నారదునిగా మారిన కొడాలి నాని.. ధర్మాన సోదరుల మధ్య దూరం పెంచే వ్యాఖ్యలు!
posted on Nov 27, 2019 @ 2:02PM
2019 ఎన్నికల్లో శ్రీ కాకుళం జిల్లాలో ఫ్యాన్ గాలి బలంగానే వీచింది. సిక్కోలులో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 8 చోట్ల వైసీపీ అభ్యర్ధులు గెలిచారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వీచిన వ్యతిరేక పవనాలు సిక్కోలును తాకాయి. దీంతో టిడిపి డీలా పడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత అధికార వైసీపీ నేతల్లో మంచి జోష్ కనిపించింది. ఇక సిక్కోలులో పార్టీకి తిరుగులేదనే తీరులో ఉన్నారు నేతలు. మెజారిటీ సీట్లు సాధించమన్న ధీమా వారిలో ఏర్పడింది. అయితే వైసీపీ అధికారం లోకి వచ్చి 6 నెలలు గడవక ముందే ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కేడర్ ను గందరగోళానికి గురి చేస్తున్నాయని లోకల్ టాక్.
వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధర్మాన కుటుంబం పెద్ద దిక్కుగా చెప్పాలి. పార్టీ ఆవిర్భావ సమయంలో జిల్లాలో వైసీపీ జెండా చేపట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. అలాంటి సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవిని వదిలేసి ధర్మాన కృష్ణదాస్.. వైయస్ జగన్ కు బాసటగా నిలిచారు. అంతేకాదు ఆ పార్టీకి మేమున్నామంటూ కృష్ణదాస్ భార్య పద్మప్రియ పార్టీ జిల్లా బాధ్యతలు స్వీకరించారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న కృష్ణదాస్ కుటుంబానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సముచిత స్థానం కల్పించారు.తన క్యాబినెట్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా క్రిష్ణదాసును నియమించారు. దీంతో విధేయతకు జగన్ పట్టం గట్టారన్న భావన పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది.
ఇక రాజకీయ అనుభవం విషయానికొస్తే ధర్మాన సోదరుల్లో ప్రసాదరావు సీనియర్.. గతంలో ధర్మాన ప్రసాదరావు , క్రిష్ణదాసు వేర్వేరు పార్టీలు ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రసాదరావు సైతం వైయస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరారు. మొన్నటి ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో, క్రిష్ణదాస్ నరసన్నపేట అసెంబ్లీ స్థానంల్లో విజయం సాధించారు. సీనియర్ కాబట్టి ధర్మాన ప్రసాదరావుకే మంత్రి పీఠం దక్కుతుందని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ జగన్ వ్యూహాత్మకంగా ఈ సోదరుల్లో పెద్దవాడైన కృష్ణదాస్ కి మంత్రి కుర్చీ వేశారు.అంతే అప్పటి నుంచి ఈ ధర్మాన సోదరుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.
సిక్కోలులో ఏదైనా ప్రభుత్వం పథకాన్ని లేదా ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు జిల్లా కేంద్రంలో శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. అందులో జిల్లా మంత్రిగా ఉన్న కృష్ణదాస్ ముఖ్య అతిథిగా పాల్గొనడం సహజం. అయితే కృష్ణదాస్ అటెండవుతున్న కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన ప్రసాదరావు డుమ్మా కొడుతుండటం కొత్త చర్చకు దారితీస్తుంది. గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక పత్రాలు జారీ, సన్న బియ్యం పంపిణీ, అగ్రి గోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ, వైయస్ఆర్ వాహన మిత్ర వంటి పలు కార్యక్రమాలనూ జిల్లా అధికార యంత్రాంగం శ్రీకాకుళంలో అట్టహసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో ఎక్కడా ప్రసాదరావు జాడ కనిపించలేదు.
ఇటీవల జరిగిన ఓ పరిణామం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు తెరతీసింది. జిల్లా ఇన్ చార్జి మంత్రిగా నియమితులైన కొడాలి నాని నవంబర్ 14 న సిక్కోలు పర్యటనకు వచ్చారు. అయితే జిల్లా కేంద్రానికి వచ్చిన కొడాలి నాని స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఇంటికి అల్పాహార విందుకు వెళ్లారు. అదే సమయంలో మంత్రి క్రిష్ణదాస్ సైతం కొడాలి వెంట ప్రసాదరావు ఇంటికెళ్లారు. బ్రేక్ ఫాస్ట్ అనంతరం కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఈ అన్నదమ్ములిద్దరి మధ్య మరింత దూరం పెంచాయని స్థానికంగా కొందరు చెప్పుకుంటున్నారు. ఈ జిల్లాలో మంత్రి క్రిష్ణదాస్ ఉండేమి లాభం? స్పీకర్ తమ్మినేని తప్ప మిగతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలెవరూ తెలుగుదేశం పార్టీ పై విమర్శలు చేయడం లేదు అంటూ కొడాలి నాని చురకలంటించారు. అక్కడితో ఊరుకోకుండా అక్కడే ఉన్న కృష్ణదాస్ వైపు చూస్తూ రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ కూడా తమ్మినేని గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయనను చూసైనా నేర్చుకోండి అని కామెంట్ చేశారు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్న మంత్రి కృష్ణదాస్ అక్కడ్నించి వెళ్లిపోయారు. బయటకు వెళుతున్న సమయంలో కృష్ణదాస్ ను ధర్మాన ప్రసాదరావు చిరునవ్వుతొ ఆపి అన్న బయటకు వెళ్లాల్సిన దారి అటుకాదు ఇటూ అంటూ కాస్త వెటకారం ప్రదర్శించారు. అప్పటికే ఆవేశంతో ఉన్న క్రిష్ణదాసు ఆ దృశ్యాలను కెమెరాలో క్లిక్ మనిపిస్తున్న మీడియా వారిపై మండిపడ్డారు.
వాస్తవానికి కృష్ణదాస్ కి సున్నిత మనస్కుడని పేరుంది. అయితే ఇసుక వారోత్సవాలకు హాజరైన మంత్రి కృష్ణదాస్ తన సహజశైలికి భిన్నంగా వ్యవహరించారు. టిడిపి నేతలను ఉద్దేశించి అసభ్య పదాలు వాడేశారు. కృష్ణదాస్ నోటి వెంట అలాంటి మాటలు రావటం చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోయారు. అయితే లోతుగా ఆరా తీస్తే అసలు సంగతి తెలిసింది.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఈ అన్నదమ్ముల మధ్య కొడాలి నాని ఆజ్యం పోశారని స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చర్చించుకుంటుంది.నిజానికి మంత్రి కృష్ణదాస్ కు సిక్కోలులో సహాయనిరాకరణ జరుగుతోందనే చర్చ కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది. జిల్లా కేంద్రంలో జరుగుతున్న మంత్రి పర్యటనల్లో నరసన్నపేట కార్యకర్తల మినహా ప్రసాదరావు అనుచరులెవరూ కనిపించటం లేదు. ఈ తరుణంలో ధర్మాన సోదరుల మధ్య పెరుగుతున్న అంతరం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్న ఆందోళన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పెరుగుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.