జియో సిమ్.. ఆదిలోనే కష్టాలు
posted on Sep 6, 2016 @ 4:06PM
అతి తక్కువ ధరకే సిమ్.. దాదాపు మూడు నెలల వరకూ ఉచితంగా కాల్స్, డేటా ప్యాక్ ఇలాంటి అఫర్స్ ఇస్తే యువత అసలు ఆగుతుందా. ఆ సిమ్ ఎక్కడ దొరుకుతుందా అని..ఎంత కష్టమైన సరే దానిని సాధిస్తారు. అలాంటి ఆఫర్లతోనే రిలయన్స్ సంస్థ 'రిలయన్స్ జియో' పేరుతో సిమ్ ను తీసుకొచ్చింది. రిలయన్స్ వార్షికోత్సవం సందర్బంగా ప్రకటించిన ఈ సిమ్ దెబ్బకు 'ఎయిర్ టెల్', 'ఐడియా' నెట్ వర్క్ లు సైతం బెంబేలెత్తిపోయాయి. ఇక దాంతో 'జియో' కనుక బయటకి వస్తే ఆ నెట్ వర్క్ ల పని అయిపోయినట్టే అనుకున్నారు. కానీ ఆదిలోనే సిమ్ కు కష్టాలొచ్చిపడ్డాయి. వినాయక చవితి సందర్బంగా జియో సేవలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. దీంతో వేలాది మంది సిమ్ ల కోసం వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాదు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సిమ్ కార్డుల కొరత, కష్టపడి సిమ్ తీసుకున్నప్పటికీ, సాంకేతిక కారణాలతో యాక్టివేట్ కాకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. అంతేనా సిమ్ కార్డులు అందని వారికి టోకెన్లు ఇచ్చి 15 వ తేదీ నాటికి ఇస్తామని నచ్చజెప్పుతున్నారు.
సిమ్ దొరకని వారి పరిస్థితి ఇలా ఉంటే కష్టపడి దొరికిన వారి పరిస్థితి మరోలా ఉంది. వాటిని యాక్టివేట్ చేయించుకునేందుకు ఒక్కసారిగా వెల్లువెత్తడంతో డిజిటల్ వెరిఫికేషన్ నెట్ వర్క్ సైతం స్తంభించిపోయినట్టు తెలుస్తోంది. ఢిల్లీ వంటి కొన్ని ప్రాంతాల్లో జియో సిమ్ ను రూ. 300 నుంచి రూ. 1000కి విక్రయిస్తున్నట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లోనూ సిమ్ ల కొరత కనిపిస్తోంది. మొత్తానికి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు.. ఇప్పుడే ఇన్ని కష్టాలు పడుతుంటే ముందు ముందు ఇంకెన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో 'జియో'..