నాగినీ డ్యాన్స్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నిరసన..

  నిరసన తెలపాలంటే ఒకొక్కరికీ ఒక్కో పద్దతి ఉంటుంది.  అయితే మహారాష్ట్రలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కార్యకర్తలు మాత్రం చాలా విచిత్రంగా.. నవ్వు తెప్పించే విధంగా తమ నిరసనను తెలియజేశారు. అసలు సంగతేంటంటే.. మహారాష్ట్రలోని బుల్దానా టౌన్ లో రోడ్డు పనులు రెండేళ్లుగా జరుగుతున్నాయి. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొంటున్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో.. విసుగెత్తిపోయిన ఎన్సీపీ కార్యకర్తలు పీడబ్బ్యూడీ కార్యాలయానికి వెళ్లారు. అధికారులకు తమ ఫిర్యాదు అందజేశారు. అయితే, ఈవిషయమై అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో, ఎన్సీపీ కార్యకర్తలు నాగినీ డ్యాన్స్ చేస్తూ తమ నిరసనను తెలియతజేశారు.

21 బంతుల్లో శతగ్గొట్టేసిన క్రికెటర్..!

  క్రిస్ గేల్ ఐపిఎల్ లో కేవలం 30 బంతుల్లో సెంచరీ కొట్టేసి రికార్డ్ సాధించాడు. ఇక ఎవరూ ఈ రికార్డును బద్ధలుగొట్టలేరని అందరూ అనుకున్నారు. కానీ మరో ఆటగాడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. అది కూడా కేవలం 21 బంతుల్లోనే సెంచరీ మార్కును దాటేసి ప్రపంచరికార్డులన్నింటినీ తుడిచేశాడు. ఇరాక్ థామస్ అని పేరున్న ఆ ఆటగాడు కూడా వెస్టిండీస్ వాడే కావడం విశేషం. క్రికెట్ కు టి20 ప్లేయర్లను అందించే వెస్టిండీస్ కు ఇప్పుడు ఈ కొత్త కుర్రాడు దొరికాడు. ప్రపంచపు దృష్టిని  23 ఏళ్ల ఇరాక్ థామస్ ఆకర్షించాడు. త్వరలోనే అతను ఐపిఎల్ టీంకు ఆడితే ఆశ్చర్యపోవక్కర్లేదు. అతని 21 బంతుల సెంచరీలో 15 సిక్స్ లు, 5 ఫోర్లు ఉన్నాయి. వెస్టిండీస్ లోని ట్రినియాడ్ అండ్ టొబాగోలో జరుగుతున్న టి20 టోర్నీ లో ఈ రికార్డ్ నమోదైంది. లోకల్ గా ఉన్న స్క్రాబరో టీమ్ కు స్ప్రే సైడ్ కు మధ్య జరుగుతున్న మ్యాచ్ లో స్ప్రేసైడ్ మొదట బ్యాటింగ్ చేసి 152 పరుగులు చేసింది. స్క్రాబరో తరపున ఆడుతున్న ఇరాక్ బరిలోకి దిగి కేవలం 8 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేసేశాడు. మొత్తం 31బంతుల్లో 131 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడం విశేషం.

ఆదర్శ్ కుంభకోణంపై మహారాష్ట్ర కోర్టు సంచలన నిర్ణయం.... బిల్డింగ్ కూల్చేయండి

  మహారాష్ట్రలో ఆదర్శ్ కుంభకోణం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిపై మహారాష్ట్ర కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదర్శ్ సొసైటీ అక్రమంగా నిర్మించిన 31 అంతస్థుల భవనాన్ని వెంటనే కూల్చేయాలని ఆదేశించింది. కార్గిల్‌ యుద్ధంలో అమరులైన జవాన్ల కుటుంబాలకు కేటాయించిన స్థలంలో అక్రమంగా ఈ నిర్మాణం చేపట్టారని.. అమరవీరుల కుటుంబాలకు కాకుండా రాజకీయ నేతలు, వారి బంధువులకు ప్లాట్లు కేటాయించారని కోర్టు తెలిపింది.   కాగా అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఆదర్శ్ సొసైటీ భవనంలో ముగ్గురు బంధువులకు కూడా ప్లాట్లు కేటాయించిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన తన పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు ఆదర్శ్ భవనంలోని 102 ప్లాట్లలో 25 ప్లాట్లు అక్రమంగా ఇచ్చినవేనని 2013లో జ్యూడిషియరీ కమిషన్ గుర్తించిం కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పుడు దీనిపై విచారించిన కోర్టు భవంతిని కూల్చేయాల్సిందిగా ఆదేశించింది.

ప్రధాని విద్యార్హతలేంటో చెప్పండి.. కేజ్రీవాల్

  ఢిల్లీ ముఖ్యమంత్రి గారికి ఉన్నట్టుండి ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలు తెలుసుకోవాలని అనిపించినట్టుంది. అందుకే మోడీ విద్యార్హతలు తెలియజేయాలని ఏకంగా కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)కు లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలపై పలు అనుమానాలు ఉన్నాయని.. మోడీకి ఎలాంటి విద్యార్హతలు కానీ.. డిగ్రీలు కానీ లేవని ఆరోపణలు వస్తున్నాయి.. ఈనేపథ్యంలో ఆయన విద్యార్హతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉందని తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు నా విద్యార్హతల గురించి సీఐసీ తెలుసుకుంది.. మరి ప్రధాని విద్యార్హతల గురించి ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని ప్రశ్నించారు. మరి కేజ్రీవాల్ కోరినట్టు ప్రధాని విద్యార్హతల గురించి చెబుతారో లేదో చూడాలి.

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కుమార్తె మృతి..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కుమార్తె కర్ణిక సింగ్ మృతి చెందింది. గత కొంతకాలంగా కర్ణిక సింగ్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఆమె గత ఏడాది యూఎస్ లో చికిత్స కూడా చేయించుకున్నారు. కానీ పూర్తిగా నయం కాకపోవడంతో గత కొద్దిరోజులుగా బాధపడుతున్నారు. ఆ క్రమంలో ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు. ఆమె భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ కు తరలించనున్నారు.   కాగా దిగ్విజయ్ సింగ్, ఆశా దంపతులకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు. దిగ్విజయ్ భార్య ఆశా 2013లో మృతి చెందారు. అనంతరం దిగ్విజయ్ టీవీ యాంకర్ అమృతారాయ్ ని వివాహం చేసుకున్నారు.

యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు.. ఫ్లింటాఫ్ అలా అన్నందుకే కొట్టాను..

  డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టి రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం జరిగిన దీనికి ఎప్పటికీ మరచిపోలేము. అయితే తాను ఆరు సిక్సులు కొట్టడానికి గల కారణం ఏంటో చెప్పాడు. తొలి టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ తో మ్యాచ్ జరుగుతుండగా.. స్టువార్ట్ బ్రాడ్ ఓవర్లో యువరాజ్ వరుసగా ఆరు సిక్సులు కొట్టాడు. అయితే దీనికి అదే జట్టులో ఉన్న ప్లింటాఫ్ తో జరిగిన గొడవే కారణమంటూ అసలు ఏం జరిగిందో చెప్పాడు. ఫ్లింటాఫ్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టానని, అవి చెత్త షాట్లంటూ ఓ బూతు పదం అతను వాడాడని, నేనూ ఓ బూతు తిట్టానని.. దానికి ఏం మాట్లాడావని అతను తనని అడిగాడని, దానికి తాను ఘాటుగానే.. నువ్వు సరిగ్గానే విన్నావని చెప్పానని తెలిపాడు. దానికి అతను 'నీ గొంతు కోస్తానని' తనను అన్నాడని యువీ చెప్పాడు. దీనికి కోపం కట్టలు తెచ్చుకొని వచ్చిందని దానికి ప్రతి బాల్ బౌండరీ దాటించాలని అనుకున్నా అని చెప్పాడు.

అగ్రకులాలవారికి పదిశాతం రిజర్వేషన్లు..

  గుజరాత్ ముఖ్యమంత్రి అనంది బెన్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఆర్ధికంగా వెనుకబడిన అగ్రకులాలవారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా, ఉపాధి ఉద్యోగాలలో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు.. ఏడాదికి ఆరు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని.. మే 1వ తేదీ నుండి కొత్త రిజర్వేషన్ అమలవుతుందని ఆమె తెలిపారు. అయితే ఇప్పటికే అమలవుతోన్న 49 శాతం మించబోదని తెలిపారు. కాగా రిజర్వేషన్ల కోసం పటీదార్ కులస్తులు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహించడం, సమీప భవిష్యత్ లో ఆధిపత్య కులాలుగా కొనసాగుతున్న ఇంకొన్ని కులాలు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

భారత్, పాకిస్థాన్ యుద్దం.. ఇందిరా గాంధీ బెడ్‌కవర్లను మార్చుతూ కూర్చున్నారు..

  మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గురించి ఆమె దగ్గర పనిచేసిన వైద్యుడు కేపీ మాథుర్.. ఇందిరా గాంధీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. 92 ఏళ్ల కేపీ మాథుర్ ఇందిరాకు వ్యక్తిగత వైద్యుడిగా పనిచేసేవారు. అయితే ఆయన రాసిన "ద అన్‌సీన్‌ ఇందిరా గాంధీ" పుస్తకంలో ఇందిరా గాంధీ గురించి చెప్పిన విషయాలు తెలిస్తే ఆశ్యర్చపోవాల్సిందే. ముఖ్యంగా భారత-పాక్‌ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇందిరా గాంధీ ఏం చేశారో ఆయన తెలిపారు. 1971 నవంబర్‌ 5వ తేదీన 'భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం మొదలైన మరుసటి రోజు అంటే నవంబర్ 6వ తేదీన నేను వెళ్లేసరికి ఇందిరా గాంధీ స్వయంగా బెడ్‌కవర్లను మార్చుతూ కనిపించారు.బహుశా ఈ పని ద్వారా ముందురోజు అర్థరాత్రి వరకు ఉన్న పని ఒత్తిడి నుంచి ఆమె బయటపడి ఉంటారు' అని తన పుస్తకంలో పేర్కొన్నారు. అంతేకాదు ఇంకా ఆమె గురించి తెలుపుతూ.. ప్రధాని అయిన మొదట్లో ఇందిరా చాలా ఒత్తిడికి గురయ్యేవారు.. శని, ఆదివారాల్లో ఏ మాత్రం వీలుదొరికినా.. పుస్తకాలు చదివేవారన్నారు. మధ్యాహ్న భోజనం ముగిశాక కొన్నిసార్లు పేకాట ఆడేవారని రాశారు.

టీవీ చర్చా సమయంలో మంత్రి గారిపై రాళ్లు, కుర్చీలు...

  కేరళలోని కార్మిక మంత్రి బేబి జాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయనపై రాళ్లతో దాడి చేశారు. వివరాల ప్రకారం.. కేరళలోని కొల్లాం ప్రాంత శంకరమంగళం జంక్షన్లో  ఓ టీవీ ఛానెల్ చర్యా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రేక్షకులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెబుతుండగా కొందరు వారిపై రాళ్లు రువ్వి, కుర్చీలు విసిరారు.. తమ ప్రాంతంలో తాగునీటికి నానా ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ఎమ్మల్యే శిబు ఎంత మాత్రం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. దీంతో శిబు మద్దతుదారులు అడిగినవారిపై దౌర్జన్యం చేయటంతో వారూ రెచ్చిపోయి రాళ్లు విసిరారు. దీంతో మంత్రి జాన్, లెఫ్ట్ కూటమికి చెందిన ఎన్.విజయ్ పిళ్లై గాయపడ్డారు.  గాయపడిన నేతలను ఆసుప్రతికి తరలించి చికిత్స చేశారు.

గల్లా జయదేవ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..

  గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణాజిల్లాలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి గుంటూరు వెళుతున్న ఆయనకు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గుంటూరులో ఐటీసీసంస్థ రూ. 150 కోట్లతో 'మై ఫార్చూన్‌' పైవ్ స్టార్ హోటల్‌ను నిర్మించనుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనికి శంకుస్థాపన చేశారు. దీంతో స్థానికి ఎంపీగా గల్లా జయదేవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలోనే గన్నవరం విమానాశ్రయం చేరుకున్న గల్లా జయదేవ్ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరుకు బయల్దేరారు. రోడ్డు పై అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి వాహనం పక్కనే ఉన్న ఓ మట్టి గుట్టను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో గల్లాకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఎంపీని హుటాహుటిన విజయవాడకు తరలించి అనుచరులు ఆయనకు ప్రథమ చికిత్స చేయించారు.   ఇటీవలే గుంటూరులో ఓ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వెళ్లిన సందర్భంలో కూడా ఆయన కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.

భూవివాదంలో ప్రియాంక గాంధీకి నోటీసులు...

  ఇప్పటికే నేషన్ హెరల్డ్ కేసులో.. ఇప్పుడు తాజాగా అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ల కుంభకోణంలో సోనియాగాంధీ ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. ఇప్పుడు ఆమె కూతురు ప్రియాంక గాంధీ కూడా మరో వివాదంలో ఇరుకున్నారు. ఓ భూవివాదంలో ప్రియాంక గాంధీకి కోర్టు నోటీసులు జారీ అయినట్టు తెలుస్తోంది. అసలు సంగతేంటంటే.. ప్రియాంక గాంధీ హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఓ భూమిని కొనుగోలు చేశారు. అయితే ఆ భూమికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కోర్టుకు తెలియజేయాలని.. అసలు ఎందుకు తెలియజేరాదో కూడా చెప్పాలని చెపుతూ.. దీనిపై నాలుగు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.   కాగా సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు దేవాశీష్ భట్టాచార్య అనే వ్యక్తి భూమికి సంబంధించిన వివరాలు అదంజేయాలని ధరఖాస్తు చేశారు. అయితే దీనిని సవాల్ చేస్తూ ప్రియాంక గాంధీ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు దీనిపై విచారించిన హైకోర్టు పైవిధంగా తెలిపింది. ప్రస్తుతం గాంధీ కుటుంబానికి ఇది గడ్డుకాలంలా ఉన్నట్టుంది.

అగస్టా వెస్ట్ ల్యాండ్..మరో విషయం బయటపెట్టిన సుబ్రహ్మణ్యస్వామి

  అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్లో కుంభకోణం ఆందోళనలతో ఇప్పటికే పార్లమెంట్ దద్దరిల్లిపోతుంది. ఈ వ్యవహారాన్ని రాజ్యసభలో ప్రస్తావించిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి రోజుకో కొత్త విషయాన్ని చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో విషయాన్ని బయటపెట్టారు. అగస్టా నుంచి తీసుకున్న ముడుపులను సోనియా గాంధీ... జెనీవాలోని ‘సరసిన్ బ్యాంక్’లో దాచుకున్నారని.. ఇందులో కొంత మొత్తాన్ని అక్కడి నుంచి తరలించిన సోనియా గాంధీ... ‘పిక్ టెట్ బ్యాంకు’లో డిపాజిట్ చేశారన్నారు. ఈ రెండు బ్యాంకుల ఖాతాలను పరిశీలించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోనియా గాంధీపై కేసులు నమోదు చేయాలని స్వామి డిమాండ్ చేశారు. మరి దీనిపై ప్రతిపక్షం ఎలా స్పదింస్తుందో చూడాలి.

పాలేరు ఉపఎన్నికకు తుమ్మల నామినేషన్.. అభ్యర్థిగా రాంరెడ్డి సతీమణి

  ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికలో భాగంగా నామినేషన్ల పర్వం సాగుతోంది. దీనిలో భాగంగానే.. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఇక తుమ్మలకు ప్రధాన పోటీదారుగా భావిస్తున్న సుచరితారెడ్డి కూడా తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి సతీమణి సుచరితా రెడ్డి బరిలోకి దిగుతున్నారు.

నా పాస్ పోర్ట్ రద్దు చేసి, అరెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయా..? మాల్యా వితండవాదం

  విజయ్ మాల్యాను దేశానికి రప్పించాడనికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేస్తున సంగతి తెలిసిందే. ఇప్పటికే మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. అయితే ఇంతా చేసినా కూడా మాల్యా మాత్రం ఏ మాత్రం దారికి రానట్టే కనిపిస్తోంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న తన ఆస్తుల వివరాలు ఎందుకు వెల్లడించాలి అని వితండవాదన చేసిన మాల్యా ఇప్పుడు తాజాగా మరోసారి భారత ప్రభుత్వంపై వాదానికి దిగారు. తప్పనిసరి పరిస్థిల్లోనే తాను దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందని..  రుణం మొత్తాన్ని చెల్లించడం మాత్రం తనతో అయ్యే పనికాదని తేల్చేశారు. అలాగని రుణాన్ని ఎగ్గొట్టనని, తీసుకున్న రుణంలో తన శక్తి మేర చెల్లిస్తానని కూడా ఆయన బ్యాంకులకు బంపర్ ఆఫరిచ్చారు. అంతేకాదు తన పాస్ పోర్టు రద్దు చేయడం ద్వారానే కాక, తనను అరెస్ట్ చేస్తే డబ్బెలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ చర్యల ద్వారా తన నుంచి సింగిల్ పైసా కూడా వసూలు కాదని ఆయన స్పష్టం చేశారు.

టీడీపీలోకి గాదె వెంకటరెడ్డి.. కాంగ్రెస్ నేతలూ క్యూ కడతారా..?

వైసీపీ నేతలు వరుసపెట్టి టీడీపీ పార్టీలోకి చేరతున్న నేపథ్యంలో.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలోకి నేతలు చేరడం స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి నేడు టీడీపీలోకి చేరనున్నట్టు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై గాదె ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో ఆయన కూడా టీడీపీలోకి చేరుతారేమో అన్న సందేహాలు వచ్చాయి. అయితే అలా అనుకున్నారో లేదో అప్పుడే ఆయన టీడీపీలోకి చేరుతున్నట్టు ప్రకటించారు. ఇంకా చంద్రబాబు కూడా గాదెకు వెల్ కమ్ చెప్పేందుకు సిద్ధమవడంతో నేడు ఆయన టీడీపీలో చేరనున్నారు. తన అనుచరవర్గంతో కలిసి నేటి సాయంత్రం టీడీపీలో చేరనున్నట్లు నిన్న గుంటూరులో గాదె ప్రకటించారు. మరి గాదె తరువాత కాంగ్రెస్ నేతలు కూడా క్యూ కడతారో లేదో చూడాలి.

కలిసిపోయిన భూమా, శిల్పా సోదరులు..!

  ఎట్టకేలకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి కలిసిపోయినట్టు తెలుస్తోంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. అఖరికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కూడా ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఉండేవారు. అలాంటి ఇద్దరూ ఇప్పుడు కలిసిపోయారు. కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిన్న టీడీపీలో చేరిన సంగతి తెలసిందే. ఈ సందర్భంగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు ఇంటికి వచ్చిన నేపథ్యంలో ఆయనతో పాటు భూమా, శిల్పా కూడా వచ్చారు. ఈ సందర్భంగా వారు మాటా మాటా కలిపారు. అంతేకాదు పార్టీ పరిస్థితులపైనా ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. దీంతో వారిద్దరూ కలవడంతో పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఎంతకాలం కలిసుంటారో చూడాలి.

కోల్ కతా నైట్ రైడర్స్ స్కోర్ 174/5, ముంబై విజయ లక్ష్యం 175

  ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ముంబై కోల్ కతా మ్యాచ్ లో టాస్ గెలిచి కోల్ కతాకు బ్యాటింగ్ అప్పగించింది ముంబై. బరిలోకి దిగిన కోల్ కతా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఊతప్ప (36, 20 బంతుల్లో), గంభీర్ (59, 45 బంతుల్లో) రాణించారు. చివర్లో వచ్చిన యూసుఫ్ పఠాన్ (19, 8 బంతుల్లో) దూకుడుగా ఆడాడు. ముంబై ఆటగాడు టిమ్ సౌథీ వరసగా రెండు సార్లు క్యాచ్ లను జారవిడవడం కోల్ కతా కు కలిసొచ్చింది. బౌలింగ్ లో సౌథీ కి రెండు వికెట్లు, మెక్ గ్లెనాగన్, హర్భజన్, హార్థిక్ పాండ్యాలకు తలో వికెట్ లభించాయి. ముంబై విజయ లక్ష్యం 175 పరుగులు. వాంఖడే స్టేడియంలో 200 పరుగుల లక్ష్యం వరకూ ఛేదించే అవకాశం ఉంది. టోర్నీలోనే అత్యంత పొదుపైన కోల్ కతా బౌలింగ్ లో ముంబై ఎంత వరకూ ఛేజింగ్ చేయగలదనేది ఆసక్తికరం.

మాల్యాను వెనక్కి పంపిచండి.. భారత విదేశాంగ శాఖ లేఖ

  బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని వాటికి ఎగనామం పెట్టి ఎంచక్కా విదేశాల్లో ఉన్న విజయ్ మాల్యాకు రోజు రోజుకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేసింది కేంద్ర విదేశాంగ శాఖ. అంతేకాదు నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేసింది. ఇంకా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి.. ఇంటర్ పోల్ కు సమాచారం అందించడమే తరువాయి భాగం. అయితే ఇప్పుడు భారత విదేశాంగ శాఖ మరో అడుగు ముందుకేసింది. విజయ్ మాల్యాను తిరిగి ఇండియాకు పంపించాలని బ్రిటన్ హై కమిషనర్‌కు లేఖ రాసింది. మరి దీనిపై బ్రిటన్ హై కమిషనర్ ఎలా స్పందిస్తారో చూడాలి.