నరేంద్రమోడీకి మద్దతిస్తా... జగన్ అత్యుత్సాహం
posted on May 19, 2014 @ 2:24PM
కేంద్రంలో ఎవరి మద్దతూ అవసరం లేని స్థాయిలో భారతీయ జనతాపార్టీ వుంది. అయితే ఎన్నికలకు ముందు కుదిరిన పొత్తుల విషయంలో ఆ పార్టీకి గౌరవం వుంది. అయితే వైసీపీ అధ్యక్షుడు జగన్ మాత్రం పిలవని పేరంటంలాగా బీజేపీకీ, ఎన్డీయేకి మద్దతు ఇస్తానని కొత్త పాట అందుకున్నారు. బీజేపీకి చేరువైపోవాలని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా తాను ఎప్పుడూ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెబుతున్నారు. మోడీని కలవటానికి ఎంపీల బృందంతో ఢిల్లీకి వెళ్ళిన జగన్ మీడియాతో మాట్లాడుతూ, మోడీ విషయంలో తన పవిత్రతను చాటుకునే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ సహాయం అవసరమని, అందుకు ఎన్డీయెకు అంశాలవారీగా మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని కాంగ్రెసు దారుణంగా విభజించిందని, అలా జరిగిన విభజన విషయంలో కొన్ని మార్పులు అవసరమని, బడ్జెట్ ప్రతిపాదించే సమయంలో ఆ మార్పులను నరేంద్ర మోడీ చేస్తారని ఉద్దేశంతో వినతిపత్రం సమర్పించడానికి వచ్చామని ఆయన చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని మోడీని కోరుతామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఈ దేశ ప్రధాని సాయం అవసరమని, అందుకు అంశాలవారీగా ఎన్డీయేకిమద్దతు ఇస్తామని జగన్ ఆఫర్ ఇచ్చారు.