హెచ్‌సీయూ.. ముగిసిన ద్విసభ్య కమిటీ విచారణ

హెచ్‌సియూలో దళిత విద్యార్ది రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలు విద్యార్ధుల సంఘాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా రోహిత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కేంద్రం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. దీని నిమిత్తం వారు నిన్ననే హెచ్‌సియూ చేరుకొని రోహిత్ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యపై విచారణ పూర్తయిందని.. అందరినుంచి వివరాలు సేకరించామని తెలిపారు. త్వరలోనే కేంద్రానికి నివేదిక ఇస్తామని.. అయితే నివేదిక ఎప్పుడు ఇచ్చేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. తిరిగి వారు ఢిల్లీ బయలుదేరారు.

సింపుల్ గా దత్తాత్రేయ ఇంటిని ముట్టడి..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటిలో దళిత విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కేంద్రమంత్రి దత్తాత్రేయపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ ఆత్మహత్యకు కారణం దత్తాత్రేయ అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు విద్యార్ధి సంఘాలు ఆయన ఇంటిని ముట్టడిస్తున్నాయి. నిన్న కొన్ని విద్యార్ది సంఘాలు దత్తాత్రేయ ఇంటిని ముట్టడించాయి.. ఈరోజు మరికొన్ని సంఘాలు దత్తాత్రేయ ఇంటిని ముట్టడించాయి. ఏఐఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు దత్తాత్రేయ ఇంటిని ముట్టడించి.. దత్తాత్రేయ తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అరికట్టే ప్రయత్నం చేసినా అది కాస్త విఫలమైంది. ఇదిలా ఉండగా మరోవైపు ఇంతమంది విద్యార్ధి సంఘాలు ఒక కేంద్ర మంత్రి ఇంటిని ముట్టడిస్తుంటే ముందుగా పోలీసులు ఏం చేస్తున్నారు అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. అంత సింపుల్ గా కేంద్ర మంత్రి ఇంటిని ముట్టడి చేస్తుంటే పోలీసుల నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి అని అనుకుంటున్నారు.

పాకిస్థాన్ లో ఉగ్రవాదుల దాడి..15 మంది మృతి..

పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాకిస్థాన్‌లోని బచాఖాన్ యూనివర్సిటీలో ఉగ్రవాదులు దాడి చేశారు. యూనివర్సిటీలో ఓ ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో సుమారు 3వేల మంది విద్యార్దులు దాదాపు 600 మంది అతిథులు హాజరయ్యారు. దీంతో ఇదే అదనుగా చూసుకొని 10 మంది ఉగ్రవాదులు యూనివర్శిటీలోకి చొరబడి విద్యార్దులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 15 మంది మృతిచెందగా, 70మందికి గాయాలైనట్లు పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. గాయపడ్డ విద్యార్థులను సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనతో పాక్ భద్రతా సిబ్బంది హైఅలర్ట్ ప్రకటించింది. ఈసందర్భంగా డిప్యుటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సయీద్‌ వజీర్‌ మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, అతిథులను రక్షించేందుకు ఆపరేషన్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు.

పవన్ కళ్యాణ్ సడెన్ గా సింగపూర్ ట్రిప్.. సీక్రెట్ ఏంటో..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సడెన్ గా సింగపూర్ వెళ్లడంపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతున్న వేళ.. ఉన్నట్టుండి బ్రేక్ తీసుకొని మరీ పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు.. సింగపూర్ దేశ అధికారులతో మంతనాలు జరుపుతూ మాస్టర్ ప్లాన్స్ రెడీ చేస్తున్న తరుణంలో పవన్ సింగపూర్ పర్యటన చేయబోతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విహార యాత్రకి సింగపూర్ వెళ్లారా..? లేక రాజకీయ పరంగా వెళ్లారా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నారు కానీ.. షూటింగ్ పూర్తికాకపోవడంతో అదికాస్త ఏప్రిల్ కు వాయిదా పడింది. ఇప్పుడు ఏప్రిల్ లో కూడా సినిమా వస్తుందో రాదో డౌటే అంటున్నారు.

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి.. చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్విట్జర్లాండ్ దావోస్‌లో జరిగే 46వ ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన జ్యూరిక్ లో కొద్దిసేపు ఉండి అక్కడ ఉన్న ప్రవాసాంధ్రులు.. ప్రవాస భారతీయులు.. వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా.. ఏపీ అభివృద్దికి తోడ్పడాల్సిందిగా వారికి పిలుపునిచ్చారు. అంతేకాదు యూరోపియన్ దేశాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తమ విధానాలు, పద్ధతులతో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేయవచ్చని.. సరికొత్త ఆలోచనలను ఆహ్వానించడానికి తాను దేశ విదేశాల్లో పర్యటిస్తున్నానని.. ప్రవాస భారతీయుల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఏపీ ఎన్‌ఆర్‌టీ పేరుతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా చంద్రబాబుతోపాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఎంపీ సీఎం రమేష్‌, ఇతర ఉన్నతాధికారులు, ఏపీ ఎన్‌ఆర్‌టీ అధ్యక్ష, కార్యదర్శులు జయకుమార్‌, కారం సురేష్‌లు ఇందులో పాల్గొన్నారు.

పీఎస్ఎల్వీ-సీ31 రాకెట్ ప్రయోగం విజయవంతం

పీఎస్ఎల్వీ-31 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. నెల్లూరు జిల్లాలోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి పీఎస్ఎల్వీ-31పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ31(పీఎస్ఎల్వీ)ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. దీంతో ఈరోజుతో ఐదు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాలను ఇస్రో ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. ఈ రాకెట్‌ ద్వారా నావిగేషన్‌ వ్యవస్థకు సంబంధించిన 1,425 కిలోల ఐఆర్‌ ఎన్‌ఎస్‌ఎస్‌-1ఇ ఉప గ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌ కుమార్ దగ్గరుండి ప్రయోగాన్ని పర్యవేక్షించారు. త్వరలో మరో 2  ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాలను ప్రవేశపెడతామని తెలిపారు. 2016 లో ఇస్రో సాధించిన తొలి విజయం ఇది. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

రోజా సస్పెన్షపై కమిటీ చర్చ..

వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆమె సస్పెండ్ పై విచారించేందుకు గాను డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటైన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి విచారణ కమిటి ఈరోజు మూడు గంటల పాటు చర్చించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జరిగిన వాదనల గురించి.. శాసనసభ వీడియో ఫుటేజీల లీకేజీపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. కాగా దీనిపై చర్చించేందుకు గాను తిరిగి ఈ నెల 27వ తేదీన మళ్లీ సమావేశం కావాలని కమిటీ నిర్ణయించుకుంది.

కోర్టులో ధోనికి ఊరట..

భారత క్రికెటర్ ధోనికి ఊరట లభించింది.ధోనిపై అనంతపురం కోర్టులో శ్యాంసుందర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. విష్ణు అవతారంలో ధోనీని చిత్రించి హిందువుల మనోభావాలను దెబ్బ తీశాడనే, దేవతలను అవమానించారని పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో ధోనిని కోర్టుకు హాజరుకావాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కానీ ధోని మాత్రం కోర్టుకు హాజరుకాలేదు.. పైగా కనీసం లాయర్ ద్వారా కౌంటరు కూడా దాఖలు చేయలేదు. దీంతో అనంతపురం జుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు తీవ్రంగా పరిగణించి ధోనీకి నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారంట్‌ జారీ చేసింది. అయితే ఇప్పుడు దీనిపై విచారించిన కోర్టు ధోనిపైన జారీ చేసిన నాన్ బెయిలబుల్  రద్దు చేసింది.

నరేంద్ర మోదీ, మనోహర్‌పారికర్‌లను చంపుతాం.. ఐసిస్

భారత ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్‌పారికర్‌లను చంపుతామంటూ ఓ బెదిరింపు లేఖ వచ్చింది. గత వారం గోవా రాష్ట్ర సెక్రటేరియట్‌కు వీరిద్దరిని చంపుతామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. అయితే ఈ లేఖ రాసిన వారి చిరనామా గురించి ఏం లేదుకాని లేఖపై మాత్రం ఐసిస్ (ఇస్లామిక్‌ స్టేట్‌ ) ఉగ్రవాద సంస్థ సంతకం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు ఈ లేఖను అన్ని పోలీస్ స్టేషన్లకి పంపి.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఈ కేసును యాంటి టెర్రరిస్ట్‌ స్క్వాడ్ కు(ఏటీఎస్‌) అప్పగించినట్టు.. రాష్ట్ర పోలీసు యంత్రాంగంలోని అన్ని ఏజెన్సీలూ ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాయని త్వరలోనే బెదిరింపు లేఖ గురించి అన్ని వివరాలు తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు. లేఖలో గోవధ నిషేధంపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు పోలీసులు వెల్లడించారు.

హెచ్‌సీయూకి రాహుల్ గాంధీ.. నేలపై రాహుల్ గాంధీ..

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేరుకున్నారు. రెండు రోజుల క్రితం దళిత విద్యార్ధి రోహిత్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ అక్కడికి చేరుకొని అసలు ఏం జరిగిందో అన్న వివరాలు తెలుసుకుంటున్నారు. రాహుల్ గాంధీ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నేలపై కూర్చొని సస్పెండైన నలుగురు విద్యార్థులతో మాట్లాడి.. వారిని కొన్ని ప్రశ్నలు వేసి వివరాలు సేకరించారు. అనంతరం రోహిత్ తల్లిదండ్రులను పరామర్శించి.. రోహిత్ చిత్రపటానికి, స్మారక స్థూపానికి నివాళులు అర్పించారు. రాహుల్ గాంధీతోపాటు  దిగ్విజయ్ సింగ్, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇంకా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ యూనివర్శిటీల్లో మతతత్వ శక్తులపై పోరాటానికి విద్యార్థి సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాల్లో వీసీలను ఆరెస్సెస్, బిజెపిలు నియమిస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. చదువులకు బదులుగా ఓ విద్యార్థి సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు.

ఎన్టీఆర్ ను కేసీఆర్ మరిచిపోవడం దారుణం.. రేవంత్

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. ఎన్టీఆర్ వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం మరచిపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం లాంఛనంగా నిర్వహించకపోగా, నిర్వహించడానికి తమకు అనుమతులివ్వకుండా అడ్డుపడ్డారని.. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన ఎన్టీఆర్ ను కేసీఆర్ మరిచిపోవడం దారుణని అన్నారు. ఈ విషయమై వెంటనే తెలుగు ప్రజలకు కేసీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై మరో టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

రోహిత్ ఆత్మహత్య.. మోడీ క్షమాపణ చెప్పాలి.. కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ ఆత్మహత్యపై స్పందించారు. విద్యార్ధి ఆత్మహత్య ఘటనపై మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ వ్యహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రులను వెంటనే బర్త్ రఫ్ చేయాలని అన్నారు. మోదీ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి సహకరించడం లేదని కేజ్రీవాల్‌ విమర్శించారు. మరోవైపు రోహిత్ ఆత్మహత్యపై తీవ్రంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో భాగంగానే ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంటి వద్ద తెలంగాణ జాగృతికార్యకర్తలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌ రాంనగర్‌లోని బండారు దత్తాత్రేయ ఇంటి వద్ద ఆందోళనకారులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడకి చేరుకొని ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.

త్వరలో మోడీ తెలంగాణ పర్యటన.. కేటీఆర్ విమర్శలు పనిచేశాయా..?

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ మధ్యకాలంలో ప్రధాని నరేంద్ర మోడీపై ఎక్కువగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇంత కాలం అయిన మోడీకి తెలంగాణకు మాత్రం రాలేదు.. తెలంగాణ భారతదేశంలో లేదా..? తెలంగాణలో ప్రారంభించే ఎన్నో కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా రావాలని మోడీని ఆహ్వానించాం.. కానీ తాను మాత్రం రాలేదు.. కనీసం రాకపోతే రానని అయినా చెప్పాలి కదా అంటూ ఇలా పలు సందర్బాల్లో కేటీఆర్ మోడీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు కేటీఆర్ పదే పదే అనడం వల్లేమో మోడీ త్వరలో తెలంగాణ పర్యటనకు రావాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పైలాన్ ప్రారంభోత్సవానికి ఫిబ్రవరీ మొదటివారంలో ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ మేనల్లుడు.. మంత్రి హరీశ్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పైలాన్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారని.. దానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. ప్రధాని పదవి చేపట్టిన తరువాత తెలంగాణ ఆవిర్భావం తరువాత నరేంద్ర మోడీ తొలి పర్యటన ఇదే.

మరోసారి అబద్దం ఆడేసిన పాకిస్థాన్..

పాకిస్థాన్ కపట బుద్ది మరోసారి బయటపడింది. పంజాబ్ పఠాన్ కోట్ విమాన స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులపై పాక్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కూడా ఓ సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని తెలిపింది. దీనిలో భాగంగానే ఈ ఉగ్రదాడికి అసలు సూత్రధారి అయిన జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ను అరెస్ట్ చేసినట్లు పాక్ చెప్పింది. అయితే దీనిపై పలు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అది నిజమో..? కాదో..? అన్న సందేహంలో ఉండగానే పాక్ ప్రభుత్వం మాట తిప్పేసి మసూద్ అజార్ ను గృహనిర్బధంలో ఉంచామని చెప్పింది. అయితే పాక్ చెప్పిన ఈ మాటలన్ని ఒట్టిదేనని తేలిపోయింది. భారత్ ను తప్పుదారి పట్టించేందుకే పాక్ ప్రభుత్వం ఇలా చేసిందని.. మసూద్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్పిన ఎపిసోడ్ మొత్తం ఉత్తదేనని నిఘా వర్గాలు తేల్చేస్తున్నాయి. ఏదో ఒక ముగ్గురిని మాత్రమే పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని.. వారిని కూడా ఇతర కేసుల్లో ఉన్న ఆరోపణల నేపథ్యంలోనే అదుపులోకి తీసుకున్నట్లుగా తేల్చారు.

లేఖకు, రోహిత్ ఆత్మహత్యకు సంబంధం లేదు.. దత్తాత్రేయ

హైదరాబాద్  సెంట్రల్ యూనివర్శిటిలో దళిత విద్యార్ధి వి.రోహిత్ ఆత్మహత్య చేసుకున్నసంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పోలీసులు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పై కేసు నమోదు చేశారు. ఇప్పుడు దీనిపై దత్తాత్రేయ స్పందిస్తూ తన లేఖకు, రోహిత్ ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. హెచ్‌సీయూలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని.. ఏబీవీపీ కార్యకర్తలను బాగా కొట్టినట్లుగా నాకు వినతిపత్రం వచ్చింది. నేను దానిని నేరుగా మానవ వనరుల మంత్రిత్వ శాఖకు పంపించాను. ఆ తరువాత వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారో నాకు తెలియదు అని తెలిపారు. అంతేకాని నాకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు.. విచారణ జరుగుతోంది, అసలు విషయాలు బయటకు వస్తాయి అని అన్నారు. మరోవైపు దీనిపై నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ బండారు దత్తాత్రేయను విమర్శించారు. హెచ్‌సీయూలో విద్యార్ది ఆత్మహత్య చాలా దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని.. దత్తాత్రేయ రాసిన లేఖ‌తో కేంద్రం వ‌ర్శిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ పై ఒత్తిడి తెచ్చిందని, దీంతో వీసీ ఐదుగురు దళిత విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారని ఆమె ఆరోపించారు. దీంతో మనస్థాపానికి గురై రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్.. మరో ఇద్దరిపై వేటు

  2013 ఐపీఎల్ మ్యాచ్ లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో గతంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్లతో మరో ఆటగాడు  అజిత్ చండీలాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఇద్దరు ఆటగాళ్లపై వేటు పడింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై బీసీసీఐ శశాంక్ మనోహర్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల బృందం ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే బీసీసీఐ శ్రీశాంత్, చవాన్లపై జీవితకాలం నిషేధం విధించగా ఇప్పుడు ఈ కమిటీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. స్పాట్ ఫిక్స్ంగ్ చేసినందుకు గాను అజిత్ చండీలాపై జీవితకాలం, హీకెన్ షాపై ఐదేళ్ల చొప్పున బీసీసీఐ నిషేధం విధించింది. 

దళిత విద్యార్ది ఆత్మహత్య.. కేంద్రమంత్రి పై కేసు

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీలో వి. రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు నగరానికి చెందిన రోహిత్‌ హెచ్‌సియూలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే కొద్ది రోజుల క్రిందట విద్యార్థి సంఘాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఏబీవీపీ విద్యార్థిపై దాడి చేశారన్న సాకుతో రోహిత్ ను అతనితో పాటు నలుగురు విద్యార్ధులను యూనివర్శిటీ బహిష్కరించింది. దీంతో ఐదుగురు దళిత విద్యార్థులపై బహిష్కరణ ఎత్తివేయాలని కోరుతూ 15రోజులుగా వర్సిటీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఇంతలో సడెన్ గా నిన్న సాయంత్రం ఎన్‌ఆర్‌ఎస్‌ వసతి గృహంలో రోహిత్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతేకాదు ఒక సూసైడ్ నోటును కూడా రాసిపెట్టాడు. అందులో "ఈ యూనివర్సిటీలో మనిషిని మనిషిగా చూడటం లేదు. నాపుట్టుకను చూస్తున్నారు. కులం పేరుతో ఇంకా ఏన్నాళ్లు చూస్తారు.. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చా. కొన్ని రోజులుగా నా మనసుకు శరీరానికి తీవ్ర ఘర్షణ జరుగుతోంది. నాపుట్టుక తప్పా.. లేక నేనాకులంలో పుట్టడం తప్పా..'' అని రోహిత్ సూసైడ్ లెటర్ లో పేర్కోన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రోహిత్ హత్యపై విద్యార్ది నాయకులు మాట్లాడుతూ ఇది ఆత్మ హత్య కాదని మతోన్మాదుల హత్య అని.. దీనికి కారకులైన బీజేపీ నాయకులు, కేంద్రమంత్రులు బండారుదత్తాత్రేయ, స్మృతీఇరానిలను వెంటనే అరెస్టు చేయాలని విద్యార్ధులు డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా హెచ్‌సీయూలో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఐస్‌ఏ నాయకుడు ప్రశాంత్‌ ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీసీ అప్పారావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఏబీవీపీ నాయకుడు సుశీల్‌కుమార్‌, బీజేవైఎం నాయకుడు విష్ణుపై కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి సీఐ జూపల్లి రమేశ్‌ తెలిపారు.

కేసీఆర్ ను కలిసిన బాలకృష్ణ.. డిక్టేటర్ చూడండి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సినీ నటుడు.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ రోగుల సౌకర్యార్ధం బసవతారకం ఆస్పత్రి ఆవరణలో నిర్మించిన భవనాలను బీఆర్ఎఫ్ కింద క్రమబద్దీకరించాలని కేసీఆర్ ను కోరినట్టు తెలుస్తోంది. దీనికి కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ హైదరాబాద్‌ ఆస్పతుల్లో రోగుల సహాయకులకు నైట్‌ షెల్టర్ల సంఖ్య పెంచాలని.. త్వరలోనే నగరంలోని ఆస్పత్రుల యాజమాన్యాలతో భేటీ అయి వసతులపై చర్చిస్తామని చెప్పారు. అంతేకాదు తన డిక్టేటర్ సినిమాను చూడాలని బాలకృష్ణ కేసీఆర్ ను కోరారు. దీనికి కేసీఆర్ తన 100 సినిమా ఎప్పుడు అని బాలకృష్ణను అడుగగా.. ఆదిత్య 369 కు సీక్వెల్ గా తన 100 సినిమా ఉంటుందని బాలకృష్ణ తెలిపారు.