప్పటి అధికార పార్టీ టీడీపీ నేతలు రాజధాని అమరావతిని 29 గ్రామాల్లో ఏర్పాటు చేస్తారని ముందే తెలుసుకొని.. అధికార ప్రకటనకు ముందే రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకి వేల ఎకరాల భూమి కొన్నారని ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా.. ప్రభుత్వం సేకరించిన 33,771 ఎకరాల భూమిలో 15,000 ఎకరాలు పైగా భూమిని రైతులు అమ్ముకున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు.
CRDA వెబ్ సైట్ లో ఎవరెవరి నుంచి ఎంతెంత భూమి సేకరించింది పూర్తీ వివరాలు ఉన్నాయి. 2015 కౌలు లిస్టును గమనిస్తే... 81 శాతం భూమి ఐదు ఎకరాల లోపు ఉన్నవారి చేతిలో ఉంది. 13 శాతం భూమి 5 నుండి 10 ఎకరాలు ఉన్నవారి చేతిలో ఉంది. 3 శాతం భూమి 10 నుండి 15 ఎకరాలు ఉన్నవారి చేతిలో ఉంది. 2.88 శాతం భూమి 15 ఎకరాలకు పైగా ఉన్నవారి చేతిలో ఉంది. 15 ఎకరాల కన్నా ఎక్కువగా పొలం ఉన్న భూయజమానులు సంఖ్య యాభై. వారి చేతిలో ఉన్న మొత్తం పొలం 973 ఎకరాలు. ఈ 973 ఎకరాలలో దేవుడి మాన్యం 447 ఎకరాలు. వక్ఫ్ బోర్డు భూమి 21 ఎకరాలు. అంటే బడా బాబుల వద్ద వందలు వేల ఎకరాలు ఉన్నాయనేది అసత్యమని ఈ లిస్ట్ ని బట్టి అర్థమవుతోంది. అలాగే 15 ఎకరాలకు పైగా పొలం ఉన్నవారి పేర్లను గమనిస్తే ఆ లిస్ట్ లో అన్ని కులాల వారు ఉన్నారు. అంటే 973 ఎకరాలలో దేవుడి మాన్యం, వక్ఫ్ బోర్డు భూమి పోగా మిగిలిన ఆ కొద్ది భూమి కూడా ఒక్క కులం చేతిలో లేదనేది స్పష్టమవుతోంది.
ఇక 2019 కౌలు లిస్టుని గమనిస్తే.. ప్లాట్లు అమ్ముకున్న వారికి కౌలు ఇవ్వరు. అందుకే 2019 కౌలు లిస్టులో రైతుల సంఖ్య 4564 మంది తక్కువగాను, మొత్తం పొలం విస్తీర్ణంలో 5083 ఎకరాలు తక్కువగాను ఉంది. అంటే గడచిన 4-5 సంవత్సరాలలో అమ్మకం జరిగింది 5083 ఎకరాలు మాత్రమే. అంటే ప్రభుత్వ వర్గాలు చెప్తున్నట్టు ప్రభుత్వం సేకరించిన 33,771 ఎకరాలలో 15,000 ఎకరాల అమ్మకం జరిగింది అనేది అసత్యం. దీనిబట్టి చూస్తే అమరావతి లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అమరావతి ఒక కులానికి చెందిన రాజధాని అన్న ఆరోపణల్లో నిజం లేదని అర్థమవుతోంది.