మూడు రాజధానుల ప్రకటన వెనుక బీజేపీ.. జగన్ తో కలిసి మాస్టర్ ప్లాన్!!
posted on Dec 21, 2019 @ 6:39PM
ఏపీలో ఏం జరుగుతోందో.. అసలేం జరగబోతోందో.. అర్థంగాక టీడీపీ కార్యకర్తలు తలలుపట్టుకుంటున్నారు. ఏపీ సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులకి.. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఏంటా అని టీడీపీ కార్యకర్తలు కలవరపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలను ఎక్కువగా కలవరపెడుతోన్న అంశం మూడు రాజధానులు. అసెంబ్లీ సాక్షిగా ఏపీకి మూడు రాజధానులు అంటూ జగన్ చేసిన ప్రకటన.. చంద్రబాబుకి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. జగన్ ప్రకటనని వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమలో పార్టీకి నష్టం. స్వాగతిస్తే పరువుప్రతిష్ఠలకు నష్టం. ఇలా ఎటుచూసినా చంద్రబాబు ఇరుకున పడ్డారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కలవరపడుతున్నారు. అయితే జగన్ మూడు రాజధానుల ప్రకటన వెనుక బీజేపీ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ సపోర్ట్ తోనే ఏపీలో టీడీపీని దెబ్బకొట్టడానికి జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2019 ఎన్నికల తరువాత వైసీపీ, బీజేపీల మధ్య దూరం పెరిగిందని.. అందుకే ఇటీవల జగన్ ఢిల్లీ వెళ్తే అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని మీడియాలో తెగ వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని అంటున్నారు. ఢిల్లీ వెళ్లినప్పుడు జగన్ అమిత్ షాని కలిశారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఆ సమయంలో మూడు రాజధానుల అంశం గురించి చర్చించారట. అమిత్ షా అంగీకారంతోనే జగన్ మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. దీనికి తెరవెనుక విజయసాయి రెడ్డి చక్రం తిప్పారని తెలుస్తోంది. అందుకే మూడు రాజధానుల నిర్ణయంపై బీజేపీ నుండి అంతగా వ్యతిరేకత వ్యక్తమవట్లేదని అంటున్నారు. నిజానికి అమరావతి భూమి పూజకి ప్రధాని మోడీ వచ్చారు. పవిత్ర మట్టిని, గంగ జలాన్ని ఇచ్చి.. అమరావతిని ఢిల్లీ కంటే పెద్ద నగరంగా తీర్చిదిద్దటంలో పూర్తీ సహకారం అందిస్తామని చెప్పుకొచ్చారు. ప్రధాని హోదాలో మోడీ మాట ఇచ్చారు. ఇప్పుడూ ప్రధానిగానే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ప్రధాని మాటని మట్టిలో కలిపేస్తూ జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ బీజేపీ సపోర్ట్ లేకుండా జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మూడు రాజధానుల నిర్ణయం వల్ల బీజేపీకి ఒరిగేదేముంది అనుకోవచ్చు. కానీ దాని వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ ప్రభ తగ్గుతోంది. పలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. జార్ఖండ్ లో కూడా బీజేపీకి చేదు ఫలితాలు తప్పవని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. ఉత్తరాదిలో మొదలైన వ్యతిరేకతను దక్షిణాదితో భర్తీ చేయాలని బీజేపీ భావిస్తోంది. దక్షిణాదిలో బలపడేలా వ్యూహాలు రచిస్తోంది. దానిలో భాగంగానే ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీలో జగన్ ని పావుగా వాడుకొని పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. జగన్ మెడకి బెయిల్ కత్తిని వేలాడదీసి గ్రిప్ లోకి తెచ్చుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొద్దిరోజులుగా జగన్ ని జైలుకి పంపి ఏపీలో బీజేపీ బలపడాలని చూస్తోందని ప్రచారం జరిగింది. కానీ బీజేపీ మాత్రం.. జగన్ జైలు కి వెళ్లడం కంటే.. బయట ఉంటేనే తమ పార్టీకి ప్రయోజనమని భావిస్తోందట. ఇప్పుడు వైసీపీలో ఉన్న వారిలో మెజారిటీ కార్యకర్తలు, నాయకులు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నవారే. ఒకవేళ జగన్ జైలుకి వెళ్లి.. వైసీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే.. వారంతా కాంగ్రెస్ వైపు చూస్తారు కానీ బీజేపీ వైపు చూడరు. అంటే ఏపీలో కాంగ్రెస్ కి బీజేపీనే జీవం పోసినట్టు అవుతుంది. అసలు కాంగ్రెస్ బలపడటం బీజేపీకి ఏమాత్రం నచ్చదు. అందుకే జగన్ ని తమ గ్రిప్ లో పెట్టుకొని గేమ్ ఆడాలని చూస్తోందట. ఏపీలో టీడీపీ ప్లేస్ ని భర్తీ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట. ఈ మూడు రాజధానుల ప్రకటనతో టీడీపీ ఇరుకున పడింది. వ్యతిరేకించినా నష్టమే, సమర్ధించినా నష్టమే. ఒక్కమాటలో చెప్పాలంటే టీడీపీ మనుగడకే ప్రమాదం వచ్చి పడింది. అదే బీజేపీకి కలిసొచ్చే అంశం. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరారు. ఈ మూడు రాజధానుల దెబ్బతో మరింతమంది టీడీపీ నుండి బీజేపీకి క్యూ కడతారు. ఓ రకంగా ఏపీలో వైసీపీకి ప్రత్యమ్నాయ శక్తిగా ఎదిగే అవకాశముంది. జగన్ మెడ మీద బెయిల్ కత్తి వేలాడుతుండటంతో.. ఆయన బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటున్నారని అంటున్నారు. ఓ రకంగా బీజేపీ అజ్ఞాత మిత్రుడిగా మారిపోయి సాయం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ మూడు రాజధానుల ప్రకటనతో టీడీపీ పునాదులను కలిదించి ఆ ప్లేస్ లోకి రావాలని బీజేపీ చూస్తోందని.. టీడీపీని లేకుండా చేయడం జగన్ కి ఇష్టం, జైలుకి వెళ్లడం కష్టం కాబట్టి పూర్తిగా సహకరిస్తున్నారని అంటున్నారు.