కేబినెట్ పదవి పై క్లారిటీ ఇచ్చిన లోకేశ్...

  టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కేబినెట్ పదవిపై ఎప్పటినుండో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు లోకేశ్ కోసం ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు సైతం రాజీనామాలు చేస్తామంటూ త్యాగాలు చేసేస్తున్నారు. అయితే దీనిపై లోకశ్ ఓ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ.. ఇప్పుడప్పుడే కేబినెట్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం లేదని.. 2019లో జరిగే ఎన్నికల నాటికి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడంతో పాటు కేబినెట్ లో మంత్రి పదవి చేపట్టేందుకు రెడీ అవుతానని చెప్పారు. దీంతో లోకేశ్ కేబినేట్ పదవిపై జరుగుతున్న ఊహాగానాలకు తెరదించారు.   కాగా చంద్రబాబు నాయుడు లోకేశ్ కు ఇప్పుడప్పుడే కేబినెట్ పదవి కట్టబెట్టడానికి సముఖత చూపించనట్టు గతంలో వార్తలు కూడా వచ్చాయి. మరి ఈ నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి లోకేశ్ కోసం త్యాగం చేద్దామనుకున్న వారికి ఆ అవకాశం లేకుండా పోయింది. 

సీఎం గా లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు..

  రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పుత్రరత్నం తేజ్ ప్రతాప్ యాదవ్ సీఎం అయ్యారు.  బీహార్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈయన సీఎం ఎప్పుడయ్యారనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈయన సీఎం అయింది రియల్  లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. అసలు సంగతేంటంటే.. బీహార్ లో లాలూ, ఆయన సతీమణి రబ్రీదేవిలు సీఎంలుగా కొనసాగిన కాలంలో ఆ రాష్ట్రంలో జరిగిన వరుస కిడ్నాప్ లను ఆధారం చేసుకుని భోజ్ పురిలో ‘అపహరన్ ఉద్యోగ్’ పేరిట ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రతాప్ యాదవ్ సీఎంగా నటించనున్నారంట. అయితే తన పాత్ర చాలా చిన్నదైన.. చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందట. మొత్తానికి తన సీఎం కోరికను ఈ రకంగా తీర్చుకున్నారు తేజ్ ప్రతాప్ యాదవ్.

కొత్తగా పెళ్లయిన భారత ఆర్మీ జవాన్లకు గుడ్ న్యూస్...

  భారత ఆర్మీలో పనిచేసే జవాన్లకు ఓ గుడ్ న్యూస్. ఇక నుండి పెళ్లయిన వెంటనే విధులు నిర్వహించడానికి వెళ్లకుండా.. ఒక ఏడాది పాటు కుటుంబం, భార్యతోనే ఉండే అవకాశం ఇచ్చారు. భారత సరిహద్ద దళం (బీఎస్ఎఫ్ ) ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. అనేక మంది జవాన్లు తమ జీవిత భాగస్వామితో గడపలేక పోయామన్న బాధతో కాలం వెళ్లదీస్తున్నారని.. పెళ్లయిన వెంటనే తన భాగస్వామి నుండి దూరం కావడం వల్ల వారి పని తీరుపై ప్రభావాన్ని చూపుతుందని  ఇలాంటివారికి న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశ్యంతో భారత సరిహద్దు దళం (బీఎస్ఎఫ్) ఒక నిర్ణయానికి వచ్చిందని బీఎస్‌ఎఫ్‌ డీజీ కె.కె.శర్మ తెలిపారు.

దర్గాలోకి వస్తే ఇంక్ పడుద్ది.. తృప్తి దేశాయ్ కు హెచ్చరిక

  మహారాష్టలోని శనిసింగనాపూర్ ఆలయంలోకి, నాసిక్ త్రయంబకేశ్వరాలయంలోకి ప్రవేశించడానికి పోరాటం చేసి ఎట్టకేలకు విజయం సాధించిన భూమాతా బ్రిగేడ్ సంఘ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ మరో పోరాటానికి తెర తీసిన సంగతి తెలిసిందే. ముంబైలోని హలీ అజీ దర్గాలోకి ప్రవేశిస్తామని ఆమె ప్రకటించారు. అయితే దీనిపై శివసేన ఇప్పటికే ఆమె దర్గాలోకి ప్రవేశిస్తే.. చెప్పులతో కొడతాం అంటూ తీవ్రంగా హెచ్చరించారు కూడా. ఇప్పుడు ఎంఐఎం పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆమె కనుక బలవంతంగా ఆలయంలోకి ప్రవేశించాలని చూస్తే మాత్రం ఆమెపై నల్లరంగు సిరా చల్లుతాం అంటూ మహారాష్ట్రం ఎంఐఎం పార్టీ నేత హజీ రఫత్ హెచ్చరించారు.   మరోవైపు తృప్తి మాత్రం దర్గాలోకి మహిళలను ప్రవేశింపజేయాలని.. వారికి కూడా ప్రార్ధనల్లో సమాన హక్కులు కల్పించాలని.. ఈ నేపథ్యంలోనే దర్గా జంక్షన వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. దీంతో అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

1500 ఏళ్ల నాటి శవానికి అడిడాస్ షూస్..

  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1500 ఏళ్ల నాటి శవం షూస్ ధరించడం.. అందునా అడిడాస్ బ్రాండ్ షూస్ ధరించిన ఘటన మంగోలియాలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. మంగోలియాలోని  పురావస్తు శాఖవారికి అల్తాయ్ పర్వత ప్రాంతంలో సముద్ర మట్టానికి 2,800 మీటర్ల ఎత్తులో ఒక శవం కనిపించింది. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఆ శవానికి తెల్లని చారలు ఉన్న షూస్ ఉన్నట్టు వారు గుర్తించారు. ఈ సందర్భంగా ఖోవ్‌ద్ మ్యూజియం ఎక్స్ పర్ట్ సుఖ్‌బాతర్ మాట్లాడుతూ..మమ్మీ వెలుగు చూసిన ప్రాంతం టర్కీకి చెందిన సమాధి స్థలంలా ఉందని ఇక్కడ సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటం వల్లే డెడ్ బాడీ పాడవలేదని.. షూస్‌ పై తెల్లటి చారలు, స్పోర్ట్స్ బ్రాండ్‌ను సూచించే ఎంబ్లమ్ కూడా ఉందని అంటున్నారు.

లోకేశ్ నోట మీడియా మాట..

  తన తండ్రికి కనీసం మనమడితో ఆడుకునేంత తీరిక కూడా లేదని.. రాష్ట్ర అభివృద్దికోసం రోజులు 18 గంటలు మీటింగులతోనే బిజీగా.. ఒక కుర్రాడిలా కష్టపడుతున్నారని.. నారా లోకేశ్ అన్నారు. విశాఖపట్నంలో టీడీపీ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. 65 ఏళ్ల వయసులో కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు.. ఈ విషయంలో మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.   ఇంకా ఆయన మాట్లాడుతూ.. మీడియా గురించి ప్రస్తావించారు. మన పార్టీకి ఎలాంటి ఛానెళ్లు లేవు.. పత్రికలూ లేవూ.. కార్యకర్తలే మన పార్టీ బలం అని అన్నారు. అందుకే ప్రజా వ్యతిరేక వార్తలు రాసే కొన్ని మీడియా సంస్థల విషయంలో గందరగోళం చెందవద్దు. పార్టీ కార్యకర్తలు అసలు విషయాలను వారికి వివరించాలి” అని లోకేష్ సూచించారు. కాగా గతంలో నారా లోకేశ్ ఓ టీవి ఛానల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

చంద్రబాబుకు హైకోర్టులో "చుక్కె"దురు...

  ఏపీ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. మద్యం పాలసీలో ఏపీ సర్కార్ ఎంచుకున్న కొత్త మార్గాన్ని హైకోర్టు నిలిపేసే దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. గతంలో మద్యం పాలసీ ప్రకారం ఎవరు ఎక్కువ ధర ఇచ్చేందుకు ముందుకు వస్తే వారికి అవకాశం దక్కేది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం బాగానే వచ్చేది. అయితే ఈ పద్దతిని మార్చే దిశగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఫస్ట్ కం... ఫస్ట్ సర్వ్’ పేరిట... ఎవరు ముందుగా వస్తే వారికే బార్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే కొత్త మద్యం పాలసీకి రూపకల్పన చేసి జీవో నెం:19ను జారీ చేసింది. అయితే దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలవ్వగా.. నేడు విచారించిన హైకోర్టు జీవోను నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ-33.. లైవ్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కీర్తి కిరిటంలో మరో కలికితురాయి చేరింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-33 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఇండియన్ నేవిగేషన్ సిస్టమ్‌కు సంబంధించి ఇదే చివరి ఉపగ్రహం. ఈ ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. ఈ ఉపగ్రహం భూతలం, ఆకాశం, సముద్రాల్లో నేవిగేషన్ సేవలను అందించనుంది. ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా సొంతంగా నేవిగేషన్ వ్యవస్థ ఉన్న అగ్రదేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచింది. శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు.  

చంద్రబాబుపై జేసీ.. మీరు పొగడ్త అనుకుంటే నేనేం చేయలేను..

  టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు. అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కూడా తనకు తానే సాటి. ఒక్క జేసీ దివాకర్ రెడ్డి మాత్రమే కాదు.. ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిది కూడా ఇదే ధోరణి. అయితే ఈసారి జేసీ దివాకర్ రెడ్డి విదాస్పద వ్యాఖ్యలు చేయలేదు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి టీడీపీ చేరిన సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ దివాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ పాలనలో నిమగ్నమైన చంద్రబాబు... తన మనవడితో కూడా సరదాగా గడపలేకపోతున్నారని.. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేసుకుపోతున్న చంద్రబాబు కర్మయోగిలా మారారని అన్నారు. అంతేకాదు మనవడు, మనవరాలితో గడిపే క్షణాలు ఏ వ్యక్తి జీవితంలోనైనా ప్రత్యేకమైనవేనని..  అసలు మీ మనవడితో ఎంతసేపు ఆడుకున్నారో చెప్పాలంటూ ఆయన చంద్రబాబును నిలదీశారు.   అయితే ఇంతా మాట్లాడిన జేసీ.. ఇది నా మనసులోని మాట.. దానిని మీరు పొగడ్త అనుకుంటే నేనేమీ చేయలేను అని ట్విస్ట్ ఇచ్చారు. అయితే జేసీ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలకు చంద్రబాబుకు ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ గా కూర్చున్నారు.

నాకు అంత అవసరం లేదు.. చంద్రబాబు

  ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీ లోకి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరి తరువాత ఒకరు జంప్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ 15 మందికి పైగా ఎమ్మెల్యేలు టీడీపీ తీర్ధం పుచ్చుకోగా.. ఇంకా మరి కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు.  దీంతో వైసీపీ పరిస్థితి అయోమయంలో పడింది. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. తమ పార్టీలోని ఎమ్మెల్యేలను డబ్బులకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ.. ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తనకు లేదని, అయినా తనకు ఏ బలహీనతలు లేవని కూడా చంద్రబాబు తేల్చిచెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు అని చంద్రబాబు అన్నారు.   ఇదిలా ఉండగా నిన్ననే వైసీపీ నుంది అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలోకి చేరగా.. ఈరోజు బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

కోహినూర్ పై పాకిస్థాన్ కూడా చేతులెత్తేసింది..

  కోహినూర్ వజ్రంపై ఇప్పటికే కోర్టులో పలు వాదనలు జరుగుతున్నాయి. ఈ వజ్రాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి గిఫ్ట్ గా ఇచ్చారని దీనిని వెనక్కి తీసుకురావడం కష్టమని మన ప్రభుత్వం మొదట చెప్పినా.. ఆతరువాత మళ్లీ కోహినూర్ ను తీసుకురావడానికి ప్రయత్నిస్తామని చెప్పింది. మరోవైపు బ్రిటన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోహినూర్ ను వెనక్కి ఇవ్వడానికి సిద్దంగా లేనట్టే కనిపిస్తోంది. ఏదో కోహినూర్ ఒకటే కదా అని ఇస్తే..ఇక ఏం మిగలదు అని బ్రిటన్ ప్రధాని ఈమధ్యే వ్యాఖ్యానించారు కూడా. అయితే ఇప్పుడు తాజాగా కోహినూర్ వజ్రంపై పాకిస్థాన్ కూడా చేతులెత్తేసినట్టు కనిపిస్తోంది. కోహినూర్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరగగా.. పంజాబ్‌ ప్రభుత్వ న్యాయాధికారి లాహోర్‌ హైకోర్టుకు తమ వాదనలు వినిపించారు. 1849 నాటి లాహోర్‌ ఒప్పందం కింద కోహినూర్‌ వజ్రాన్ని బ్రిటన్‌కు అప్పగించినట్టు పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కోహినూర్‌ ఇక బ్రిటన్‌దేనని,  బ్రిటన్‌ నుంచి దీనిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏవీ వెనక్కి తీసుకురాలేవని తేల్చి చెప్పేసింది.

జగన్ అధికారంలోకి రావాలంటే అలా జరగాలి.. మైసూరా

  వైసీపీ పార్టీ నుండి ఒక్కోక్కరుగా సైకిల్ ఎక్కుతున్నారు. తొలిసారి వెసీపీ నుండి టికెట్ గెలిచిన ఎమ్మెల్యేల దగ్గర నుండి సీనియర్ నేతల వరకూ అందరూ టీడీపీ బాట పట్టారు. తాజాగా నిన్న వైసీపీ పార్టీ సీనియర్ నేత.. మాజీ ఎంపీ ఎంవీ మైసూరా రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. అయితే తాను మాత్రం ఏ పార్టీలో చేరనని.. పుస్తకాలు రాసుకుంటూ కాలం గడుపుతానని చెప్పారు. అయితే మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డిపై మాత్రం బాగానే విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా జగన్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తారా అని అడుగగా దానికి ఆయన కాస్త వివరంగానే సమాధానం చెప్పారు. జగన్ అధికారంలోకి రావాలంటే చాలా కష్టమైన పనే అని... అలా రావాలంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉండాలి.. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రస్తుత సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలం కావాలి అదే సమయంలో రాజకీయంగా ఇతర పక్షాలు బలీయం కావడం లాంటివి జరగాలి అలాంటప్పుడే అధికారంలోకి రావడం జరుగుతుంది. లేకపోతే జగన్ అధికారంలోకి రావడం కలేనని మైసూరా తేల్చేశారు.

స్పీడ్ మీదున్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి.. నేడు టీడీపీలోకి

  వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి వలసల పర్వం సాగుతోంది. ఒకరి తరువాత ఒకరు క్యూ కట్టి టీడీపీలోకి జంప్ అవుతున్నారు. నిన్ననే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈరోజు మరో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. గత కొంత కాలంగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా టీడీపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. అయితే  ఆయన ఇంకా టీడీపీలో చేరకముందే చాలా స్పీడ్ మీదున్నట్టు తెలుస్తోంది. అప్పుడే తాను టీడీపీ ఎమ్మెల్యే గా తన ఫేస్ బుక్ ఫ్రొఫైల్ నే మార్చేశాడు. ఇంకా తన ఎంట్రీని కూడా గ్రాండ్ గా జరుపుకోవాలనుకున్నాడో ఏమో ఏకంగా.. 35 బస్సుల నిండా తన కార్యకర్తలతో విజయవాడకు బయలుదేరాడు. దీనిలో భాగంగానే చంద్రబాబును కలిసి ఆయన ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు.  కాగా ఈయన చేరికతో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 16కు చేరనుంది.

విమానం వాష్ రూం లో బంగారం దొరికింది..!

  అది ఖతార్ ఎయిర్ వేస్ విమానం. గోవా ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత రెగులర్ గా చేసే చెకప్ లాగే ఆ రోజు కూడా చెక్ చేయడానికి వెళ్లారు సిబ్బంది. విమానం వాష్ రూమ్ లో వాళ్లకో బ్యాగ్ కనబడింది. ఓపెన్ చేసి చూస్తే కళ్లు జిగేల్ మన్నాయి. బ్యాగ్ నిండా బంగారం ఉంది. బాత్రూమ్ లో బంగారం బ్యాగ్. కాసేపు సిబ్బందికి నోట మాట రాలేదు. వెంటనే తేరుకుని అధికారులకు ఫోన్ చేసి ఇన్ఫర్ మేషన్ ఇచ్చారు. తూకం వేస్తే, ఆ బంగారం దాదాపు 7 కేజీలు తూగింది..! ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం ఆ బ్యాగ్ విలువ కోటీ 80 లక్షలకు పైమాటే. ఈ వాష్ రూం లో బంగారం ఎవరు ఎందుకు వదిలేశారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. త్వరలోనే ఆ బ్యాగ్ ఎవరిదో కనిపెడతామని చెబుతున్నారు బంగారాన్ని స్వాధీనం చేసుకున్న గోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు..

ట్రంప్ ది ఆదిమ సంస్కృతే.. ప్రియాంక చోప్రా

  అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే అతని వ్యాఖ్యలపై ఇప్పుడు బాలీవుడ్ నటి స్పందిస్తూ విమర్శనాస్తాలు సంధించింది. గతంలో అమెరికాలోకి ముస్లింల‌ను రానివ్వ‌కుండా నిషేధం విధించాల‌ని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక చోప్రా.. ఇటువంటి చ‌ర్య ఆదిమ సంస్కృతేనంటూ.. క్లిష్ట‌మైన ఉగ్ర‌వాద నిర్మూల‌నా అంశాన్ని ఓ వ‌ర్గానికి ఆపాదిస్తూ వారిపై నిషేధం విధించ‌డం స‌రైన చ‌ర్య కాద‌ని ట్రంప్ వ్యాఖ్య‌ల‌ను తిప్పి కొట్టింది.   కాగా ప్రస్తుతం ప్రియాంక చోప్రా.. అమెరిక‌న్ టీవీ సీరియ‌ల్‌ ‘క్వాంటికో’ షూటింగ్‌లో బిజీబిజీగా ఉంది. మరోపక్క హాలీవుడ్‌ స్టార్‌ డ్వెయిన్‌ జాన్సన్‌తో కలిసి ‘బేవాచ్‌’ సినిమాలో నటించే అవకాశం సైతం కొట్టేసింది.

సరి-బేసి విధానానికి ఎంపీల నిరసన.. సైకిల్, గుర్రంపై పార్లమెంట్ కి

  ఢిల్లీలోని వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కేజ్రీవాల్ సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ పద్దతి నుండి తమకు మినహాయింపు ఇవ్వాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ఈ నిబంధనలతో పార్లమెంట్ సమావేశాలకు వెళ్లాలంటే కష్టమని.. తమకు ఈ పద్దతి నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ నేతలు తమ నిరసనను ప్రదర్శించారు. బీజేపీ ఎంపీ రామ్‌ ప్రసాద్ శ‌ర్మ ఈరోజు సరి-బేసి విధానానికి వ్య‌తిరేకంగా వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. ఆయన గుర్రంపై స్వారీ చేస్తూ పార్లమెంటుకు వచ్చారు. మ‌రో బీజేపీ ఎంపీ మ‌నోజ్ తివారీ సైకిల్‌పై చ‌క్క‌ర్లు కొడుతూ.. స‌రి బేసి విధానంపై నిర‌స‌న వ్య‌క్తం చేశారు.