అచ్చెన్నను మెచ్చుకున్న చంద్రబాబు.. పీతల సుజాత, కొల్లు రవీంద్రలకు తిట్లు..
posted on May 3, 2016 @ 10:38AM
ఏపీ చంద్రబాబు నాయుడు మంత్రులు పనితీరు నచ్చకపోతే తిట్టడం ఎంత సహజమే.. పనితీరు నచ్చితే అదే రీతిలో పొగుడుతారు. నిన్న ఏపీ కేబినెట్ మీటింగ్ జరిగిన నేపథ్యంలో చంద్రబాబు కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ప్రశంసించారు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు కార్మిక శాఖపై పట్టు సాధించి తన సత్తా చాటుతున్నారు. దీనిలో భాగంగానే.. కార్మిక శాఖ పనితీరు తనకు బాగా నచ్చిందని.. మిగిలిన మంత్రులు కూడ తమ శాఖలపై పట్టు సాధించాలని సూచించారు.
అయితే మరో ఇద్దరు మంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాతలకు మాత్రం చంద్రబాబు అక్షింతలు వేసినట్టు సమాచారం. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయాలు సాగుతున్నాయని చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో.. దీనిపై స్పందించిన చంద్రబాబు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖలో ఏం జరుగుతుందో ఏంటో అని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని.. పరిస్థితి మారాల్సిందేనని ఆదేశించారు.
ఇంకా ఉచిత ఇసుక విధానంపై పీతల సుజాతకు కూడా చంద్రబాబు క్లాస్ పీకినట్టు సమాచారం. రాత్రి వేళ ఇసుక తవ్వకాలకు అనుమతి లేదని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ జారీ చేసిన ఆదేశాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు తక్కువ ధరకు ఇసుకను అందించాలన్న ఉద్దేశంతోనే ఉచిత ఇసుకకు శ్రీకారం చుట్టామని మరింత సేపు ఇసుక తవ్వుకుంటామంటే వచ్చే ఇబ్బంది ఏమిటని.. అయినా ఇసుక వ్యవహారంలో పోలీసులకు ఏం పని అని ఆయన పీతలపై ప్రశ్నల వర్షం కురిపించారు.