ఏపీలో ఇకపై బిడ్డ పుట్టిన వెంటనే ఆధార్..
posted on Jun 14, 2016 @ 12:58PM
ఇటీవలి కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫలాలు పొందాలంటే ఆధార్ తప్పనిసరైంది. దీంతో ప్రభుత్వపరంగా ఏం కావాలన్నా ఆధార్ కార్డు కావాల్సిందే. ఇక నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో బిడ్డ పుట్టిన వెంటనే ఆధార్ కార్డ్ జారీ చేసే నూతన విధానం ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి రానుంది.
భారత విశిష్ట ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తొలుత హర్యానాలో ఈ కార్యక్రమం ప్రారంభించగా విజయవంతమైంది. దీంతో రాష్ట్రంలోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. కేంద్రప్రభుత్వం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో జనన ధ్రువీకరణ పత్రం తయారు చేయడం కోసం వివరాలు నమోదు చేసే సమయంలోనే తల్లి లేదా తండ్రి ఆధార్ సంఖ్య, ఫోన్ నెంబర్ వివరాలు జత చేస్తారు. ఆ వెంటనే ఆ బిడ్డకు 14 అంకెలతో కూడిన ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ వస్తుంది. దీని ఆధారంగా ఆ బిడ్డకు శాశ్వత ఆధార్ నెంబర్ మూడు రోజుల్లోనే మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత పేరు పెట్టగానే కార్డులో మార్పు చేసుకోవచ్చు. ఐదు సంవత్సరాల వయసు దాటిన తర్వాత బయోమెట్రిక్ తీసుకుంటారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా జులై నుంచి అమలు చేయనున్నారు.