యాంటీ స్నోరింగ్ డివైజ్ తో గురకకు చెక్        

ఎన్ని మందులు వాడినా, చికిత్స తీసుకున్నా గురక మిమ్మల్ని వదలడం లేదా? గుర్రు గుర్రు అంటూ చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు ఎందరినో  కుటుంబ సభ్యుసభ్యులకు సైతం దూరం చేసిన సందర్భాలు, గురకవల్ల విడిపోయిన కుటుంబాలు ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు. అంతే కాదు సుదీర్ఘ ప్రయాణంలో సైతం మనలని ఇబ్బంది పెట్టే గురకకు పలు అనారోగ్య కారణాలు ఉన్నాయి. ఒకటి ఊబకాయం, హృద్రోగ సమస్య, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిని గురక పెద్ద సమస్యని వైద్యులు పేర్కొన్నారు. అయితే ఒక చిన్న డివైజ్ తో గురకకు నియంత్రించవచ్చని దాంతో మీరు మీ కుటుంబసభ్యులు, జీవిత భాగస్వామి సైతం ప్రశాంతంగ నిద్రపోవచ్చని నిపుణులు అంటున్నారు. దీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న గురక సమస్యతో బాధ పడుతున్న మిలియన్ల ప్రజలకు ఎట్టకేలకు ముక్తి ప్రసాదించినట్లు అయింది. ముక్కులోని గాలిమార్గం బ్లాక్ కాకుండా నియంత్రిస్తుంది. దీనివల్ల శ్వాస సులభంగా తీసుకోవచ్చు.  స్లీప్ క్వైట్ వల్ల  శ్వాస తీస్కోడమే కాదు గురక చాలా తక్కువగా వస్తుంది నిద్రలోకి జారుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇక దీనిని ఉపయోగించడం సులభమని అంటున్నారు. దీనిని సైలెన్స్ రింగ్ అని  కూడా అంటారు. రింగ్ చాలా సులభం ప్రభావవంతమైనదని అంటున్నారు. ముక్కులో దీనిని సులభంగా అమర్చవచ్చు. దీని ద్వారా వచ్చే  మాగ్నెటిక్ టిప్స్  వాటిని యధా స్థానంలో ఉంచుతుంది. అనేక పరిశోధనలు చేసిన తరువాతే దీనిని  మార్కెట్లోకి తెచ్చినట్లు ఉత్పత్తి దారులు తెలిపారు. స్లీప్ క్వైట్  ఏ వయస్సుల వారైనావాడచ్చు. వాడిన కొద్దిసేపటికే మీముక్కుకు ఏమైందో గమనిస్తారు. స్లీప్ క్వైట్ వల్ల శరీరం, మెదడు ప్రశాంతంగా నిద్రపోతుంది. అనారోగ్యం తగ్గినట్లు కనిపిస్తుంది. ఊపిరితిత్తులలోకి ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోడం వల్ల  ఎక్కువసేపు నిద్రపోగలరు. 100% శాతం రక్షణకల్పిస్తుంది. ఇందులో ఎటువంటి మత్తుమందు లేదు. స్లీప్ క్వైట్ వల్ల ఎటువంటి బ్యాక్టీరియా రాదు. నీటిలో ముంచడం తోనే పరిశుభ్రం చేసుకుని మరలావాడచ్చు. అయితే దీనిని స్టెరిలైజ్ చేసిన ప్లాస్టిక్ కేసులో భద్రంగా ఉంచితే చాలని ఉత్పత్తిదారులు సూచించారు.

కొత్తిమీర…. ఖర్చు తక్కువ…. ఆరోగ్యం ఎక్కువ ...

ధనియాల మొక్కలే ఈ కొత్తిమీర. మంచి సువావన కలిగి ఉంటుంది. వంటకాలలో విరివిగా వాడతారు. కొత్తిమీరతో పచ్చడి కూడా చేస్తారు. దీని శాస్త్రీయ నామము " Coriandrum sativum ". ఆహార పదార్దాల మీద అలంకరించుకోవడానికని భావిస్తే పొరపాటే. మనం తీసుకునే అన్ని రకాల ఆకుకూరలు,కాయగూరల వంటకాలలో విరివిగా వేసి తీసుకోవచ్చు. కొత్తిమిర నిండా విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి . అంతేకాదు సమృద్ధి గా ఐరన్ కుడా లభిస్తుంది .కొత్తిమిర రక్తహీనతను తగ్గిస్తుంది. పొగతాగడం,కేమోతెరఫి వల్ల కలిగే నష్టము తగ్గించడానికి పోరాడుతుంది.. కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది.రక్తనాళాలలో ఆటంకాలను తొలగిస్తుంది.   దీనిని కేవలం వంటింటి పదార్థంగా మాత్రమే కాకుండా కొత్తిమీరను ఔషధంగా కూడా వాడవచ్చు. కొత్తిమీర మొక్క కాండంలోనూ, ఆకుల్లోనూ, గింజల్లోనూ సుగంధ తత్వాలూ, ఔషధ తత్వాలూ అనేకం ఉంటాయి. ఈమధ్య జరిగిన అధ్యయనాల్లో కొత్తిమీర ఫుడ్ పాయిజనింగ్‌లో అత్యంత ప్రయోజనకారిగా పనిచేస్తుందని తేలింది. తాజాగా సేకరించిన కొత్తిమీరలో డుడిసినాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఆహారాన్ని విషతుల్యం చేసే సాల్మనెల్లా బ్యాక్టీరియాని నిర్వీర్యపరుస్తుందని గమనించారు. కొసమెరుపేమిటంటే, సాధారణంగా ఫుడ్ పాయినింగ్‌లో జెంటామైసిన్ వాడుతుంటారు. అయితే దీనికన్నా కొత్తిమీర ప్రభావవంతంగా, సురక్షితంగా పనిచేసినట్లు రుజువయ్యింది. ఇటీవల జరిగిన అధ్యయనాల్లో కొత్తిమీర కార్మినేటివ్‌గా (గ్యాస్ నుంచి ఉపశమనం కలిగించేదిగా) పనిచేస్తుందని తేలింది. అలాగే రిఫ్రిరెంట్‌గా (శరీరాన్ని చల్లపరిచేదిగా), డైయూరిటిక్‌గా (మూత్రాన్ని జారిచేసినదిగా), ఏఫ్రోడైజియాక్‌గా (లైంగిక శక్తిని పెంచేదిగా), యాంటీ స్పాస్‌మోడిక్‌గా (అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేదిగా), హైపోగ్లైసీమిక్‌గా (రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించేదిగా) పనిచేస్తుందని తేలింది. కొత్తిమీర ఆకుల స్వరసాన్ని ఔషధంగా వాడుకోదలిస్తే 10మి.లీ. (రెండు టీస్పూన్లు) మోతాదులో వాడాలి.కొత్తిమీర ఆమాశయాన్ని శక్తివంతం చేయటమే కాకుండా దాని పనితీరును మెరుగుపరుస్తుంది. ఉదరంలో చేరిన గ్యాస్‌ని తగ్గించటంతోపాటు మూత్రాన్ని చేయటం, జ్వరాన్ని తగ్గించటం చేస్తుంది. అలాగే శృంగారానురక్తిని పెంచటం, శ్వాసనాళికల్లో సంచితమైన కఫాన్ని కరిగించి వెలుపలకు వచ్చేలాచేయటం వంటి పనులను కూడా చేస్తుంది. ఉదర కండరాలు పట్టేసి నొప్పిని కలిగిస్తున్నప్పుడు ఉపశమనాన్ని కలిగిస్తుంది.   కొత్తిమీర రసం విటమిన్-ఎ, బి1, బి2, సి, ఐరన్ లోపాల్లో హితకరంగా ఉంటుంది. గృహ చికిత్సలు అజీర్ణం, వికారం, శరీరంలో మంటలు తాజా కొత్తిమీర రసం అజీర్ణం, వికారం, ఆర్శమొలలు, బంక విరేచనాలు, హెపటైటిస్, అల్సరేటివ్ కోలైటిస్(పెద్ద పేగులో వ్రణం తయారుకావటం) వంటి వ్యాధుల్లో హితకరంగా పనిచేస్తుంది. జీర్ణక్రియా సమస్యల్లో కొత్తిమీర రసాన్ని(10-20 మి.లీ) 1 గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకోవాలి. నోటి పూత, నోటి దుర్వాసన, చిగుళ్లవాపు, చిగుళ్లనుంచి రక్తం కారటం. కొత్తిమీర ఆకులను నమిలి మింగుతుంటే నోటికి సంబంధించిన సమస్యల్లో ఉపయుక్తంగా ఉంటుంది. దంతాలు దెబ్బతినకుండా ఉంటాయి. కొత్తిమీర రసానికి లవంగ మొగ్గల పొడి కలిపి వాడితే మరింత హితకరంగా ఉంటుంది.  మొటిమలు, మంగు మచ్చలు చర్మంమీద నల్లని మచ్చలు, పొడి చర్మం, పెద్దసైజు మొటిమలు వంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు చెంచాడు కొత్తిమీర రసానికి చిటికెడు పసుపు చేర్చి కలిపి బాహ్యంగా ప్రయోగించాలి. దీని ప్రయోగానికి ముందు ముఖాన్ని బాగా శుభ్రపరుచుకోవటం అవసరం. దీనిని ప్రతిరోజూ రాత్రి నిద్రకుముందు ప్రయోగిస్తే కొద్దిరోజుల్లోనే చక్కని ఫలితం కనిపిస్తుంది. ముక్కునుంచి రక్తం కారటం, ముక్కులో కొయ్యగండలు పెరగటం (పాలిప్స్) 20గ్రాముల కొత్తిమీర ఆకులకు చిటికెడు పచ్చకర్పూరం పలుకులు కలిపి ముద్దగా నూరి రసం పిండి రెండుముక్కు రంధ్రాలలోనూ రెండేసి చుక్కల చొప్పున వేసుకోవాలి. అలాగే కొద్దిగా రసాన్ని తలకు కూడా రాసుకోవాలి. దీంతో ముక్కునుంచి జరిగి రక్తస్రావం ఆగుతుంది.   ముక్కులో పాలిప్స్ పెరిగిన సందర్భాల్లోకూడా ఇది హితకరంగా ఉంటుంది. నొప్పి, వాపు 20 మిల్లీలీటర్ల కొత్తిమీర రసానికి 10 మిల్లీలీటర్ల వెనిగర్‌ని కలిపి రాసుకుంటే నొప్పి, వాపులనుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్శమొలలు కొత్తిమీర ఆకులను ముద్దగా దంచి ఎర్రగా వేయించిన ఎర్రమట్టికి కలిపి బాహ్యంగా ప్రయోగిస్తే మొలలు ఎండిపోయి నొప్పి, దురదలనుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంనుంచి రక్తస్రావమవటం తాజాగా కొత్తిమీర ఆకులను ముద్దగా దంచి, రసం పిండి, పంచదార కలుపుకొని తాగితే బహిష్టుస్రావం ఎక్కువగా కావటం, ఆర్శమొలలనుంచి రక్తం కారటం వంటి సమస్యలు తగ్గుతాయి. విటమిన్ల లోపం కొత్తిమీరను చట్నీగా చేసుకొని తినాలి. లేదా ప్రతిరోజూ రాత్రి నిద్రకు ముందు తాజాగా తీసిన కొత్తిమీర రసానికి చెంచాడు తేనె కలుపుకొని తాగుతుండాలి. దీనిని క్రమంతప్పకుండా తీసుకుంటే విటమిన్-ఏ, విటమిన్-బి1, విటమిన్-బి6, విటమిన్-సి, లోహం వంటి పదార్థాల లోపం ఏర్పడకుండా ఉంటుంది. ఈ ఆహార చికిత్స క్షయవ్యాధి, ఉబ్బసం, ఎలర్జీలు, మెదడు బలహీనత, కళ్ల బలహీనత వంటి సమస్యల్లో బాగా పనిచేస్తుంది. అమ్మవారు (స్మాల్‌పాక్స్) కొత్తిమీర రసాన్ని తాజాగా తీసి, చెంచాడు రసానికి ఒకటి రెండు అరటి ‘గింజలు’ పొడిని కలిపి రోజుకు ఒకసారి చొప్పున వారంపాటు తీసుకుంటే స్మాల్‌పాక్స్ వంటి పిడకమయ వ్యాధుల్లో నివారణగా సహాయపడుతుంది. స్మాల్‌పాక్స్ వ్యాధి తీవ్రావస్థలో ఉన్నప్పుడు కొత్తిమీర రసాన్ని పరిశుభ్రమైన పద్ధతులతో తీసి, రెండు కళ్లలోనూ చుక్కలుగా వేసుకుంటే కళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. తలనొప్పి, మైగ్రెయిన్ కొత్తిమీర ఆకులను ముద్దగా దంచి కణతలకు, నుదుటికి పూసుకుంటే తలనొప్పి, ఒంటి కణత నొప్పి వంటివి తగ్గుతాయి.  కళ్లమంటలు, కళ్లకలక కొత్తిమీర ఆకులను తాజాగా తెచ్చి, బాగా కడిగి, ముద్దగా నూరి, రసం పిండి, చనుబాలతో కలిపి కళ్లల్లో బిందువులుగా వేసుకుంటే కళ్లమంటలు, కనురెప్పలు అంటుకుపోవటం, కళ్లుమెరమెరలాడటం, కళ్లకలక వంటి సమస్యలు తగ్గుతాయి. నొప్పితో కూడిన వాపులు కొత్తిమీర ఆకులను, బాదం పలుకులతో ముద్దగా నూరి వాపు, నొప్పి ఉన్నచోట పట్టుగా వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. దద్దుర్లు కొత్తిమీర ఆకుల రసానికి తగినంత తేనెనూ బాదాం నూనెనూ కలిపి దద్దురు తయారైనచోట పైకి రాసుకోవాలి. అలాగే పంచదార కలిపి లోపలకు తీసుకోవాలి. విష పురుగులు కుడితే కొత్తిమీర ఆకులను ముద్దగా నూరి బాదం పలుకులనూ, పెసర పిండినీ కలిపి స్థానికంగా ప్రయోగిస్తే విషపురుగులు కరిచినచోట తయారైన నొప్పి,  వాపులు తగ్గుతాయి.  కొత్తిమీర ఆకుల రసానికి కొద్దిగా పంచదార కలిపి తీసుకుంటే మంటలు తగ్గుతాయి. స్మాల్‌పాక్స్ (బృహన్మసూరిక) తాజా కొత్తిమీర రసం స్మాల్‌పాక్స్‌లో నివారణగా పనికి వస్తుంది. దీనిని ఒక చెంచాడు మోతాదులో అరటి పండుతో కలిపి ఏడు రోజులపాటు తీసుకోవాలి. స్మాల్‌పాక్స్‌లో నేత్రాలు దెబ్బతినకుండా కొత్తిమీర రసాన్ని కళ్లలో డ్రాప్స్‌గా వేసుకోవాలి. ధనియాల మొక్కను మనం కొత్తిమీరగా పిలుస్తాము. దీనికి ధనియాల గుణాలన్నీ ఉంటాయి. సాధారణంగా కొత్తిమీరను సువాసనకోసం వంటల్లో వాడుతుంటారు. లేత మొక్కని మొత్తంగా రోటి చట్నీలకోసం వాడుతుంటారు. కొత్తిమీర ఆకులను సూప్స్,  కూరల వంటి వాటికి చేర్చుతుంటారు.   పెదవులు నల్లగా ఉన్నవారు రోజూ రాత్రి పడుకునే ముందు కొత్తిమీర రసం పెదవులపై రాయండి. కొన్ని రోజులకి పెదాలు లేత రంగును సంతరించుకొంటాయి... ఏదైనా కూర వండేటపుడు కాకుండా చివరలో అంటే దించివేసే ముందు వేస్తేనే కూరకు మంచి సువాసన వస్తుంది. కొత్తిమీర త్వరగా వాడిపోకుండా ఉండాలంటే ఓ గ్లాసులో నీరు పోసి వాటి వేర్లు మునిగేటట్లు ఉంచండి. మీ ఇంటి వెనుక కాస్త స్థలం ఉందా?  ఉంటే కాసిన్ని ధనియాలు చల్లి నీరు చిలకరించండి కొత్తిమీర వస్తుంది. ఒకవేళ స్థలం లేకపోయినా పూలకొండీలలో చల్లినా చాలు.

టెస్టోస్టెరాన్ హార్మోన్‌లు... అనారోగ్య సమస్యలు

టెస్టాస్టెరాన్ హార్మోన్ మోతాదు ఎక్కువవుంటే సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్త్రీలలో టెస్టోస్టెరాన్ హార్మోన్లు ఎక్కువగా ఉంటె టైపు 2 డయాబెటీస్ వస్తుందని నిర్దారించారు.టెస్టోస్టెరాన్ వాళ్ళ పురుషులకు పెద్దగా ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. టెస్టోస్టెరాన్ హార్మోన్లు ఉండే స్త్రీలలో వక్షోజాల కాన్సర్, ఏండో మేట్రిమెల్ కాన్సర్ వచ్చేఅవకాలు ఉన్నాయని కూడా వెల్లడించారు. పురుషులలో టెస్టోస్టెరాన్ సమస్యలవల్ల ప్రోస్టేట్ కాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు కనుగొన్నారు. టెస్టోస్టెరాన్ తీవ్రత ఉన్న స్త్రీ పురుషులను వేరు వేరుగా పరీశీలించినట్లు చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ ఎక్సటెర్ యునైటెడ్ కింగ్ డంకు  చెందిన కేతరిన్ రూత్ ఈ విషయాన్ని స్పష్టం చేసారు. న్యూయార్క్ కు చెందిన ఆల్బర్ట్ ఐన్స్టీన్  కళాశాలకు చెందినా కాలేజ్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ జోయల్ జోన్స్ జన్ మాట్లాడుతూ టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉన్నా.. తక్కువైనా సమస్యే అని చెప్పారు. బ్రిటీష్ పరిశోధకులు 425000 మంది స్త్రీ పురుషుల జనటిక్ డాటా సేకరించినట్లు చెప్పారు. దీని ఆధారంగా 2500మందిలో జనటిక్ వెరియేషన్లు ఉన్నట్లు  గుర్తించారు. ర్యాండమ్ పద్దతిలో జరిపిన పరిశోధనలో టెస్టోస్టెరాన్ సమస్య సహజమే అని పేర్కొన్నారు. స్త్రీలలో ఎక్కువ మోతాదులో (37%) టెస్టోస్టెరాన్ ఉండడం వాళ్ళ టైప్ 2 డయాబెటీస్ కు గురి అయ్యే అవకాశం ఉందని వైద్యులు నిర్ధారించారు. 51% మంది స్త్రీలలో పోలిసిస్టిక్ ఓవరీద్న్ సింగాడ్రోమ్, బ్రస్ట్ కాన్సర్,మెటబాలిక్ సింగ్ డ్రోమ్ వచ్చే అవకాశం ఉందని తినరాహిల్ ఆసుపత్రికి చెందిన ఎండోక్రాననాలజిస్ట్ డాక్టర్ మనీషాచూడ్ వివరించారు. ఈసమస్యకు టెస్టా స్టెరాన్ థెరపీ ఒక్కటే మార్గమని టెస్టాసైరన్ థెరపీతో సమస్య నుంచి బయట పడవచ్చు అని ఆమె సూచించారు.

ఆహారంతోనే ఆరోగ్యం

అనారోగ్యంతో శారీరక మానసిక ఆధ్యాత్మిక అంశాలు ఉన్నాయన్న అంశాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఎందుకంటే శారీరకంగా బలంగా ఉండడం ముఖ్యం  దాంతో పాటు మానసిక దృఢత్వం కూడా అవసరం. దీనికి తోడు ఆధ్యాత్మిక భావన ఉన్నపుడే వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యం పొందగలడు. అయితే ఆధునిక సమాజంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఒక మాత్ర ఉంటె చాలు లేదా ఆసుపత్రిలో చేరితే చాలు అనుకోవడం అది ఒక ఉపసమనం కోసమే అన్న విషయం  గ్రహించాలి. ఆసుపత్రికి  వెళితే  మందు వేసుకుంటే  తగ్గి పోతుంది అన్నది కేవలం విశ్వాసం మాత్రమే. మనకు మనపై విశ్వాశ్వనీయత లేనప్పుడు మాత్రమే దీర్ఘ ఆలోచనకు గురి అవుతారు. ఒత్తిడికి గురిఅవుతారు. అదే అనారోగ్యానికి దారి తీస్తుంది అన్నది సత్యం శారీరకంగా శ్రమించండి, మానసిక దృడత్వం కలిగి ఉండడం ముఖ్యం, ఆధ్యాత్మిక భావన ద్వారా స్థితి గతులను తెలుసుకోడం తదనుగుణంగా ప్రవర్తించడం వ్యవహరించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చన్న భావన                                    సాత్విక ఆహారం, సహజమైన ఆహరం, పోపుష్టికా ఆహారం  తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యానికి  ఒక పునాది మాత్రమే. ఉదాహరణకు ---  సరైన పునాది  ఉన్నప్పుడే కట్టడం పటిష్టంగా ఉంటుంది. కొన్ని తరాలు నిలబడుతుంది. లేదంటే కూలిపోతుంది. అందుకే పునాదిలేని ఆహారం అంటే సాత్విక ఆహరం కాని మరో ఆహరం తీసుకుంటే ఆరోగ్యం చిన్నాభిన్నమౌతుంది. సంపూర్ణ ఆహరం తీసుకుంటే పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండగలమన్నది  దీని అర్ధం.              ఉన్నత జీవన ప్రమాణాల్లో జీవించాలన్నా విజయం సాధించడానికి మూలాధారం సంపూర్ణ ఆరోగ్యం మాత్రమే అన్న విషయం తెలుసుకోవాలి. దీర్ఘ కాలంగా ఆరోగ్యంగా ఉండాలి, శరీరం దృడంగా ఉండాలి, అందరు అనుకుంటున్నట్టు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలంటే మీరు సరైన ఆహరం తీసుకోవాలి అప్పుడే మీరు జీవించడం సాధ్యం. సమయ పాలన,సరైన, సహజమైన ప్రాకృతిక ఆహారం తీసుకోవాలి, సంప్రదాయాన్ని పాటిస్తూ, జ్ఞానాన్ని పొందడం ముఖ్యం. దీనికి మరోమార్గం లేదన్నది వాస్తవం.                                                                                                                   ఆహారానికి ఆరోగ్యానికి సంబంధం ఉన్నదనే  ప్రగాఢ విశ్వాసం నమ్మకం ఉండాలి. ఆహారాన్ని  సహజమైన ప్రాకృతిక సేంద్రియ పద్ధతులలోనే పండించాలి. మనం కృత్రిమ రసాయనాల ద్వారా పండించిన ఆహారంతో పోలిస్తే ప్రాకృతిక వ్యవాసాయం ద్వారా పండించిన ఆహారంలో పోషక విలువలు ఉన్నాయన్న విషయం గ్రహించమని నిపుణులు చెపుతున్నారు. రసాయనాల ద్వారా పండించిన పంట, అనారోగ్యానికి కారణమౌతుందనేది కూడా నిజం. ఆదిశగా సేంద్రియ వ్యవసాయంతో పండిన కూరాగాయాలలో పోషక విలువలు ఉండడంతో పాటు, స్వదేశీ ఆవుల పోషణ, సంరక్షణతో చేస్తున్న వ్యవసాయ పద్ధతుల తో మంచిఉత్పత్తులు సాధించవచ్చని, అది ఆచరణ సాధ్యమని తెలుస్తోంది .                                                                                                                                   పంచ సూత్ర పర్ఫెక్ట్ హెల్త్ ఆధునిక సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో ఎన్నో రకాల దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు గొప్ప, బీదా అన్నతేడా లేకుండా అన్నివయసుల వాళ్ళని  వేధిస్తున్నాయి అన్నది వాస్తవం. ఇందులో కొన్ని వ్యాధులను నేటికీ నిరోధించలేని పరిస్థితి. ఆరోగ్యం అంశాలపై ఎన్నో పద్ధతులు చూసాం. అమలు లోకి వచ్చాయి. ప్రివెన్షన్ రివర్సల్ రెండిటిని అనుసంధానం చేస్తూ అటు సాంప్రదాయమ లో ఉన్నా అనుభవాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన పంచ సూత్ర ఉత్తమమైనదని చెప్పవచ్చు. ఆయుర్వేదం మరియు ఆధునిక న్యుట్రా జనో మిక్స్ ను రూపొందించినట్లు నిపుణులు వివరించారు. ఆహారం ద్వారా మాత్రమే ఆరోగ్యం సాధ్యం. ఆహరం ప్రాకృతిక మైనది సహజమైనది పూర్తిగా పోషకవిలువలు న్యూట్రీషియన్స్ ఉండాలి. పంచసూత్ర ద్వారా న్యూట్రీషియన్స్ ద్వారా దీర్ఘ కాళిక వ్యాధులను నిలువరించడం, రివర్సల్ పద్ధతి ద్వారా రోగ నిరోధక శక్తి పెంచవచ్చునని తద్వారాదీర్ఘ కలం జీవించి ఉండవచ్చని అదే పంచసూత్ర విధానమని అన్నారు.                                                                               సాంప్రదాయ వైద్యం విధానం పద్దతులపై పూర్తి అవగాహనా ఉండడంతో పాటు, ఆహారం న్యూట్రీషియన్స్ ద్వారా ఆరోగ్యం అంశంపై పరిశోధనలు చేపట్టి  రోగాన్ని నిలువరించడం రివర్సల్ పద్దతిలో జీవన శైలి మార్పుకు దోహదం చేస్తుందని డాక్టర్ మురళి ఆచార్య వివరించారు. ఈమేరకు  వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే పంచ సూత్రా పర్ఫెక్ట్ హెల్హ్ పై అవగాహన కారక్రమాలు చేపట్టినట్లు మురళి ఆచార్య వెల్లడించారు. పంచసూత్ర ద్వారా వేలాది మంది లబ్ది పొందారని అన్నారు. పంచసూత్ర పర్ఫెక్ట్ హెల్త్ పద్దతుల ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటూ దీర్ఘ కాలిక సమస్యలనుంచి బయట పడగలరని అభిప్రాయం పడ్డారు.        ఆరోగ్యం కేవలం శరీరానికి సంబందించినది మాత్రమే కాదు. మానసిక ఆధ్యాత్మిక అంశాలు మన జీవితంలో ముడి పడి ఉన్నాయన్నది నిజం. మనశరీరం సహజంగా ఐదురకాల ఎలిమెంట్స్ తో తయారు చేయబడింది. కొన్ని పద్దతుల ద్వారా ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకోవచ్చ్జు. అనారోగ్యాన్నినిలుపుదల చేయడం ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉందన్నది వాస్తవం. సహజంగా మన శరీరంలో దానికి అదే అనారోగ్యం రాకుండా నిరోధించుకునే శక్తి లేదా దానికి ఆడే హీలింగ్ చేసుకునే సెల్ఫ్ మెకానిజం ఉంటుంది. చిన్న చిన్న న్యూట్రీషియన్ కొరత ఏర్పడడం టాక్సీ కేన్స్ శరీరంలో వృద్ధి చెందుతాయి. ఇవే దీర్ఘ కాలిక వ్యాధులకు కారణం అవుతున్నాయి. మనం కనక సహజంగా లభించే పౌష్టికాహారం  తీసుకోడం సహజమైన జీవన శైలిని అనుసరించడం ద్వారా ఆధునికంగా వస్తున్న అనారోగ్య సమస్యలను తిప్పి కొట్టవచ్చు. ఎలా తిప్పి కొట్ట వచ్చు అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ సహజంగా మనలో ఉన్న సాజమైన హీలింగ్ ఎబిలిటీ పెంచడం ద్వారా అనారోగ్యాన్ని తిప్పి కొట్టవచ్చు. ఎదుర్కోవచ్చు .  పంచసూత్ర ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోడం సహజమైన పౌష్టిక ఆహార లోపాన్ని నిరోధించడం ముఖ్యం. ఎవరైనా సరే పంచసూత్రాలను అనుసరిస్తే  సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించడం అసాధ్యం కాదు. ఆరోగ్యాన్ని శరీర ధారుడ్యాన్ని సాధించడం మనలక్ష్యం. మనబాధ్యత. తరువాతి తరాన్ని మార్గ నిర్దేశం  చేయడం ద్వారా పూర్తి గా సహజ సిద్ధమైన విధానాల ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యవంతులను చేయగలమన్న విశ్వాసం ఉంది.

కళ్లతో చెలగాటం వద్దు

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్న మాట పుట్టినప్పటి నుంచి వింటున్నదే! కాకపోతే ఏదో ఉపద్రవం ముంచుకువచ్చేంతవరకూ వాటి విలువ మనకి తెలియదు. నిజానికి లోకానికీ మనకీ వారధిగా నిలిచే ఆ కంటిచూపుని కాపాడుకోవాలంటే పెద్దగా కష్టపడాల్సింది ఏమీ లేదు. మనకి అందుబాటులో ఉండే ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఉంటే... కళ్లు మన కడవరకూ తోడుగా నిలుస్తాయి.     పిల్లలకి కంటి పరీక్ష మన దేశంలో చాలామంది కంటి పరీక్షలని చేయించుకునేందుకు బద్ధకిస్తూ ఉంటారు. తమ పిల్లల విషయంలో కూడా ఇదే అశ్రద్ధ చూపడం ఆశ్చర్యకరం. పిల్లలు తమలో ఏర్పడిన దృష్టిలోపాలని గ్రహించలేకపోవడం వల్లనో, గ్రహించినా పెద్దలకు భయపడి చెప్పలేకపోవడం వల్లనో... చత్వారం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అందుకని పెద్దలే పూనుకొని రెండేళ్లకి ఓసారి పిల్లలను కంటి వైద్యుడి దగ్గరకి వెళ్లి పరీక్ష చేయించాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇక పెద్దలు కూడా తమకి 60 ఏళ్లు వచ్చేవరకూ ప్రతి రెండేళ్లకి ఓసారి, ఆ తరువాత ఏడాదికి ఓసారి కంటి పరీక్షలు చేయించుకోవాలంటున్నారు.     కంప్యూటర్‌తో 20-20-20 ఈకాలంలో ఇంచుమించుగా అన్ని ఉద్యోగాలూ కంప్యూటర్‌ ముందే సాగుతున్నాయి. కంప్యూటర్ స్క్రీన్‌ వంక తదేకంగా చూడటంతో అసలు మనం కళ్లని ఆర్పడం కూడా మర్చిపోతూ ఉంటాము. దానివల్ల కళ్లు పొడిబారిపోవడం వంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కంప్యూటర్‌ స్క్రీన్‌ బ్రైట్‌నెస్ మరీ ఎక్కువగా ఉండకూడదనీ, స్క్రీన్‌ తగినంత దూరంలో ఉండాలనీ, మధ్యమధ్యలో కళ్లని ఆర్పుతూ ఉండాలనీ చెబుతున్నారు. దీనికి తోడుగా ప్రతి 20 నిమిషాలకి ఓసారి కంప్యూటర్ నుంచి దృష్టి మరల్చి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను ఓ 20 సెకన్ల పాటు చూడటం వల్ల... కంటి మీద ఒత్తిడి తగ్గుతుందని సూచిస్తున్నారు.     సరైన ఆహారం కంటి ఆరోగ్యం అనగానే అందరూ క్యారెట్ల గురించే మాట్లాడతారు. నిజానికి పోషకాలను అందించే ప్రతి ఆహారమూ కంటికి మంచిదే. ఎందుకంటే విటమిన్‌ Aతో పాటుగా విటమిన్‌ C, విటమిన్‌ E, జింక్‌, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఎన్నో పోషకాలు కంటికి అవసరమవుతాయి. ఇందుకోసం ఆకుకూరలు, నారింజ వంటి పండ్లు కంటికి బలాన్ని చేకూరుస్తాయి.     సరైన జాగ్రత్తలు చాలావరకూ కంటి ప్రమాదాలు అజాగ్రత్త వల్లే జరుగుతాయి. క్రికెట్‌ వంటి ఆటలు ఆడేటప్పుడు హెల్మెట్‌ పెట్టుకోకపోవడం, ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ చేసేటప్పుడు కళ్లద్దాలు ధరించకపోవడం, దీపావళి సామాన్లు కాల్చేటప్పుడు అజాగ్రత్తగా ఉండటం... అన్నింటికీ మించి కంటికి ఏదన్నా సమస్య వస్తే వెంటనే వైద్యుని సంప్రదించపోవడం వంటి అజాగ్రత్తల వల్ల సున్నితమైన కంటి భాగాలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.     పొగత్రాగడం పొగ త్రాగేవారిలో నానారకాల ఆరోగ్య సమస్యలతో పాటుగా కంటిచూపు కూడా దెబ్బతినే అవకాశం ఉందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా కంటిలోని రెటినాని దెబ్బతీసే age-related macular degeneration (AMD) అనే వ్యాధి పొగత్రాగేవారిని వేధించే అవకాశం ఉందని తేలింది. ఇక పొగతాగే అలవాటుకీ శుక్లాలకీ కూడా సంబంధం ఉందనే పరిశోధనలు కూడా వెలువడ్డాయి. (ఇవాళ World Sight Day సందర్భంగా)   - నిర్జర.

ఎడమచేతివాటం ఉంటే క్షయవ్యాధి వస్తుందా!

ప్రపంచంలో కొందరికి కుడిచేతి వాటం ఉంటే మరికొందరు ఎడమచేతినే ఎందుకు ఉపయోగిస్తారు? ఈ చిన్న ప్రశ్నకి ఇప్పటివరకూ కూడా సరైన జవాబు కనుక్కోలేకపోయారు శాస్త్రవేత్తలు. జన్యువులో ఉండే ఏదో తేడా వల్లే కొందరికి ఎడమ చేతి వాటం అలవడుతుందని మాత్రం ఊహిస్తున్నారు. కానీ ఆ జన్యువు ఏదో ఇప్పటివరకూ తెలుసుకోలేకపోయారు.   ప్రపంచంలోని ప్రతి వస్తువునీ కుడిచేతివారికి అనుగునంగానే రూపొందించారు. దాంతో ఎడమచేతి వాటం ఉన్నవారు చాలా ఇబ్బందులనే ఎదుర్కోవలసి వస్తుంటుంది. పులి మీద పుట్రలాగా ఇప్పుడు ఎడమ చేతివారికి మరో సమస్య ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే ఇది మనం ఏర్పరుచుకున్నది కాదు.... స్వతహాగా వారి జన్యువులలో ఉన్నదే!   అమెరికాలోని కొందరు పరిశోధకులు 13,536 మందిని పరిశీలించి తరువాత తేల్చిందేమిటంటే... ఎడమచేతి వాటం ఉన్నవారిలో కోలమొహం ఉండే అవకాశం ఎక్కువ. ఇతరులతో పోలిస్తే వీరిలో కోలమొహం ఉండే అవకాశం 25 శాతం ఎక్కువగా ఉందట! అబ్బే... ఇదీ ఒక పరిశోధనేనా అనుకునేరు. ఎందుకంటే మన శరీరంలోని ప్రతి భాగమూ, ప్రతి మార్పూ ఏదో ఒక లక్షణానికి సూచనగా నిలిచే అవకాశం ఉంది. అలాగే కోలమొహం ఉన్నవారిలో కూడా క్షయవ్యాధి సోకే అవకాశం ఎక్కువని అంటున్నారు.   దాదాపు రెండువేల సంవత్సరాల క్రితమే ఒక గ్రీకు వైద్యుడు... క్షయవ్యాధితో బాధపడుతున్నవారిలో ఎక్కువమందికి కోలమొహం ఉండటాన్ని గమనించాడు. అది నిజమేనని ఆధునిక పరిశోధనలు నిరూపించాయి. ఏ జన్యువులైతే ఎడమచేతి వాటానికీ, కోలమొహానికి కారణం అవుతున్నాయో... అవే జన్యువుల క్షయవ్యాధికి కూడా త్వరగా లొంగిపోతున్నాయని తేల్చారు.   ఎడమచేతి వాటానికీ, క్షయ వ్యాధికీ మధ్య సంబంధం ఉందంటూ చెబుతున్న ఈ పరిశోధనని కొట్టి పారేయడానికి లేదు. ఎందుకంటే ఇంగ్లండులో క్షయ వ్యాధి కేసులు చాలా ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. ఆశ్చర్యకరంగా ఎడమచేతి వాటం ఉన్నవారు కూడా ఇంగ్లండులోనే ఎక్కువ! ఈ పరిశోధన తరువాత ఎడమచేతి వాటం ఉన్నవారు ఊపిరితిత్తుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలేమో! - నిర్జర.

ఆఫీసుకి ఇలా వెళ్తే... ఆయుష్షు పెరుగుతుంది!

ఇరవై ఏళ్ల క్రితం, రోడ్డు మీద ఎక్కడ చూసినా సైకిళ్లే కనిపించేవి. గ్లోబలైజేషన్‌ పుణ్యమా అని ఇప్పుడు రోడ్లన్నీ మోటర్‌ సైకిళ్లతో నిండిపోయాయి. ఒళ్లు అలవకుండా ఉండేందుకో, ప్రతిష్ట కోసమో... ఇప్పుడు జనాలంతా బైక్‌ల మీదే కనిపిస్తున్నారు. కానీ ఇప్పటికీ మించిపోయిందేమీ లేదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బైక్‌లని కాస్త పక్కన పెట్టి సైకలెక్కితే ఆయుష్షు పెరుగుతుందని సూచిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా ఓ సర్వేని చూపిస్తున్నారు. బ్రిటన్‌లోని దాదాపు 22 ప్రాంతాలలో ఈ సర్వేను నిర్వహించారు. 2,50,00 మంది ఉద్యోగుల మీద ఓ ఐదేళ్ల పాటు నిర్వహించిన ఈ సర్వేలో దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ఈ రెండులక్షలా యాభైవేలమందిలో ఐదేళ్లకాలం ముగిసేసరికి 2,430 మంది చనిపోయారు. 3,748 మందికి కేన్సర్‌ సోకింది. 1,110 మంది గుండెజబ్బుల బారిన పడ్డారు. అయితే ఈ గణాంకాలకీ వారిలో సైకిల్ తొక్కడానికీ మధ్య సంబంధం ఉండటమే ఆశ్చర్యం కలిగించే అంశం. వాహనాల మీద ఆఫీసుకి వెళ్లేవారితో పోలిస్తే, సైకిల్‌ తొక్కేవారిలో కేన్సర్‌ సంభవించే అవకాశం 45 శాతం తక్కువని తేలింది. వీరిలో గుండెజబ్బు సోకే ప్రమాదం కూడా 46 శాతం తక్కువగా నమోదైంది. ఏతావాతా.... సైకిల్‌ మీద ప్రయాణం చేసేవారు, ఇతరులతో పోలిస్తే అర్థంతరంగా చనిపోయే ప్రమాదం దాదాపు 40 శాతం తక్కువని వెల్లడైంది. సైకిల్ మీద ఆఫీసుకి వెళ్లేవారు, సగటున వారానికి 30 మైళ్ల వరకూ ప్రయాణం చేస్తున్నట్లు తేలింది. ఇదేమీ మామూలు వ్యాయామం కాదు కదా! క్రమం తప్పకుండా జిమ్‌కి వెళ్తే ఎంత లాభమో, రోజూ సైకిల్‌ తొక్కడం వల్ల అంతే లాభమని చెబుతున్నారు. ఒక్కసారి కనుక ఈ అలవాటు మన జీవితంలో భాగమైతే, అదిక పెద్ద కష్టంగా తోచదని భరోసా ఇస్తున్నారు. అంతేకాదు! ఊబకాయం, పొగత్రాగడం, ఆహారనియమాలు పాటించపోవడం వంటి సందర్భాలలో కూడా సైకిల్‌ తొక్కడం వల్ల లాభం కనిపించిందట. ఇంతాచేసి పరిశోధకులు చెబుతున్న విషయం ఏమిటంటే... వీలైనప్పుడల్లా బైక్‌ని పక్కనపెట్టి సైకిల్‌ మీద స్వారీ చేయమనే! దీని వల్ల డబ్బు ఆదా అవుతుంది, పర్యావరణానికీ మేలు జరుగుతుంది, బస్సుల కోసం నిరీక్షించే సమయమూ మిగులుతుంది. అన్నింటికీ మించి ఆరోగ్యం దక్కుతుంది, ఆయుష్షు పెరుగుతుంది. ఇక నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. -నిర్జర.

కంటి క్యాన్సర్ కు థెరపీ

కంటి క్యాన్సర్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులకు శుభవార్త. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కంటి క్యాన్సర్ థెరపీని విజయ వంతంగా  నిర్వహించింది. కంటి క్యాన్సర్ రోగులకు అక్యులర్ ట్యూమర్లు కు ఎయిమ్స్ ఢిల్లీ డాక్టర్లు రుతినియం 106 ప్లాక్యూ ను వినియోగించి రక్త నాళాలలో ఉండే ట్యూమర్లను హోలగించడంలో వైద్యులు విజయం సాధించారు. బాబా అటామిక్  రీసెర్చ్ సెంటర్ కంటి క్యాన్సర్ కు థెరపీ రోగులకు అందుబాటులోకి తెచ్చింది. ఈమేరకు కేంద్ర అణు శక్తి ఇంధన శాఖా మంత్రి జితేందర్ సింగ్ అదే శాఖకు చెందిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అఫామిక్సైన్స్ ఎయిమ్స్ బాబా అటామిక్ ఎనర్జీ సెంటర్ సంయుక్తంగా అతి తక్కువ ఖర్చులో దీనిని రూపొందించినట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో రూపొందించిన సింపుల్ గ ఉండే పద్ధతి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే రూపొందించామని తెలిపారు. బాబా అటామిక్ ఎనెర్జీ  అభివృద్ధి చేసిన్ ప్లాక్ సర్జన్లకు చాల సులభమైనదని అన్నారు. ప్లాక్ థెరపీ రేడియో యాక్టివ్ సోర్స్ తో రుతినియం 106 రేడియో వేస్ట్ నుండి రూపొందించినట్లు తెలిపారు. ఇది చాల సులభమైనదని చిన్న పరిమాణంలో ఉండే ప్లాక్యూ 50 మంది రోగులకు సంవత్సరం పాటు వినియోగించవచ్చని చెప్పారు. కాగా ఎయిమ్స్ ఈ చికిత్సను చేసేందుకు రెండు ఆసుపత్రులకు అందించనుంది.  అందుకు శంకర్ నేత్రాలయా హైద్రాబాద్, బెంగుళూరు ఆసుపత్రులను ఎంపిక చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోడీ ప్రకటించిన వోకల్ ఫర్ లోకల్ అన్న నినాదానికి బలం చేకూర్చి నట్లయింది. గత సంవత్సరం అక్టోబర్ లో డిఏసి  ఛైర్మెన్ వ్యాస్ జితేంద్ర సింగ్ తో సుదీర్ఘ చర్చలు అనంతరం డీఐఈ, బార్క్, ఎయిమ్స్ , ఆప్తమాలిక్ సైన్సెస్ శాఖలు సంయుక్తంగా డాక్టర్ వ్యాస్, డాక్టర్ అతుకుమార్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ల సమన్వయంతో రూపొందించామన్నారు. అయితే కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ డాక్టర్ కావడం వల్ల ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.

శాకాహారంతో ఆరోగ్యమే కాదు, పర్యావరణమూ క్షేమమే!

శాకాహారమా, మాంసాహారమా... ఈ రెండింటిలో ఏది మంచిది? అన్న అనుమానం ఈనాటిది కాదు. సాధారణంగా శాకాహారానికే ఎక్కువ ఓట్లు పడినప్పటికీ, కొన్ని రకాల పోషకాలు కేవలం మాంసాహారం ద్వారానే సాధ్యమనే వాదనా వినిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ Academy of Nutrition and Dietetics (AND) అనే సంస్థ ఒక నివేదికను రూపొందించింది.     ఆరోగ్య సమస్యలు దూరం మాంసాహారం తినేవారితో పోలిస్తే శాకాహారులలో అనేకరకాల ఆరోగ్య సమస్యలు తక్కువగా కలుగుతాయని తేల్చారు ‘AND’ పరిశోధకులు. శాకాహారం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం 62 శాతం తక్కువగా కనిపిస్తోందట. ఇక ప్రొస్టేట్‌ క్యాన్సర్ సోకే ప్రమాదం 35 శాతం తక్కువగానూ, గుండెజబ్బులు ఏర్పడే అవకాశం 29 శాతం తక్కువగానూ ఉండటాన్ని గమనించారు. పైగా మాంసం తినే అలవాటు ఉన్న పిల్లలతో పోలిస్తే శాకాహారంపు అలవాట్లు ఉన్న పిల్లలలో ఊబకాయం కూడా తక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. అంతేకాదు! రక్తపోటు, అధికకొవ్వు, పేగు క్యాన్సర్‌ వంటి సమస్యలూ అంతగా పీడించవంటున్నారు. పైగా మాంసాహారతో పోలిస్తే శాకాహారం తీసుకునేందుకు అయ్యే ఖర్చు కూడా అంత భారంగా ఉండదన్న విషయాన్నీ గుర్తుచేస్తున్నారు.     పర్యావరణానికీ క్షేమమే మాంసాహారంతో పోలిస్తే శాకాహారం మీద ఆధారపడటం వల్ల పర్యావరణానికి కూడా మేలు అంటున్నారు ‘AND’ నిపుణులు. ఒక కిలో మాంసాన్ని ఉత్పత్తి చేసేందుకు ఖర్చయ్యే వనరులతో పోల్చుకుంటే ఒక కిలో బీన్స్‌ను ఉత్పత్తి చేయడంలో అవసరమయ్యే వనరులు చాలా తక్కువని తేలుస్తున్నారు. దీనివల్ల నీరు, భూమి, ఎరువులు, ఇంధనం... వంటి వనరులన్నీ ఆదా అవుతాయని చెబుతున్నారు. పైగా వాతావరణంలోకి పేరుకునే విషవాయువుల (greenhouse gases) శాతం కూడా తగ్గుతుందట.     తారకమంత్రం కాదు మాంసాహారంకంటే శాకాహారం మంచిది అన్నారు కదా అని ఏది పడితే అది తింటే ఉపయోగం లేదంటున్నారు. అన్ని రకాల పోషక విలువలు ఉన్న సమతుల ఆహారాన్ని తీసుకోవడం కూడా ముఖ్యమేనని హెచ్చరిస్తున్నారు. ఆ జాగ్రత్త కనుక తీసుకుంటే ఏ వయసువారి అవసరాలనైనా శాకాహారం తీరుస్తుందంటున్నారు. ఒక్క B12 తప్ప శాకాహారులకు అన్నిరకాల పోషకాలూ అందుతాయని భరోసా ఇస్తున్నారు. ఆ B12ని కూడా శాకాహారులకు అందించేందుకు ఇప్పుడు B12ని జోడించిన ఆహారపదార్థాలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి.   అదీ విషయం! శాకాహారం మీద ఆధారపడటం వల్ల మంచి ఫలితాలే ఉంటాయన్న మాట ఇప్పుడు తేలిపోయింది. కాకపోతే శాకాహారం అన్నారు కదా అని ఉత్త తెల్లటి బియ్యం, కాసిని చారునీళ్లు తీసుకోకుండా తృణధాన్యాలు, పప్పులు, పండ్లు, ఆకుకూరలు వంటి అన్నిరకాల ఆహారపదార్థాలనీ తీసుకోమన్న హెచ్చరికా అందిపోయింది.  - నిర్జర.

ఒంటరితనంలో జలుబు కూడా సమస్యే!

సంసారాన్ని విడిచిపెట్టేసి హిమాలయాల్లో గడపాలనుకోవడం వింతేమీ కాదు. అది ఏకాంతం! కానీ సమాజంలో ఉంటూ కూడా ఇతరుల తోడు లేకపోవడం బాధాకరం. అది ఒంటరితనం! మన ఆరోగ్యం మీద ఈ ఒంటరితనం ప్రభావం గురించి ఇంతకుముందు చాలా పరిశోధనలే జరిగాయి. ఒంటరితనంతో వేగిపోయేవారు రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతారనీ, త్వరగా గతించిపోతారనీ తేల్చారు.   ఒంటరితనంలో దీర్ఘకాలిక అనారోగ్యాల సంగతి అలా ఉంచితే చిన్నపాటి జలుబు ఎలా వేధిస్తుందో చూడాలని అనుకున్నారు కొందరు పరిశోధకులు. ఇందుకోసం వారు ఓ 159 మందిని అయిదు రోజుల పాటు గమనించారు. వీరంతా కూడా 18 నుంచి 55 ఏళ్ల వయసు లోపలివారే! పరిశోధన కోసం ఎన్నుకొన్నవారందరి దగ్గరా కొన్ని వివరాలను సేకరించారు. వారు తమ జీవితాలలో ఎంత తీవ్రంగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు? ఇతరులతో వారి సంబంధబాంధవ్యాలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలను గ్రహించారు. ఆ తరువాత వారందరికీ జలుబుని కలిగించే ఒక మందుని ఇచ్చారు. ఒంటరితనంతో వేగిపోయేవారిని జలుబు చాలా తీవ్రంగా వేధించిందట! జలుబు లక్షణాలు, వాటి వల్ల వారు బాధపడిన తీరు కూడా తీవ్రంగానే ఉన్నాయట.   అబ్బా...జలుబుతో బాధపడటం కూడా ఓ బాధేనా! ఇదీ ఓ పరిశోధననే అనుకోవడానికి వీల్లేదు. జలుబు వల్ల డబ్బుకి డబ్బు, సమయానికి సమయం వృధా అయిపోతుంటాయి. పైగా ఒంటరతనంలో ప్రతి చిన్న ఆరోగ్య, మానసిక సమస్యా అమితంగా వేధిస్తుందనడానికి ఇదో రుజువు. ఉదాహరణకు ఒంటరితనంతో బాధపడేవారిలో ఒత్తిడి కూడా మనసు మీద తీవ్రమైన ప్రభావం చూపవచ్చునట. ఆ ఒత్తిడే వారి శరీరాన్ని కూడా లోబరుచుకుని కేన్సర్ వంటి అనారోగ్యాలకి దారితీస్తుంది.   ఒంటరితనంటే ఎవరూ లేకపోవడమే కాదు.... తన చుట్టూ వందమంది ఉన్నా కూడా ఎవరితోనూ మనసుని పంచుకోలేకపోవడం. ఇది నిజంగా ఓ మానసిక సమస్యే! దానికి పరిష్కారం వెతుక్కోవాల్సిందే. వైద్యులు కూడా తమ దగ్గరకి వచ్చే రోగుల శారీరిక లక్షణాలకి మందులు ఇచ్చేసి ఊరుకోకుండా... వీలైతే వారి మానసిక పరిస్థితిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వైద్యం ఓ వ్యాపారం అయిపోయిన ఈ రోజుల్లో అంత శ్రద్ధ ఎవరికన్నా ఉంటుందంటారా! - నిర్జర.

చలికాలంలో చమటలు పడుతున్నాయా..?

చలికాలంలో వచ్చిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలను వెంటపెట్టుకుని వస్తుంది. అయితే కరోనా కారణంగా ఈ సమస్య తీవ్రత మరింత పెరిగింది. వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గడం, పొగమంచు కమ్ముకోవడం వంటి కారణాలతో అనేక అనారోగ్యాలకు గురవ్వాల్సివస్తుంది. ఈ కాలంలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, జలుబు, శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు, దగ్గు, తలనొప్పిలాంటివి ప్రధానంగా ఏర్పడే అనారోగ్యాలు. కరోనా లక్షణాలు కూడా ఇవే కావడంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ చెమటలు పడుతుంటే దాన్ని హైపోధెర్మియా అంటారు. ఆ సమయంలో శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతూ, శరీరం చల్లగా మారుతుంది. శరీరంలోని వివిధ అవయవాలు చేసే పనులు మందకొడిగా సాగుతాయి. ఈ అనారోగ్యం ఏర్పడటానికి కారణం చల్లనిగాలి తాకుతున్నప్పుడు వెచ్చని దుస్తులు ధరించకపోవడం, ఆందోళన ఎక్కువగా ఉండటం, సరిగ్గా ఆహారాన్ని తీసుకోకపోవడం,  ఎక్కువ సమయం నీళ్ళల్లో నానటం లాంటి వాటివల్ల ఈ అనారోగ్యం ఏర్పడుతుంది. ఈ వ్యాధికి గురయినప్పుడు  మాటల్లో స్పష్టత ఉండదు. వణుకు ఏర్పడుతుంది.  మెదడుకు ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. అశ్రద్ద, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని వద్దకు వెళ్ళి తగినవైద్యం చేయించుకోవాలి. వ్యాధి లక్షణాలను బట్టి వైద్యుని సంప్రదించ టమే కాకుండా తగిన ఆరోగ్య జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. చల్లనిగాలి శరీరానికి సోకకుండా శరీరాన్ని పూర్తిగా కప్పివుంచి, శరీరానికి వెచ్చదనాన్ని కలిగించాలి. గోరువెచ్చని నీటిని తాగాలి, వేడివేడిగా కాఫీ, టీ, సూప్ లు తాగవచ్చు, హైపోధెర్మియాకు వైద్య చికిత్స ఎంతో అవసరం.  లేకపోతే ప్రాణాపాయ పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఆస్తమాతో బాధపడుతున్నవారు.. చలికాలంలో ముఖ్యంగా వృద్ధులలో ఆస్తమా, గుండెజబ్బులు, శ్వాసకోశవ్యాధులు ఉన్నవారి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. చలిగాలికి రక్షణ చర్యలు తీసుకోకపోతే జలుబు, తుమ్ములు, గొంతు నొప్పివంటి లక్షణాలు కనిపిస్తే  వెంటనే వైద్యునికి చూపించాలి. ముందుజాగ్రత్తగా పిల్లలకు, వృద్ధులకు చలిగాలి సోకకుండా  స్వెట్టర్‌, మంకీ క్యాప్ లు వాడాలి. చలికాలంలో ఆస్తమా  రోగులకు చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది.  శ్వాస నాళాలలో ఒత్తిడి ఏర్పడి ఊపిరి పీల్చడం కష్టమవుతుంది.  కొంతమందికి ఎలర్జీ, దుమ్ము, పొగ కారణంగా శ్వాసనాళాలలో మెలికలు ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. పొద్దున, రాత్రి సమయంలో దగ్గు ఎక్కువగా వస్తుంది. వేగంగా నడవలేరు. శరీరంలో చురుకుదనం తగ్గుతుంది. కఫం అధికంగా ఏర్పడుతుంది. దగ్గినపుడు కళ్ళె ఆకుపచ్చరంగులో పడుతుంది.  ఆకలి లేకపోవడంతో ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. ఆ కారణంగా బలహీనంగా మారుతారు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే తక్కువ మోతాదులో ఎక్కువ ఆహారం తీసుకోవాలి. చలిగాలిలోనూ, మంచు కురిసేటప్పుడు బయటకు వెళ్ళకూడదు.వేడి  తగ్గని ఆహారపదార్థాలను మాత్రమే తీసుకోవాలి. చలికాలంలో కూడా రోజుకు 6 నుండి 10 గ్లాసుల వరకూ పరిశుభ్రమైన కాచి చల్లార్చి, వడకట్టిన నీటిని తాగాలి. జలుబు, దగ్గు ఎక్కువగా వుంటే డాక్టర్ ను సంప్రదించాలి.  పొగ, దుమ్ము, ధూళి ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. సిగిరెటు, చుట్టా, బీడి తాగే అలవాటు ఉన్నవారికి దూరంగా ఉండాలి.

బరువు తగ్గాలంటే జామకాయ తింటే సరి!

రోజుకో యాపిల్ తింటే రోగాలన్నీ తగ్గిపోతాయని అంటారు. కానీ యాపిల్‌ సామాన్యులకి అందుబాటులో ఉండని పండు. పైగా డయాబెటిస్‌ ఉన్నవారు యాపిల్ ఎక్కువగా తినకూడదని చెబుతూ ఉంటారయ్యే! ఇక రోగాలు తగ్గే అవకాశం ఎక్కడిది. అందుకనే ఈ సామెతని మార్చి రోజుకో జామకాయ తినమని సూచిస్తున్నారు నిపుణులు...   బరువు తగ్గిస్తుంది – జామకాయలో పీచుపదార్థం అధికం. కానీ కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు మాత్రం ఇంచుమించుగా కనిపించవు. శరీరానికి పోషణని అందించే ప్రొటీన్లు, విటమిన్లు మాత్రం జామలో పుష్కలంగా కనిపిస్తాయి. ఓ మాటలో చెప్పాలంటే బరువుపెరగకుండా, శక్తిని అందించేందుకు రూపొందించిన మందులా జామకాయ కనిపిస్తుంది.   కఫానికి విరుగుడు – కాలుష్యం పుణ్యమా అని ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. కానీ కఫాన్ని కరిగించేందుకు, ఊపిరితిత్తులలో ఏర్పడే ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనేందుకూ దోర జామకాయలు దివ్యంగా పనిచేస్తాయి. ఇందులో సమృద్ధిగా ఉండే సి విటమిన్ మళ్లీమళ్లీ జలుబు రాకుండా అడ్డుకొంటుంది.     రక్తపోటుకి అడ్డుకట్ట – శరీరంలో సోడియం శాతం పెరిగి పొటాషియం నిష్ఫత్తి తగ్గినప్పుడు, అది రక్తపోటుకి దారి తీస్తుంది. కానీ జామకాయతో ఈ నిష్ఫత్తి సాధారణ స్థితికి చేరుకుటుంది. వందగ్రాముల జామకాయలో కేవలం 2 mg సోడియం ఉంటే... పొటాషియం ఏకంగా 400 mg ఉంటుంది. ఇంకా మన ఒంట్లోని ట్రైగ్లిజరైడ్స్‌, LDL కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుతుంది. వీటన్నింటి కారణంగా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.   పళ్లని మెరిపిస్తుంది – జామకాయని తినగానే పళ్లు, చిగుళ్లు బలంగా నున్నగా అనిపిస్తాయి. జామకాయలో ఉండే ఆస్ట్రింజంట్‌ అనే పదార్థమే దీనికి కారణం. అంతేకాదు! జామలో వాపుని తగ్గించే లక్షణాలు, సూక్ష్మక్రిములను సంహరించే శక్తి కనిపిస్తుంది. అందుకనే జామకాయని తింటే పళ్ల దగ్గర నుంచీ పేగుల దాకా జీర్ణవ్యవస్థ అంతా బాగుపడిపోతుంది.     డయాబెటిస్‌ను అదుపుచేస్తుంది – జామకాయలో glycaemic index చాలా తక్కువగా కనిపిస్తుంది. దీనర్థం... జామకాయని తిన్నాక, అందులోని శక్తి నిదానంగా విడుదల అవుతుందన్నమాట. పైగా ఇందులో చక్కెర పదార్థాలు కూడా తక్కువే! అందుకనే డయాబెటిస్‌ ఉన్నవారు నిక్షేపంగా జామకాయని తినవచ్చని చెబుతూ ఉంటారు. ఇక వంశపారంప్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో, ఆ మహమ్మారిని వీలైనంత దూరంగా ఉంచేందుకు కూడా జామ ఉపయోగపడతుందట. జామలో ఉండే ఫోలేట్ ధాతుపుష్టిని కలిగిస్తుంది; ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ కేన్సర్‌ దరిచేరకుండా చేస్తాయి; విటమిన్‌ ఏ కంటిచూపుని మెరుగుపరుస్తుంది... ఇలా చెప్పుకొంటూ పోతే అసలు ఈ జాబితాకి అంతమే ఉండదనిపిస్తుంది. మరింకేం... చిరుతిండి పేరుతో ఏది పడితే అది తినేసే బదులు ఓ నాలుగు జామకాయలని ఇంటికి తెచ్చుకుంటే పోలా!!!   - నిర్జర.

నువ్వులని మించిన ఔషధం ఉందా!

నువ్వులు మనకి కొత్తేమీ కాదు. శ్రాద్ధ కర్మలలో నువ్వులను వాడటం చూస్తే, వేల సంవత్సరాల నుంచే భారతీయులు దీనిని పండిస్తూ ఉండేవారని అర్థమైపోతుంది. ఇప్పటికీ నువ్వుల పంటలో మన దేశానిది అగ్రస్థానమే!   - హైందవ ఆచారాలలో నువ్వులది సుస్థిరమైన స్థానం. నరక చతుర్దశి, సంక్రాంతి సమయాలలో చేసుకునే పిండివంటలలో నువ్వులు తప్పకుండా ఉండాలంటారు. నువ్వులలో పోషక పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని తినడం వల్ల శరీరంలో శరీరంలో తగినంత వేడి కలుగుతుందనే ఈ సూచన.   - కనీసం నెలకి రెండుసార్లయినా నువ్వుల నూనెతో తైలాభ్యంగనం చేయాలని చెబుతుంటారు. నువ్వుల నూనెని ఒంటికి పట్టించి, మర్దనా చేసి.... అది ఆరిన తరువాత స్నానం చేయడమే ఈ తైలాభ్యంగనం. మిగతా నూనెలతో పోల్చుకుంటే, నువ్వుల నూనె సాంద్రత చాలా ఎక్కువ. కాబట్టి ఒంటికి పట్టిన మట్టి, మకిలిని తొలగించి స్వేదరంథ్రాలను శుభ్రం చేయగలదు. ఇక నువ్వుల నూనెలో ఉండే విటమిన్ ఇ, కెలు అటు చర్మాన్నీ, ఇటు కేశాలనీ కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.   - మన దీపారాధనలో కూడా నువ్వులనూనెదే ప్రథమ ఎంపిక. ఎక్కువ కాంతిని ఇస్తాయనీ, ఎక్కువసేపు వెలుగుతాయనీ నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తారు. నువ్వుల నూనెతో వెలిగించిన దీపాలతో చుట్టుపక్కల వాతావరణంలో ఉన్న సూక్ష్మక్రిములు సైతం నశించిపోతాయట.   - నోటి పూత, నోరు పొడిబారిపోవడం వంటి సమస్యలు ఉన్నప్పుడు నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించమని ఆయుర్వేదంలో చెబుతారు. ఇదే తరువాత కాలంలో ఆయిల్ పుల్లింగ్ అనే ప్రక్రియకు దారితీసింది.   - నువ్వులలో తగినంత జింక్, కాల్షియం ఉంటాయి. ఈ రెండు పోషకాలూ ఎముకలను దృఢంగా ఉంచుతాయని తెలిసిందే! ముఖ్యంగా పిల్లలలో సరైన ఎదుగుదల ఉండేందుకు నువ్వులు ఉపయోగపడతాయి. ఇక స్త్రీలు ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు అప్పుడప్పుడూ నువ్వులు తీసుకోవాలని సూచిస్తున్నారు.   - నువ్వులలో అరుదైన Phytosterols అనే రసాయనం ఉంటుంది. దీని వలన రక్తంలోని కొవ్వు శాతం తగ్గుతుందనీ, రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ, కొన్ని రకాల కేన్సర్లను సైతం అడ్డుకొంటుందనీ పరిశోధనల్లో రుజువైంది.   - నువ్వులలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు, పేగులలో తగిన కదలికలు ఉండేందుకు ఈ పీచు పదార్థాలు ఉపయోగపడతాయి. తద్వారా జీర్ణసంబంధమైన వ్యాధులెన్నింటిలోనో నువ్వులు ఉపశమనాన్ని కలిగిస్తాయి.   - నువ్వులు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. పైగా గుండె ధమనులలో పేరుకుపోయే కొవ్వుని తొలగించడంలో కూడా గొప్ప ప్రభావం చూపుతాయి. నువ్వులలో ఉండే మెగ్నీషియం రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. ఈ కారణాలన్నింటి వల్లా గుండె ఆరోగ్యానికి నువ్వులు దివ్యౌషధం అని చెప్పవచ్చు.   ఇంతేకాదు! సహజసిద్ధమైన సన్స్క్రీన్లాగా, కాలి పగుళ్లకు నివారణగా, కంటిచూపుని మెరుగుపరిచేదిగా, ఒత్తిడిని తగ్గించే మందుగా, ఊపిరితిత్తుల సమస్యలకి ఔషధంగా, రక్తహీనతని ఎదుర్కొనే ఆయుధంగా... నువ్వులు అనేకరకాలుగా లాభిస్తాయి. ఇక ఆహారపదార్థాలకు రుచి అందించడంలో నువ్వుల పాత్ర గురించి చెప్పనే అక్కర్లేదు. అందుకే ఫాస్ట్ఫుడ్స్లో సైతం నువ్వులను విపరీతంగా వాడతారు. మెక్సికోలో ఉత్పత్తి అయ్యే నువ్వులలో 75 శాతం నువ్వులను మెక్డొనాల్డ్స్ సంస్థ తన ఉత్పత్తుల కోసం ఖరీదు చేస్తుందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంత ప్రశస్తమైనది కాబట్టే నువ్వుల నుంచి నూనె తీసిన తరువాత ఆ తెలకపిండిని కూడా మనవారు పశువులకు ఆహారంగా పెడుతూ ఉంటారు. - నిర్జర.  

ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే?

చచ్చీచెడీ తెగ వ్యాయామం చేస్తామా! ఒంట్లో ఒక్క అరకిలో బరువు కూడా తగ్గకపోవడం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. వ్యాయామం చేసే సమయంలో మనం చేసే పొరపాట్లే మన కష్టానికి తగిన ఫలితం రాకపోవడానికి కారణం అంటున్నారు నిపుణులు. వాటిలో ఒకటి ఏదో ఒకటి తిన్న తరువాత వ్యాయామం చేయడం! అదెంత పొరపాటో మీరే చూడండి...   ఏదన్నా తిన్న తరువాత వ్యాయామం చేయడానికీ, ఖాళీ కడుపు మీద వ్యాయామం చేయడానికి మధ్య ఏమన్నా వ్యత్యాసం ఉందేమో తెలుసుకునేందుకు బ్రిటన్లోని ఒక విశ్వవిద్యాలయంలో పరిశోధన జరిగింది. దీని కోసం పరిశోధకులు ఊబకాయంతో బాధపడుతున్న కొందరు మగవారిని ఎన్నుకొన్నారు. వీరిలో కొందరి చేత ఖాళీ కడుపు మీద ఓ గంటపాటు వ్యాయామం చేయించారు. మరికొందరిచేత శుభ్రంగా ఏదన్నా తిన్నతరువాత వ్యాయామం చేయించారు.   వ్యాయామానికి ముందరా తరువాతా కూడా అభ్యర్ధుల నుంచి రక్తం నమూనాలని సేకరించి పరీక్షించారు. ఈ పరీక్షలో... ఖాళీ కడుపు మీద ఆహారం తీసుకున్నప్పుడు, కొవ్వు కణాలకు చెందిన PDK4, HSL అనే రెండు జన్యువులు విభిన్నంగా ప్రవర్తించడం కనిపించింది. PDK4 పనితీరులో మార్పు వల్ల వ్యాయామానికి కావల్సిన శక్తిని, ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు నుంచి సేకరిస్తున్నట్లు తేలింది. అదే ఆహారం తిన్న తరువాతైతే అప్పుడే తిన్న తిండి నుంచి వ్యాయామానికి కావల్సిన శక్తిని పొందుతున్నాయన్నమాట. HSL అనే జన్యువు కూడా అవసరం అయినప్పుడు ఒంట్లోని కొవ్వు కణాలను కరిగించేందుకు దోహదపడేదే!   ఇంతకీ ఖాళీ కడుపు మీద వ్యాయామం చేయడం వల్ల అధిక ప్రభావం ఉంటుందని పాశ్చాత్య పరిశోధకులు తేల్చారన్నమాట. ఒక్కసారి మన యోగాసనాల గురించి తల్చుకుంటే... ఉదయం వేళ సూర్యనమస్కారాలు వంటి ఆసనాలు వేసేటప్పుడు ఖాళీ కడుపుతో ఉండాలన్న నియమం గుర్తుకురాకమానదు. కాకపోతే మన పెద్దలు చెప్పిన విషయాన్ని ఎవరో పాశ్చాత్యులు తిరిగే చెబితే కానీ మనకి నమ్మబుద్ధి కాదు!!! - నిర్జర.  

పండ్లు ఆ సమయంలోనే తినాలా?!

ఆరోగ్యానికి ఏ ఆహారం మంచిది అని అడగ్గానే ఫ్రూట్స్ అని అందరూ ఠక్కున చెప్పేస్తారు. నిజమే. పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే వాటిలో ఉండే పోషకాలు మరెందులోనూ ఉండవు. అందుకే వీలైనన్ని ఫలాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఫ్రూట్స్ తీసుకోడానికి సరైన సమయం ఒకటి ఉంది. ఆ సమయంలో తింటే వాటిలోని పోషకాలన్నీ శరీరానికి సరిగ్గా అందుతాయని తాజాగా ఓ పరిశోధనలో తేలింది.   సాధారణంగా చాలామంది టిఫిన్ తిన్న తర్వాత, మధ్యాహ్నం రాత్రి భోజనం చేసిన తర్వాత ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకోవడంలో తప్పేమీ లేదు కానీ ఆ సమయాల్లో కంటే ఉదయం పరగడుపునే పండ్లు తినడం చాలా మంచిదంటున్నారు నిపుణులు. మామూలుగానే పండ్లు త్వరగా అరిగిపోతాయి. పరగడుపునే అయితే ఆ అరుగుదల మరింత మెరుగ్గా ఉంటుంది. పైగా అప్పటికి ఏ ఇతర ఆహార పదార్థాలూ కడుపులోకి వెళ్లకపోవడం వల్ల ఫలాల పోషకాలు శరీరానికి అందండంలో ఎటువంటి అవరోధాలూ ఉండవట.   అయితే కడుపులో అల్సర్లు ఇతరత్రా సమస్యలు ఉన్నవారు, జీర్ణశక్తి తక్కువగా ఉన్నవాళ్లు పరగడుపున పండ్లు తీసుకోకూడదట. ముఖ్యంగా అనాస, ద్రాక్ష, నిమ్మ, నారింజ, టొమాటో వంటివి అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే వాటిలో ఉండే ఎసిటిక్ యాసిడ్ కారణంగా గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి అయ్యి.. తద్వారా పలు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందట.   మీకు అలాంటి సమస్యలేమీ లేవా? అయితే భయపడక్కర్లేదు. రోజూ ఉదయాన్నే పరగడుపున పండ్లు తినండి. వాటిలోని పోషకాలను పూర్తిగా పొందండి. - sameeranj

పెద్దవాళ్లు మీ మాటను ఎందుకు వినలేరు!

కొంతమంది పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్లు ఎందుకో మన మాటల్ని అర్థం చేసుకోలేకపోతున్నారని అనిపిస్తుంది. ఇంకాస్త గట్టిగా మాట్లాడినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. అలాగని వారికి ఏమన్నా చెముడు వచ్చిందా అంటే, పరీక్షలలో అంతా బాగానే ఉన్నట్లు తోస్తుంది. దాంతో సమస్య ఎక్కడ ఉందా అని అటు వినేవారూ, ఇటు వాగేవారు కూడా వాపోతుంటారు. ఇన్నాళ్లకి ఆ సమస్యకి తగిన సమాధానం దొరికింది.   కథలు వినిపించారు మేరీలాండ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు 61-73 ఏళ్లలోపు ఉన్న కొందరు వ్యక్తులను ఎన్నుకొన్నారు. వీరికి ఒకేసారి మూడు కథలను వినిపించారు. వాటిలో కేవలం ఒక్క కథ మీదే తమ దృష్టిని నిలపమని ముందుగానే చెప్పారు. అలా దృష్టి పెట్టిన కథలోంచి కొన్ని ప్రశ్నలకు అడిగి చూశారు. ఫలితం! వారు ఎంతగా ప్రత్యేక దృష్టి సారించినా కూడా సదరు కథలోని చిన్న చిన్న వివరాలను సైతం వెల్లడించలేకపోయారు.   కార్టెక్సే కారణం మనుషి మిగతా జీవులలాగానే అన్ని శబ్దాలనూ వింటాడు. కానీ ఆ విన్న శబ్దాలను విశ్లేషించేందుకు అతని మెదడులోని ‘కార్టెక్స్‌’ అనే భాగం మరింతగా అభివృద్ధి చెంది ఉంటుంది. ముసలివారు అవుతున్న కొద్దీ ఈ కార్టెక్స్‌ సామర్థ్యం తగ్గిపోవడాన్ని గ్రహించారు పరిశోధకులు. ఫలానా కథ మీదే దృష్టి పెట్టమని అడిగినప్పుడు, పెద్దవారిలో కార్టెక్స్‌ సహకరించకపోవడాన్ని గమనించారు. ఇదే సమస్యని యువకుల ముందు ఉంచినప్పుడు, కార్టెక్స్‌ స్పందన ఖచ్చితంగా కనిపించింది.   వింటారు కానీ ఈ పరిశోధనతో పెద్దవారు మిగతావారిలాగానే వినగలిగినా, తాము విన్నదాన్ని ఠక్కున విశ్లేషించడంలో విఫలం అయ్యే పరిస్థితి ఉందంటున్నారు. మరీ ముఖ్యంగా రెండుమూడు రకాల శబ్దాలు ఒకేసారి వినిపించినప్పుడు, వాటిలో ఏ శబ్దాన్ని ఎన్నుకోవాలి, ఆ శబ్దం ద్వారా ఏం గ్రహిస్తున్నాను అనే అయోమయంలోకి వారి మెదడు జారిపోతోందట. ఒకోసారి వారు ప్రశాంతమైన వాతావరణంలో వింటున్న శబ్దాలను సైతం గ్రహించలేకపోతుంటారని తేలింది.   నిదానంగా చెప్పాలి పెద్దవారితో ఏదన్నా ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నప్పుడు రణగొణధ్వనులు లేని సందర్భాన్ని ఎంచుకోవాలి. వారితో ఏదన్నా సంభాషణ చేసేటప్పుడు టీవీ, సెల్‌ఫోన్‌ వంటి ఇతర మోతలు లేకుండా చూసుకోవాలి. అన్నింటికీ మించి గట్టిగా అరవడం వల్ల ఉపయోగం లేదని తెలుసుకోవాలి. దాని బదులుగా మనం చెప్పదల్చుకున్న విషయాన్ని నిదానంగా, స్పష్టంగా తెలియచేయాలి. అప్పుడు వినిపించడం లేదన్న వేదన వారికీ ఉండదు, చెప్పలేకపోతున్నామన్న విసుగు మనకీ కలగదు.   - నిర్జర.

ఇంటర్నెట్‌తో మానసిక వ్యాధులు

ఒకప్పుడు ఇంటర్నెట్‌ అంటే అదో విలాసం. అందులో ఏమన్నా సమాచారం వెతకాలంటే ఎక్కడెక్కడికో వెళ్లి వందలకొద్దీ రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. ఆ సమాచారం కూడా నిక్కుతూ నీలుగుతూ నిదానంగా ‘లోడ్‌’ అయ్యేది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఇంటింటా ఇప్పుడు ఇంటర్నెట్‌ రాజ్యమేలుతోంది. సాంకేతిక విప్లవం పుణ్యమా అని గంపల కొద్దీ సమాచారం సెకన్లలో కంప్యూటర్లో మెదుల్తోంది. ఇక ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం వంటి సామాజిక సైట్ల విజృంభణా తక్కువేం లేదు. మరి కళ్ల ముందు ఇంత ప్రపంచం కనిపిస్తోంది కదా అని, కదలకుండా కూర్చునేవారి పరిస్థితి ఏంటి?   ఇంటర్నెట్‌ ఎడిక్షన్‌ టెస్ట్‌  ఇంటర్నెట్‌ మీద ఎక్కువసేపు గడిపేవారిలో ఇతరత్రా మానసిక వ్యాధులు ఏమన్నా ఉండే అవకాశం ఉందా? అన్న సందేహం వచ్చింది, కొందరు కెనడా పరిశోధకులకి. సందేహం వచ్చిందే తడవు, ఓ 254 మందిని విద్యార్థులను ఎన్నుకున్నారు. అలా ఎన్నుకొన్నవారిలో ఇంటర్నెట్ వాడకాన్ని పరిశీలించారు. ఈ 254 మందిలో ఓ 33 మందిలో ఇంటర్నెట్‌ పట్ల విపరీతమైన వ్యసనం ఉన్నట్లు తేలింది.   వ్యాధుల గంప ఇంటర్నెట్‌ వ్యసనం ఉన్న వారిలో రకరకాల మానసిక సమస్యలు ఉన్నట్లు వెల్లడైంది. విపరీతమైన క్రుంగుబాటు, ఉద్వేగం, ఆందోళన, ఏకాగ్రత లోపం వంటి ఇబ్బందులను వారు ఎదుర్కొన్నట్లు తేలింది. ఇంటర్నెట్‌ను వాడేవారిలో ఈ కింది గణాంకాలను కూడా పరిశోధకులు నమోదు చేశారు. - ఒక 56 శాతం విద్యార్థులు వీడియోలకి సంబంధించిన సైట్లకి అతుక్కుపోతున్నారట. - 48 శాతం మంది విద్యార్థులైతే సోషల్‌ మీడియా సైట్లను వదిలి ఉండలేకపోతున్నారు. - విద్యార్థులలో 29 శాతం మంది ఇన్‌స్టంట్ మెసేజింగ్ సైట్లను పట్టుకుని వేళ్లాడుతున్నారు. మొత్తం మీద ఇంటర్నెట్‌ ఓ వ్యసనంగా ఉన్నవారిలో 42 శాతం మంది నానారకాల మానసిక ఇబ్బందులనూ ఎదుర్కొంటున్నారు.   కొత్త కోణం ఇప్పటివరకూ మనస్తత్వ వైద్యలు తమ వద్దకు వచ్చే మానసిక రోగుల జీవితంలో ఇంటర్నెట్ ప్రాముఖ్యతని అంతగా గమనించనేలేదు. కానీ ఇక మీదట ఇంటర్నెట్‌ వాడకాన్ని కూడా ఒక లక్షణంగా భావించాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంతేకాదు! ఇప్పుడు ఇంటర్నెట్ వ్యసనం అనేది రెండు రకాల ప్రమాదాన్ని మన ముందు ఉంచుతోంది. ఒకటి- ఏదన్నా మానసిక వ్యాధి ఉన్న వ్యక్తుల, ఆ వ్యాధి కారణంగా ఇంటర్నెట్‌కు మరింతగా వ్యసనపరులు కావడం; రెండు- తెలియకుండా ఇంటర్నెట్‌ మీద ఎక్కువ సమయాన్ని గడుపుతున్నవారు, నిదానంగా ఏవో ఒక మానసిక ఇబ్బందులకు లోను కావడం. ఎలా చూసినా అవసరానికి మించిన ఇంటర్నెట్ వాడకం నష్టమేనని రుజువవుతోంది. తస్మాత్‌ జాగ్రత్త!   - నిర్జర.  

పుదీనా..... సేద తీర్చేనా

ఆకుకూరల్లో ఘుమఘుమలాడేది ఏది అంటే వెంటనే వచ్చే సమాదానం పుదీనా. నిజమే కదా ఏ వంటకానికైనా మంచి రుచిని వాసనను తీసుకురావాలంటే ఖచ్చితంగా పుదీనాను వాడాల్సిందే. అందులో ఎండాకాలం ఎండల నుంచి ఉపశమనం కావాలనుకుంటే క్రమం తప్పకుండా పుదీనాను వాడతారు చాలామంది. దీనిని కేవలం వంటకాలకి మాత్రమే దీనిని ఉపయోగిస్తారు అనుకోకండి. వైద్యపరంగా కూడా పుదీనాకి మంచి గుర్తింపే ఉంది. ముఖ్యంగా ప్రాకృతిక వైద్యం, ఆయుర్వేదం మొదలైనవాటిలో దీనిని బాగా ఉపయోగిస్తారు. ఈ పుదీనా రక్తప్రసరణని క్రమబద్దీకరించటమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. గొంతు నొప్పికి, కడుపులో మంటకి ఇదొక మంచి మందు. పుదీనాతో ఎన్ని ఉపయోగాలున్నాయో చూద్దామా.     జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే పుదీనాను క్రమం తప్పకుండా వాడితే మంచిదని వెైద్యులు చెబుతున్నారు. పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకు లు, దాల్చిన చెక్క కలిపి నూరి ప్రతి రోజూ  2-3 చెంచాలు సేవిస్తూవుంటే అరుగుదల పెరుగుతుంది. జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా గింజలు కొన్ని నమిలిన  తరువాత ఒక గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది.     పుదీనా కషాయం ఎలాంటి జ్వరాన్నైనా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ కషాయం వల్ల కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధవ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.   పుదీనా, మిరియాలు, ఇంగువ, ఉప్పు, జీలకర్ర, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు కలిపి మొత్తం నూరుకుని లేహ్యంలా సేవిస్తే ఉదరసంబందిత వ్యాధులు నివారణ అవుతాయి. ఆకలి ఎక్కువగా లేని వారు, పుల్లత్రేనుపులతో బాధపడేవారు, కడుపులో గ్యాస్ పేరుకుపోయి ఇబ్బంది పడేవారు కూడా ఈ లేహ్యాన్ని తినవచ్చు. ఫలితాన్ని మీరే స్వయంగా చూడచ్చు.   ప్రెగ్నెన్సీ మొదటి రోజుల్లో కొంతమంది వాంతులతో బాధపడుతూ ఉంటారు అలాంటివారు చెంచాడు పుదీనా రసంలో అదే కొలతలో నిమ్మరసం, తేనే కలుపుకుని ఆరారా తాగుతూ ఉంటే వాంతులు తగ్గుతాయి. వికారం కూడా రాకుండా ఉంటుంది.   నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి ముందు ఈ ఆకుల్ని ఒక గ్లాసుడు నీళ్ళల్లో వేసి మూతపెట్టి అరగంట తర్వాత తాగితే మంచి నిద్ర పడుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.   అరికాళ్ల మంటలకు పుదీనా ఆకులను మొత్తగా రుబ్బి పేస్టులా చేసుకుని ఫ్రిజ్‌లో కాసేపు ఉంచిన తరువాత బయటకు తీసి చల్లగా ఉన్నప్పుడు అరికాళ్లకు రాస్తూ ఉంటే మంటలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.   పుదీనా ఆకుల్ని ఎండబెట్టి దానిని టీ పొడిలో కలిపి టీ చేసుకుని తాగితే గొంతునొప్పి తాగటమే కాకుండా గొంతులో మాధుర్యం కూడా పెరుగుతుంది.   చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌కి తాజా పుదీనా ఆకులు కొన్ని చేతితో రసంలా తీసి ఆ రసంలో దూదిని  ముంచి ఆ డ్రాప్స్ చెవిలో, ముక్కులో ఆరారా  వేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గిపోతుంది.   నోటి దుర్వాసనకి కూడా ఇది మంచి మందు. నోరు వాసన వచ్చేవారు పుదీనా ఆకుల్ని ఎండబెట్టి పొడిచేసి అందులో కాస్త ఉప్పు వేసుకుని ఆ పొడితో రోజూ పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన మాయం అవ్వటమే కాదు చిగుళ్ళు కూడా గట్టిపడతాయి.   ఎండాకాలంలో మజ్జిగలో పుదీనా ఆకులు వేసుకుని తాగితే చాలా చలవ చేస్తుంది. నిమ్మరసంలో పుదీనా కలుపుకుని తాగితే దాహం కూడా తీరుతుంది. వేసవికాలానికి పుదీనా ఒక మంచి నేస్తంలాంటిది.   ఈ రోజుల్లో ప్రతి వస్తువులోనూ పుదీనాని కలుపుతున్నారు. సబ్బులలో, పేస్టులలో, పేస్ క్రీమ్స్ లో, ఆఖరికి ఈ మధ్య సిగరెట్ తయారీలో కూడా పుదీనాని వాడుతున్నారు. ఈ పుదీనా సిగరెట్ వల్ల గొంతు నొప్పులు అలాగే గొంతు కాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా మటుకు తగ్గుతాయట. ఇన్ని ఉపయోగాలున్న పుదీనా ని మనం నిర్లక్షం చెయ్యకుండా క్రమం తప్పకుండా వాడదామా. ...కళ్యాణి

భారతీయుల వంటల్లో ఇంగువ ఎందుకు?

అసెఫీటిడా అంటే ఏంటి? అని ఎవరన్నా అడిగితే కాసేపు ఆలోచించాల్సి ఉంటుంది. అదే ఇంగువ అనో హింగ్ అనో చెబితే మన రోజువారీ వంటకాల్లో ఉపయోగించే పదార్థం గుర్తుకువస్తుంది. ఫెరూలా అనే వృక్షజాతి నుంచి సేకరించిన పాలతో రూపొందించే ఇంగువని విడిగా తినడం కష్టమే. కానీ అదే ఇంగువని వంటల్లో వేసుకుంటే వచ్చే రుచీ, పరిమళం వేరు. భారతీయుల వంటకాల్లో, మరీ ముఖ్యంగా దక్షిణాది వంటకాల్లో ఇంగువ లేకుండా పని జరగదు. వెల్లుల్లి, ఉల్లి వంటి పదార్థాలకు దూరంగా ఉండే సనాతనవాదులు సైతం... వాటికి బదులుగా ఇంగువని చిలకరించి వంటకాల్లో అనూహ్యమైన రుచిని సాధిస్తుంటారు. మరి వందల సంవత్సరాలుగా మన వంటకాల్లో చేరిపోయిన ఈ ఇంగువను కేవలం రుచి, పరిమళానికేనా... లేదా మరేదన్నా ఆరోగ్యపరమైన కారణంతో వాడుతుంటారా? అంటే జవాబులు ఇవిగో... - చాలామందికి ఆహారం తిన్న తరువాత కడుపు ఉబ్బరంగా మారిపోతుంది. ఇలాంటి ఉబ్బరాన్ని శుబ్బరంగా తగ్గిస్తుంది ఇంగువ. ఇలా కడుపు ఉబ్బరాన్ని తగ్గించే పదార్థాలని యాంటీ ఫ్లాట్యులెంట్స్‌ అంటారు. ఇంగువ అలాంటి యాంటీ ఫ్లాట్యులెంట్స్‌లో ఒకటి. - కేవలం కడుపు ఉబ్బరాన్నే కాదు! జీర్ణసంబంధమైన సమస్యలెన్నింటిలోనో ఇంగువ అమోఘంగా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం పిత్తదోష కారణంగా ఏర్పడే అరుచి, అజీర్ణం, ఆకలి లేకపోవడం లేకపోవడం వంటి సమస్యలకు ఇంగువ దివ్యౌషధం. ఆఖరికి కడుపు లోపల అయిన గాయాలను మాన్పే శక్తి కూడా ఇంగువకు ఉందని పరిశోధనల్లో తేలింది. - అటు ఆయుర్వేదంలోనే కాకుండా ఇటు యునానీలో కూడా ఇంగువ ప్రాధాన్యత అంతాఇంతా కాదు. ముఖ్యంగా ఫిట్స్‌ వంటి మానసిక సంబంధమైన వ్యాధులకు మందుగా యునానీ వైద్యులు ఇంగువను వాడుతుంటారు. - ఆడవారిలో రుతుసంబంధమైన సమస్యలకు ఇంగువ విరుగుడుగా పనిచేస్తుందని నమ్ముతారు. రుతుచక్రం సరిగా లేకపోవడం, రుతుక్రమ సమయంలో కడుపునొప్పి వంటి ఇబ్బందులను ఇంగువ సరిచేస్తుంది. అందుకే కొంతమంది బాలింతలకు ఇంగువను ఇస్తుంటారు. - ఇంగువ ఇటు పొడిదగ్గు, అటు కఫంతో వచ్చే దగ్గలకు ఉపశమనంగా నిలుస్తుంది. ఆస్తమా, బ్రాంకైటిస్‌ వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులలోనూ ఉపయుక్తంగా ఉంటుంది. ఇక తీవ్ర పడిశాన్ని (Influenza) కలిగించే H1N1 అనే వైరస్‌ను ఇంగువ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తేలింది. - ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా షుగర్‌ వ్యాధి బాధలు కనిపిస్తున్నాయి. ఈ చక్కెర వ్యాధిని అదుపుచేయడంలో ఇంగువ తనదైన పాత్రను పోషించగలదంటున్నారు. ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇంగువ, రక్తంలో చక్కెర నిల్వలని అదుపు చేస్తుందని చెబుతున్నారు. - ఇంగువలో coumarin అనే రసాయనాలు ఉన్నాయట. ఈ కౌమరిన్‌లకు రక్తాన్ని పలచన చేసే ప్రభావం ఉంటుంది. దీని వల్ల రక్తం గడ్డకట్టి గుండెపోటుకి దారితీసే పరిస్థితి నుంచి బయటపడవచ్చు. రక్తంలో కొలెస్టరాల్‌ పేరుకోకుండా నివారించవచ్చు. - ఇంగువకి ఒంటి నొప్పులను నివారించే గుణం ఉందంటున్నారు. ముఖ్యంగా ఓ పట్టాన మందులకు లొంగని మైగ్రెయిన్ తలనొప్పులు, రుతుక్రమంతో పాటు వచ్చే కడుపునొప్పులను ఇది హరిస్తుంది. చెప్పుకొంటూ పోవాలే కానీ ఇంగువ ఇచ్చే అద్భుత ఫలితాల జాబితా చాంతాడంత ఉంటుంది. అందుకే దీనిని ఆయుర్వేదం, హోమియోపతి, యునాని వంటి అన్ని సంప్రదాయ వైద్యాలలోనూ వాడుతుంటారు. ఇంగువని మన వంటకాల్లో చేర్చడం వల్ల పైన పేర్కొన్న లాభాలన్నీ ఎంతో కొంత కలుగుతూనే ఉంటాయి. అలా కాకుండా చిటికెడంత ఇంగువని గోరువెచ్చటి నీళ్లలోనో, మజ్జిగలోనో తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది. ఇంగువను ప్రత్యేకించి ఒక ఔషధిగా తీసుకోవాలంటే మాత్రం ఎవరన్నా తెలిసిన ఆయుర్వేద వైద్యుని సంప్రదించడం మంచిది. - నిర్జర.