కేసీఆర్, చంద్రబాబు ఫ్రెండ్ షిప్ పై దిగ్విజయ్ సింగ్..

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సభలో ప్రసంగించిన చంద్రబాబు కేసీఆర్ ను పల్లెత్తు మాట కూడా అనలేదు. ఇక మిగిలిన నేతలు తమదైన శైలిలో కేసీఆర్ పై మండిపడ్డారు. అయితే ఇప్పుడు దీనిపై ఎఐసిసి ప్రధాన కార్యదర్సి దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. గురువారం హైదరాబాద్ వచ్చిన ఆయన కేసీఆర్ చంద్రబాబు గురించి మాట్లాడుతూ బద్దశత్రువులైన కెసిఆర్, చంద్రబాబు మిత్రులుగా మారడానికి వెనక గల కారణమేమిటని ప్రశ్నించారు. నోటుకు ఓటు కేసు వెలుగు చూసినప్పుడు ఇరువురు ముఖ్యమంత్రులు కోడి పుంజుల్లా కలబడ్డారని, ఇప్పుడు మిత్రులుగా మారి పరస్పరం అభినందించుకుంటున్నారని, కేసులను మాత్రం గాలికి వదిలేశారని ఆయన అన్నారు.

నాయిని ఓపెన్ వార్నింగ్..

  రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఓ అధికారికి ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా కంటోన్మెంట్ పరిధిలోని కార్ఖానాలోని మూడో వార్డులో  పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో నాయిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈవో సుజాతా గుప్తాకు వార్నింగ్ ఇచ్చారు.  ప్రజలను బోర్డు సభ్యులను వేధించటం మానుకోవాలని.. జాగ్రత్తగా మసలుకోవాలని.. లేదంటే ఢిల్లీకి వెళ్లిపోవాలంటూ ఓపెన్ గా హెచ్చరించారు. దీంతో సుజాతా గుప్తాకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. మరోవైపు నాయిని వార్నింగ్ పై పలువురు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నాయిని వార్నింగ్ ఇవ్వాలంటే వ్యక్తిగతంగా ఇవ్వాలి లేకపోతే.. చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలే కానీ ఇలా అందరిముందు వార్నింగ్ ఇవ్వడం ఏంటంని అంటున్నారు.

మోడీ పై కేటీఆర్ ఫైర్.. ఏనాడైనా తెలంగాణ ప్రజలకు ముఖం చూపించారా..

తెలంగాణ మంత్రి కేటీఆర్ మోడీపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు బంగారు ప్రకాశ్, సామ సుందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 18 నెలలు అయింది.. ఈ 18 నెలల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇతర ప్రాంతాల వారిపై ఈగ కూడా వాలకుండా శాంతిభద్రతలను పరిరక్షించామని అన్నారు. అంతేకాదు టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక ఒక్కరికీ మేలు జరిగిందని..  పేదల పక్షాన నిలవాలనే ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు ప్రవేశపెట్టారని తెలిపారు. ఇక ప్రధాని మోడీ గురించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఇంత కాలం అయినా మోడీ ఇంతవరకూ ఇక్కడ అడుగు పెట్టారా.. ఏనాడైనా తెలంగాణ ప్రజలకు ముఖం చూపించారా? అని ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీ హైదరాబాద్‌కు ఏం చేశారో చెప్పాలని బీజేపీ నేతలను డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేసేందుకు నగ్మా ప్రయత్నాలు..

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నగ్మా రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయడానికి బానే కష్టపడుతున్నట్టు ఉంది. తమిళనాడులో పార్టీ వ్యవహారాలు చూస్తున్న నగ్మా తాజాగా తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే అలానే ఉన్నాయని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ఇంతకీ నగ్మా తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే..  కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల సంస్కృతికి కళ్లెం వేయాలని. మహిళా కాంగ్రెస్ లో గ్రూపులకు ఆస్కారం లేకుండా పనిచేయాలని ఈనేపథ్యంలోనే మహిళా నేతలకు ఆదేశాలు జారీ చేశారంట. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించినా మహిళా విభాగంలో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేసినా రాహుల్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరిస్తున్నారు. కాగా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీలో విజయధరణి అధ్యక్ష పగ్గాలు చేపట్టినానంతరం మహిళా రాజకీయాల్లో మరింత వేడెక్కింది. విజయధరణి ఏకంగా టీఎన్సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ను ఢీకొట్టడంతో వివాదం ముదిరింది. ఈ వివాదం కాస్త అధిష్టానంకి చేరడంతో ఇక మహిళా విభాగం రాష్ర్ట ఇన్చార్జ్ జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా రంగంలోకి దిగారు. మహిళా నాయకుల్ని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి తామంతా ఒక్కటే అని చాటేందుకు తీవ్ర కుస్తీల్లో పడ్డారు.

జకార్తా ఉగ్రదాడి.. ఆరుగురు మృతి

ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఉగ్రవాదులు దాడి చేశారు. మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఆరు సార్లు పేలుళ్లు జరిపి దాడి చేశారు. ఈ ఉగ్రవాదుల దాడిలో ఇప్పటి వరకూ ఆరుగురు మృతిచెందగా.. పలువురికి గాయాలపాలయ్యాయి. అంతేకాదు ముగ్గురు పోలీసులు కూడా మృతి చెందారు. దీనిపై ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో స్పందించి.. ఇది ఉగ్రవాదుల పనేనని.. ఈ పని చేసిన వారిని వదిలిపెట్టమని అన్నారు. మరోవైపు దుండగులకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌తో సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. పలువురు ఉగ్రవాదులు నగరంలోని ఓ థియేటర్ కాంప్లెక్స్‌లో దాక్కున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

వైసీపీ పోటీ చేయకపోవడంపై శివకుమార్ ఫైర్

గ్రేటర్ ఎన్నికల్లో వైకాపా పోటీ చేయడం లేదంటూ.. జగన్ జెండా పీకేసినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ తీసుకున్న నిర్ణయం మాత్రం ఆ పార్టీ నేతలకే నచ్చడంలేదు. ఈ విషయాన్ని బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారంట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ ఈ నిర్ణయంపై తన అసంతృప్తిని ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటం ఇది ఏకపక్ష నిర్ణయమేనని.. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని  వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడంతో మనస్థాపానికి గురయ్యానని అన్నారు. అసలు ఎవరితో చర్చించకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏకపక్షంగా తనకు తాను నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అయితే మరోవైపు మాత్రం జగన్ నిర్ణయంతోనే పొంగులేటి ప్రకటన చేశారని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

నాగార్జునకు కేటీఆర్ ఫోన్.. నేను మీ అభిమానిని

తెలంగాణ మంత్రి కేటీఆర్ ను.. హీరో నాగార్జున ఓ కోరిక కోరారంటా.. అదేంటంటే.. నాగార్జున నటించిన తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయన సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఛానెల్ లో లైవ్ ప్రోగ్రాం లో నాగార్జున పాల్గొన్నారు. అయితే దీనికి మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి నాగార్జునకు సర్ఫరైజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను మీ ఫ్యాన్ను అని చెప్పి శివ సినిమా చూసినప్పటి నుంచి అభిమానిగా మారిపోయానని చెప్పారు. దీనికి నాగార్జున కేటీఆర్ కు థ్యాంక్స్ చెప్పి ఓ సాయం కోరారు. తెలుగు చిత్ర పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీని అరికట్టాలని కోరగా.. దానికి కేటీఆర్ తప్పకుండా ప్రభుత్వం తరుపున చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారంట.

టీఆర్ఎస్ కు ధీటుగా టీడీపీ ప్రచారం..

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా అధికార పార్టీకి ధీటుగా టీడీపీ-బీజేపీ పార్టీలు కూడా బానే వ్యూహాలు రచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటివరకూ ప్రచారంలో దూసుకుపోతున్న అధికార పార్టీకి ధీటుగా ఇప్పుడు ఈ మిత్రపక్షాలు కూడా దూసుకెళ్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే టీఆర్ ఎస్ అధికారంలోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్ నిధులను తెలంగాణకు ప్రభుత్వ ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించేస్తారని హైదరాబాద్ ప్రజలు మాత్రం గతుకుల రోడ్లతో మంచినీటి కరువుతో కటకటలాడాల్సిందేనని టీడీపీ ప్రచారం చేస్తోందట. అంతేకాదు హైదరాబాద్ నిధుల మళ్లింపు గురించి కూడా వివరంగా చెబుతున్నారంట. దీంతో ఈ విషయంలో టీడీపీ ప్రచారానికి ప్రజల్లో మంచి ఆదరణే లభిస్తుందట. మరోవైపు బీజేపీ కూడా టీఆర్ఎస్ వాదననే అందిపుచ్చుకుంటోంది. టీఆర్ఎస్ కు ఓటు వేస్తే మజ్లిస్ కు వేసినట్లేనని ప్రచారం చేస్తోంది. మొత్తానికి టీడీపీ మంచి ప్లానే వేసి టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నట్టుంది.

కాల్ మనీ.. పెండ్యాల శ్రీకాంత్ కు రహస్య విచారణ

కాల్ మనీ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న పెండ్యాల శ్రీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అతనిని టాస్క్ఫోర్స్ పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించి విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాగా కాల్ మనీ బాధీతురాలు ఇచ్చిన ఫిర్యాదు వల్ల యలమంచిలి రాము, భవానీశంకర్, చెన్నుపాటి శ్రీనివాసరావు, విద్యుత్ డీఈ ఎం.సత్యానందం, వెనిగళ్ల శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్, దూడల రాజేశ్‌లపై కేసు నమోదు అయిన తెలిసిందే. మరోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలపై నిషేధం ఉన్న నేపథ్యంలో శ్రీకాంత్కు చెందిన మామిడి తోటపై పోలీసులు దాడి చేసి పెద్ద ఎత్తున పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.

జైషే మహ్మద్ చీఫ్ పై శివసేన సంచలన వ్యాఖ్యలు

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో శివసేన తనకు తానే సాటి. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా పంజాబ్ లోని పఠాన్ కోట్ విమాన స్థావరం పై దాడి చేసిన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ ఆజార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడికి సూత్రధారిగా వ్యవహరించిన జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ తల తెగనరికిన వారికి రూ.1 కోటి రూపాయలు ఇస్తామని శివసేన పంజాబ్ శాఖ నేత యోగేశ్ బతీశ్ వ్యాఖ్యనించారు. ఇంకా పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశ ఆర్మీ నడిపిస్తోందని.. మిలటరీ చేతుల్లో ప్రభుత్వం ఉండటంతో టెర్రరిస్టులకు ఆశ్రయిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.. దీనికి ఆదేశ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని అన్నారు.  

ఈనెల 17న టీడీపీ చేరిక.. ఆనం రాంనారాయణ రెడ్డి

ఆనం బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి చేరుతున్న సంగతి అందరికి తెలిసిందే. దీనిలో భాగంగా సంక్రాంతి తరువాత అంటే ఈనెల 17 వ తేదీన తాను.. తనతో పాటు 4 వేల మంది అనుచరలు టీడీపీలోకి చేరబోతున్నట్టు ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవుల కోసం పార్టీ మారడంలేదు.. ఏపీ అభివృద్ధికి తమవంతు కృషి చేయాలనే ఆలోచనతో పార్టీ మారుతున్నామని.. పదవులు మాకేం కొత్తకాదని అన్నారు. అంతేకాదు చంద్రబాబు మాత్రమే ఏపీని అభివృద్ధి చేయగలరని.. కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని టీడీపీ చేస్తోందన్నారు. ఇప్పటికైనా రఘువీరా ప్రభుత్వంపై విమర్శలు మానుకొని సహకరించాలని ఆనం రాంనారాయణరెడ్డి సూచించారు.

కోడిపందేలను సంప్రదాయ క్రీడగా పరిగణించాలి

సంక్రాంతి సందర్భంగా ఏపీలో కోడీపెందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, భాజపా నేత రఘురామకృష్ణంరాజు, ప్రజా సంఘాలు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఉపేంద్రమిశ్రాకు లేఖ రాశాయి. తమిళనాడులోని జల్లికట్టు అనుమతి ఇచ్చిన విధంగానే... ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందేలను సంప్రదాయ క్రీడగా పరిగణించాలని కోరారు. కాగా తమిళనాడులో జల్లికట్టును సంప్రదాయ క్రీడగా గుర్తిస్తూ ఇవాళ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశముంది. అదే ఆర్డినెన్స్‌లో కోడిపందేలను కూడా చేర్చాలని ఉభయగోదావరి జిల్లాల నేతలు కోరుతున్నారు.

విశాఖ సీఐఐ సదస్సు.. అప్పుడే శంకుస్థాపన

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో సీఐఐ సదస్సు నిర్వహించిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు దాదాపు 41 దేశాల నుంచి 1400 మంది ప్రతినిధులు ఆయా దేశాల వాణిజ్యశాఖ మంత్రులు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. మొత్తం నాలుగు లక్షల 78 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. అయితే మూడు రోజుల నిర్వహించిన ఈ సదస్సు ద్వారా ఆశించిన ఫలితాలే వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఎందకంటే అలా ఒప్పందం జరిగిందో లేదో వెంటనే ఆచరణ రూపంలోకి రావడం విశేషం. చైనాకు చెందిన ట్రైనాసోలార్ ఇండియా లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న సోలార్ ప్యానళ్ల తయారీ పరిశ్రమకు విశాఖలో భూమి పూజ జరిగింది. సుమారు 35 ఎకరాల్లో 3వేల కోట్లతో ఈ కంపెనీని నిర్మించననున్నారు. ఈ కంపెనీ ద్వారా దాదాపు 7వేల మందికి ఉపాధి దొరుకుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ సదస్సు ద్వారా ఏపీకి బాగానే పరిశ్రమలు వచ్చేలా కనిపిస్తున్నాయి.

రోజాకు పీతల సుజాత గట్టి వార్నింగ్.. తగిన బుద్ధి చెబుతా..

వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ మంత్రి పీతల సుజాతపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి సుజాతకు వడ్డెణాలు, డబ్బు సంచులపై ఉన్న ప్రేమ నియోజక వర్గ ప్రజలపై లేదని రోజా సుజాతపై మండిపడ్డారు. దీనికి స్పందించిన సుజాత తన దైన శైలిలో రోజాకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రోజాను అసెంబ్లీ నుండి ఏడాది పాటు సస్పెండ్ చేసినా ఆమెకు బుద్ది రాలేదు.. తన నోటి దురుసు ఏమాత్రం తగ్గలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని ఏడాది పాటు కాదు పూర్తికాలం అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళితలను అవమానించడమే తన పనిగా పెట్టుకున్నారు.. దీనంతటికి కారణం ఆపార్టీ అధినేత జగన్.. తనే రోజా వెనుక ఉండి ఇలా మాట్లాడిస్తున్నారని అన్నారు. ఇక మీదట రోజా కనుక ఇలానే హద్దుమీరి మాట్లాడితే సహించేది లేదని..  ఆమెకు తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. మరి సుజాత వార్నింగ్ కు రోజా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

కేటీఆర్ సవాల్ కు రేవంత్ రెడ్టి ప్రతిసవాల్..

తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ-టీడీపీ పార్టీలు నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభతో తమ ప్రచారాన్నిలాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అందరి కృషి వల్లే వచ్చింది అంతే కాని మీ ఒక్కరి వల్లే వచ్చింది కాదని ఎద్దేవ చేశారు. అంతేకాదు మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ కు రేవంత్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. ఈ గ్రేటర్ ఎన్నికల్లో 100 సీట్లు కనుక టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే తాను రాజకీయాలనుండి తప్పుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఎవరు రాజీనామా చేస్తారో.. ఎవరు రాజకీయాలనుండి తప్పుకుంటారో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.