త్వరలో మోడీ తెలంగాణ పర్యటన.. కేటీఆర్ విమర్శలు పనిచేశాయా..?

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ మధ్యకాలంలో ప్రధాని నరేంద్ర మోడీపై ఎక్కువగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇంత కాలం అయిన మోడీకి తెలంగాణకు మాత్రం రాలేదు.. తెలంగాణ భారతదేశంలో లేదా..? తెలంగాణలో ప్రారంభించే ఎన్నో కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా రావాలని మోడీని ఆహ్వానించాం.. కానీ తాను మాత్రం రాలేదు.. కనీసం రాకపోతే రానని అయినా చెప్పాలి కదా అంటూ ఇలా పలు సందర్బాల్లో కేటీఆర్ మోడీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు కేటీఆర్ పదే పదే అనడం వల్లేమో మోడీ త్వరలో తెలంగాణ పర్యటనకు రావాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పైలాన్ ప్రారంభోత్సవానికి ఫిబ్రవరీ మొదటివారంలో ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ మేనల్లుడు.. మంత్రి హరీశ్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పైలాన్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారని.. దానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. ప్రధాని పదవి చేపట్టిన తరువాత తెలంగాణ ఆవిర్భావం తరువాత నరేంద్ర మోడీ తొలి పర్యటన ఇదే.

మరోసారి అబద్దం ఆడేసిన పాకిస్థాన్..

పాకిస్థాన్ కపట బుద్ది మరోసారి బయటపడింది. పంజాబ్ పఠాన్ కోట్ విమాన స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులపై పాక్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కూడా ఓ సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని తెలిపింది. దీనిలో భాగంగానే ఈ ఉగ్రదాడికి అసలు సూత్రధారి అయిన జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ను అరెస్ట్ చేసినట్లు పాక్ చెప్పింది. అయితే దీనిపై పలు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అది నిజమో..? కాదో..? అన్న సందేహంలో ఉండగానే పాక్ ప్రభుత్వం మాట తిప్పేసి మసూద్ అజార్ ను గృహనిర్బధంలో ఉంచామని చెప్పింది. అయితే పాక్ చెప్పిన ఈ మాటలన్ని ఒట్టిదేనని తేలిపోయింది. భారత్ ను తప్పుదారి పట్టించేందుకే పాక్ ప్రభుత్వం ఇలా చేసిందని.. మసూద్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్పిన ఎపిసోడ్ మొత్తం ఉత్తదేనని నిఘా వర్గాలు తేల్చేస్తున్నాయి. ఏదో ఒక ముగ్గురిని మాత్రమే పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని.. వారిని కూడా ఇతర కేసుల్లో ఉన్న ఆరోపణల నేపథ్యంలోనే అదుపులోకి తీసుకున్నట్లుగా తేల్చారు.

లేఖకు, రోహిత్ ఆత్మహత్యకు సంబంధం లేదు.. దత్తాత్రేయ

హైదరాబాద్  సెంట్రల్ యూనివర్శిటిలో దళిత విద్యార్ధి వి.రోహిత్ ఆత్మహత్య చేసుకున్నసంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పోలీసులు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పై కేసు నమోదు చేశారు. ఇప్పుడు దీనిపై దత్తాత్రేయ స్పందిస్తూ తన లేఖకు, రోహిత్ ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. హెచ్‌సీయూలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని.. ఏబీవీపీ కార్యకర్తలను బాగా కొట్టినట్లుగా నాకు వినతిపత్రం వచ్చింది. నేను దానిని నేరుగా మానవ వనరుల మంత్రిత్వ శాఖకు పంపించాను. ఆ తరువాత వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారో నాకు తెలియదు అని తెలిపారు. అంతేకాని నాకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు.. విచారణ జరుగుతోంది, అసలు విషయాలు బయటకు వస్తాయి అని అన్నారు. మరోవైపు దీనిపై నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ బండారు దత్తాత్రేయను విమర్శించారు. హెచ్‌సీయూలో విద్యార్ది ఆత్మహత్య చాలా దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని.. దత్తాత్రేయ రాసిన లేఖ‌తో కేంద్రం వ‌ర్శిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ పై ఒత్తిడి తెచ్చిందని, దీంతో వీసీ ఐదుగురు దళిత విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారని ఆమె ఆరోపించారు. దీంతో మనస్థాపానికి గురై రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్.. మరో ఇద్దరిపై వేటు

  2013 ఐపీఎల్ మ్యాచ్ లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో గతంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్లతో మరో ఆటగాడు  అజిత్ చండీలాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఇద్దరు ఆటగాళ్లపై వేటు పడింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై బీసీసీఐ శశాంక్ మనోహర్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల బృందం ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే బీసీసీఐ శ్రీశాంత్, చవాన్లపై జీవితకాలం నిషేధం విధించగా ఇప్పుడు ఈ కమిటీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. స్పాట్ ఫిక్స్ంగ్ చేసినందుకు గాను అజిత్ చండీలాపై జీవితకాలం, హీకెన్ షాపై ఐదేళ్ల చొప్పున బీసీసీఐ నిషేధం విధించింది. 

దళిత విద్యార్ది ఆత్మహత్య.. కేంద్రమంత్రి పై కేసు

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీలో వి. రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు నగరానికి చెందిన రోహిత్‌ హెచ్‌సియూలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే కొద్ది రోజుల క్రిందట విద్యార్థి సంఘాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఏబీవీపీ విద్యార్థిపై దాడి చేశారన్న సాకుతో రోహిత్ ను అతనితో పాటు నలుగురు విద్యార్ధులను యూనివర్శిటీ బహిష్కరించింది. దీంతో ఐదుగురు దళిత విద్యార్థులపై బహిష్కరణ ఎత్తివేయాలని కోరుతూ 15రోజులుగా వర్సిటీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఇంతలో సడెన్ గా నిన్న సాయంత్రం ఎన్‌ఆర్‌ఎస్‌ వసతి గృహంలో రోహిత్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతేకాదు ఒక సూసైడ్ నోటును కూడా రాసిపెట్టాడు. అందులో "ఈ యూనివర్సిటీలో మనిషిని మనిషిగా చూడటం లేదు. నాపుట్టుకను చూస్తున్నారు. కులం పేరుతో ఇంకా ఏన్నాళ్లు చూస్తారు.. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చా. కొన్ని రోజులుగా నా మనసుకు శరీరానికి తీవ్ర ఘర్షణ జరుగుతోంది. నాపుట్టుక తప్పా.. లేక నేనాకులంలో పుట్టడం తప్పా..'' అని రోహిత్ సూసైడ్ లెటర్ లో పేర్కోన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రోహిత్ హత్యపై విద్యార్ది నాయకులు మాట్లాడుతూ ఇది ఆత్మ హత్య కాదని మతోన్మాదుల హత్య అని.. దీనికి కారకులైన బీజేపీ నాయకులు, కేంద్రమంత్రులు బండారుదత్తాత్రేయ, స్మృతీఇరానిలను వెంటనే అరెస్టు చేయాలని విద్యార్ధులు డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా హెచ్‌సీయూలో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఐస్‌ఏ నాయకుడు ప్రశాంత్‌ ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీసీ అప్పారావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఏబీవీపీ నాయకుడు సుశీల్‌కుమార్‌, బీజేవైఎం నాయకుడు విష్ణుపై కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి సీఐ జూపల్లి రమేశ్‌ తెలిపారు.

కేసీఆర్ ను కలిసిన బాలకృష్ణ.. డిక్టేటర్ చూడండి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సినీ నటుడు.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ రోగుల సౌకర్యార్ధం బసవతారకం ఆస్పత్రి ఆవరణలో నిర్మించిన భవనాలను బీఆర్ఎఫ్ కింద క్రమబద్దీకరించాలని కేసీఆర్ ను కోరినట్టు తెలుస్తోంది. దీనికి కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ హైదరాబాద్‌ ఆస్పతుల్లో రోగుల సహాయకులకు నైట్‌ షెల్టర్ల సంఖ్య పెంచాలని.. త్వరలోనే నగరంలోని ఆస్పత్రుల యాజమాన్యాలతో భేటీ అయి వసతులపై చర్చిస్తామని చెప్పారు. అంతేకాదు తన డిక్టేటర్ సినిమాను చూడాలని బాలకృష్ణ కేసీఆర్ ను కోరారు. దీనికి కేసీఆర్ తన 100 సినిమా ఎప్పుడు అని బాలకృష్ణను అడుగగా.. ఆదిత్య 369 కు సీక్వెల్ గా తన 100 సినిమా ఉంటుందని బాలకృష్ణ తెలిపారు.

కరుణానిధి పై జయలలిత కేసు.. కోర్టుకు హాజరైన కరుణానిధి

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై మాజీ ముఖ్యమంత్రి.. డీఎంకే అధినేత కరుణానిధి గతేడాది ఆమెను విమర్శిస్తూ మురసొలి పత్రికలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం చెందిన జయలలిత ఆయనపై పరువు నష్టం కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు కరుణానిధిని కోర్టుకు హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. ఈ సందర్బంగా కురణానిధి చెన్నైలోని సెషన్స్ కోర్టులో హాజరయ్యారు. ఈ కేసును విచారించిన కోర్టు తదుపరి విచారణను మార్చి 10 వ తేదీకి వాయిదా వేసింది. కాగా కురుణానిధితో పాటు కుమార్తె కనిమొళి, చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్ కూడా ఉన్నారు.

గాలి బెయిల్ స్కాం నిందితుడు..హైకోర్టు మాజీ జడ్జి మృతి

గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ స్కాంలో నిందితుడిగా ఉన్న హైకోర్టు మాజీ జడ్జి ప్రభాకరరావు మృతి చెందారు.  ప్రభాకరరావు నిన్న ఉదయం 6.30 గంటల సమయంలో తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రభాకరరావు కుమారుడు డేవిడ్ ప్రశాంత్ తన తండ్రి ఇంటికి వెళ్లగా అక్కడ ఆయన విగతజీవిగా ఉండటంతో డేవిడ్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అయితే ముందు పోలీసులు ఆయనది సహజ మరణమని భావించినా ఆ తరువాత సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం 174 ఐపీసీ కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అంతేకాదు ప్రభాకరరావు మృతిపై పోలీసులు పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ స్కాంలో నిందితుడిగా ఉన్నాననే అవమానాన్ని భరించలేకే ఆత్మహత్య చేసుకున్నారా? లేక మరెవరైనా ఆయన మరణానికి కారకులా అని భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ప్రభాకరరావు కొడుకు మాత్రం తన తండ్రిది సహజ మరణమేనని.. తన తండ్రి ఆత్మహత్య చేసుకోలేదని.. అనవసరంగా తన తండ్రి మరణాన్ని రాజకీయం చేయోద్దని కోరారు.

కేజ్రీవాల్ కు చేదు అనుభవం.. సిరా చల్లిన యువతి

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది. కేజ్రీవాల్ ఇటీవలే ఢిల్లీలోని కాలుష్యాన్ని నివారించేందుకు గాను సరి-బేసి విధానాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను ప్రయోగాత్మకంగా చేపట్టిన పథకం విజయవంతం కావడంతో ప్రజలకు కృతజ్ఞతలు తెలియడానికి ప్రభుత్వం ఓ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతున్న సమయంలో సుమారు 20 ఏళ్ల వయసున్న ఆ యువతి అతని ముందున్న స్టాండ్ వద్దకు చేరుకుంది. తరువాత ఏవో కొన్ని పేపర్లు చూపిస్తూ కేజ్రీవాల్ పై సిరా పోసింది. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాకయ్యారు. పోలీసులు వెంటనే తేరుకొని ఆమెను పక్కకు లాక్కెళ్లగా.. ఆమె వద్ద ఉన్న పత్రాలను స్వీకరించి, ఆమెను వెళ్లిపోనివ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అంతేకాదు ప్రసంగం ముగిసిన తరువాత తనపై సిరా చల్లిన యువతి సమస్యలను పరిశీలించి, పరిష్కరించాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

కాంగ్రెస్ షరతులపై వెంకయ్య ఫైర్..

జీఎస్టీ బిల్లుపై బీజేపీ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ మధ్య మంతనాలు జరుగుతున్న సంగతి తెలసిందే. ఈ బిల్లుపై రెండు మూడు నెలల క్రితం ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో చర్చించారు కూడా. అయితే తమ షరతులకు ఒప్పుకుంటే బిల్లు ఆమోదానికి సహకరిస్తామని వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విధించిన షరతులపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డుతున్నారు. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన బిల్లు విషయంలో షరతులు విధించటం కాంగ్రెస్‌ పార్టీకి సరి కాదని.. వాస్తవానికి ఈ బిల్లు కాంగ్రెస్‌ అధికారంలో వున్నపుడు చేపట్టినదేనని అన్నారు. అప్పుడు ఎలాంటి షరతులు పెట్టని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమ ప్రభుత్వం దగ్గరికి వచ్చేసరికి ఇలాంటి షరతులు తెస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ సమయంలో కాని.. జిఎస్‌టి బిల్లు స్టీరింగ్‌ కమిటీకి సారధ్యం వహించిన చిదంబరం కాని ఈ బిల్లుకు పన్నుల పరిమితి షరతు అవసరమని చెప్పలేదని.. ఇప్పుడు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ  పన్నులపై పరిమితి వుండాలనటంలోని ఔచిత్యమేమిటని ఆయన ప్రశ్నించారు.

భయపడే ప్రసక్తే లేదు.. రోజా

వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. రాజం పేట ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో రోజా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. తమ పైన ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. అక్రమ కేసులను పెట్టి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు.. కాని అలాంటి వాటికి భయపడేది లేదు..మాపైన పెట్టిన కేసులను ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటామని చెప్పారు. కాగా అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ 20వ వర్ధంతి.. ప్రముఖుల నివాళులు

ఈరోజు ఎన్టీఆర్ 20వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు. నందమూరి కుటుంబసభ్యులతో పాటు ఇతర ప్రముఖులు కూడా ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ నిరంతరం పేదల అభ్యున్నతికి పాటుపడ్డారని.. గ్రామాలకు రహదారులు, బస్సు సౌకర్యాలు కల్పించిన మహానీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ఎన్టీఆర్ స్ఫూర్తి అని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నాన్నకు ప్రేమతో రక్తదాన శిబిరాలను విజయవంతం చేయాలని.. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో లెజండరీ బ్లడ్‌ డొనేషన్‌ డ్రైవ్‌ చేపట్టారు.

అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు.. కేసీఆర్ అలా కాదు.. కవిత

కేసీఆర్ కూతురు.. నిజామాబాద్ ఎంపీ కవిత మరోసారి బీజేపీ పై మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో వికలాంగులు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలుస్తూ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ నేతలపై విమర్శల బాణాలు వదిలారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పథకాలేంటో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా తెలంగాణ బీజేపీ నేతలెవరికీ తెలియదని ఆమె అన్నారు. సుగమ్య అభియాన్‌కు ప్రధాని మోడీ ఇచ్చింది సున్నా అని.. సుగమ్య అభియాన్ కాస్త అగమ్య అభియాన్ అయిపోయిందన్నారు. అంతేకాదు ఈసందర్భంగా తన తండ్రిపై మాత్రం ప్రశంసలు కురిపించారు కవిత. అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదని, అయితే కేసీఆర్ మాత్రం అలా కాదని, అడగకుండా చాలా చేశారని, ఆయనను ఏమడిగినా చేస్తారని అన్నారు.

మాల్దా ఘటన.. రాష్ట్రపతితో బీజేపీ నేతలు..

పశ్చిమ బెంగాల్ లోని మాల్దా ఘటనపై చర్చించేందుకు బీజేపీ నేతలు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో సమావేశం కానున్నట్టు తెలస్తోంది. మాల్దాలో స్థానిక పోలీస్ స్టేషన్లో అల్లరి మూకలు దాడి చేసి దానికి నిప్పంటించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి నిజ నిజాలు తెలుసుకోవడానికి మల్దా వెళ్లగా అక్కడ వారిని రైల్వే స్టేషన్ నుండే వెనక్కి పంపించేశారు. కాగా ఇప్పుడు ఈ విషయంపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో చర్చించి ఆ సంఘటనకు సంబంధించిన నివేదిక తెప్పించుకోవాలని బిజెపి బృందం రాష్ట్రపతిని కోరనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతిని కలిసే వారిలో సిద్ధార్థ్‌నాథ్‌, సంత్‌ కైలాశ్‌, విజయ్‌వార్ఘి ఉన్నారు.

పఠాన్ కోట్ ఉగ్రదాడి.. గృహనిర్బంధ కస్టడీలో మౌలానా మసూద్ అజహర్..?

పఠాన్ కోట్ లో ఉగ్రవాదుల దాడికి సూత్రధారి అయిన జైష్-ఏ-మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ ను గృహనిర్బంధ కస్టడీలో ఉన్నాడని పాకిస్థాన్ వెల్లడించింది. పంబాజ్ లోని పఠాన్ కోట్ విమాన స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని భారత్ చెప్పిన నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అందుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పాకిస్థాన్ బృందం అజహర్ గృహనిర్బంధ కస్టడీలో ఉన్నాడని చెప్పింది. కానీ పాక్ న్యాయశాఖ మంత్రి సనావుల్లా మాత్రం మౌలానా మసూద్ అజహర్ ను అరెస్టు చెయ్యలేదని చెప్పారు. అంతేకాదు భారత్ లోని పఠాన్ కోట్ దాడులకు భాద్యులెవరు అని కచ్చితంగా తెలియకుండా మౌలానా మసూద్ అజహర్ ను ఎలా అరెస్టు చేస్తామని న్యాయశాఖ మంత్రి సనావుల్లా ప్రశ్నించారు. ఈ ఘటనపై పాకిస్థాన్ దర్యాప్తు చేపట్టిందని, సాక్షాధారాల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.

భారత్ పాక్ చర్చలు వాయిదా.. భవిష్యత్తులో ప్రారంభించాలని నిర్ణయం.. వికాస్‌ స్వరూప్‌

పంజాబ్ పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరపడంతో పాక్-భారత్ మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక చర్చలు కాస్త వాయిదా పడ్డాయి. అసలు ఉగ్రవాదుల దాడి వలన చర్చలు జరుగుతాయో.. లేదో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు ఉగ్రవాదుల పై చర్యలు తీసుకుంటేనే కాని చర్చలు ఉండవని భారత్ తేల్చిచెప్పేసింది. దీనికి పాకిస్థాన్ కూడా స్పందించి.. ఉగ్రవాదులుపై చర్యలు తీసుకోవడానికి ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో పాక్-భారత్ చర్చలు త్వరలో జరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. పాకిస్తాన్‌తో జరగాల్సిన విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి సమావేశం వాయిదా పడిందని.. ఇరుదేశాల పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు ఫోన్‌లో మాట్లాడుకొని సంభాషణలను సమీప భవిష్యత్తులో ప్రారంభించాలని నిర్ణయించినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ తెలిపారు.

ఏపీకి ఒక్కరోజులో 15 లక్షల మంది..

సంక్రాంతి పండుగ సీమాంధ్రులకు ఎంతపెద్ద పండుగో అందరికి తెలిసిందే. అయితే ఈ పండుగ సందర్భంగా ఏపీకి ఎంతమంది వెళ్లారు అన్న లెక్క ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఎంతమంది ఏపీ వారు వెళ్లారో చూస్తే షాకవ్వాల్సిందే. సంక్రాంతి సందర్భంగా వివిధ ప్రాంతాలనుండి దాదాపు 20 నుండి 25 లక్షల మంది ఏపీకి వెళ్లగా అందులో దాదాపు 15 లక్షల మంది ఒక్క హైదరాబాద్ నుంచే ఆంధ్రాకు వెళ్లినట్లుగా లెక్క వేస్తున్నారు. రైలు.. బస్సు ప్రయాణాల లెక్కను ప్రాతిపదికగా తీసుకుంటే ఈ సంఖ్యను చెప్పొచ్చు. కాగా ఊర్లకి వెళ్లిన వారందరూ ఒకేరోజు తిరిగి రానున్న పరిస్థితి. దీంతో.. తిరుగు ప్రయాణం పెద్ద ఇబ్బందిగా మారింది. ఒకేరోజు 15 లక్షల మంది తిరిగి రానుండటంతో ట్రాఫిక్ మరీ ఎక్కువగా మారే పరిస్థితి ఏర్పడింది.