మరోసారి అబద్దం ఆడేసిన పాకిస్థాన్..
posted on Jan 19, 2016 9:24AM
పాకిస్థాన్ కపట బుద్ది మరోసారి బయటపడింది. పంజాబ్ పఠాన్ కోట్ విమాన స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులపై పాక్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కూడా ఓ సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని తెలిపింది. దీనిలో భాగంగానే ఈ ఉగ్రదాడికి అసలు సూత్రధారి అయిన జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ను అరెస్ట్ చేసినట్లు పాక్ చెప్పింది. అయితే దీనిపై పలు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అది నిజమో..? కాదో..? అన్న సందేహంలో ఉండగానే పాక్ ప్రభుత్వం మాట తిప్పేసి మసూద్ అజార్ ను గృహనిర్బధంలో ఉంచామని చెప్పింది. అయితే పాక్ చెప్పిన ఈ మాటలన్ని ఒట్టిదేనని తేలిపోయింది. భారత్ ను తప్పుదారి పట్టించేందుకే పాక్ ప్రభుత్వం ఇలా చేసిందని.. మసూద్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్పిన ఎపిసోడ్ మొత్తం ఉత్తదేనని నిఘా వర్గాలు తేల్చేస్తున్నాయి. ఏదో ఒక ముగ్గురిని మాత్రమే పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని.. వారిని కూడా ఇతర కేసుల్లో ఉన్న ఆరోపణల నేపథ్యంలోనే అదుపులోకి తీసుకున్నట్లుగా తేల్చారు.