రాజ్యసభలో విజయసాయిరెడ్డికి చుక్కెదురు.. పోలవరం ప్రాజెక్టుపై ప్రశ్నించి అబాసుపాలయ్యారు
posted on Dec 13, 2019 @ 2:11PM
ఏపిలో టిడిపిని ఏదో ఒక విధంగా బోనెక్కించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెగ ఆరాటపడుతున్నారు. ఈ వైఖరి శృతిమించి వారికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని చెప్పుకోవాలి. తాజా విషయం లోకి వస్తే ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఒక ప్రశ్న సంధించారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయట పెట్టాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా గత కాంట్రాక్టర్ కు రూ.2,343 కోట్ల రూపాయల అదనపు చెల్లింపులు జరిగినట్టుగా తెలిసిందన్నారు. పోలవరం హైడల్ ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా రూ.787 కోట్ల రూపాయలను నవయుగ కంపెనీకి చెల్లించినట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఈ అంశాలు నిజమైతే సంబంధిత వివరాలివ్వాలని విజయసాయిరెడ్డి కోరారు.
తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అంటారే విజయసాయిరెడ్డి విషయం లోనూ ఇదే జరిగింది. ఆయన ఆశించింది ఒకటైతే సంబంధిత మంత్రి ఇచ్చిన వివరణ మరో రకంగా ఉంది. విజయసాయిరెడ్డి ప్రశ్నపై రాజ్యసభలో జలశక్తి శాఖ మంత్రి రతన్ లాల్ కఠారియా బదులిచ్చారు. కేంద్ర జల సంఘానికి ఏపీ ప్రభుత్వం నుంచి అందిన తాజా సమాచారాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టులో 2,346 కోట్ల 85 లక్షల రూపాయల అదనపు చెల్లింపులు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తమ దృష్టికి వచ్చిందని కేంద్ర మంత్రి వివరించారు. ఇందులో హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టుకు 787 రూపాయలు అడ్వాన్స్ కూడా చెల్లించినట్లుగా కూడా పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. అయితే 2019 నవంబర్ 13 వ తేదీ న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖ పంపిందని కేంద్ర మంత్రి రతన్ లాల్ కటారియా చెప్పుకొచ్చారు. నిపుణుల కమిటీ అభిప్రాయం కేవలం ప్రాథమిక నిర్థారణ మాత్రమేనని నిధుల విడుదలలో కాని వ్యయంలో కాని ఎటువంటి నిబంధనల ఉల్లంఘింపు జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా లేఖలో పేర్కొన్నదని కేంద్ర మంత్రి చదివి వినిపించారు.
దీంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి నిర్ణయం కూడా కాంపిటెంట్ అథారిటీ అంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదం మేరకే జరిగిందని కూడా రతన్ లాల్ కఠారియా స్పష్టం చేశారు. ఈ అంశాల పై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం దర్యాప్తు కూడా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో అదనపు చెల్లింపులు గురించి కేంద్రమంత సీరియస్ గా లేదని కేంద్ర మంత్రి సమాధానం ద్వారా విజయసాయిరెడ్డికి బోధపడింది. అంతేకాదు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి నిర్ణయమూ ప్రాజెక్టు అథారిటీ ఆమోదం మేరకే జరిగిందని రతన్ లాల్ కటారియా విస్పష్టంగా పేర్కొనడంతో సభలో ఉన్నవారు సైతం ఆశ్చర్యపోయారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో అదనపు చెల్లింపుల గురించి ప్రస్తావించారేగానీ ఆ ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు లేవని రాష్ట్ర ప్రభుత్వమే సదరు లేఖలో పేర్కొన్న విషయాన్ని తెలుగుదేశం నేతలు బయటపెట్టారు. ఈ అంశాన్ని టిడిపి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు సదరు లేఖను తెప్పించుకుని చూసి ఆశ్చర్యపోయారు. ఇదండీ ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్న బూమరాంగైన విచిత్ర సన్నివేశం.