మాతృభాషతోనే సృజనాత్మకత
మీ పిల్లలు అమ్మ భాషలో మాట్లాడుతున్నారా? అంటే మాతృ బాషలో. అచ్చ తెలుగులో ఎంచక్కా మాట్లాడగలిగితే పరవాలేదు. లేకపోతె మాత్రం పరిశోధకులు చెప్తున్నా ఈ విషయాన్నీ గమనించండి.
ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో తేలింది ఏంటంటే... మాతృభాషలో చక్కగా మాట్లాడగలిగే పిల్లల్లో సృజనాత్మకత, పరాయి బాషలలో మాట్లాడే పిల్లల్లో కంటే ఎక్కువ ఉంటుందట. అంటే ... పూర్తిగా మాతృభాషలో ఆలోచించటం మానేస్తే, వినూత్నతకు దూరమైపోయినట్లే. సహజంగా బాష బీజాలు తల్లి గర్భంలో ఉండగానే పడతాయని ఎన్నో పరిశోధనల్లో తేలింది. బిడ్డ పుట్టి పెరుగుతున్నప్పుడు చుట్టూ ఉండే వారిని గమనిస్తూ, మాటలు నేర్చుకుంటూ, భావాలను వ్యక్తీకరించటం మొదలు పెడతాడు. అన్నీ భావావేశాలను చక్కగా వ్యక్తీకరించగలుగుతాడు. ఎప్పుడైతే వేరే భాషలో మాత్రమే మాట్లాడవలసి వస్తుందో.. అప్పుడు తన భావవ్యక్తీకరణలో మార్పు రావడం మొదలు పెడుతుందట. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో మాతృభాషలోనే మాట్లాడటం మంచిది అంటున్నారు పరిశోధకులు. అలాగే గేయాలు, కథలు, పద్యాలు వంటి వాటిని మాతృభాషలో నేర్పిస్తే పిల్లల్లో మాతృభాష పట్ల ఆసక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు వస్తుంది. అలాగే తన భావాలను చక్కగా, స్పష్టంగా వ్యక్తీకరించే నేర్పు కూడా వస్తుంది.
ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అంటే అమ్మ భాషను పది కాలాల పాటు కాపాడుకోవడానికి, అలాగే ఆ భాష తీయదనాన్ని ముందు తరాలకు చేరేలా చేయటానికి మనం ఏం చేయాలి అన్నది సమాలోచించుకోవలసిన రోజు. ప్రభుత్వం ఏం చేయాలన్నది పక్కన పెడితే.. వ్యక్తులుగా మన పరిధిలో మనం ఏం చేయగలం అన్నది ఆలోచించాలి. దానికి పునాది మన ఇంటినుంచే పడాలి. పరాయి భాషలను గౌరవిస్తూ, మన మాతృభాషను పూజించటం ఎలాగో పిల్లలకు నేర్పాలి. తేట తెలుగు తీయదనాన్ని రుచి చూపించాలి. అందుకు చేయవలసిందల్లా పిల్లలతో అచ్చ తెలుగులో మాట్లాడటం, చిట్టి చిలకమ్మా వంటి కధాగేయాలను, పద్యాలనూ నేర్పించటం, కథలు, పొడుపు కథలు, సామెతలు మొదలైన వాటిని పిల్లలకు చెప్పటం అలాగే మన తిధి, వార, నక్షత్రాలను నేర్చుకునేలా చేయటం. ఇవన్నీ పిల్లల్లో భాషపట్ల ఆసక్తిని రేకెత్తిస్తాయి. తెలుగులో మాట్లాడటమే కాదు. చదవటం, రాయటం నేర్పించటం కూడా ముఖ్యమే. అప్పుడే రేపటి తరం వరకు తెలుగు భాష నిలిచేది. ఇదంతా భాషకి మనం చేసే సేవ అని అనుకున్నా మంచిదే. ఎవరి పరిధిలో వారు ఎంతో కొంత చేయటం మొదలు పెడితేనే భాష మనగలిగేది. అంతకన్నా ముఖ్యంగా అమ్మ భాష పిల్లల సృజనాత్మక సమగ్రాభివృద్ధికి దోహదపడుతుంది అని అధ్యయనాలు గట్టిగా చెబుతున్నాయి కాబట్టి... పిల్లలను తెలుగులో మాట్లాడగలిగేలా, రాయగలిగేలా ప్రోత్సహిద్దాం.
......రమ