మోడీకి పోటీగా చాపకింద నీరులా ఎదుగుతున్న యువ నాయకుడు!!
posted on Dec 23, 2019 @ 4:24PM
రాజకీయ నాయకులు ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటే వారి ప్రసంగం ఆకట్టుకునేవిధంగా ఉండాలి. ప్రసంగంతో ప్రజల్ని ఉత్తేజపరచాలి.. ఆలోచనలో పడేయాలి.. వారి వెంట నడిచేలా చేసుకోవాలి.. అలాంటి వారే తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. బలమైన నాయకుడిగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. ఇందిరా గాంధీ, వాజ్‌పేయి, ఎన్టీఆర్, కరుణానిధి వంటివారు ఆ కోవలోకే వస్తారు. వారి ప్రసంగం ప్రజల్ని ఉత్తేజ పరిచేది. వారి ప్రసంగం వినడం కోసం అప్పట్లో ప్రజలు కొన్ని కిలోమీటర్లు కూడా నడిచి వెళ్లేవారు. అయితే ఈ తరంలో ఆ స్థాయిలో ప్రసంగించే నేతలు కరువయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం ప్రసంగాలతో ఆకట్టుకుంటున్న అతి తక్కువ మంది నాయకుల్లో నరేంద్ర మోడీ ఒకరని చెప్పుకోవచ్చు. ఆయన ప్రసంగం ప్రజల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. అసలు విపక్ష పార్టీల నేతల్లో ఆ స్థాయిలో ప్రజల్ని ఆకట్టుకునే నేతలు లేకపోవడమే మోడీకి కసిసొచ్చిందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. అయితే ఇప్పుడొక యువ నాయకుడు మోడీకి పోటీగా చాపకింద నీరులా బలమైన శక్తిగా ఎదుగుతున్నాడని అంటున్నారు. ఆ యువ నాయకుడు ఎవరో కాదు కన్నయ్య కుమార్.
గతంలో ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా పనిచేసిన కన్నయ్య కుమార్... ఏఐఎస్ఎఫ్ జాతీయ నేతగా, సిపిఐ శక్తివంతమైన నేతగా మంచి పేరు తెచ్చుకున్నాడు. విద్యార్థి సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై పోరాడటంలో కన్నయ్య ముందుంటాడు. ఎందర్నో ఆ పోరాటంలో నడిచేలా చేస్తాడు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం నుండి పౌరసత్వ సవరణ బిల్లు వరకు ఇలా ఎన్నో అంశాలపై కన్నయ్య పోరాటం చేసాడు, చేస్తున్నాడు. కన్నయ్య ప్రభావం ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తోంది. ఆయన ప్రసంగం వినడానికి యువత పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆయన మాటలతో యువతలో కొత్త ఉత్తేజం, ఉత్సాహం ఉప్పొంగుతున్నాయి. ఇక ఇటీవల ఆయన ఆజాదీ నినాదం యువతలోకి బలంగా వెళ్లింది. ఆయన గొంతు వినిపిస్తే చాలు వేల గొంతులు జత కలుస్తున్నాయి. మొత్తానికి ఈ 32 ఏళ్ళ దళిత యువ నాయకుడు.. తన ప్రసంగాలతో యువతని కదిలిస్తూ బలమైన శక్తిగా ఎదుగుతున్నాడు. అతని ప్రస్థానం ఇలాగే కొనసాగితే.. కాన్షీరాం, మాయావతి వంటి శక్తివంతమైన దళిత నాయకుల సరసన చేరినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.