'రియల్' ట్విస్ట్... కొత్త జిల్లాకు షేక్! పాత జిల్లాకు షాక్!
posted on Aug 27, 2016 @ 6:08PM
రియల్ భూం... ఇంతకు ముందు ఈ పదం కేవలం హైద్రాబాద్ లో మాత్రమే వినిపించేది. ఇక్కడ భూములు కోటి అంటే అక్కడ కోటిన్నరా అంటూ న్యూస్ వచ్చేది. కాని, రాష్ట్ర విభజన వల్ల అమరావతి కూడా రియల్ ఎస్టేట్ కళతో మెరిసిపోతోంది. కాని, తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల విభజన నిర్ణయం వల్ల చిన్న చిన్న టౌన్లు కూడా రియల్ ఎస్టేట్ భూంతో ఎగిసిపడుతున్నాయి. అదే సమయంలో కొన్ని చోట్ల భూముల ధరలు పడిపోయి రియాల్టర్లు దిగాలుపడిపోతున్నారు!
జిల్లాల విభజనతో రియల్ షేక్ కి గురవుతున్న తెలంగాణ జిల్లా ఖమ్మం. ఇందులోంచి కొత్తగూడెం జిల్లా అంటూ కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. ఫలితంగా కొత్తగూడెం పరిసరాల్లో భూముల ధరలకి రెక్కలొచ్చాయి. 30 నుంచి 60లక్షలున్న ఎకరం ఇప్పుడు కోటి దాటిపోయింది! అటు ఖమ్మం జిల్లాగా మిగలనున్న అవశేష ప్రాంతంలో పరిస్థితి రివర్స్ గా వుంది. మొన్నటి వరకూ కోటి , కోటిన్నర పలికిన ఎకరం ధర ఇప్పుడు ఖమ్మలో యాభై లక్షలు కూడా దాటడం లేదు. దీంతో అప్పులు చేసి మరీ భూములు కొని పెట్టుకున్న ఖమ్మం జిల్లా రియాల్టర్లు లబోదిబోమంటున్నారు.
ఒక్క ఖమ్మంలోనే పరిస్థితి ఇలా వుంటే మొత్తం 17 జిల్లాల ఏర్పాటుతో స్థితి ఎలా వుంటుందో మున్ముందు చూడాలి. కాకపోతే, తెలంగాణ రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగాలో బండ్లు ఓడలు, ఓడలు బండ్లయ్యే సూచనలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి!