జగ్గారెడ్డి @ జనసేన?
posted on May 19, 2014 @ 1:15PM
మెదక్ జిల్లా సంగారెడ్డి మాజీ శాసనసభ్యుడు జగ్గారెడ్డి ఆ నియోజవర్గంలో బలమైన కాంగ్రెస్ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా వుండాలని నినదించిన నిజమైన తెలుగుబిడ్డ. అయితే టైం బాగాలేక ఆయన ఈసారి ఎన్నికలలో ఓడిపోయారు. అయితే ఆయనకు కాంగ్రెస్ పార్టీ మీద రోత పుట్టినట్టు కనిపిస్తోంది. అయిదేళ్ళ తర్వాత వచ్చే ఎన్నికలల కోసం ఇప్పటి నుంచే ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈసారి ఎన్నికలలో డెడ్‌బాడీ లాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఆయన వున్నట్టు తెలుస్తోంది. సోమవారం నాడు పవన్ కళ్యాణ్‌ని కలవటం ఈ అనుమానాలకు బలం ఇస్తోంది. జగ్గారెడ్డి పవన్‌ని కలిసినప్పుడు వారు ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు తనకు ఎంతో నచ్చాయని చెప్పారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి తాను పని చేస్తానని తెలిపారు. అయితే ఏవిధంగా ఆయనతో కలిసి పని చేసేది కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. పవన్ మాట్లాడుతూ... తెలంగాణలో బలమైన ప్రతిపక్షం అవసరమని చెప్పారు. తెలంగాణ విషయంలో జగ్గారెడ్డి వ్యవహరించిన తీరు తనకు నచ్చిందని చెప్పారు. తాను జగ్గారెడ్డితో కలిసి పని చేస్తానని తెలిపారు.