జాతీయ పార్టీలకు పవన్ వార్నింగ్
posted on Sep 9, 2016 @ 4:18PM
కాకినాడలో పవన్ తలపెట్టిన సీమాంధ్ర ఆత్మగౌరవ సభ ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఆయన జాతీయ పార్టీలకు వార్నింగ్ ఇచ్చారు. నన్ను కంభకర్ణుడిలా నిద్రపోయి ఇన్ని రోజులకు లేచాడా అని విమర్శించారు.. నేను నిద్రపోతున్నా అని ఎందుకు అనుకోవాలి.. ధ్యానం చేస్తున్నా అని అనుకోవచ్చు కదా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉన్న సమస్యలు పరిష్కరించకుండా.. కొత్త సమస్యలు సృష్టించవద్దు అని అన్నారు. ప్రజలు వదిలేయమంటే సినిమాలు వదిలేయడానికి నేను సిద్దంగా ఉన్నా.. ప్రజా సమస్యలే నాకు గాడ్ ఫాదర్ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు కాదు తనను బీజేపీ నడిపిస్తుందా.. టీడీపీ నడిపిస్తుందా అని విమర్శలు వచ్చిన నేపథ్యంలో వాటిపై స్పందించిన ఆయన నన్ను ఒకళ్లు నడిపించాలా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు జాతీయ పార్టీలు కలిసి రాష్ట్రాన్ని విడదీసి అస్థిరతను సృష్టించారు.. ఇప్పుడు మీ చేతకానితనం.. దీపిడి వల్ల సుస్థిరతను ఏర్పాటు చేయలేకపోతున్నారు అని అన్నారు. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిస్తే.. బీజేపీ పొట్టలో పొడిచింది అని అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి దండలు వేయడం కాదు.. ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని బయటకు తీసుకురండి.. మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా ఇచ్చి మాట్లాడండి అని హెచ్చరించారు.