మహిళా డీఎస్పీ ఫొటోలు తీశాడు.. ఉద్యోగం పోగొట్టుకున్నాడు
posted on May 3, 2016 @ 10:58AM
ఆకతాయితనంతో కొన్నిసార్లు చేసే పనుల వల్ల నష్టం కలుగుతుంది. అలా ఆకతాయితనంతోనే ఓ పోలీసు అధికారి ఫొటో తీసి ఉద్యోగం ఊడగొట్టుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఓ యువకుడు హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతడు ఏకంగా కమిషనర్ కార్యాలయంలోనే సెల్ ఫోన్ చేతబట్టి సీఐడీ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న ఓ మహిళా పోలీసు అధికారి ఫొటోలు తీశాడు. వెంటనే విషయాన్ని గమనించిన సదరు డీఎస్పీ అతడి చేతిలోని సెల్ ఫోన్ లాగేసుకొని.. తన ఫొటోలను అతడు తీసిన తీరును పరిశీలించి.. ఉద్దేశ్యపూర్వకంగానే అతడు ఈ పని చేసినట్టు నిర్ధారించుకొని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అతడిని సర్వీసు నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసి అతడిపై కేసు కూడా నమోదు చేశారు.