10 రూపాయల నాణెం చెల్లుతుందా..?
posted on Jul 22, 2016 @ 5:49PM
భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన 10 రూపాయల నాణెంపై ఉత్తరప్రదేశ్‌లోని ఫరీదాబాద్ ప్రజలు కన్ఫ్యూజన్‌లో పడిపోయారు. కొంతమంది దుకాణ యజమానులు రూ.10 నాణెం చెల్లుతుందని తీసుకుంటే..మరికొందరు చెల్లదని ప్రజలను తిప్పి పంపుతున్నారు. దీంతో నాణెన్ని తీసుకోవాలా..? వద్దా..? అనే విషయంపై జనం ఏటూ తేల్చుకోలేకపోతున్నారు.
చేసేది లేక అక్కడి ప్రజలు బ్యాంకులకు క్యూకట్టి తమ వద్ద ఉన్న రూ.10 నాణెం ఇచ్చి దానికి బదులుగా పది రూపాయల నోటును తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 2 వేల పది రూపాయల నాణాలు బ్యాంకుకు వచ్చినట్లు చెప్పారు. ఇంతటి గందరగోళానికి కారణం ఆర్బీఐ రూ.10 నాణెం చెల్లదని చెప్పినట్లు సోషల్ మీడియాలో పుకార్లు రావడమే. దీనిపై స్పందించిన నగరంలోని నీలమ్ చౌక్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని, ఆర్బీఐ అటువంటి ఏ నిర్ణయం తీసుకోలేదని..రూ.10 నాణెంను తిరస్కరించిన వ్యాపారులు చట్టరీత్యా శిక్షార్హులని పేర్కొన్నారు.