ఇదే రిపీట్ అవుతుంది.. అమెరికాకు ఆల్‌ఖాయిదా హెచ్చరిక...

  9/11 ఈ డేట్ పేరు చెప్పగానే మనకు అమెరికాలోని ట్విన్ టవర్స్ పై ఉగ్రవాదులు జరిపిన సంఘటన గుర్తుకొస్తుంది. ఈ ఘటన జరిగి దాదాపు 15 ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ఇప్పుడు అలాంటి దాడులే మళ్లీ జరుగుతాయని అగ్రరాజ్యమైన అమెరికాను హెచ్చిరించారు ఉగ్రవాదులు. నిన్నటితో ఈఘటన జరిగి 15 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఆల్‌ఖాయిదా ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ఆల్‌ఖాయిదా చీఫ్ అయిమన్ అల్-జవహరీ మాట్లాడుతూ.. ‘‘మాపై మీ నేరాలకు ప్రతీకారంగానే 9/11’’ దాడి అని..ఇది ఇలాగే కొనసాగితే 9/11 లాంటి ఘటనలు వేలసార్లు చూడాల్సి వస్తుందని హెచ్చరించాడు. అరబ్, ముస్లిం దేశాలల్లో భూములను ఆక్రమించుకుంటూ నేరపూరిత, లంచగొండి ప్రభుత్వాలకు అమెరికా మద్దతు ఇస్తోందని ఆరోపించాడు. ఉగ్రవాదులందరూ ఏకం కావాలని కోరిన ఆల్‌ఖాయిదా చీఫ్ ఆఫ్రికన్ అమెరికన్లను ఇస్లాంలోకి మారాల్సిందిగా సూచించాడు. కాగా 2001లో ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడిలో 2,753 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్... అరెస్టుల పర్వం..

  కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఈరోజు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్రమంతా బంద్ చేపట్టారు. తెల్లవారుజామున 4గంటల నుంచే వామపక్ష పార్టీలన్నీ బంద్ ను ప్రారంభించారు. మరోవైపు పోలీసులు కూడా బంద్ చేపట్టిన నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వైకాపా, వామపక్ష పార్టీలకు చెందిన 54 మందిని అదుపులోకి తీసుకున్నారు.   ఇంకా తిరుపతిలో వైకాపా నేత భూమన కరుణాకర్‌రెడ్డిని అరెస్టు చేసి తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టుకు నిరసనగా తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట వైకాపా కార్యకర్తలు ధర్నా చేపట్టారు.   కడప జిల్లాలో 8 డిపోల పరిధిలో 930 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారుజామునే బస్టాండ్‌ల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగిన వైకాపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక సీపీఎం నాయకులు శాంతియుతంగా మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. విద్యా, వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా సినిమాహాళ్లు, పెట్రోల్‌ బంక్‌లు మూసివేశారు.  

ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత

అసెంబ్లీ లోపలే కొట్టుకునే అధికార, ప్రతిపక్ష సభ్యులు చివరికి సభ బయట కూడా అలాంటి వాతావరణాన్నే సృష్టిస్తున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ మూడో రోజు సమావేశాల్లో భాగంగా ప్రత్యేకహోదాపై చర్చించాలంటూ ప్రతిపక్ష వైసీపీ సభ్యులు పట్టుబట్టడంతో స్పీకర్ కోడెల సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.  దీంతో శాసనసభ్యులు మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నారు. అయితే ముందుగా వైసీపీ చేరుకోగా..ఆ తర్వాత టీడీపీ సభ్యులు అక్కడికి వచ్చారు. అయితే ముందు మేం మాట్లాడాలంటే..మేం మాట్లాడాలంటూ ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

జగన్ చెప్పినట్లు సభ నడవదు-కోడెల

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లోమూడో రోజు కూడా సభా కార్యక్రమాలకు ప్రతిపక్ష వైసీపీ అడ్డుతగులుతూనే ఉంది. ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రత్యేకహోదాపై చర్చించాలని కోరుతూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. అయితే నిన్నటి ఘటనతో స్పీకర్‌ పోడియం చుట్టూ మార్షల్ రక్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మార్షల్స్‌కు, వైసీపీ సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా వైసీపీ సభ్యులు ఆందోళన విరమించలేదు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన స్పీకర్..జగన్ చెప్పినట్లు సభ నడవదు..నియమనిబంధనల ప్రకారం సభ నిర్వహిస్తాం. సభ్యులు తమ ప్రవర్తను అవలోకనం చేసుకోవాలంటూ సూచించారు. వైసీపీ సభ్యుల ఆందోళనతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

బెజవాడ బెస్ట్‌ప్రైస్‌లో భారీఅగ్నిప్రమాదం..

విజయవాడ నగరంలోని బెస్ట్‌ప్రైస్‌ సూపర్‌మార్కెట్‌‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నిడమానూరులో ఉన్న బెస్ట్‌ప్రైస్‌లో ఉదయం మంటలు చెలరేగాయి..చూస్తుండగానే క్షణాల్లో మార్కెట్ అంతటా వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే మార్కెట్ నుంచి భారీ పేలుడు శబ్ధాలు వస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ప్రమాదంలో వస్తుసామాగ్రి చాలా వరకు దగ్ధమై ఉండొచ్చని భావిస్తున్నారు..సుమారు ఆరు ఫైరింజిన్లతో మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

టీజీకి పవన్ కౌంటర్.. నేను కళ్లు తెరిస్తే

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీ టీజీ వెంకటేష్ తనపై చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించి.. ఆయనపై నాలుగు విమర్శనాస్త్రాలు విసిరారు. నేను కుంభకర్ణుడిలా నిద్రపోతున్నా అని అన్నారు.. నిద్ర అని ఎందుకు అనుకోవాలి.. ధ్యానం చేస్తున్నా అని అనుకోవచ్చు కదా అని మండిపడ్డారు. అంతేకాదు నేను కళ్లు తెరిస్తే టీడీ వెంకటేష్ కంపెనీల కాలుష్యం బయటకు వస్తుంది.. జనసేన కార్యకర్తలు వదిలిపెట్టిన ఎంపీ సీట్లో మీరు కూర్చున్నారు అని ఎద్దేవ చేశారు.   కాగా తిరుపతి బహిరంగ సభలో పవన్ చేసిన ప్రసంగంపై టీజీ ఆయనపై మండిపడ్డ సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కుంభకర్ణుడిలా నిద్రపోయార‌ని.. ఇప్పుడు లేచి ప్ర‌త్యేక‌హోదా కోసం ఎంపీలు రాజీనామా చేయాల‌న‌డం ఆయ‌న‌ అవివేకానికి నిద‌ర్శ‌నమ‌ని అన్న సంగతి తెలిసిందే.

మీకు చేతకాకపోతే చెప్పండి.. చంద్రబాబే తేల్చుకోవాలి..

  రాజకీయ నేతలే ప్రత్యేక హోదా గురించి పోరాటం చేయాలని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ప్రజలెందుకు పోరాడాలి.. ప్రజాప్రతినిధులే పోరాడాలి.. అసెంబ్లీ, పార్లమెంట్లో కూర్చున్న నేతలే ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తారని.. పార్లమెంట్లో సబ్సిడీ ఫుడ్ తింటున్న నేతలు ఏం చేస్తారు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నేతలే పోరాటం చేస్తారు.. సామన్య ప్రజలు ఎందుకు రోడ్లెక్కాలి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎంపీలు సుఖపడితే నాకేం అభ్యంతరం లేదు.. అలా అని ప్రజలను కష్టపెడితే మాత్రం చూస్తూ ఊరుకోమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పాచిపోయిన ప్యాకేజీ లడ్డూలను చంద్రబాబు స్వీకరిస్తారా.. లేక విసిరి కొడతారా అన్న విషయం ఆయనే తేల్చుకోవాలి.. తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం ఉంది.. టీడీపీ నేతలు కేంద్రం వద్ద తలదించుకోవద్దు.. పోరాటం చేయటం మీకు చేతకాకపోతే చెప్పండి.. జనసేన చేస్తుంది అని మండిపడ్డారు.  

11రోజులు అన్నం తినలేదు... పవన్ కళ్యాణ్

  తెలంగాణకు ద్రోహం చేసిన వారిలో సీమాంధ్ర నేతలే కాదు.. తెలంగాణ నేతలు కూడా ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడులో సభలో వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని విడదీస్తున్నప్పుడు చాలా బాధపడ్డాను.. రాష్ట్రాన్ని విడగొట్టినందుకు 11రోజులు అన్నం తినలేదు అని అన్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఏపీకే కాదు.. తెలంగాణకు కూడా అన్యాయం చేసిందని.. ఇప్పటివరకూ హైకోర్టును వారికి ఇవ్వలేదు అని అన్నారు. ఇంకా తెలంగాణ వాసులు, సీమాంధ్రులను తిడుతుంటే బాధేసింది.. సన్నాసులు, దద్దమ్మలు అన్నా పౌరుషం లేకుండా.. నిస్సుగుగా చూస్తూ ఊరుకున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయ పార్టీలకు పవన్ వార్నింగ్

కాకినాడలో పవన్ తలపెట్టిన సీమాంధ్ర ఆత్మగౌరవ సభ ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఆయన జాతీయ పార్టీలకు వార్నింగ్ ఇచ్చారు. నన్ను కంభకర్ణుడిలా నిద్రపోయి ఇన్ని రోజులకు లేచాడా అని విమర్శించారు.. నేను నిద్రపోతున్నా అని ఎందుకు అనుకోవాలి.. ధ్యానం చేస్తున్నా అని అనుకోవచ్చు కదా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉన్న సమస్యలు పరిష్కరించకుండా.. కొత్త సమస్యలు సృష్టించవద్దు అని అన్నారు. ప్రజలు వదిలేయమంటే సినిమాలు వదిలేయడానికి నేను సిద్దంగా ఉన్నా.. ప్రజా సమస్యలే నాకు గాడ్ ఫాదర్ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు కాదు తనను బీజేపీ నడిపిస్తుందా.. టీడీపీ నడిపిస్తుందా అని విమర్శలు వచ్చిన నేపథ్యంలో వాటిపై స్పందించిన ఆయన నన్ను ఒకళ్లు నడిపించాలా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   రెండు జాతీయ పార్టీలు కలిసి రాష్ట్రాన్ని విడదీసి అస్థిరతను సృష్టించారు.. ఇప్పుడు మీ చేతకానితనం.. దీపిడి వల్ల సుస్థిరతను ఏర్పాటు చేయలేకపోతున్నారు అని అన్నారు. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిస్తే.. బీజేపీ పొట్టలో పొడిచింది అని అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి దండలు వేయడం కాదు.. ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని బయటకు తీసుకురండి.. మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా ఇచ్చి మాట్లాడండి అని హెచ్చరించారు.

ప్రత్యేక ప్యాకేజీ కాదు.. పాచిపోయిన లడ్డూలు.. పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రత్యేక హోదాపై పవన్ మొదటి దశ పోరాటానికి కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణం వేదికైన సంగతి తెలిసిందే. ఈ సభకు జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశభక్తి ఉత్తరాదికే కాదు..మనకూ అంతే ఉంది.. ఢిల్లీకి వినపించేలా భారత్ మాతాకి జై నినాదం చేద్దాం అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ముఖ్యంగా బీజేపీ, వెంకయ్యనాయుడిని టార్గెట్ చేసి ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తుంది..టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం.. ఇస్తాం.. ఇస్తాం అంటూ మూడు సంవత్సరాల తరువాత పాచిపోయిన లడ్డూ ఇస్తారా.. పాచిపోయిన లడ్డూలను టీడీపీ స్వీకరిస్తుందా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు ఆంధ్రాకు వచ్చి ఆంధ్రానే విడగొడతారా.. అంటూ విమర్శించారు.

కేజ్రీవాల్ కు తృటిలో తప్పిన ప్రమాదం..

  ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ కు ప్రస్తుతం కాలం కలిసిరానున్నట్టు ఉంది. ఒకపక్క పలు నేరాల్లో ఆప్ నేతలు ఆరోపణలు ఎదుర్కోవడం.. ఇక పంజాబ్ లో ఆప్ నేతలు పెద్ద ఎత్తున రాజీనామాలు చేయడం.. ఇక సమావేశాలకు వెళుతున్న ఆయనను మధ్యలోనే అడ్డుకోవడం జరుగుతుంది. ఇప్పుడు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా (సీహెచ్ 01 ఏబీ 9595) కారు, కాన్వాయ్ లోని ఎస్కార్ట్ జీప్ ను ఢీకొట్టింది. జలంధర్ నుంచి అమృతసర్ మార్గంలోని పీఏపీ చౌక్ సమీపంలో ఈ ప్రమాదం జరుగగా, ఇన్నోవా హెడ్ లైట్, బాయ్ నెట్, బంపర్ దెబ్బతిన్నాయి. ఆ సమయంలో కేజ్రీవాల్ ముందు సీట్లోనే కూర్చుని ఉన్నారని, ప్రమాదంలో కేజ్రీవాల్ కు ఎలాంటి గాయాలూ కాలేదని ఆప్ వర్గాలు తెలిపాయి.

వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవి కోసమే..

  కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని పాపం ఎన్డీయేదే అని.. ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటి ఎన్డీయే సర్కారు తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. వెంకయ్యనాయుడు సీనియర్ సీనియర్ మంత్రి తరహాలో మాట్లాడలేదు.. ఉపరాష్ట్రపతి పదవి కోసమే వెంకయ్య ఇదంతా చేస్తున్నారు.. 14వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పలేదు.. కాంగ్రెస్ పై విమర్శలు మానుకొని ఏపీకి న్యాయం చేయాలి అని అన్నారు. తాము చెప్పింది ఒకటైతే, ఇప్పుడు జరుగుతున్నది మరొకటని, దీనివల్ల విడిపోయిన రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీలో ఏమీ లేదని, రాష్ట్రానికి వచ్చేదేంటో తనకు తెలియడం లేదని.. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల రూ.60వేల కోట్ల నష్టం జరుగుతుందని మండిపడ్డారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించడం సరికాదు. ఒకవేళ అప్పగిస్తే చట్ట సవరణ అవసరమని చెప్పారు.

అధికారంలోకి మాయవతి... సర్వే చెప్పిన నిజం

2017 లో జరగబోయే యూపీ ఎన్నికల నేపథ్యంలో కొత్త కొత్త అంశాలు చోటుచేసుకుంటున్నాయి. యూపీ ఎన్నికల్లో గెలుపొంది ఎలాగైనా అధికారం చేపట్టాలని పార్టీలన్నీ కసరత్తు చేస్తున్నాయి. అయితే ఓ సర్వే ప్రకారం ఈసారి బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. 25 వేల మందిని భాగం చేస్తూ నిర్వహించిన సర్వేలో.. 403 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో బీఎస్పీకి 169 సీట్లు రావచ్చని నివేదికలో పేర్కొంది. ఆ తరువాత బీజేపీ రెండో స్థానంలో నిలవవచ్చని అంటున్నారు. అయితే బీజేపీ వెనుకబడటానికి గల కారణాలు కూడా చెబుతున్నారు. పెరిగిన ధరలను కిందకు దించలేకపోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా చెప్పలేకపోవడమే బీజేపీని వెనక్కిలాగుతున్నాయట. ఇక  కాంగ్రెస్ స్థానాలు 28 నుంచి 15కు తగ్గుతాయని అంచనా వేసింది. మాయావతి సీఎంగా వస్తే బాగుంటుందని 32 శాతం మంది ప్రజలు అభిప్రాయపడుతుండగా, అఖిలేష్ యాదవ్ ను 15 శాతం మందే కోరుతున్నారని వివరించింది. మరి ఏది నిజమో.. సర్వే ఎంత వరకూ కరెక్టో తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.

వెంకయ్యకు బీజేపీ నేతల ధన్యవాదాలు..

  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని ఏపీ బేజీపీ నేతలు కలిశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినందుకు వెంకయ్యనాయుడికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్యాకేజీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నేతలకు వెంకయ్యనాయుడు సూచించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాను కాంగ్రెస్‌ ఎందుకు చట్టంలో పొందుపరచలేదని ప్రశ్నించారు. కేంద్ర సహకారం లేకుంటే ఏపీ కోలుకోలేదని అయన అన్నారు. రైల్వేజోన్ పై ఇంకా ప్రకటన చేయలేదు..అప్పుడే అంత రాద్దాంతం చేయడం అనవసరం అని అన్నారు. పదేళ్లలోపు విద్యాసంస్థలు నిర్మించాలని అన్నారు..కానీ రెండేళ్లలోనే 90 శాతం విద్యాసంస్థలు నిర్మించామని వెల్లడించారు.

ముంబై కోర్టు సంచలన తీర్పు...యాసిడ్ దాడి నిందితుడికి ఉరిశిక్ష..

ప్రేమకు, పెళ్లిళ్లకు ఒప్పుకోని మహిళలపై యాసిడ్ దాడులు జరగడం చూస్తూనే ఉంటాం. ఇప్పటి వరకూ ఎంతో మంది మహళలు ఈ యాసిడ్ దాడుల భారీన పడినవారు ఉన్నారు. అయితే ఇప్పుడు యాసిడ్ దాడికి పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ముంబైలోని మహిళా ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. ముంబైలోని ప్రీతి రాఠీ (23) అనే యువతిపై సల్యూరిక్ యాసిడ్ చల్లి ఆమె మరణానికి కారణమైన దోషి అంకుర్‌లాల్ పన్వర్ (26)కు ముంబైలోని మహిళల ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. వివరాల ప్రకారం.. ప్రీతి రాఠీ ముంబైలోని నావికాదళం దవాఖానలో నర్సుగా ఉద్యోగం చేస్తుంది. ఆమెను పన్వర్ వివాహం చేసుకోవాలని వేధించేవాడు. దీనికి ప్రీతి నిరాకరించడంతో ఆమెపై పగ పెంచుకున్న పన్వర్.. ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూనే ఆమె చనిపోయింది.   కాగా ఈ ఘటన 2013లో జరిగింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసుల ముందు ఓ స్టూడెంట్ ను అరెస్ట్ చేయగా ఆతరువాత తను కాదని తెలిసి విడుదల చేశారు. అనంతరం ముమ్మర దర్యాప్తు చేసిన పోలీసులు 2014 జనవరి 17న పన్వర్‌ ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతనికి ఉరిశిక్ష పడింది.

కావేరి జలాల కాక.. కర్ణాటక బంద్..

  కర్ణాటక కావేరి జలాలు తమిళనాడుకు విడుదల చేయడంపై కర్ణాటక వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంకా కర్ణాటకలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగానే ఈరోజు కర్ణాటక రాష్ట వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. వేర్వేరు కన్నడ సంఘాలు, రైతు సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఆర్టీసీ బస్సు లు, ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అంతేకాదు.. బంద్‌కు మద్దతుగా 30వేల ట్యాక్సీలు, 93వేల మ్యాక్సీ క్యాబ్‌లు, లక్షన్నర లారీలు కదల్లేదు. కన్నడ చలనచిత్ర పరిశ్రమ, మాల్స్‌ యజమానులు, విద్యాసంస్థలు, ఔషద దుకాణాల సంఘాలు, వ్యాపారుల సమాఖ్య, హోటళ్లు, పరిశ్రమల సంఘాలు, సమాఖ్యలు, 170కు పైగా కన్నడ సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపాయి.  

పవన్ సభకు సర్వం సిద్దం... తెలంగాణ నుండి కూడా..

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక పోరాటంలో భాగంగా ఈరోజు కాకినాడలో సీమాంధ్ర ఆత్మగౌరవ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. నేటి సాయంత్రం కాకినాడలోని జేఎన్టీయూ మైదానంలో 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు నిన్నటి నుండే ప్రారంభమయ్యాయి. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు దగ్గరుండి మరీ అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఈ సభకు పవన్ అభిమానులు, ప్రజలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే పోలీసులు ముందుజాగ్రత్తగా.. బారికేడ్లు, భద్రతను ఏర్పాటు చేసి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా నగరమంతా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... పవన్ సీమాంధ్ర ఆత్మగౌరవ సభకు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ధర్మపురి, ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన యువత ఇప్పటికే కాకినాడలోని జేఎన్టీయూ మైదానానికి చేరుకుంది. తామంతా పవన్ వీరాభిమానులమని, ఆయనేం మాట్లాడతారో వినేందుకే వచ్చామని వీరంతా చెబుతున్నారు.