లేఖకు, రోహిత్ ఆత్మహత్యకు సంబంధం లేదు.. దత్తాత్రేయ
posted on Jan 18, 2016 @ 2:56PM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటిలో దళిత విద్యార్ధి వి.రోహిత్ ఆత్మహత్య చేసుకున్నసంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పోలీసులు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పై కేసు నమోదు చేశారు. ఇప్పుడు దీనిపై దత్తాత్రేయ స్పందిస్తూ తన లేఖకు, రోహిత్ ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. హెచ్‌సీయూలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని.. ఏబీవీపీ కార్యకర్తలను బాగా కొట్టినట్లుగా నాకు వినతిపత్రం వచ్చింది. నేను దానిని నేరుగా మానవ వనరుల మంత్రిత్వ శాఖకు పంపించాను. ఆ తరువాత వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారో నాకు తెలియదు అని తెలిపారు. అంతేకాని నాకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు.. విచారణ జరుగుతోంది, అసలు విషయాలు బయటకు వస్తాయి అని అన్నారు.
మరోవైపు దీనిపై నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ బండారు దత్తాత్రేయను విమర్శించారు. హెచ్‌సీయూలో విద్యార్ది ఆత్మహత్య చాలా దురదృష్టకరమని.. దత్తాత్రేయ రాసిన లేఖతో కేంద్రం వర్శిటీ వైస్ ఛాన్సలర్ పై ఒత్తిడి తెచ్చిందని, దీంతో వీసీ ఐదుగురు దళిత విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారని ఆమె ఆరోపించారు. దీంతో మనస్థాపానికి గురై రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.